రజనీకాంత్: రాజకీయాల్లోకి వస్తున్నా.. సొంతంగా పార్టీ పెడతా

రజనీకాంత్

ఫొటో సోర్స్, Getty Images

‘‘నేను రాజకీయాల్లోకి వస్తున్నా. సొంతంగా పార్టీ పెడతా. రాబోయే శాసనసభ ఎన్నికల్లో 234 స్థానాల్లో నా పార్టీ పోటీ చేస్తుంది’’ అని తమిళ సినీ నటుడు రజనీకాంత్ ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా రజనీ రాజకీయ ప్రవేశంపై ఉన్న ఉత్కంఠకు ఆయన 2017వ సంవత్సరం చివరి రోజున తెరదించారు.

డిసెంబర్ 26వ తేదీ నుంచి చెన్నైలోని రాఘవేంద్ర హాల్‌లో తన అభిమానులతో సమావేశం నిర్వహిస్తున్న రజనీకాంత్.. రాజకీయ అరంగేట్రం విషయమై డిసెంబర్ 31వ తేదీన ప్రకటిస్తానని మొదటి రోజునే చెప్పారు. అన్నట్లుగానే ఆదివారం నాడు ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని చెప్పారు.

‘‘కీర్తి కోసమో డబ్బు కోసమో రాజకీయాల్లోకి రావటం లేదు. నేను కోరుకున్నదానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ కీర్తిని, డబ్బును మీరు నాకు ఇచ్చారు’’ అని అభిమానుల కేరింతల మధ్య ఆయన పేర్కొన్నారు.

‘‘దేశ రాజకీయాలు భ్రష్టు పట్టాయి. వాటిని ప్రక్షాళన చేయాల్సి ఉంది. రాజులు వేరే దేశాలమీద దండయాత్రలు చేసి దోచుకునేవారు. ఇప్పుడున్న పార్టీలు అధికారంలోకి వచ్చి సొంత ప్రజలనే దోచుకుంటున్నాయి. అవినీతిని అంతం చేయాలి. మార్పు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని చెప్పారు.

రజనీకాంత్

ఫొటో సోర్స్, Getty Images

తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయటానికి సమయం తక్కువగా ఉంది కాబట్టి.. తన పార్టీ రాబోయే శాసనసభ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేస్తుందని రజనీకాంత్ తెలిపారు. ‘‘ఆ ప్రజాస్వామ్య సమరంలో మన సైన్యం ఉంటుంది’’ అని స్పష్టంచేశారు.

నిర్ణయాన్ని పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. బహుశా రాజకీయ పార్టీ పేరును ఎప్పుడు ప్రకటించేదీ, ఎప్పుడు ప్రారంభించేదీ ఇలా సూచించినట్లు కనిపిస్తోంది.

‘‘అలాగని నేను అధికారం కోసం రాజకీయాల్లోకి రావటం లేదు. అలా చేస్తే నేను ఆధ్యాత్మికవాదికి తగను. కుల, మతాలకు సంబంధంలేని రాజకీయాలు అందించటమే నా లక్ష్యం’’ అంటూ తన రాజకీయాలు ఏ తీరుగా ఉండబోతాయో రజనీ వివరించారు.

‘‘పాత రోజుల్లో రాజులు, వారి సైన్యాలు ఇతర దేశాలను ఆక్రమించి దోచుకున్నారు. కానీ ఈనాటి పాలకులు తమ సొంత ప్రజలను దోచుకుంటున్నారు. ఈ వ్యవస్థ మారాల్సి ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

రజనీకాంత్

తమిళనాడులో 1996 శాసనసభ ఎన్నికలను రజనీ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘45 ఏళ్లపుడే నాకు అధికారంపై ఆశ లేదు. 68 ఏళ్లపుడు ఎలా ఉంటుంది?’’ అని వ్యాఖ్యానించారు.

‘‘జయలలిత మళ్లీ ఎన్నికైతే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడు’’ అని 1996 ఎన్నికలకు ముందు రజనీకాంత్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీ అధినేత్రి జయలలిత సైతం బర్గూర్ నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో డీఎంకే - కాంగ్రెస్ కూటమికి రజనీ మద్దతు ప్రకటించారు.

అయితే.. రజనీ చేసిన ప్రధానమైన తొలి రాజకీయ ప్రకటన అదే అయినప్పటికీ.. ఏఐఏడీఎంకే ఓటమి కానీ, డీఎంకే గెలుపు కానీ పూర్తిగా ఆయన ప్రకటన ఫలితంగానే భావించలేదు.

2004 శాసనసభ ఎన్నికల సమయంలో.. పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) నాయకులు తనను బహిరంగంగా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నందున.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఆ పార్టీ కార్యకర్తలకు రజనీ పిలుపునిచ్చారు. కానీ.. డీఎంకే - కాంగ్రెస్ - వామపక్షాలు - పీఎంకే - ముస్లిం లీగ్ కూటమిలో ఆరు స్థానాలకు పోటీ చేసిన పీఎంకే అన్ని చోట్లా గెలిచింది.

రజనీకాంత్ ఫొటోలు, బ్యాడ్జీలు

ఏదేమైనా.. ఎన్నికల్లో తాను స్వయంగా పోటీ చేస్తానా లేదా అన్న విషయాన్ని రజనీకాంత్ ప్రస్తావించలేదు. ‘‘తమిళనాడు వ్యాప్తంగా ఎన్నో రిజిస్టర్డ్ అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇక రిజిస్టరు కాని అభిమాన సంఘాలు వాటికన్నా ఒకటిన్నర, రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి. మనం ముందుగా వాటిని రిజిస్టరు చేయాల్సి ఉంది. ఈలోగా మహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేయాలి. ఆతర్వాత మనం పార్టీ ప్రారంభిస్తాం’’ అని ఆయన వివరించారు.

‘‘ఇటీవలి కాలంలో తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో దుర్ఘటనలు జరిగాయి. ఇతర రాష్ట్రాల ప్రజలు తమిళనాడును చూసి నవ్వుతున్నారు. ఇప్పుడు నేను ఏదైనా చేయకపోతే.. నాకు ఎంతో ఇచ్చిన ప్రజలకు ఏమీ చేయలేదన్న అపరాధ భావన నాకు కలుగుతుంది’’ అని చెప్పారు.

‘‘ఏ పార్టీకైనా కార్యకర్తలే పునాది అని అంటారు. కానీ.. వాళ్లు కేవలం పునాది మాత్రమే కాదు.. కొమ్మలు సహా చెట్టులో ప్రతీదీ వారేనని నేను చెప్తాను. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు వారి నుంచే వస్తారు’’ అని రజనీ పేర్కొన్నారు.

రజనీకాంత్ పోస్టర్లు, ఫొటోలు

ఫొటో సోర్స్, Getty Images

‘‘పార్టీ కోసం కార్యకర్తలు నాకు వద్దు. ప్రజల హక్కులను కాపాడే ‘రక్షకులు’ నాకు కావాలి. తమ స్వప్రయోజనాల కోసం ఆశించని రక్షకులు కావాలి. ఆ రక్షకులకు నేను పర్యవేక్షకుడిగా ఉంటాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

తన అభిమానులు రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రకటనలు చేయకుండా నిరసన ప్రదర్శనలు నిర్వహించకుండా నియంత్రణ పాటించాలని.. ఆ పనులు చేయటానికి ఇతరులు ఉన్నారని రజనీ సూచించారు.

‘‘మన పార్టీ అజెండా, విధానాలను మనం ప్రజలకు వివరిస్తాం. ఎన్నికైన తర్వాత.. మనం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే మూడేళ్లలో అధికారానికి రాజీనామా చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.

రజనీకాంత్ రాజకీయ ప్రవేశ ప్రకటనతో ఆయన అభిమానులు కేరింతలు కొట్టారు. బాణసంచా కాల్చి పండుగ చేసుకున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)