స్వర్ణ దేవాలయంలో కలకలం - అపవిత్రం చేస్తున్నారన్న అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపారు

స్వర్ణ దేవాలయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్వర్ణ దేవాలయం

సిక్కుల పవిత్ర స్థలం స్వర్ణ దేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపారని పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్ పోలీసులు తెలిపారు.

శనివారం ప్రార్థనల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానిక మీడియా పేర్కొంది.

సిక్కుల మత గ్రంథం గురు గ్రంథ్ సాహెబ్ ఉండే పవిత్రమైన ప్రాంతంలోకి ఆయన వెళ్లారన్నది ప్రధాన ఆరోపణ.

ఆపై అక్కడ గురు గ్రంథ్ సాహెబ్ పక్కనే ఉండే కత్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు, కానీ వెంటనే అక్కడున్న రక్షణ సిబ్బంది, భక్తులు ఆయన్ను బలవంతంగా వెనక్కు లాగేశారు.

ఈ ఘటన శనివారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాల ప్రాతంలో జరిగింది. సాయంకాల ప్రార్థనలు టీవీల్లో ప్రసారం చేస్తుండటంతో ఈ ఘటన కెమెరాల్లో రికార్డయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంలో స్పష్టత లేదు. అధికారులు అక్కడకు చేరుకునే సయమానికే ఆ వ్యక్తి చనిపోయి ఉన్నారని, విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

ఈ సంఘటన తరువాత, శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ ప్రధాన కార్యాలయం ముందు అనేకమంది కార్యకర్తలు గుమిగూడారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ సంఘటన తరువాత, శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ ప్రధాన కార్యాలయం ముందు అనేకమంది కార్యకర్తలు గుమిగూడారు.

ఈ చర్య వెనుక ఎవరున్నది పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసుల్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింఘ్ ఆదేశించారు.

మరోవైపు ఈ ఘటన పంజాబ్‌లో రాజకీయంగానూ కలకలం సృష్టిస్తోంది. పవిత్ర స్థలాల్లో తగిన రక్షణ చర్యలు తీసుకోవడంలో అధికార పార్టీ విఫలమయ్యిందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)