కర్నాటకలో ప్రసాదంలో విషం: ‘ఆ స్వామీజీ చెప్పాడని ప్రసాదంలో అరలీటరు పురుగుల మందు కలిపా’

ప్రసాదంలో విషం కలిపాడు

ఫొటో సోర్స్, CHAMARAJNAGAR POLICE

ఫొటో క్యాప్షన్, ఎడమ నుంచి నిందితులు మహదేవ్‌స్వామి, అంబిక, మాదేశ్, దొడ్డయ్య
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

కర్నాటక చామరాజనగర్ జిల్లాలోని ఒక ఆలయంలో ప్రసాదం తిని 15 మంది మృతి చెందిన కేసులో పోలీసులు ఆ ఆలయం ట్రస్ట్ అధ్యక్షుడిని అరెస్టు చేశారు.

ప్రసాదం తిన్న తర్వాత అనారోగ్యం పాలైన 90 మంది మైసూరులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది.

ట్రస్ట్ అధ్యక్షుడు ప్రసాదంలో అర లీటరు పురుగు మందు కలిపాడని ఆరోపణలు వచ్చాయని పోలీసులు చెప్పారు.

సల్లూర్ మఠానికి చెందిన 52 ఏళ్ల పత్తడా ఇమ్మడి మహాదేవస్వామి, ఒక మహిళ, మరో ఇద్దరితో కలిసి ఈ కుట్ర చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ప్రసాదంలో విషం కలిపాడు

ఫొటో సోర్స్, ANURAG BASAVARAJ

ఈ కేసులో అంబిక, ఆమె భర్త మాదేశ్, దొడ్డయ్య అనే మరో వ్యక్తికి ప్రమేయం ఉందని పోలీసులు చెప్పారు.

ఆలయ పాలకవర్గానికి చెడ్డపేరు తేవాలనే లక్ష్యంతోనే నలుగురూ ఇలా చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆలయ ట్రస్టును తిరిగి తమ చేతుల్లోకి తీసుకోవాలని వారు భావించినట్లు వివరించారు.

2017 వరకూ హనూర్ తాలూకా సులివది గ్రామంలోని కిచుకుట్టి మారమ్మ ఆలయం నియంత్రణ పూర్తిగా మహాదేవస్వామి చేతుల్లో ఉండేది. అప్పుడు ఆయన మాలె మహదేశ్వర లోయలో ఉన్న సల్లూర్ మఠంలో పూజారిగా ఉండేవారు.

"మారెమ్మ ఆలయంను మొదట ఒక సేవా సంఘం ద్వారా నడిపేవారు. మొత్తం డబ్బు లావాదేవీలన్నీ స్వామీజీ తన ప్రైవేటు అకౌంట్ నుంచే చేసేవారు. అందరినీ తన చెప్పుచేతల్లో ఉంచుకున్నారు. ట్రస్ట్ ఏర్పాటు చేశాక స్వామీజీ బలం తగ్గిపోయింది. దాంతో ట్రస్టు సభ్యులతో శత్రుత్వం పెంచుకున్నారు" అని చామరాజగర్ ఎస్పీ ధర్మేంద్ర కుమార్ మీనా బీబీసీతో చెప్పారు.

ప్రసాదంలో విషం కలిపాడు

ఫొటో సోర్స్, ANURAG BASAVARAJ

ట్రస్ట్ సభ్యుల మధ్య గోపురం చిచ్చు

ఆలయాన్ని మరింత విస్తరించాలని కోరుకున్న స్థానికులు స్వామీజీపై ఒత్తిడి తీసుకురావడంతో ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేశారు.

కర్నాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తులు భారీగా వచ్చేవారు. దాంతో ఆలయంలో మొక్కులు, హుండీల ద్వారా రాబడి కూడా బాగా పెరిగింది.

ఆలయానికి గోపురం నిర్మించడంలో తలెత్తిన వివాదాలే ఇటీవలి ఘటనకు కారణం అయ్యాయి.

"కోటిన్నర వ్యయంతో తమిళనాడు ఆర్కిటెక్ట్‌ను పిలిపించి మారమ్మ ఆలయానికి గోపురం నిర్మించాలని స్వామీజీ భావించారు. కానీ ట్రస్ట్‌లో మరో సభ్యుడు దీనికి 50 నుంచి 55 లక్షలు ఖర్చు చేస్తే సరిపోతుందని అన్నారు. ట్రస్ట్‌లోని మిగతా సభ్యులు కూడా స్వామీజీ తమకు ప్రతి విషయంలో అడ్డుపుల్లలు వేస్తున్నారని భావించారు" అని ఎస్పీ మీనా చెప్పారు.

"దీంతో ఏకపక్ష నిర్ణయం తీసుకున్న ట్రస్ట్ సభ్యులందరూ డిసెంబర్ 14న గోపురం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత ట్రస్ట్ అధ్యక్షుడైన స్వామీజీకి దీని గురించి సమాచారం ఇచ్చారు. దీంతో స్వామీజీకి కోపం వచ్చింది. ఆయన వెంటనే అంబిక, మాదేశ్, దొడ్డయ్యతో కలిసి ప్రసాదంలో విషం కలపాలని చెప్పాడు. ఆ నేరంలో ట్రస్ట్ సభ్యులను అరెస్ట్ చేయించాలని అనుకున్నాడు. మాదేశ్‌ను ట్రస్టీగా చేయాలని స్వామీజీ ప్లాన్ వేశాడు" అని పోలీసులు తెలిపారు.

ప్రసాదంలో విషం కలిపాడు

ఫొటో సోర్స్, ANURAG BASAVARAJ

పురుగుమందు తీసుకొచ్చిన అంబిక

శంకుస్థాపన జరిగే ఒక్క రోజు ముందే అంబిక వ్యవసాయ విభాగంలో పనిచేసే తన బంధువు ఇంటికి వెళ్లారు.

ఇంట్లో మొక్కలకు కొట్టాలని పురుగుమందు కావాలని అడిగారు. ఆయన ఉద్యోగులతో రెండు డబ్బాల పురుగుమందు తెప్పించారు.

ఆలయంలో విషాద ఘటన జరిగిన తర్వాత పురుగుమందులు ఎక్కడ వాడారో చెప్పాలని, వాటిని తెచ్చిన వ్యక్తి అంబికను గట్టిగా నిలదీశాడు. దాంతో ఆమె జరిగింది మొత్తం అతడికి చెప్పారు. "స్వామీజీ చెప్పడం వల్లే ఆ పని చేశానని, ఆయన ట్రస్ట్ సభ్యులపై అసంతృప్తితో ఉన్నాడని తెలిపారు. అందుకే ప్రసాదంలో పురుగుమందు కలపాలని ఆయన అనుకున్నాడని చెప్పారు.

వ్యవసాయ విభాగం ఉద్యోగి తరచూ అంబిక, మాదేశ్ ఇంటికి వస్తూపోతూ ఉండేవాడని పోలీసుల విచారణలో తేలింది.

దర్యాప్తులో కూడా తను అంబికకు పురుగుమందు డబ్బాలు ఇచ్చినట్లు అతడు పోలీసులకు చెప్పాడు. ఇటు మహదేవ్‌స్వామి కూడా ప్రసాదంలో పురుగుమందు కలిపినట్లు పోలీసుల ముందు నేరం అంగీకరించారు.

హత్య, హత్యాయత్నం, అపస్మారక హత్య, నేరపూరిత కుట్ర లాంటి వివిధ సెక్షన్ల ప్రకారం నిందితులందరినీ అరెస్ట్ చేశామని మైసూర్ రేంజ్ ఐజీపీ హెచ్ఎస్ శరత్ చంద్ర చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)