రక్షణ బడ్జెట్‌లో రెండు శాతం శానిటరీ ప్యాడ్లకు ఖర్చు చేయాలి: అక్షయ్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సుప్రియా సోగ్లే
- హోదా, బీబీసీ కోసం
హిందీ సినిమాల్లో 'ఖిలాడీ'గా పేరొందిన అక్షయ్ కుమార్ గత కొన్నేళ్లుగా దేశభక్తి, తదితర సామాజిక సమస్యలపై సినిమాలు తీస్తున్నారు. 'టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ', 'ఎయిర్‌లిఫ్ట్' వంటి సినిమాలు ఈ కోవకు చెందినవే.
తాజాగా, మహిళల పీరియడ్స్ గురించి అవగాహన పెంచడం కోసం అక్షయ్ కుమార్ 'ప్యాడ్ మ్యాన్' అనే సినిమాతో ముందుకు వస్తున్నారు. అయితే యాభై ఏళ్ల అక్షయ్ కుమార్‌కు పీరియడ్స్ గురించిన పూర్తి అవగాహన కలిగింది మాత్రం రెండేళ్ల క్రితం 'ప్యాడ్ మ్యాన్' సినిమా నిర్మాణం మొదలయ్యాకేనట.
ఈ విషయంపై బీబీసీతో మాట్లాడుతూ అక్షయ్ కుమార్, "మిగతా అన్ని కుటుంబాల లాగానే మా ఇంట్లో కూడా దీని గురించి నాకు తెలియకుండా దాచిపెట్టారు. పెద్దయ్యే క్రమంలోనే నాకు మహిళల నెలసరి గురించి అర్థమవసాగింది" అని అన్నారు.
"అసలు నెలసరి ఎందుకు వస్తుంది? ఈ సందర్భంగా మహిళలు ఏం చేయాల్సి ఉంటుంది? అన్న విషయాలు మన దేశంలో 82 శాతం మహిళలకు అసలు తెలియనే తెలియదు" అని అక్షయ్ అన్నారు.

ఫొటో సోర్స్, Hype PR
'అవగాహనరెండేళ్ల కిందటే'
"గత కాలంలో మహిళలు రుతుస్రావం సందర్భంగా మట్టి, ఆకులు, బూడిదను ఉపయోగించేవారట. ఇది చాలా విచారకరం. దీనంతటి గురించి నాకు రెండేళ్ల కిందటే అవగాహన కలిగింది. అప్పుడే ఈ అంశంపై ఒక సినిమా తీయాల్సిన అవసరం ఉందని నేను భావించాను" అని అక్షయ్ తెలిపారు.
శానిటరీ ప్యాడ్లను చౌకగా తయారు చేసే యంత్రాన్ని రూపొందించిన అరుణాచలం మురగునాథమ్ అనే వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఆయన చెప్పిన ఒక్క మాట తన గుండెల్లో నిలిచిపోయిందని అక్షయ్ అంటారు. దేశంలో మహిళలు శక్తిమంతులైతే దేశం శక్తిమంతమవుతుందన్నదే అరుణాచలం చెప్పిన మాట.
ఆర్. బాల్కీ దర్శకత్వంలో రూపొందిన 'ప్యాడ్ మ్యాన్' సినిమాలో అక్షయ్ కుమార్‌తో పాటు రాధికా ఆప్టే, సోనమ్ కపూర్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 26న రిలీజ్ కాబోతోంది.
'రక్షణ బడ్జెట్‌లో రెండు శాతం ప్యాడ్స్ కోసం ఖర్చు చేయాలి'
దేశ రక్షణ బడ్జెట్ కోసం ఏటా ఎంతో పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. కానీ దేశంలో మహిళలు శక్తిమంతంగా లేనప్పుడు అంత ఖర్చు చేసీ ఏం లాభం అని అక్షయ్ అంటారు. అందుకే రక్షణ బడ్జెట్‌లో రెండు శాతం కేటాయించి ఆ డబ్బుతో మహిళలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని ఆయన అభిప్రాయపడుతున్నారు.
పీరియడ్స్ సందర్భంగా మహిళల పరిస్థితిపై మాట్లాడుతూ అక్షయ్, "నేను దీని గురించి చాలానే చదివాను. మన దేశంలో మహిళలకు ఆ ఐదు రోజులు నరకంలా ఉంటుంది. వాళ్లకు ఈ పరిస్థితి ఎదురవుతున్నది కేవలం పీరియడ్స్ కారణంగా కాదు. చుట్టుపక్కల జనాల వ్యవహారమే వారిని ఎక్కువ ఇబ్బందికి గురి చేస్తుంది. వారికి తగిన హైజీన్‌ను పాటించే అవకాశాలుండవు. అంతేకాదు, వంటగదిలోకి వెళ్లగూడదు, ఇంటి బయట పడుకోవాలి, పచ్చళ్లు ముట్టుకోగూడదు, గుడికి వెళ్లగూడదు వంటి అనేక కట్టుబాట్లు కూడా వారు పాటించాల్సి ఉంటుంది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Hype PR
'పీరియడ్స్ సెలబ్రేషన్'
ఇలాంటి కట్టుబాట్లపై అక్షయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "స్కూలుకు వెళ్లే అమ్మాయిల దుస్తులపై మరక కనిపిస్తే వారిని ఎగతాళి చేయడం, కామెంట్లు చేయడం సిగ్గుచేటు. కొన్ని చోట్ల దీనిని ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ అని కూడా ఎద్దేవా చేస్తుంటారు" అని అన్నారు.
ప్రారంభంలోనే ఆడపిల్లలు పీరియడ్స్‌ను సెలబ్రేట్ చేసుకోవాలని అక్షయ్ అభిప్రాయపడ్డారు. దాంతో వారిలో బిడియం పోయి, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, Hype PR
వరుసగా హిట్ ఫిల్ములు అందిస్తున్న అక్షయ్ కుమార్ తాను చేసే ప్రతి సినిమా తన గత సినిమాకు భిన్నంగానే ఉండాలని నిశ్చయించుకున్నారు. హిట్ సినిమాల ఫార్ములా అనేది సినీ పరిశ్రమలో ఎవరి వద్దా లేదనీ, ఏ సినిమా బాగా ఆడుతుందన్న విషయం ఎవరికీ ముందే తెలియదని అక్షయ్ అన్నారు.
తనలో శక్తి, ఉత్సాహం ఉన్నంత కాలం సినిమాల్లో పని చేస్తూనే ఉంటానని అక్షయ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








