జాతీయవాదం పేరిట వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్

ఫొటో సోర్స్, Getty Images
ఫేక్ న్యూస్ విస్తృతిలో జాతీయ వాదం పేరుమీద ప్రచారం అయ్యేవి ప్రధానంగా ఉంటున్నాయని బీబీసీ అధ్యయనం వెల్లడించింది.'జాతి నిర్మాణం' కోసం అనుకుంటూ భారత దేశంలో కొందరు ప్రజలు ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారని.. ఇక్కడ ఒక వార్తలో నిజానిజాల తనిఖీకన్నా తమ భావాలను చాటుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంటోందని బీబీసీ తాజా అధ్యయనం గుర్తించింది.
సాధారణ పౌరుల దృక్కోణం నుంచి ఫేక్ న్యూస్ వ్యాప్తిని విశ్లేషిస్తూ నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా వినియోగదారులు బీబీసీకి తమ ఫోన్లలోకి అనుమతి (యాక్సెస్) ఇవ్వడంతో ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్‌లలో ప్రజలు వార్తలను ఎలా పంచుకుంటున్నారో ఈ అధ్యయనం విశ్లేషించింది.
అంతకు ముందు మొదట ట్విటర్లోని నెట్వర్క్‌లను భారీ స్థాయిలో అధ్యయనం చేసింది. ఈ రోజు ప్రారంభమైన తప్పుడు వార్తల వ్యతిరేక భారీ అంతర్జాతీయ కార్యక్రమం BBC Beyond Fake News ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పరిశోధన జరిగింది.

ఈ నివేదికలో కీలక అంశాలు
- హింసను ప్రేరేపించవచ్చనుకునే సందేశాలను షేర్ చేసుకోవాలని భారత్ లోని ప్రజలేమీ భావించడం లేదు. కాకపోతే జాతీయవాదం పేరిట వచ్చే సందేశాలను షేర్ చేసుకోవడం తమ కర్తవ్యంగా భావిస్తున్నారు. భారత దేశ కీర్తి పేరిట, హైందవ శక్తి పేరిట హైందవ కీర్తి పునరుద్ధరణ పేరిట ఫేక్ న్యూస్‌ను కొందరు ఏమాత్రం నిజానిజాల నిర్థరణ లేకుండా షేర్ చేసుకుంటున్నారు. ఈ సందేశాలను షేర్ చేస్తున్నపుడు వారు తాము జాతి నిర్మాణంలో భాగం పంచుకోవడం అనే కర్తవ్యం నిర్వహిస్తున్నామని భావిస్తున్నారు.
- నైజీరియా, కెన్యాల్లో జరుగుతున్న ఫేక్ న్యూస్ వ్యాప్తిలోనూ కర్తవ్య భావన గోచరించింది. అయితే అక్కడ 'జాతి నిర్మాణ' కర్తవ్యంతో కాకుండా ఈ వార్త నిజమైతే తమ చుట్టూ ఉన్నవారు, తమ సమాజం ప్రభావితమవుతుందని భావించి 'బ్రేకింగ్ న్యూస్'ను షేర్ చేసుకుంటున్నట్ల కనిపిస్తోంది. ఇక్కడ స్వేచ్ఛగా సమాచారం పొందడాన్ని తమ విధిగా భావిస్తున్నట్లూ అర్థమయింది.
- భారత దేశంలో మోదీ అనుకూల రాజకీయాలు, ఫేక్ న్యూస్ వాహకాల మధ్య అనుబంధం ఉన్నట్టు ఈ నివేదిక సూచించింది. ట్విటర్లోని నెట్వర్క్‌ల మధ్య బిగ్ డేటా విశ్లేషణ చేసినపుడు .. రైట్ వింగ్ కాని శిబిరాల నుంచి వచ్చిన ఫేక్ న్యూస్ మామూలు స్థాయిలో ఉంది. అయితే.. మితవాద మూలాల నుంచి వచ్చిన ఫేక్ న్యూస్ వాహకాలు మాత్రం ఒకదానికి ఒకటి గట్టి సంబంధం కలిగి ఉన్నాయి. ఇది ఇతర ఫేక్ న్యూస్ కన్నా మితవాదానికి సంబంధించిన ఫేక్ న్యూస్ వేగంగా వ్యాప్తి చెందడానికి మార్గం చూపుతోంది.
- ఒక వార్త లేదా కథనంలో నిజానిజాలను ఇంకెవరో తనిఖీ చేస్తారు, అది నేనుచేయనక్కర్లేదు అనే భావనతో భారత దేశం, కెన్యా, నైజీరియాల్లో ప్రజలు తమకు తెలియకుండానే ఫేక్‌న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్నారు.
- మొత్తానికి భారత్‌లో జాతీయ వాదం పేరిట ఫేక్‌న్యూస్ వ్యాప్తి చెందుతోంది. కెన్యా, నైజీరియాల్లో మాత్రం ఈ పరిశోధన మరో కోణాన్ని వెల్లడించింది. కెన్యాలో వాట్సాప్ సంభాషణల్లో భాగంగా వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్‌లో మూడో వంతు డబ్బులకు సంబంధించిన కుంభకోణాలు, టెక్నాలజీకి సంబంధించినవే ఉంటున్నాయి. ఇది అక్కడి జాతీయ సమస్యలను, ఆకాంక్షలను, సామాజిక రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. నైజీరియాలో ఉగ్రవాదం, సైన్యానికి సంబంధించిన కథనాలు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి.
- తమకు వచ్చిన సందేశం లేదా వార్త మూలాధారాన్ని తెలుసుకోవాలన్న కోరిక భారత దేశంతో పోల్చితే కెన్యా, నైజీరియా ప్రజల్లో ఎక్కువగా ఉన్నా.. వారు ప్రధాన మీడియా వార్తలను, ఫేక్ న్యూస్‌ను సమాన స్థాయిలోనే అందుకుంటున్నారు. వార్తలను తెలుసుకోవడంలో వెనుకబడకూడదని ఆఫ్రికా ప్రజలు బలంగా భావిస్తారు. అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా ఉండటం అక్కడి సమాజంలో ఓ మంచి గుర్తింపు. ఈ కారణాలు ఇక్కడ వినియోగదారులకు నిజాన్ని తెలుసుకోవాలనివున్నా ఫేక్ న్యూస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి.

బీబీసీ వరల్డ్ సర్వీస్ ఆడియన్స్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ శంతను చక్రబర్తి మాటల్లో..
''ఫేక్ న్యూస్ వ్యాప్తి గురించి ఆందోళన చెందుతున్నామని సాధారణ ప్రజలు చెబుతున్నా.. మరి వారెందుకు ఈ ఫేక్ న్యూస్‌ను షేర్ చేస్తున్నారన్నది ఈ పరిశోధనలో కీలక ప్రశ్న. భారత దేశం, కెన్యా, నైజీరియాల్లో ఫేక్ న్యూస్ తీరును వివిధ కోణాల్లో బిగ్ డేటా, డిజిటల్ నెట్వర్క్ విశ్లేషణతో విశదీకరించి రూపొందించిన నివేదిక ఇది. ఈ దేశాల్లో బూటకపు వార్తల వ్యాప్తిని అర్థం చేసుకోవడానికి ఓ పద్ధతి ప్రకారం టెక్నాలజీ ఆధారంగా చేపట్టిన తొలి అధ్యయనం ఇదే కావొచ్చు. ఈ పరిశోధనలో వెల్లడైన అంశాలు ఫేక్ న్యూస్‌పై జరుగుతున్న చర్చను మరింత సమగ్రం చేస్తాయని భావిస్తున్నా. పరిశోధకులు, విశ్లేషకులు, పాత్రికేయులకు ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఫేక్ న్యూస్‌పై మరిన్ని పరిశోధనలు చేసేలా ప్రోత్సహిస్తాయని ఆశిస్తున్నాను.'' .

బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్రూప్ డైరెక్టర్ జెమీ యాంగస్ మాటల్లో..
''పశ్చిమ దేశాల్లోని మీడియాలో ఫేక్ న్యూస్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ప్రపంచలోని ఇతర దేశాల్లో ఎలాంటి తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో తెలిపేందుకు తాజా పరిశోధన గట్టి ఆధారాలను అందిస్తోంది. సోషల్ మీడియాలో వార్తలను ప్రచారం చేసే విషయంలో జాతి నిర్మాణ భావన పేరుమీద వాస్తవాలు ఏమవుతున్నాయో తెలుపుతోంది. తప్పుడు వార్తలను సమర్థంగా ఎదుర్కొనే దిశగా సాగుతున్న మన ప్రయత్నాలకు బీబీసీ Beyond Fake News కార్యక్రమం ఒక దారి చూపుతోంది. తప్పుడు వార్తలను ఎదుర్కొనేందుకు ఈ పరిశోధన అమూల్యమైన అంశాలను అందిస్తోంది.'' అని అన్నారు.

ఫేస్‌బుక్ వినియోగం
నైజీరియా, కెన్యాల్లో ఫేస్‌బుక్ వినియోగదారులు బూటకపు వార్తలు, వార్తలను సమానంగానే అందుకుంటున్నారు. అయితే వారు వీటిలో ఏది ఫేక్ న్యూస్, ఏది నిజమన్న విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. భారత దేశం విషయానికి వస్తే కాస్త వైవిధ్యం ఉంది. ఫేస్‌బుక్‌లో కొన్ని గ్రూప్స్ సంప్రదాయమైన వార్తలతో అనుసంధానమన్నా అవుతున్నాయి. లేదంటే బాగా వైరల్ అయిన ఫేక్‌న్యూస్‌ను అనుసరించడమన్నా చేస్తున్నాయి.. అరుదుగా కొందరు రెండింటినీ అనుసరిస్తున్నారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి, వాటి మూలాలపై ఆసక్తి ఉన్నవారు రాజకీయాలపైనా, రాజకీయ పార్టీలపైనా మరింత ఆసక్తి కలిగి ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది.
తరాల మధ్య తారతమ్యం
కెన్యా, నైజీరియాల్లో యువత తమ ముందు తరాల వారితో పోల్చితే మత విషయాలు, గిరిజన విషయాలపై అంత ఆసక్తిగా లేదు. అందువల్ల ఈ విషయాలు అక్కడ ఫేక్ న్యూస్ వ్యాప్తికి తక్కువగా దోహదం చేస్తాయి. అయితే భారత దేశంలో మాత్రం యువత జాతీయ వాదం పేరుమీద గుర్తింపు పొందుతోంది. ఇది భారత దేశంలో ముందు తరాలతో పోల్చితే ఇప్పటి యువత షేరింగ్ అలవాటుపై ప్రభావం చూపుతోంది.
చిత్రాలే అధికం..
టెక్స్ట్ కథనాలకన్నా బొమ్మలు, మీమ్స్ (memes) రూపంలో ఎక్కువగా ఫేక్ న్యూస్ షేర్ అవుతోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఫేక్ న్యూస్ విషయంలో సోషల్ మీడియా వేదికల తీరు ఎలా ఉంటుందనే అంశాన్నీ ఈ పరిశోధన మరింత లోతుగా వివరిస్తోంది.
ఫేక్‌న్యూస్ తమ వేదికలపై ఎలా ప్రభావం చూపుతోందో చర్చించడానికి ఫేస్‌బుక్, గూగుల్, ట్విటర్‌ల ప్రతినిధులు కూడా బీబీసీ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు. ఇదే రోజు ఈ నివేదిక కూడా విడుదలవుతోంది. ఆయా సంస్థల ప్రతినిధులు ఫేక్‌న్యూస్ అంశంపై ఈ రోజు దిల్లీలో BBC Beyond Fake News Conferenceలో చర్చించనున్నారు. ఈ కార్యక్రమం బీబీసీ వరల్డ్ న్యూస్‌లో GMT 16.30 గంటలకు ప్రసారమవుతుంది.
పరిశోధన ఎలా జరిగింది?
ఫేక్ న్యూస్ వ్యాప్తిని అర్థం చేసుకోవడానికి మేం పలు పద్ధతులను అనుసరించాం. ఆ పద్ధతుల వివరాలు..
బిగ్ డేటా/ మిషన్ లెర్నింగ్: గత రెండేళ్లలో ఫేక్ న్యూస్ గురించిన వచ్చిన వార్తల పరిశీలన. భారత దేశంలో ఇంగ్లిష్, స్థానిక భాషల్లో 112,000, ఆఫ్రికా దేశాల్లో 8000
ఆటో ఎథ్నోగ్రఫీ: ఫేక్ న్యూస్ సందేశాల సేకరణ

సెమియాటిక్ అనాలిసిస్: ఫేక్ న్యూస్ సందేశాలకు సంబంధించిన గుర్తులు, సూచనలు, నిర్మాణ తీరుపై విశ్లేషణ. భారత దేశంలో 1000+, నైజీరియాలో 1000+, కెన్యాలో 1000+ సందేశాల విశ్లేషణ
భారత దేశంలో 10 నగరాల్లో 40 మంది వద్ద 120 గంటలకు పైగా లోతైన ఇంటర్వ్యూలు, నైజీరియాలో 3 నగరాలు, కెన్యాలో 2 నగరాలు, ప్రతి చోటా 40 మంది వద్ద ఇంటర్వ్యూలు.
నెట్వర్క్ అనాలిసిస్: 16000 వేల ట్విటర్ ఫ్రొఫైల్స్ ( భారత దేశంలో 3,70,999 రిలేషన్‌షిప్స్), భారత దేశంలో 3200 ఫేస్‌బుక్ పేజీలు, ఆఫ్రికా దేశాల్లో 3000 పేజీలు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










