కర్నాటక: ఆలయంలో ప్రసాదం తిని 11 మంది మృతి.. మరో 70 మందికి అస్వస్థత

ఫొటో సోర్స్, Anurag Basavaraj
కర్నాటకలోని ఒక ఆలయంలో పూజ అనంతరం ప్రసాదం తిని 11 మంది చనిపోయారు. మరో 70 మంది అస్వస్థతకు గురయ్యారని పోలీసులు తెలిపారు.
చామరాజనగర్ జిల్లాలోని సులవది గ్రామంలో మారమ్మ ఆలయంలో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది.
ప్రసాదం తిని అస్వస్థత పాలైన వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు బీబీసీ ప్రతినిధికి చెప్పారు. అనారోగ్యం పాలైన వారందరినీ మైసూరు తదితర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన అనంతరం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు. ప్రసాదం విషపూరితం అయివుండవచ్చునని ఆరోగ్యశాఖాధికారి ఒకరు విలేకరులతో అన్నారు.
‘‘మాకు ప్రసాదంగా టొమాటో రైస్ ఇచ్చారు. అది చెడు వాసన వచ్చింది’’ అని ఆ పూజా కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి మీడియాకు తెలిపారు.

ఫొటో సోర్స్, Anurag Basavaraj
‘‘ఆ ప్రసాదం తినకుండా పారేసిన వారందరూ బాగున్నారు. దానిని తిన్న వారికి వాంతులు మొదలయ్యాయి. కడుపులో నొప్పి వచ్చింది’’ అని వివరించారు.
గ్రామంలోని కిచుకుట్టి మారమ్మ ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొనటానికి చాలా మంది పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చారని.. వారు తిరిగి వెళ్లేటపుడు వారికి ఈ టొమాటో అన్నాన్ని ప్రసాదంగా ఇచ్చారని మరొక ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
చనిపోయిన 11 మందిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు మైసూరు ఐజీపీ హెచ్.సి.శరత్‌చంద్ర బీబీసీకి తెలిపారు.
అస్వస్థతకు గురైన వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మైసూరు ఆస్పత్రిలో పరామర్శించారు.

ఫొటో సోర్స్, ANURAG BASAVARAJ
పారేసిన ప్రసాదాన్ని తిన్న కాకులు అక్కడికక్కడే చనిపోయాయి. ప్రసాదం నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.
ఈ దుర్ఘటన మీద మాజీ ప్రధానమంత్రి హె.డి.దేవెగౌడ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘‘ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు.. ఆ బాధను తట్టుకోగలిగే శక్తి, ధైర్యం కలగాలి’’ అని ఆయన ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఒక భార్య, ఇద్దరు భర్తలు... ఆమె జీవితమే ఒక సినిమా
- ఒక్కటైన సైనా - కశ్యప్: తండ్రి చెప్పిన లవ్ స్టోరీ
- ఇది కుందేళ్ల 'దండయాత్ర', కుదేలైన ఆర్థిక వ్యవస్థ
- ఒకప్పటి క్లాస్మేట్స్.. నేడు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు
- మహాకూటమి చంద్రబాబు వల్ల నష్టపోయిందా?
- గాంధీ మహాత్ముడు జాత్యహంకారేనా
- అంబానీల వివాహ వేడుకలో ఆడిపాడిన పాప్ సింగర్ బియోన్సే పారితోషికం ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








