ఈజిప్ట్ టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ స్టార్లను 'అసభ్యత' పేరుతో జైల్లో పెడుతున్న ప్రభుత్వం

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సాలీ నబిల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
టిక్‌టాక్ వీడియోలు చేస్తున్న అమ్మాయిలను ఈజిప్ట్‌లో జైళ్లో పెడుతున్నారు.
22 ఏళ్ల మవడా అల్ అదామ్ అనే సోషల్ మీడియా స్టార్‌కు ఇటీవల ఈజిప్ట్‌లో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
ఆమె చేసిన నేరం టిక్‌టాక్ వీడియోలు చేయడమే. అవి కుటుంబ విలువలకు విరుద్ధంగా ఉన్నాయంటూ కోర్టు ఆమెకు శిక్ష విధించింది.
ఆధునిక దుస్తులు ధరించి, కొన్ని పాపులర్ పాటలకు డ్యాన్స్ చేస్తూ మవడా టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో వీడియోలు పోస్టు చేస్తుంటారు. ఫొటోలు పెడుతుంటారు.
గత మేలో మవడాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయని కోర్టు నిర్ధారించింది.
‘‘మేం షాక్ తిన్నాం. ఆమె ఏ తప్పూ చేయలేదు, నేరస్థురాలూ కాదు. ఫేమస్ అవ్వాలనుకుందంతే’’ అని మవడా చెల్లెలు రహ్మ అంటున్నారు.
‘‘మా అమ్మ ఇప్పుడు పూర్తిగా మంచం పట్టారు. ఏడుస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు రాత్రి నిద్ర లేచి, మవడా ఇంటికి వచ్చేసిందా అని అడుగుతున్నారు’’ అని రహ్మ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఒక్క మవడానే కాదు...
మవడాకు మాత్రమే కాదు, మరో నలుగురు యువతులకు కూడా టిక్‌టాక్ వీడియోలు చేసినందుకు ఈజిప్ట్ కోర్టులు ఇదే శిక్ష విధించాయి. రెండేళ్ల జైలు శిక్షతోపాటు దాదాపు రూ.15 లక్షల జరిమానా కూడా విధించాయి.
ఈ ఐదుగురిని ఇప్పుడు ‘టిక్‌టాక్ గర్ల్స్’ అని పిలుస్తున్నారు.
హనీన్ హోసమ్ అనే సోషల్ మీడియా స్టార్ కూడా ఈ ఐదుగురిలో ఉన్నారు. మిగతా ముగ్గురి పేర్లు బయటకు వెల్లడి కాలేదు.
‘‘కొన్ని పేరు పొందిన ఫ్యాషన్ బ్రాండ్లకు మా అక్క సోషల్ మీడియాలో మోడలింగ్ చేస్తున్నారు. ఆమె పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారు. నటి అవ్వాలన్నది ఆమె కల’’ అని రహ్మ తన అక్క గురించి వివరించారు.
మవడా ‘అసభ్యకరంగా’ కనిపించిందనడానికి ఆధారంగా 17 ఫొటోలను ప్రొసిక్యూషన్ కోర్టుకు చూపించినట్లు మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. అయితే, తన ఫోన్ గత ఏడాది చోరీకి గరైందని, దాని నుంచి ఈ ఫొటోలు బయటకు లీక్ అయ్యాయని మవడా చెప్పారు.
ఆగస్టు 17న మవడా శిక్షపై అప్పీలు విచారణకు రావాల్సి ఉంది.
తన అక్కకు కనీసం శిక్షనైనా తగ్గిస్తారని రహ్మ ఆశాభావంతో ఉన్నారు.
‘‘మా అక్కనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? చాలా మంది సినీ తారలు శరీరం కనిపించేలా డ్రెస్సులు వేసుకుంటుంటారు. కానీ, వారిని ఎవరూ ఏమీ అనరు’’ అని రహ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టు తీర్పు వినగానే మవడా స్పృహ తప్పి పడిపోయారని ఆమె న్యాయవాది అహ్మద్ బాహ్క్రీ అన్నారు.
‘‘ఆమె వీడియోల్లో కొన్ని సంప్రదాయాలకు, విలువలకు వ్యతిరేకంగా ఉన్నా... దానికి జైలు శిక్ష పరిష్కారం కాదు. జైళ్లు నేరస్థులను తయారుచేస్తాయి. ఆమెను పునరావాస శిబిరానికి పంపి ఉండాల్సింది’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
భావ ప్రకటన స్వేచ్ఛ
ఈజిప్ట్ జనాభాలో ఎక్కువ భాగం ముస్లింలే. సమాజంలో ఛాందసవాదం ఎక్కువ.
మవడా లాంటి వారు చేసే టిక్‌టాక్ వీడియోలను కొందరు అసభ్యకరమైనవిగా చూస్తుంటారు. సోషల్ మీడియాలో వారిపై విమర్శల దాడి చేస్తుంటారు.
మవడా లాంటి వాళ్లు సరదాగా ఇలాంటి టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నారని, వాళ్లకు జైలు శిక్ష విధించడం సరికాదని అభిప్రాయపడుతున్నవారు కూడా ఈజిప్ట్‌లో ఉన్నారు.
మవడా సహా జైలు శిక్ష ఎదుర్కొంటున్న అమ్మాయిలను విడుదల చేయాలని మానవహక్కుల ఉద్యమకారులు డిమాండ్ చేశారు.
వారి అరెస్టు... భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేస్తూ, డిజిటల్ వేదికలను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం వేసిన మరో అడుగని వారు అంటున్నారు.
2014లో సైన్యం మద్దతుతో అబ్దెల్ ఫతా సిసి దేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ప్రభుత్వం అతివాద విధానాలను అమలు చేస్తోందని మానవహక్కుల కార్యకర్తలు అంటున్నారు.
ఉదారవాదులు, ఇస్లామిస్టులు, జర్నలిస్టులు, మానవహక్కుల న్యాయవాదులు ఈజిప్ట్‌లో వేల సంఖ్యలో రాజకీయ ఖైదీలుగా ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఈజిప్ట్ అధ్యక్షుడు మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చారు.
లింగ వివక్ష
‘‘సోషల్ మీడియాలో మహిళలకు తమను తాము వ్యక్తపరుచుకునేందుకు మాత్రమే అనుమతి ఉంది. ఈజిప్ట్ కుటుంబ విలువలను కాలరాస్తున్నారని ఆ యువతులపై ఆరోపణలు మోపుతున్నారు. అసలు ఆ విలువలు ఏంటన్నదానికి ఎక్కడా నిర్వచనం లేదు’’ అని ఈజిప్షియన్ కమిషన్ ఫర్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహమ్మద్ లాట్ఫీ అన్నారు.
మవడా కేసులో లింగ వివక్ష కొట్టొచ్చినట్లు కనపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘ఇది పూర్తిగా లింగ వివక్షే. ప్రభుత్వ పితృస్వామ్య ధోరణికి ఇది ప్రతిరూపం. నిర్వచనమంటూ లేని ఈ కుటుంబ విలువలను పాటించాల్సిన బాధ్యతను ప్రధానంగా మహిళలపైనే రుద్దుతున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
మవడాను ఒకవేళ విడుదల చేసినా, ఈ ఉదంతం ద్వారా యువతులను భయపెడుతూ ప్రభుత్వం గట్టి సందేశం పంపినట్లైందని లాట్ఫీ అన్నారు.
‘‘ప్రభుత్వం గట్టి సందేశం పంపింది. ‘మీరు అనుకున్నదల్లా మాట్లాడటం, చేయడం కుదరదు. అది రాజకీయాలతో ముడిపడింది కాకపోయినా. మీరు దాటకూడని గీతలున్నాయి’ అని స్పష్టంగా చెప్పింది’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, mawada_eladhm/instagram
‘సాధారణ నేపథ్యం ఉన్నవారినే’
మవడాకు టిక్‌టాక్‌లో 30 లక్షలకుపైగా ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 16 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.
సోషల్ మీడియాలో వీరి ప్రభావం పెరుగుతుండంటపై ప్రభుత్వం ఆందోళనతో ఉందని కొందరు విమర్శకులు అంటున్నారు.
సాధారణ నేపథ్యం ఉండి, పెద్దగా పరిచయాలు లేని కుటుంబాల నుంచి వచ్చిన యువతులపైనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని... సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న యువతులు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ధోరణితో ఉన్నా వారిపై చర్యలు ఉండటం లేదని కూడా విమర్శిస్తున్నారు.
‘‘ఉన్నత స్థాయి కుటుంబాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి. ఆ కుటుంబాల యువతలు ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశాలు తక్కువ’’ అని లాట్ఫీ అన్నారు.
‘‘సైబర్ స్పేస్‌ను నియంత్రించే వ్యూహాల్లో భాగంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ను ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో యువతులపై ఆంక్షలు పెట్టడానికి బదులు... ఈజిప్ట్‌లో మహిళలు తీవ్రంగా ఎదుర్కొంటున్న లైంగిక హింస, లింగ వివక్షను రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా యాక్టింగ్ రీజనల్ డైరెక్టర్ లిన్ మాలూఫ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- భారత్, చైనాల సంబంధాల్లో మార్పులు రాబోతున్నాయా? మోదీ, జిన్‌పింగ్ భేటీ సాధ్యమేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్‌లు విడిపోయేవి కాదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








