విక్రాంత్: రక్షణ కోసం భారత్ సిద్ధం చేస్తున్న బ్రహ్మాస్త్రం
రక్షణ రంగంలో ప్రపంచంలోని అగ్రదేశాల సరసన నిలిచే సామర్థ్యం గల భారత్.. విమాన వాహక యుద్ధనౌకల విషయంలో మాత్రం ఎంతో వెనుకబడి ఉంది. ప్రస్తుతం భారత్ వద్ద ఈ తరహా నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య మాత్రమే ఉంది.
భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పూర్తిగా దేశీయంగా తయారుచేసుకుంటున్న విక్రాంత్ క్లాస్ యుద్ధనౌక ప్రస్తుతం సిద్ధమవుతోంది.
విక్రాంత్ నిర్మాణం పదేళ్ల కిందట ప్రారంభమైంది.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధనౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉండనున్నాయి.
భారత నావికాదళంలో చేరేందుకు సిద్ధమవుతూ.. కోచి షిప్‌యార్డులో తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ విమాన వాహక యుద్ధనౌకను సందర్శించిన బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్ అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ కథనం.

హిందూ మహాసముద్రం... మహాసముద్రాల్లో ప్రపంచంలోనే మూడో అతి పెద్దది. రవాణా, రక్షణపరంగా ఎంతో కీలకమైన ఈ సముద్రంలో ఆధిపత్యం కోసం భారత్, చైనా, అమెరికా.. అన్నీ ప్రయత్నిస్తున్నాయి.
ఈ ఆధిపత్య పోరులో పైచేయి సాధించేందుకు.. రక్షణ పరంగా దుర్భేద్యంగా నిలిచేందుకు భారత్ సిద్ధం చేస్తున్న బ్రహ్మాస్త్రమే ఈ విక్రాంత్.
కేరళలోని కోచి షిప్‌యార్డ్‌లో నిర్మితమవుతున్న ఇది ఇప్పటికే జల ప్రవేశం చేసి భారత సైన్యానికి సేవలందించేందుకు సన్నద్ధమవుతోంది.
37,500 టన్నుల బరువుగల ఈ భారీ నౌకను, పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. దీనిపై 20 యుద్ధవిమానాలను, ఇంకా కొన్ని చిన్న యుద్ధ నౌకలను మోహరించవచ్చు.
ఏడు కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల హిందూ మహాసముద్రంలో అడ్డే లేకుండా ముందుకుసాగే సామర్థ్యం దీనిది.

అలాంటి ఈ యుద్ధనౌకను ప్రపంచానికి చూపించే అవకాశం బీబీసీకి లభించింది. ఇక్కడ సుమారు వెయ్యి మంది పని చేస్తున్నారు.
వాస్తవానికి.. అనుకున్న సమయానికి దీని నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోవడంతో గడువు పొడిగిస్తూ వస్తున్నారు. మరో ఏడాదిలో ట్రయిల్ రన్‌కు సిద్ధం చేస్తామని అధికారులు నమ్మకంగా చెబుతున్నారు.
‘‘ఇది అంత సులభమైన ప్రాజెక్ట్ కాదు. పదేళ్లు కావస్తున్నా నిర్మాణం పూర్తికాలేదు. ఇక ఖర్చు కూడా సుమారు 20,000 కోట్ల రూపాయలకు చేరింది.
ఇదే సమయంలో చైనా సొంత సాంకేతికతతో ఒక యుద్ధనౌకను పూర్తి చేసి సముద్రంలో దించింది. రెండో నౌకను ట్రయిల్ రన్‌కు పంపింద’’ని భారత నావికాదళ వార్‌షిప్ ప్రొడక్షన్ సూపరింటెండెంట్ కమడోర్ సిరిల్ థామస్ చెప్పారు.
‘‘మొదటిసారిగా సొంత యుద్ధనౌకను తయారు చేసేటప్పుడు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలే చాలా సమయాన్ని తీసుకున్నాయి. మేం ఇతర దేశాల నుంచి ఎలాంటి సాయం తీసుకోడం లేదు. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం. గతంలో ఎన్నడూ యుద్ధనౌకలను నిర్మించని కోచి షిప్ యార్డ్, విక్రాంత్ విషయంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటోంది’’ అని కోచీ షిప్‌యార్డ్ డైరెక్టర్ ఎన్‌వీ సురేశ్ బాబు ‘బీబీసీ’కి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
విక్రాంత్ ఘనతను వివరిస్తూ భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా.. ‘‘ఒక నగరానికి సరిపడా విద్యుత్‌ను ఇది ఉత్పత్తి చేయగలదు. రెండు రన్‌వేలు, 1500 మంది సిబ్బంది.. ఇలా గతంలో ఎన్నడూ లేనన్ని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. రెండో విమానవాహక యుద్ధనౌకకు మరిన్ని ప్రత్యేకతలను అద్దాలని నౌకా దళం భావిస్తోంద’’ని చెప్పారు.
దేశీయంగా నిర్మించనున్న రెండో విమానవాహక యుద్ధనౌక విషయమై భారత రక్షణశాఖతో చర్చలు ప్రారంభించామని.. దాన్నీ సంప్రదాయ వనరులతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా రూపొందించనున్నామని చెప్పారాయన.
కాగా ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తున్నప్పటికీ మూడు యుద్ధనౌకలను కలిగి ఉండాలన్న నౌకాదళ కల ఇప్పటికీ నెరవేరలేదు. బడ్జెట్‌లో రక్షణ కేటాయింపులు తగ్గుతున్న నేపథ్యంలో ఇది నెరవేరని ఆశేనని కొందరంటున్నారు. ప్రస్తుతం భారత్‌కున్న ఏకైక విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య మాత్రమే. సోవియట్ రష్యా కాలం నాటి దీన్ని మార్పులు చేసుకొని వాడుకుంటున్నాం.
విక్రాంత్ అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో తీర ప్రాంత భద్రతకు సంబంధించిన కీలక బాధ్యతలు భుజానికెత్తుకోగలదు.
- ఏదైనా సరే... 20 గంటల్లోనే నేర్చుకోవడం ఎలా
- తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: లగడపాటి పోల్‌లో కాంగ్రెస్ కూటమి, మిగిలిన పోల్స్‌లో టీఆర్ఎస్
- ఎగ్జిట్ పోల్స్: మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ, రాజస్థాన్ కాంగ్రెస్‌కు
- నన్ను స్పీకర్ లేని టీవీ అంటూ విమర్శలు చేశారు : మిస్ డెఫ్ ఆసియా నిష్టా
- ‘‘కొన్ని నెలలు కోమాలో ఉన్నా.. రెండు సార్లు ఉరివేసుకున్నా’’
- సిక్కోలు మత్స్యకారులు బంగాళాఖాతాన్ని వదిలి పాక్ తీరం దాకా ఎందుకెళ్తున్నారు? అక్కడ అరెస్టయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









