‘‘మదర్స్‌ డే’కి ముందే అమ్మకి తుది వీడ్కోలు చెబుతాననుకోలేదు’

స్మశానంలో యువతి

ఫొటో సోర్స్, Ismail Moneer

    • రచయిత, డీనా అబౌఘజాల
    • హోదా, బీబీసీ మానిటరింగ్

మదర్స్ డే (మే నెల రెండో ఆదివారం)కి అమ్మకి బహుమతి కొనే పనిలో నిమగ్నమైపోయింది 33 సంవత్సరాల అయా (పేరు మార్చడమైనది). కానీ, ఆ సమయానికి తల్లిని తాను పూడ్చిపెట్టబోతున్నానని ఊహించలేకపోయింది.

ఈజిప్టులో చోటు చేసుకున్న తొలి 10 కరోనావైరస్ మరణాల్లో అయా వాళ్ల తల్లిది కూడా ఒకటి.

ఫిబ్రవరి మధ్య వారానికే ఈజిప్టులో కోవిడ్-19 కేసులు నమోదు అయినప్పటికీ , మార్చి మొదటి వారంలో కొత్త కేసులు పెరగడం మొదలయింది.

ఇప్పటికే ఈజిప్టులో దాదాపు 9 వేల మంది కోవిడ్-19 బారిన పడగా 500 మందికి పైగా మంది మరణించారు.

‘నాకు నిన్ను కౌగలించుకోవాలని ఉంది..కానీ’

ఒక వారం రోజులుగా తన తల్లి ఆరోగ్యం బాగోలేనప్పటికీ , ఇదే అంతం అని అయా ఊహించలేదు.

తల్లి మరణించిన వార్త వినగానే తాను స్పృహ కోల్పోవడాన్ని అయా గుర్తు చేసుకుంది.

"మా సోదరుడు అబద్దం చెబుతున్నాడనుకున్నాను. అంతకు ముందే అమ్మ ఆరోగ్యం కోలుకుంటుందని నాకు చెప్పారు".

“మా అమ్మ ఏప్రిల్లో తన పుట్టిన రోజు నాటికల్లా ఇంటికి తిరిగి వచ్చేస్తారనుకున్నాను. తను మదర్స్ డేకి కొన్ని రోజుల ముందే హాస్పిటల్లో చేరింది. ఇంటికి తిరిగి వస్తే మదర్స్ డే, తన పుట్టిన రోజు కలిపి జరుపుకోవాలనుకున్నాము”.

అయా తల్లి కోవిడ్-19 కి గురై కైరోకి దక్షిణంలో, హెల్వాన్ జిల్లాలో ఉన్న క్వారంటైన్ హాస్పిటల్లో, మరణానికి ఒక్క రోజు ముందు చేరారు.

69 సంవత్సరాల అయా వాళ్ళ అమ్మ అంతకు ముందు సోమవారం వరకు ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలో ఆమెకి కోవిడ్ 19 నెగటివ్ వచ్చింది.

‘‘నేను ఆఖరి సారి మా అమ్మతో మంగళవారం మాట్లాడాను. ఎందుకంటే నాన్నకి గుండెలో స్టెంట్ అమర్చే పని ఉండటంతో నేను పూర్తిగా రోజంతా ఆయనతోనే ఉన్నాను.’’

తన తల్లికి ఆఖరిసారి వీడ్కోలు చెప్పలేకపోవడమే అయాని వేధిస్తోంది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

అయా అమ్మ చనిపోయిన రోజే దేశ వ్యాప్తంగా అన్ని ప్రార్ధనలని, సమావేశాలని నిలిపివేశారు.

మసీదులన్నిటిని మూసివేశారు.

మరోదారి లేక అయా అంత్య క్రియల సమయంలో చేసే ప్రార్ధనలని హాస్పిటల్ మార్చురీ దగ్గరే చేయాల్సి వచ్చింది.

వాళ్ళ అమ్మ శవాన్ని కూడా హాస్పిటల్ నుంచి బయటకి తేవడానికి చాలా సమయం పట్టడంతో రాత్రి వరకు అంత్యక్రియలు జరగలేదు.

‘‘చాలా కొంత మంది కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చారు. మేమంతా మాస్కులు, చేతికి గ్లోవ్స్ వేసుకున్నాము. మా వదిన నన్ను పట్టుకుని ‘నాకు నిన్ను కౌగలించుకోవాలనుంది. కానీ కౌగిలించుకోలేను’ అని, నెమ్మదిగా చెప్పింది. మా సోదరుని అత్తగారు ఈ వార్తకి కుప్పకూలిపోయారు. కానీ, మేమెవరమూ ఒకరికి ఒకరు ఓదార్పు ఇచ్చుకోలేకపోయాం.

మా నాన్నగారు కూడా అమ్మకి ఆఖరి సారి వీడ్కోలు చెప్పలేకపోయారు. ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ, అంతకు ముందు ఒక వారం రోజులుగా ఆయన అమ్మని చూడలేదు.’’

అయా తల్లి మరణించిన తర్వాత ఆమె తండ్రి కోవిడ్-19కి గురై హాస్పిటల్లో చేరారు.

‘‘ఆయన హాస్పిటల్లో చేరిన వెంటనే నన్ను నేను కోల్పోయినట్లనిపించింది. నేను నేల మీద పడి ఏడ్చాను.’’

అయా తండ్రి కోలుకుని, హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చారు.

అయాకి, ఆమె సోదరుడికి కరోనా వైరస్ సోకనప్పటికీ, వాళ్లిద్దరూ ఇప్పుడు స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

"మేము ఈ సమయంలో ఒకరికి ఒకరు భరోసా ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నాము.’’

ఇస్మాయిల్ చిత్రం

ఫొటో సోర్స్, Ismail Moneer

‘మా అమ్మ ఎప్పటికీ సజీవంగా ఉంటుంది’

ఆప్తులను కోల్పోయిన వారి దుఃఖం ఎలా ఉంటుందో ఊహించిన రానా సమీహ ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేశారు. ఆ గ్రూప్‌లో మరణించిన వారి పేర్లను పంపించి వారి కోసం ప్రార్ధనలు చేసేందుకు సందేశాలు పంపిస్తున్నారు.

31 సంవత్సరాల రానా ఇంజనీరుగా పని చేస్తున్నారు. తను సోషల్ మీడియా నుంచి మరణించిన వారి పేర్లను సేకరిస్తున్నారు. అలాగే, కొంత మంది కుటుంబ సభ్యులని కోల్పోయిన వారు.. వారి పేర్లను చేర్చమని రానాని కోరుతున్నారు.

“మసీదులు మూసేసారు. కానీ, మరణాలు ఆగవు కదా. అంత్యక్రియల సమయంలో చేసే ప్రార్ధనలు మాకు చాలా ముఖ్యం".

మహమ్మద్ ప్రవక్త చెప్పిన కొన్ని సూక్తుల్లో అంత్యక్రియల సమయంలో ఎక్కువ మంది హాజరవ్వడానికి ప్రాముఖ్యత ఉంది.

మార్చి 24వ తేదీన వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తే కొన్ని రోజుల్లోనే గ్రూపులో సభ్యుల సంఖ్య 256కి చేరింది. ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఇంత కంటే ఎక్కువ చేర్చలేరు.

ఫేస్‌బుక్‌లో కూడా ఇలాంటి గ్రూపునే ఏర్పాటు చేశారు.

ఒక వీధిలో ఒక శవ పేటిక ముందు కొంత మంది ప్రార్ధన చేస్తున్న ఒక చిత్రాన్ని చూసి రామి సాద్ ‘సలాత్-అల్-గాయిబ్’ అనే గ్రూపుని తయారు చేశారు. సలాత్ -అల్ గాయబ్ అంటే హాజరు కాకుండా చేసే అంత్యక్రియల ప్రార్ధనలు అని అర్ధం.

సాధారణంగా ఇలాంటి ప్రార్థనల్లో చాలా మంది పాల్గొంటారు.

‘‘అది చాలా విచారకరమైన దృశ్యం. అందుకే నేను ఏదో చేయాలనుకున్నాను’’ అని 30 సంవత్సరాల వ్యాపారవేత్త అయిన రామి చెప్పారు.

మార్చి 24వ తేదీన చేసిన ఈ గ్రూపులో పది రోజుల్లోనే 4000 మంది ఫాలోవర్లు చేరారు.

‘‘మరణించిన వారి కోసం ఎక్కువ మంది ప్రార్ధనలు చేయడం కోసం ఈ గ్రూపులను తయారు చేశారు’’ అని అయా అన్నారు.

కానీ, అవి కేవలం ప్రార్ధనలకే పరిమితం కాదు.

‘‘మా అమ్మ మరణం విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న తర్వాత, నాకు చాలా మంది అపరిచితులు తమ సంతాపాన్ని తెలియచేసారు.

నా నాల్గవ తరగతిలో సహ విద్యార్థి, వాళ్ళ అమ్మతో కలిసి సంతాపాన్ని తెలిపారు. నాకు వెంటనే తను గుర్తు రాలేదు.’’

ఇలాంటి మద్దతు తాను బాధ నుంచి బయట పడటానికి సహాయం చేసిందని అయా అన్నారు.

“ఇదంతా మా అమ్మని ఎప్పటికీ సజీవంగానే ఉంచుతుంది. ఇలా అనుకోవడం నాకు శక్తినిస్తుంది. తను సాధారణ పరిస్థితుల్లో మరణిస్తే నేను తట్టుకోలేకపోయేదానిని”.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)