అఫ్గానిస్తాన్: తాలిబాన్ల రాకతో పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ మరింత దెబ్బతింటుందా?

పాకిస్తాన్ కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, తన్వీర్ మలిక్
    • హోదా, కరాచీ నుంచి

తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, సమీప భవిష్యత్తులో దక్షిణాసియాలో అనేక మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అఫ్గాన్ సరిహద్దుకు మరో వైపు ఉన్న కారణంగా ఆ దేశంలోని పరిణామాలు పాకిస్తాన్‌పై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.

ముఖ్యంగా అస్తవ్యస్తంగా ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తాలిబాన్ల పునరాగమనం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది పాక్ ప్రజల ముందున్న పెద్ద ప్రశ్న.

పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ 2020లో ఘోరంగా దిగజారింది. గత 70 ఏళ్లలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ ఇంతగా దెబ్బతినలేదు. అయితే, 2021 జూన్ 30న ముగిసిన ఆర్థిక సంవత్సరం గణాంకాలు పరిశీలిస్తే కొంతవరకు నిలదొక్కుక్కున్నట్లే కనిపిస్తోంది.

ఓవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నిబంధనలకు కట్టుబడి ఉండడం, మరోవైపు విదేశీ పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థకు సవాలుగా నిలిచాయి. గత కొన్ని వారాలుగా పాకిస్తాన్‌ స్టాక్ మార్కెట్, ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు గణనీయంగా తగ్గాయి.

అఫ్గానిస్తాన్‌లో జూన్ నుంచి తాలిబాన్ల పురోగతి ప్రభావం జూలై గణాంకాల్లో కనిపిస్తోంది. దీనివలన పాక్‌లో విదేశీ పెట్టుబడులు బాగా తగ్గిపోయాయి.

పాకిస్తాన్ స్టాక్ ఎక్ఛేంజ్

ఫొటో సోర్స్, EPA

అయితే, అఫ్గానిస్తాన్‌లో రోజురోజుకూ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంకాస్త వేచి చూడాలని ఆర్థికరంగ నిపుణులు, క్యాపిటల్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకోవడం పాకిస్తాన్ క్యాపిటల్ మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించింది.

కానీ, ఒకరోజు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌లో అమాంతం పెరుగుదల కనిపించింది. దానికి కారణం, రక్తపాతం, హింస లేకుండా తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

అఫ్గానిస్తాన్‌లో ఇప్పటివరకు హింసాత్మక ఘర్షణలు, అంతర్యుద్ధాలు జరగకపోవడం పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థకు శుభ సంకేతం అని పాకిస్తాన్ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

అయితే, భవిష్యత్తులో ఏం జరగనుందో ఆర్థికరంగ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ ఎలా ఉంది?

2020 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ వృద్ధి రేటు మైనస్ 0.4 శాతం నమోదు కాగా, 2021 ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నారు.

పాకిస్తాన్ ప్రస్తుతం ఆరు బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ ప్రోగ్రాం నిబంధనలకు కట్టుబడి ఉంది. మరోవైపు, దేశంలో ద్రవ్యోల్బణం నిరంతరం పెరిగిపోతూ ఉంది.

అయితే, పాకిస్తాన్ ఎగుమతులు, విదేశీ ధనం కొంతవరకు ఆర్థిక వ్యవస్థను నిలబెట్టినప్పటికీ అధిక దిగుమతుల కారణంగా కరంట్ అకౌంట్ లోటు సమస్యగా మారింది.

గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ కరన్సీ విలువ పడిపోతోంది. ఈ కారణంగా పెట్రోలియం దిగుమతులు, ఆహార పదార్థాలు, ఇతర దిగుమతుల విలువ పెరిగిపోతోంది.

రూపాయికి వ్యతిరేకంగా డాలర్ బలపడడంతో ద్రవ్యమార్పిడి రేటు కూడా క్షీణించింది. విదేశీ పెట్టుబడులు క్షీస్తున్నాయి. దాంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల జూలైలో 39 శాతం తరుగుదల కనిపించింది.

కాబుల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న వార్త వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్ 400 పాయింట్లు పడిపోయింది. తరువాత మెల్లగా పెరగడం ప్రారంభించింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో పాకిస్తాన్ బాండ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీనివల్ల అయిదు, పది, ముప్ఫయి సంవత్సరాల బాండ్ల ధరలు పడిపోయాయి.

"పెట్టుబడిదారుడు ఎలా ఆలోచిస్తున్నడనేదానికి మార్కెట్ స్పందించిన తీరే బాండ్ల ధరలు పడిపోవడానికి కారణం" అని ఆర్థికవేత్త డాక్టర్ ఫరూఖ్ సలీం అన్నారు.

అఫ్గానిస్తాన్‌లో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే అనేకమంది శరణార్థులు పాకిస్తాన్ చేరుతారు.

కానీ, కాబుల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తీరు చూస్తుంటే అలాంటి అవకాశాలు తక్కువగానే ఉన్నాయని మరికొందరు భావిస్తున్నారు.

ఈ కారణంగా ఇప్పటికైతే అఫ్గానిస్తాన్ తాజా పరిణామాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపలేదని స్టాక్ మార్కెట్ నిపుణులు ఆరిఫ్ హబీబ్ అన్నారు.

స్టాక్ మార్కెట్ మొదట్లో ప్రతికూలంగా స్పందించినప్పటికీ క్రమంగా కోలుకుందని ఆయన అన్నారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Reuters

మున్ముందు ఏం జరుగుతుంది?

శరణార్థుల తాకిడి పాకిస్తాన్‌కు ఎదురు కాబోయే అతి పెద్ద సమస్య. అఫ్గానిస్తాన్‌లో సమస్యలు శాంతియుతంగా పరిష్కారం కాకుండా అంతర్యుద్ధం తలెత్తి, పాకిస్తాన్‌కు శరణార్థుల రాక పెరిగితే, అది పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్ ఫరూఖ్ అభిప్రాయపడ్డారు.

"అంతేకాకుండా, పాకిస్తాన్ తాలిబాన్లకు సహాయం చేసిందని, అఫ్గానిస్తాన్ వ్యవహారాల్లో పాకిస్తాన్ పట్టు సాధించగలదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నమ్మకాలే బలపడితే పాకిస్తాన్‌పై అధికారికంగా, అనధికారికంగా కూడా ఆర్థిక ఆంక్షల రూపంలో ఒత్తిడి పెరగవచ్చు" అని ఆయన అన్నారు.

"ప్రస్తుతానికైతే పరిస్థుతులు మామూలుగానే ఉన్నాయి. కానీ, అఫ్గానిస్తాన్‌ కారణంగానే అమెరికా పాకిస్తాన్‌పై ఆసక్తి కనబరుస్తూ వచ్చింది. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్‌కు వెన్ను చూపిస్తే దేశంలోకి డాలర్ల ప్రవాహం ఆగిపోతుంది. అలాగే, ఇతర దేశాల నుంచి వచ్చే డాలర్ల ప్రవాహాన్ని కూడా అమెరికా ఆపగలదు" అని కేఏఎస్‌బీ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆసిఫ్ అర్సలాన్ సూమరో అభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌లో అక్రమ రవాణా పెరుగుతుందా?

అఫ్గానిస్తాన్‌లో మారుతున్న పరిస్థితులు పాకిస్తాన్ విదేశీ వ్యాపారంపై పెద్ద ప్రభావాన్ని చూపించవని డాక్టర్ ఫరూఖ్ అన్నారు. ఎందుకంటే చాలావరకు అఫ్గానిస్తాన్‌కు సరకులు అక్రమంగా రవణా అవుతాయని ఆయన అన్నారు.

అయితే, తాజా పరిణామాల దృష్ట్యా అఫ్గానిస్తాన్‌కు అక్రమ రవాణా పెరగవచ్చని ఆర్థిక రంగ నిపుణులు కేసర్ బెంగాలీ అభిప్రాయపడ్డారు.

"అక్కడ ఆహారపదార్థాల కొరత రావొచ్చు. ఫలితంగా వాటి ధరలు పెరుగుతాయి. విదేశీ పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త వహిస్తారు.

"అమెరికా, చైనా, రష్యాల నుంచి వచ్చిన ప్రకటనలు ఇప్పటికీ ప్రోత్సాహకరంగానే ఉన్నాయిగానీ, అఫ్గానిస్తాన్‌లో అంతర్యుద్ధం రాకుండా ఉండాలి. పాకిస్తాన్‌కు శరణార్థుల సమస్య రాకూడదనే ఆశిద్దాం" అని ఆరిఫ్ హబీబ్ అన్నారు.

"ఒక వ్యాపారవేత్తగా ఆగండి, వేచి చూడండి అనే చెబుతాను" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)