1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం: కరాచీపై భారత్ యుద్ధ నౌకలు దాడిచేసినప్పుడు ఏమైందంటే

ఫొటో సోర్స్, Indian Navy
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1971 యుద్ధానికి ముందు, భారత నౌకా దళ అధిపతి చీఫ్ అడ్మిరల్ ఎస్ఎం నందా బ్లిట్జ్ పత్రికతో మాట్లాడారు. తన నౌకా దళ కెరియర్ కరాచీ నుంచే మొదలైందని చెప్పారు.
‘‘కరాచీ నౌకాశ్రయం లేఅవుట్ గురించి నాకు బాగా తెలుసు. అవకాశం వస్తే, కరాచీ నౌకాశ్రయాన్ని ధ్వంసం చేయకుండా వదిలిపెట్టను’’అని ఆయన చెప్పారు.
మరోవైపు సోవియట్ యూనియన్ నుంచి కొన్ని క్షిపణి వాహక నౌకలను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. నౌకా స్థావరాలకు రక్షణ కల్పించేందుకు ఈ నౌకలు అవసరమని భారత్ భావించింది.
ఈ నౌకల కోసం కెప్టెన్ కేకే నయర్ నేతృత్వంలోని నౌకా దళ అధికారుల బృందం సోవియట్ యూనియన్‌కు వెళ్లింది. క్లిష్టమైన ఈ నౌకలను ఎలా ఉపయోగించాలి? అనే అంశంపై ఈ బృందానికి అక్కడ శిక్షణ ఇచ్చారు.
వ్లాదివోస్టోక్‌కు వెళ్లిన ఈ బృందం నౌకలపై శిక్షణ తీసుకోవడంతోపాటు రష్యా భాషపైనా పట్టుసాధించింది.
తమకు శిక్షణ ఇస్తున్న వారితో ‘‘ఈ నౌకలను ఆత్మరక్షణకు బదులుగా దాడులు చేయడానికి కూడా ఉపయోగించొచ్చా?’’అని కెప్టెన్ నయ్యర్ ప్రశ్నించారు.
ఈ వివరాలను తన పుస్తకం ‘1971 స్టోరీస్ ఆఫ్ గ్రిట్ అండ్ గ్లోరీ, ఫ్రమ్ ఇండియా-పాకిస్తాన్ వార్’ పుస్తకంలో భారత మేజర్ జనరల్ ఇయాన్ కార్డోజో రాసుకొచ్చారు.
‘‘ఈ నౌకలు వేగంగా కదలగలవు. అయితే, లోతైన జలాల్లో ఎక్కువ దూరం ప్రయాణించలేవు. వేగంగా వెళ్లడం వల్ల ఇవి ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి. దీంతో 500 నాటికల్ మైళ్ల కంటే ఎక్కువ దూరం ఇవి ప్రయాణించలేవు’’అని ఆయన పుస్తకంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Penguin Books
కోల్‌కతాకు...
ఈ నౌకలను దాడులకు ఉపయోగించడంపై నౌకా దళ ఉన్నత అధికారులు చర్చలు మొదలుపెట్టారు. వీటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నివేదిక సమర్పించే బాధ్యతను కమాండర్ విజయ్ జయరథ్‌కు అప్పగించారు. ఈ పత్రాన్ని కెప్టెన్ నాయర్ పరిశీలించిన తర్వాత, దిల్లీలోని నౌకా దళ ప్రధాన కార్యాలయానికి పంపించారు.
జనవరి 1971న సోవియట్ యూనియన్ నుంచి ఈ క్షిపణి నౌకలు భారత్ చేరుకున్నాయి. ఒక్కో నౌక బరువు దాదాపు 180 టన్నులు. భారీ నౌకల నుంచి ఈ క్షిపణి నౌకలను కిందకు దించేందుకు అవసరమైన క్రేన్లు ముంబయి పోర్టులో అందుబాటులో లేవు. దీంతో ఈ నౌకలను కోల్‌కతాకు తరలించారు.

అయితే, ఈ నౌకలను ముంబయికి ఎలా తీసుకెళ్లాలా? అనే అంశంపై చాలా చర్చలు జరిగాయి. చాలా ప్రయోగాల తర్వాత లెఫ్టినెంట్ కమాండర్ క్వాత్రా ఓ ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. మొత్తానికి ఎనిమిది భారీ నౌకల సాయంతో వీటిని కోల్‌కతా నుంచి ముంబయికి తీసుకొచ్చారు. అక్కడ సుదూరాల్లోని లక్ష్యాలపై ఈ నౌకలు ఎలా దాడి చేయగలవో పరీక్షించారు.
ఈ నౌకల రాడార్ పరిధి, కచ్చితత్వంతో లక్ష్యాలపై చేసే దాడులను చూసి నౌకా దళ అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పాక్‌తో యుద్ధం జరిగితే, ఈ క్షిపణి నౌకలను యుద్ధంలో ఉపయోగించాలని నిర్ణయించారు.

ఫొటో సోర్స్, AFP
తొలి దాడికి నిఫాత్, నిర్ఘట్, వీర్..
1971 డిసెంబరు 4 రాత్రిన మూడు క్షిపణి నౌకలు నిఫాత్, నిర్ఘట్, వీర్.. కరాచీ వైపుగా కదలిలాయి. వీటి వెనుకే పెట్యా తరగతికి చెందిన రెండు యుద్ధ నౌకలు కిల్టర్, కఛాల్ కూడా వెళ్లాయి.
ఈ విషయాలను ఆనాడు భారత నౌకా దళ అధిపతిగా పనిచేసిన చీఫ్ అడ్మిరల్ ఎస్ఎం నందా తన ఆత్మకథ ‘‘ద మ్యాన్ హు బాంబ్డ్ కరాచీ’’లో రాసుకొచ్చారు. ఈ మూడు క్షిపణి నౌకలను కరాచీ తీరంలోని నౌకల రాడార్లు గుర్తుపడతాయేమోనని భయం భారత నౌకా దళ అధికారులను వెంటాడింది. ఒకవేళ ఈ నౌకలు దొరికిపోతే, వీటిపై వైమానిక దాడులు జరిగే అవకాశముంది.
‘‘అందుకే దాడిని రాత్రిపూట చేపట్టాలని నిర్ణయించాం. సూర్యుడు అస్తమించే వరకు పాక్ యుద్ధ విమానాలకు ఈ నౌకలు దొరక్కుండా చూడాలని నిర్ణయించాం. అలాచేస్తే, మరుసటి రోజు ఉదయం వరకు పాక్ వైమానిక దళం వీటిని ఏమీ చేయలేదు.’’

ఫొటో సోర్స్, Harper Collins India
మొదటగా ఖైబర్‌పై..
ఆ సమయంలో వాయువ్య కరాచీ తీరంలో పాకిస్తానీ నౌక పీఎన్‌ఎస్ ఖైబర్ గస్తీ చేపడుతోంది. ఇదే నౌక 1965 యుద్ధంలో భారత్‌కు చెందిన ద్వారక నౌక స్థావరంపై దాడి చేసింది.
‘‘రాత్రి 10.15 గంటలకు భారత్ నౌకలు కరాచీ దిశగా వస్తున్నట్లు ఖైబర్ గుర్తించింది. వెంటనే దిశ మార్చుకుని, వేగంగా మావైపు కదిలింది. రాత్రి 10.40కి మాకు సమీపంలోకి వచ్చినప్పుడు నిర్ఘట్ నుంచి తొలి క్షిపణిని ప్రయోగించాం’’అని ‘ఇండియన్ డిఫెన్స్ రివ్యూ’కు రాసిన ఓ కథనంలో టాస్క్ గ్రూప్ కమాండర్ కేపీ గోపాల్ రావ్ వివరించారు.
‘‘అటు నుంచి ఖైబర్ కూడా యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లను ఉపయోగించడం మొదలుపెట్టింది. అయితే, తన వైపుగా వచ్చిన క్షిపణి నుంచి తప్పించుకోవడంలో ఖైబర్ విఫలమైంది. ఖైబర్ బాయిలర్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. అదే సమయంలో మరో క్షిపణితో ఖైబర్‌పై దాడిచేశాం. ఈ క్షిపణి తాకిన వెంటనే ఖైబర్ వేగం జీరోకు పడిపోయింది. దట్టమైన పొగలు ఆ నౌక నుంచి వచ్చాయి. సరిగ్గా 45 నిమిషాల తర్వాత, కరాచీకి వాయువ్యంగా 35 మైళ్ల దూరంలో పీఎన్‌ఎస్ ఖైబర్ మునిగిపోయింది.’’
ఈ దాడి గురించి ‘‘ద స్టోరీ ఆఫ్ ద పాకిస్తాన్ నేవీ’’ పుస్తకంలోనూ వివరించారు. ‘‘భారీ వేగంతో దూసుకొస్తున్న క్షిపణిని భారత యుద్ధ విమానం ప్రయోగించి ఉండొచ్చని తొలుత ఖైబర్ కమాండింగ్ ఆఫీసర్ భావించారు. ఆ క్షిపణి ఎలక్ట్రీషియన్ల మెస్ డెక్‌ను తాకింది. వెంటనే ఖైబర్ ఇంజిన్ పనిచేయడం ఆగిపోయింది. నౌకకు మొత్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.’’
‘‘ఆ చీకటిలోనే సైనిక ప్రధాన కార్యాలయానికి ఒక సందేశం పంపించారు. శత్రు విమానం మాపై దాడిచేసిందని పేర్కొన్నారు. రాత్రి 11.15కి అందరూ నౌక నుంచి బయటకు దూకేయాలని సైనిక ప్రధాన కార్యాలయం సూచించింది. 11.20కి ఆ నౌక జల సమాధి అయ్యింది.’’

ఫొటో సోర్స్, Indian Navy
వీనస్ ఛాలెంజర్ కూడా..
రాత్రి 11 గంటలకు నిఫాత్ రాడార్‌కు ఒక నౌక కనిపించింది. దానిపైపుగా ఓ క్షిపణిని ప్రయోగించారు. కొద్దిసేపటి తర్వాత మరో క్షిపణిని కూడా ప్రయోగించారు. దీంతో ఆ నౌక నుంచి పెద్దయెత్తున పొగ బయటకు వచ్చింది.
‘‘ఆ నౌకలో తీసుకెళ్తున్న ఆయుధాలకు నిప్పు అంటుకొని ఉండొచ్చు. ఆ నౌక రెండు ముక్కలైనట్లు మాకు రాడార్లలో కనిపించింది. కరాచీకి వాయువ్య దిశలో 26 మైళ్ల దూరంలో కేవలం ఎనిమిది నిమిషాల్లోనే ఆ నౌక మునిగిపోయింది. పాకిస్తానీ సైన్యం కోసం అమెరికా పంపిన ఆయుధాలు ఈ నౌకలు ఉన్నట్లు తర్వాత సమాచారం అందింది’’అని గోపాల్ రావ్ రాసుకొచ్చారు.
‘‘లండన్‌కు చెందిన రాయల్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ సమాచారం ప్రకారం.. ఆ మునిగిపోయిన నౌక పేరు ఎంవీ వీనస్ ఛాలెంజర్. ఇది డిసెంబరు 5న కరాచీకి చేరుకోవాల్సి ఉంది.’’
మరోవైపు మరుసటి రోజు ఉదయం 11.20 గంటలకు మరో పాకిస్తాన్ నౌక పీఎన్ఎస్ ముహాఫిజ్‌ను భారత క్షిపణి నౌక వీర్ లక్ష్యంగా చేసుకుంది. కేవలం 70 నిమిషాల్లోనే కరాచీకి దక్షిణంగా 19 మైళ్ల దూరంలో ముహాఫిజ్ కూడా మునిగిపోయింది.

ఫొటో సోర్స్, Indian Navy
ఐఎన్ఎస్ వినాశ్ దాడులు..
కరాచీ వైపుగా వీలైనన్ని క్షిపణులు ప్రయోగించాలని మూడు భారత క్షిపణి నౌకలకు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఐఎన్‌ఎస్ నిఫాత్ తన రాడార్‌లో కీమారీ చమురు కేంద్రం నుంచి వస్తున్న ఓ ట్యాంకర్‌ను గుర్తించింది. 18 మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఆ ట్యాంకర్‌పై నిఫాత్ క్షిపణిని ప్రయోగించింది.
మరోవైపు ‘ఆపరేషన్ పైథాన్’’ పేరుతో కరాచీపై మరోదాడికి కూడా ప్రణాళికలు రచించారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ దాడిని వాయిదా వేశారు.

ఫొటో సోర్స్, Indian Navy
రెండు రోజుల తర్వాత మరో క్షిపణి నౌక ఐఎన్‌ఎస్ వినాశ్ కూడా కరాచీపై దాడులు చేపట్టింది. దీని వెనుకే వచ్చిన యుద్ధ నౌకలు త్రిషూల్, తల్వార్ కూడా దాడులు చేశాయి. ఐఎన్‌ఎస్ వినాశ్‌కు జయరథ్ సారథ్యం వహించారు.
‘‘మరో దాడికి సిద్ధం అవుతుండగా నౌకలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే నౌక ఆటో పైలట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. అప్పటికీ బ్యాటరీల సాయంతో క్షిపణులు ప్రయోగించే వీలుంది. అయితే, రాడార్ల సాయంతో లక్ష్యాలను చూడటం కష్టమైంది. 11 గంటల కల్లా మళ్లీ విద్యుత్ వస్తుందని మేం భావించాం.’’

ఫొటో సోర్స్, Indian Navy
కీమారీ చమురు ట్యాంకర్లపై
‘‘నేను రాడార్లవైపు చూశాను. ఒక నౌక అప్పుడే కరాచీ నౌకాశ్రయం నుంచి నెమ్మదిగా వస్తోంది. నేను ఆ నౌక వైపు చూస్తున్నప్పుడే, నా దృష్టి కీమారీ చమురు డిపోపై పడింది. వెంటనే అటువైపుగా క్షిపణిని ప్రయోగించాం’’అని జయరథ్ బీబీసీతో చెప్పారు.
‘‘ట్యాంకర్లకు క్షిపణి తాకిన వెంటనే, భారీ విధ్వంసం జరిగినట్లు అనిపించింది. అక్కడున్న మిగతా నౌకలపై కూడా దాడిచేశాం. బ్రిటిష్ నౌక ఎస్‌ఎస్ హర్‌మటన్, పనామా నౌక గల్ఫ్‌స్టార్‌లకు కూడా నిప్పు అంటుకుంది.’’
‘‘నాలుగో క్షిపణిని పీఎన్‌ఎస్ ఢాకాపై ప్రయోగించాం. అయితే, ఆ నౌక కమాండర్ నైపుణ్యంతో తప్పించుకున్నారు. అయితే, కీమారీ చమురు డిపోకు అంటుకున్న నిప్పు 60 మైళ్ల దూరం నుంచి కూడా కనిపించింది.’’

ఫొటో సోర్స్, Lancer Publication
ఆపరేషన్ పూర్తయిన వెంటనే, జయరథ్ రేడియోలో ఒక సందేశం పంపించారు. ‘‘ఫోర్ పీజియన్స్ హ్యాప్పీ ఇన్ ద నెస్ట్’’అని చెప్పారు. ఇంతకంటే పెద్ద దీపావళి వేడుక ఏముంటుంది? అంటూ ఆయనకు సమాధానం వచ్చింది.
కరాచీ నౌకాశ్రయంలో అంటుకున్న నిప్పును ఆర్పేందుకు దాదాపు ఏడు రోజులు పట్టింది. ఆ మరుసటి రోజు కరాచీపై దాడులు చేపట్టడానికి వెళ్లిన భారత వైమానిక దళ పైలట్లు.. ఆ మంటలను ఆసియాలో మునుపెన్నడూ చూడలేదని వివరించారు.
కరాచీపై దట్టమైన పొగ మేఘాలు కమ్ముకున్నాయి. మూడు రోజులపాటు ఎండ కూడా తగలనంత స్థాయిలో పొగ కమ్ముకుంది. ఈ మంటలను చూసి పాక్ నావికా దళం విస్మయానికి గురైంది. తమ నౌకలన్నింటినీ కరాచీలో సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

కరాచీ పోర్టు దిగ్బంధం
‘‘పాకిస్తానీ వైమానిక దళం సాయానికి రాకపోవడం నిజంగా పాక్ నౌకా దళానికి దురదృష్టకర పరిణామం. పాక్ క్షిపణి నౌకలు లేదా వైమానిక దళ యుద్ధ విమానాలు అక్కడ కనిపించలేదు’’అని భారత జనరల్ కార్డోజో వివరించారు.
‘‘అరేబియా సముద్రంపై భారత నౌకా దళం పూర్తి పట్టుసాధించింది. కరాచీ జలాల్లోకి భారత్ అనుమతి లేకుండా ఏ నౌకా ప్రవేశించకుండా దిగ్బంధం విధించాం.’’

ఫొటో సోర్స్, Getty Images
అడ్మిరల్ గోర్స్‌ఖోవ్ ప్రశంసలు
ఈ నౌకా దళ యుద్ధాన్ని ఉపగ్రహాల సాయంతో సోవియట్ యూనియన్ నావికా దళ అధిపతి చీఫ్ అడ్మిరల్ గోర్స్‌ఖోవ్ జాగ్రత్తగా పరిశీలించారు.
భారత్‌లో స్థావరాల రక్షణ కోసం తాము విక్రయించిన క్షిపణి నౌకలు దాడులు చేయడాన్ని చూసి ఆయన నమ్మలేకపోయారు. కొన్ని రోజుల తర్వాత, తన బృందంతో కలిసి గోర్స్‌ఖోవ్ ముంబయి వచ్చారు.
‘‘క్షిపణి నౌకలతో కరాచీపై దాడిచేసిన వారెవరో నేను చూడాలని అనుకుంటున్నాను అని భారత చీఫ్ అడ్మిరల్ నందాతో గోర్స్‌ఖోవ్ అన్నారు’’అని కార్డోజో తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Harper Collins India
‘‘ఆ సమయంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో అడ్మిరల్ గోర్స్‌ఖోవ్‌కు విందు ఇస్తున్నారు. అందరూ ప్రత్యేక దుస్తుల్లో విందుకు హాజరయ్యారు. కానీ ఆ క్షిపణి నౌకల కమాండర్ వార్ యూనిఫాంలో ఉన్నారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు సాధారణ బట్టలు లేకపోవడంతో ఆయన విందుకు రాలేకపోతున్నారని గోర్స్‌ఖోవ్‌కు నందా చెప్పారు. అయితే, వార్ యూనిఫాంలో అయినా ఫర్వాలేదు.. ఆయన్ను విందుకు పిలవండి అని గోర్స్‌ఖోవ్ సూచించారు. దీంతో ఆయన్ను నందా ఆహ్వానించారు.’’
‘‘మీకు నేను ఒక విషయం చెప్పాలి. ఆ యుద్ధంలో మీరేమీ ఒంటరి కాదు. మేం మీతోనే ఉన్నాం. అమెరికా సైన్యం కార్యకలాపాలను మేం జాగ్రత్తగా పరిశీలించాం. అవసరమైతే మేం వెంటనే జోక్యం చేసుకునే వాళ్లం. అయితే, మేం ఇచ్చిన నౌకలను మీరు దాడి చేయడానికి ఉపయోగిస్తారని మేం ఊహించలేదు. నిజంగా మీకు మా అభినందనలు’’అంటూ గోర్స్‌ఖోవ్ అభినందించారు.
ఇవి కూడా చదవండి:
- రాయలసీమ జిల్లాల్లో జల విధ్వంసం... నిర్లక్ష్యం వల్లే డ్యామ్‌లు కొట్టుకుపోయాయా?
- హరియాణా గగనతలంలో రెండు విమానాలు ఎలా ఢీకొన్నాయి, 25 ఏళ్ల నాటి ఆ విధ్వంసం ఎలా జరిగింది?
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- అరబ్ దేశాల్లో కలకలం రేపుతున్న కొత్త మతం.. ఇది ఏంటి, ఎందుకు?
- ‘భారీ వర్షాలతో టీటీడీకి 4 కోట్లకు పైగా నష్టం.. 30 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదు’
- సినిమా చూశాక అదే స్టైల్లో దోపిడీ చేశాడు, 52 ఏళ్లు పోలీసులకు దొరకలేదు
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








