పాకిస్తానీ న్యూస్ యాంకర్ భారత్‌ను ఎందుకు ప్రశంసించారు?

ఫొటో సోర్స్, Youtube grab
- రచయిత, వందన
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన తర్వాత యావత్ దేశంలో ఆక్రోశం పెల్లుబికింది. ఆ ఆక్రోశం వీధుల్లోనూ, సోషల్ మీడియాలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
కసూర్ ప్రాంతానికి చెందిన జైనబ్ అన్సారీ అనే చిన్నారిపై జరిగిన దారుణం నేపథ్యంలో పాకిస్తాన్‌లోని అనేక పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి బాగా దిగజారడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
కాగా, ఒక ప్రైవేటు న్యూస్ చానెల్ యాంకర్ వినూత్న శైలిలో వార్తల్ని చదవడం ద్వారా వార్తల్లోకెక్కారు. సమా టీవీ చానెల్‌లో పని చేసే కిరన్ నాజ్ అనే యాంకర్ గురువారం నాడు ఒడిలో పాపను పెట్టుకొని వార్తలు చదివారు.
శవపేటిక ఎంత చిన్నదైతే అంత బరువు!
కిరన్ తన వార్తా బులెటిన్‌ను ఇలా ప్రారంభించారు: "నేనీ రోజు కిరన్ నాజ్ అనే ఓ వ్యక్తిని కాదు. ఒక తల్లిని. అందుకే నేనీ రోజు నా పాపతో సహా కూర్చున్నాను. శవపేటిక ఎంత చిన్నదైతే అంత భారంగా ఉంటుంది. ఆ భారం కింద మొత్తం సమాజమే నలిగిపోతుంది."
తానెందుకిలా చేయాల్సి వచ్చిందని బీబీసీ కిరన్‌ను అడిగినప్పుడు, "నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైంది. నేను రాత్రంతా నిద్ర పోలేకపోయాను. ఆలోచిస్తూ ఉండిపోయాను. నా పాప ముఖం చూసినపుడల్లా నాకు నా కూతురి కళ్లల్లో జైనబ్ ముఖమే కనిపించింది" అని చెప్పారు.
"మరుసటి రోజు నేను ఆఫీసుకు వెళ్లి ఆ షో చేసిన సమయంలోనే జైనబ్ తల్లి మక్కా యాత్ర పూర్తి చేసుకొని వచ్చారు" అని కిరన్ తెలిపారు.

'ఆ ఊహనే భరించలేకపోయా..'
"ఆమెను ఆ స్థితిలో చూసినప్పుడు కొద్ది క్షణాల పాటు నేనో ఆలోచనలో మునిగిపోయాను. ఒకవేళ ఈ సంఘటన నాకే ఎదురైతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించాను. జైనబ్ తల్లి కనీసం లేచి నడవగలుగుతున్నారు. నేనైతే బహుశా నడిచేదాన్ని కూడా కాదేమో."
అయితే, కూతురిని ఒడిలో పెట్టుకొని వార్తలు చదవాలనే నిర్ణయానికి ఎలా వచ్చారు అని అడగగా, "నేను ఆమె బాధను నా బాధగా భావించాను. అందుకే నేను నా పాపతోనే స్టూడియోకు వచ్చాను. నా పాప నాకు గర్వకారణం అని చెప్పాలనుకున్నాను. ప్రపంచంలో ఉన్న పాపలందరూ వాళ్ల తల్లులకు ఎంతో గర్వకారణం అని చాటాలనుకున్నాను" అని కిరన్ చెప్పారు.
"మా గర్వానికి, అభిమానానికి మూలమైన పాపల్ని ఇలా రేప్ చేసి చెత్తకుప్పలో పడేస్తే మేమెట్లా భరించేది? మనం ఉంటున్నది అడవిలోనైతే కాదుగా. మనం మనుషులం. వీళ్లు మన పిల్లలు. అందుకే నేను గర్వంగా భావించే నా పాపతో కలిసి కూర్చొని వార్తలు చదివాను. అలా నేను జైనబ్ కోసం గొంతు విప్పాను" అని కిరన్ వివరించారు.
'నా ప్రయత్నం ఫలించినట్టే..'
ఇలా చేయడం ద్వారా ఆమె ఏం సాధించారు? దీనికి జవాబుగా కిరన్, "నా ఈ ప్రయత్నం కొంత మేరకు ఫలించిందని నేననుకుంటున్నాను. మీరు నాతో మాట్లాడడం దీనికే నిదర్శనం."
"మేం మా పిల్లలకు గుడ్ టచ్ (మంచి స్పర్శ), బ్యాడ్ టచ్ (చెడ్డ స్పర్శ) గురించి తెలియజెప్పాలని సలహా ఇస్తుంటారు. నా పాప వయస్సు కేవలం ఆరు నెలలే. ఇవన్నీ ఆమెకు ఎట్లా చెప్పాలి?" అని కిరన్ ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇలాంటి ఘటనలను రోజూ చూస్తూ ఉండగలిగేందుకు మా గుండెలు రాళ్లయితే కావుగా. ఇంత చిన్న చిన్న పిల్లలను రోజూ ఎత్తుకెళ్లి శ్మశానంలో ఎలా పాతిపెట్టేది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వాడు పట్టుబడకపోతాడా అని ఎదురుచూస్తూ ఎలా ఉండగలం" అని కిరన్ అన్నారు.
"ఇప్పటికి జరిగింది చాలు. అందుకే పాకిస్తాన్ అంతటా జనం వీధుల్లోకొచ్చారు."
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత్‌లో వ్యక్తమవుతున్న స్పందనకు సంతోషం
ఈ విషయంపై భారత్‌లో వ్యక్తమైన స్పందనను చూసి సంతోషించానని పాకిస్తానీ యాంకర్ కిరన్ నాజ్ అన్నారు.
"భారత్ ఈ విషయంపై స్పందించిన తీరు, మీడియాలో వ్యక్తమవుతున్న మద్దతు నాకెంతో సంతోషం కలిగించింది" అని కిరన్ అన్నారు.
"ఇక్కడైనా, సరిహద్దుకు అవతలైనా.. ఎక్కడైనా సరే ఇలాంటివి ఇక జరగకుండా ఉండాలన్నదే నా ఆశ."
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










