ఈజిప్ట్‌ డ్రగ్స్ కేసు: ఐదుగురు పాకిస్తానీయులకు ఉరిశిక్ష.. అన్యాయం అంటున్న కుటుంబాలు

రహీల్ హనీఫ్‌

ఫొటో సోర్స్, FAMILY PHOTO

ఫొటో క్యాప్షన్, రహీల్ హనీఫ్‌
    • రచయిత, మొహమ్మద్ జుబేర్ ఖాన్
    • హోదా, బీబీసీ కోసం

కరాచీకి చెందిన అనమ్ అఫ్జల్ భర్త రహీల్ హనీఫ్‌తో పాటు మరో ఆరుగురికి ఈజిప్ట్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేసిన కేసులో ఈ ఏడాది ఉరిశిక్ష పడింది.

రహీల్ ఒక ఓడలో పని చేస్తుండేవారు. రహీల్ పాకిస్తాన్ విడిచి వెళ్లే సమయానికి అనమ్ తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నారు.

ఒక ఏడాది పాటు పనిచేసి డబ్బు సంపాదించుకుని వస్తానని విమానం ఎక్కే ముందు రహీల్ తన భార్యతో చెప్పారు.

"ఇంకా వేచి చూసే ఓపిక లేదు" అంటున్నారు అనమ్.

రహీల్ వెళ్లిన రెండు వారాలకు అనమ్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు.

వీడియో క్యాప్షన్, పంజాబ్‌: డ్రగ్స్ సమస్య ఇప్పుడు ఎలా ఉంది?

డ్రగ్స్ కేసు ఏమిటి?

2017లో రహీల్ హనీఫ్‌తో సహా ఓడలో పనిచేసే ఆరుగురు సిబ్బందిని డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఈజిప్ట్ అధికారులు అరెస్ట్ చేశారు.

వీరిలో ఒకరు పాకిస్తాన్ మూలాలున్న ఇరాన్ పౌరుడు కాగా, మిగిలిన వారంతా పాకిస్తాన్ దేశస్థులు.

వాళ్లు పనిచేస్తున్న ఓడలో రెండు టన్నుల హెరాయిన్ దొరికిందని ఈజిప్టు అధికారులు పేర్కొన్నారు. ఈజిప్ట్‌లో ఇంతవరకు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలలో ఇదే పెద్ద మొత్తమని అధికారులు తెలిపారు.

అయితే రహీల్ అమాయకుడని అనమ్ వాదిస్తున్నారు.

"నేను దీన్ని ఎలా నమ్మగలను? ఎందుకంటే రహీల్ మొదటిసారి ఓడ ఎక్కారు. దీని కోసం ఏజెంట్‌కు రూ.2.5 లక్షలు ముట్టజెప్పారు. ఆయన జీతం సుమారు 40,000 పాకిస్తాన్ రూపాయలు. ఓడను శుభ్రం చేయడం ఆయన పని."

ఈ కేసులో తమ దేశ పౌరులు తరపున వాదించేందుకు పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఒక లాయర్‌ను నియమించింది.

అంతర్జాతీయ సముద్ర చట్టాల నిపుణుడు, సుప్రీం కోర్టు లాయర్ నిసార్ ఎ ముజాహిద్‌ కూడా వీరికి సహాయం అందిస్తున్నారు.

అరెస్ట్ అయినవారిలో నలుగురు పాకిస్తాన్ పౌరులు మొదటిసారి ఓడ ఎక్కారని నిసార్ తెలిపారు.

ఈ నలుగురూ కూడా ఓడలో వెయిటర్, క్లీనర్, పెయింటింగ్ పనుల్లో కుదురుకున్నారు. వీరంతా పేద కుటుంబాల నుంచి వచ్చినవారే.

వీరు కాకుండా ఒక కెప్టెన్, ఒక ఇంజినీర్ కూడా ఉన్నారు. కెప్టెన్ వయసు సుమారు 70 సంవత్సరాలు.

ముహమ్మద్ ఆతిఫ్

ఫొటో సోర్స్, FAMILY PHOTO

ఫొటో క్యాప్షన్, ముహమ్మద్ ఆతిఫ్

'గొంతు వినాలనిపిస్తోంది'

"పెళ్ళయిన దగ్గర నుంచి ఒక మంచి భవిష్యత్తు కోసం ఆయన కలలు కంటుండేవారు. నేను తల్లిని కాబోతున్నానని తెలిసినప్పుడు ఆయన భావోద్వేగానికి గురయ్యారు. బిడ్డ పుట్టేలోపు మంచి ఉద్యోగం సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేశారు. పుట్టబోయే బిడ్డను పేదరికంలో మగ్గనివ్వనని, మన బిడ్డ కోసం కష్టపడతానని అనేవారు" అంటూ రహీల్ భార్య అనమ్ చెప్పుకొచ్చారు.

అనమ్ ప్రసవానికి ఇంకా ఒక నెల ఉందనగా ఓ ఏజెంట్ ద్వారా రహీల్ ఓడలో ఉద్యోగం సంపాదించారు.

"డెలివరీ అయ్యాక ఆ ఉద్యోగంలో చేరమని అడిగాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఒక ఏడాది పనిచేసి వస్తే మన దగ్గర చాలా డబ్బు ఉంటుంది. బిడ్డ పుట్టిన వేడుకను ఘనంగా జరుపుకోవచ్చు.. చేతిలో డబ్బులు లేకుండా ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం? అన్నారు."

"ఉద్యోగంలో చేరాక అప్పుడప్పుడూ మాట్లాడేవారు. ఓడలో పనిచేయడం వల్ల ఆరోగ్యం బావుండట్లేదని చెప్పారు. కానీ, ఫిర్యాదులేమీ రాకుండా నా విధిని నిర్వర్తిస్తున్నానని అన్నారు. సడన్‌గా ఆయన దగ్గర నుంచి ఫోన్లు రావడం ఆగిపోయింది. పదిహేను రోజుల వరకూ మాకు ఏ కబురూ లేదు. అప్పుడు మళ్లీ ఆయనే ఫోన్ చేసి డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారని చెప్పారు."

ఈజిప్ట్ కోర్టులో ఈ కేసు విచారణ మూడు సంవత్సరాల పాటు సాగింది.

తనను చిత్రహింసలకు గురిచేసి నేరం ఒప్పుకునేటట్లు చేశారని రహీల్ పేర్కొన్నారు.

"ఆయన కోర్టుకు వెళ్లినప్పుడల్లా మాట్లాడే అవకాశం చిక్కేది. కానీ, శిక్ష విధించిన దగ్గర నుంచి ఆయనతో మాట్లాడే అవకాశం రాలేదు. నాకు చాలా కంగారుగా ఉంది. ఆయన గొంతు వినాలనుంది."

"నవంబర్ 23న మా పెళ్లిరోజు. ఒక్క ఏడాది కూడా మేం కలిసి కాపురం చేయలేదు. తిరిగొచ్చేస్తే, బిడ్డతో పాటు ఏదైనా మంచి రెస్టారెంట్‌లో పెళ్లిరోజు జరుపుకుందామని అన్నారు. ఇప్పుడు ఆయన లేకుండా మరో సంవత్సరం గడిచిపోయింది. మా బాబుకు ఇప్పుడు మూడేళ్లు. వాళ్ల నాన్న గురించి అడుగుతూ ఉంటాడు" అంటూ అనమ్ వాపోయారు.

రహీల్ హనీఫ్‌, అనమ్ అఫ్జల్‌ల పెళ్లి ఫొటో

ఫొటో సోర్స్, FAMILY PHOTO

ఫొటో క్యాప్షన్, రహీల్ హనీఫ్‌, అనమ్ అఫ్జల్‌ల పెళ్లి ఫొటో

'అమ్మీ, అబ్బు మౌనంలో మునిగిపోయారు'

మరణశిక్ష పడినవారిలో ముహమ్మద్ ఆతిఫ్ కూడా ఒకరు.

"మా అన్నయ్యకు శిక్ష పడిందని తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో ఎవరూ భోజనం చేయట్లేదు. అమ్మ, నాన్న తమ కొడుకుని తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. మా అన్నయ్యతో ఇంక మేం మాట్లాడలేం" అని ముహమ్మద్ ఆతిఫ్ సోదరుడు ముహమ్మద్ రమీజ్ అన్నారు.

ఆతిఫ్ చిన్నవయసు నుంచే ఓడలో వెయిటర్‌గా పనిచేసేవారని చెప్పారు.

"అమ్మీ, అబ్బు ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఎప్పుడైనా అబ్బు ఇతర విషయాల్లో ఆసక్తి చూపిస్తారుగానీ అమ్మీ ఒకటే మాట.. ఆతీఫ్ ఫోన్ చేశాడా? ఎప్పుడు వస్తాడు? ఇంతకు మించి ఏం మాట్లాడరు. మేం ఏవో ఒక సాకులు చెప్పి సర్దిచెబుతుంటాం. అంతకు మించి చెప్పడానికి మా దగ్గర జవాబు లేదు."

ఈజిప్ట్‌లో మూడేళ్ల నుంచి అతీఫ్ జైల్లో ఉన్నారని రమీజ్ చెప్పారు.

"మేం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాం. ఆర్థిక పరిమితుల కారణంగా ఈజిప్ట్ వెళ్లలేకపోయాం. వెళ్లుంటే అన్నయ్యను ఒక్కసారైనా కళ్లారా చూసుకునేవాళ్లం. కానీ, ఆ అవకాశం లేదు."

"పాకిస్తాన్ రాయబార కార్యాలయం వారి కోసం ఒక వకీలును నియమించింది. సుప్రీం కోర్టు న్యాయవాది నిసార్ ఎ ముజాహిద్ కూడా మాకు సహాయం చేస్తున్నారు. ఆయన సహాయంతో శిక్షకు వ్యతిరేకంగా అప్పీల్ చేశాం" అని రమీజ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, తన కుమారుడి ముందే బ్రౌన్ షుగర్ తీసుకొనేవాడినని డ్రగ్స్ బాధితుల కౌన్సెలర్ తుషార్ చెప్పారు.

అప్పీల్‌లో ఏముంది?

దురదృష్టవశాత్తు శిక్షకు వ్యతిరేకంగా అప్పీల్ చేసుకోవడానికి మాత్రమే వారికి అవకాశం ఉంది అని నిసార్ తెలిపారు.

దిగువ కోర్టులో వారికి శిక్ష విధించారు. ఈజిప్ట్ చట్టాల ప్రకారం 'గ్రాండ్ ముఫ్తీ' శిక్షను ధృవపరిచింది.

ప్రస్తుతం నిందితులు చేసుకున్న అప్పీల్‌పై ఈజిప్ట్ సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది కానీ, దానికి చాలా సమయం పడుతుందని నిసార్ వివరించారు.

పాకిస్తాన్ పౌరులతో సుదీర్ఘ సంభాషణ జరిపిన తరువాత ఈ కేసులో న్యాయవిచారణ పూర్తి స్థాయిలో జరగలేదనే నిర్ధారణకు వచ్చినట్లు ఆయన చెప్పారు.

అప్పీల్ తయారుచేయడంలో వీరి తరపున వాదిస్తున్న లాయర్‌కు నిసార్ సహాయం అందించారు.

కింది కోర్టులో పారదర్శకంగా విచారణ జరగలేదని, అన్ని పక్షాల వాదనలు వినకుండానే నిర్ణయం తీసుకున్నారని ఈ అప్పీల్‌లో పేర్కొన్నారు.

ముహమ్మద్ ఆతిఫ్

ఫొటో సోర్స్, FAMILY PHOTO

ఫొటో క్యాప్షన్, ముహమ్మద్ ఆతిఫ్

"అసంపూర్ణ సాక్ష్యాధారాలతో వారిని దోషులుగా తేల్చారు. కింది కోర్టు, అధికారులను ప్రశ్నించకుండానే వారి వాంగ్మూలాలను స్వీకరించింది. ఏకపక్షంగా దర్యాప్తు జరిపి, ఇష్టానుసారం నివేదిక రాశారు. నిందితులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇవ్వలేదు" అని నిసార్ చెప్పారు.

"కోర్టు రికార్డుల ప్రకారం ఎక్కడైతే మాదకద్రవ్యాలు దొరికాయో అక్కడకు ఓడ సిబ్బంది వెళ్లే అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితుల్లోను వారిని ఆ ప్రాంతాల్లోకి అనుమతించరు. అలాంటప్పుడు ఓడలో పనిచేసే సబ్ క్రూ అక్కడ డ్రగ్స్‌ను ఎలా దాచిపెడతారు?

ఓడలోని రహస్య కంపార్ట్మెంటుల్లో డ్రగ్స్ బయటపడ్దాయి. సబ్ క్రూ ఓడ లోపలి భాగాలను తెరిచి లోనికి వెళ్లలేదు. వారి దగ్గర ఆ సామర్థ్యం ఉండదు."

ఇలాంటి అనేక విషయాలపై సరైన విచారణ జరగలేదని నిసార్ తెలిపారు.

వీరిని ఇరాన్‌లో ఓడలోకి ఎక్కించారు. వీరికి గమ్యస్థానం తప్పుగా చెప్పారు. నెల పాటూ ఏ కారణం లేకుండా జైల్లో ఉంచారు.

ఈ ఓడ గమ్యస్థానం ఈజిప్ట్ కాదని రికార్డుల్లో ఉంది. మరి ఈజిప్ట్ అధికారులు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, వీరిని ఎలా అరెస్ట్ చేశారో తెలియాల్సి ఉంది.

"ఈ కేసులో చాలా లొసుగులు ఉన్నాయి. వాటన్నింటి పైనా దర్యాప్తు జరగాలి" అని నిసార్ అన్నారు.

వీడియో క్యాప్షన్, మెక్సికోలో రోజుకి 71 హత్యలు, డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలతో మర్డర్ల మెక్సికోగా మారిన వైనం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)