భింద్రన్‌వాలేను హెలికాప్టర్లతో కిడ్నాప్ చేయాలని ‘‘రా’’ ప్రణాళికలు వేసినప్పుడు ఏం జరిగింది?

భింద్రన్‌వాలే

ఫొటో సోర్స్, SATPAL DANISH

    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1982లో పంజాబ్‌లో పరిస్థితులు చేయిదాటిపోతూ వచ్చాయి. దీంతో మొదటగా చౌక్‌మెహ్తా గురుద్వారా నుంచి భింద్రన్‌వాలేను హెలికాప్టర్‌ ఆపరేషన్‌తో కిడ్నాప్ చేద్దామని ‘‘రా‘‘ అధిపతి రామ్‌నాథ్ కావ్ ప్రణాళికలు సిద్ధం చేశారు. తర్వాత ఈ ఆపరేషన్ స్వర్ణ దేవాలయానికి మారింది.

బ్రిటిష్ గూఢచర్య సంస్థ ఎంఐ-6కు చెందిన ఇద్దరు గూఢచారులను బ్రిటిష్ హైకమిషన్‌లో రామ్‌నాథ్ ప్రైవేటుగా కలిశారు. ‘‘1983 డిసెంబరులో ఎంఐ-6కి చెందిన ఇద్దరు గూఢచారులు స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఆ ఇద్దరిలో ఒకరిని రామ్‌నాథ్ కలిశారు’’ అని రా మాజీ అదనపు కార్యదర్శి బి రామన్ ‘‘కావ్ బాయ్స్ ఆఫ్ రా’’లో పేర్కొన్నారు.

బ్రిటిష్ పరిశోధకుడు, జర్నలిస్టు ఫైల్ మిల్లర్.. శ్రీలంకలో బ్రిటన్ కమాండో ఫోర్స్ ఎస్‌ఏఎస్ పాత్ర గురించి పరిశోధన చేస్తుండగా స్వర్ణ దేవాలయ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారం బయటపడింది. ఆయనకు బ్రిటిష్ ఆర్కైవ్స్‌లో కొన్ని లేఖలు కనిపించాయి. వీటిలో భారత కమాండో ఆపరేషన్‌లో బ్రిటన్ సాయం చేసినట్లు ఉంది.

30 ఏళ్ల తర్వాత ఈ వివరాలు బయటకు వచ్చాయి. బ్రిటన్ కమాండో ఫోర్స్‌కు చెందిన ఒక ఆఫీసర్‌ను తమతో పంపించాలని ఎంఐ-6 అధిపతికి రామ్‌నాథ్ అభ్యర్థనను అప్పటి బ్రిటన్ ప్రధాన మంత్రి మార్గరెట్ థాచర్ అంగీకరించినట్లు బయటపడింది.

భింద్రన్‌వాలే

ఫొటో సోర్స్, SATPAL DANISH

పరిశోధనలో మరిన్ని విషయాలు..

స్వర్ణ దేవాలయం నుంచి సిక్కు అతివాదులను ఎలా బయటకు తీసుకురావాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆ బ్రిటిష్ అధికారిని భారత్ కోరింది.

ఒకవైపు శ్రీలంకలో బ్రిటిష్ గూఢచారుల పాత్రను విమర్శిస్తూ మరోవైపు స్వర్ణ దేవాలయంలో వారి సాయం తీసుకోవడంపై అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఫిల్ మిల్లర్ విమర్శించినట్లు 2014 జనవరి 13న రివీల్డ్: ఎస్‌ఏఎస్ అడ్వైస్డ్ అమృత్‌సర్ రెయిడ్ బ్లాగ్ పేర్కొంది.

2014లో దీనిపై బ్రిటిష్ పార్లమెంటులో భిన్న వాదనలు వినిపించడంతో.. ఈ విషయంపై విచారణ చేపట్టాలని అప్పటి బ్రిటన్ ప్రధాన మంత్రి కామెరూన్ ఆదేశించారు. ఓ ఎస్‌ఏఎస్ అధికారి 1984 ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు భారత్‌కు చెందిన స్పెషల్ ఫ్రాంటీయర్ ఫోర్స్‌ అధికారులతో కలిసి స్వర్ణ దేవాలయాన్ని సందర్శించినట్లు బ్రిటిష్ విదేశాంగ మంత్రి విలియం హేగ్ పేర్కొన్నారు.

తప్పనిసరి అయితే తప్పా, సైనిక చర్య చేపట్టొద్దని బ్రిటిష్ గూఢచార్య సంస్థ అధికారి సూచించినట్లు విచారణలో తేలిందని బీబీసీ ఓ కథనం కూడా ప్రచురించింది. మరోవైపు అతివాదులను బయటకు తీసుకురావడానికి హెలికాప్టర్ ద్వారా సైనికుల్ని స్వర్ణ దేవాలయం పరిసరాల్లోకి పంపాలని ఆయన సలహా ఇచ్చారు. ఇలా చేస్తే ప్రాణనష్టం చాలా తక్కువగా ఉంటుందని సూచించారు.

పరిశోధన

ఫొటో సోర్స్, TOM WATSON

హెలికాప్టర్ సాయంతో..

బ్రిటిష్ పార్లమెంటులో జరిగిన చర్చపై ఇండియా టుడే సీనియర్ జర్నలిస్టు సందీప్ ఉన్నిథన్ 2014 జనవరి 31న ఓ కథనం ప్రచురించారు. ఆ ఆపరేషన్‌కు ‘‘ఆపరేషన్ సన్‌ డౌన్’’గా నామకరణం చేశారని ఆయన పేర్కొన్నారు.

‘‘మొదటగా భింద్రన్‌వాలేను తన గురునానక్ నివాస్ నుంచి హెలికాప్టర్ ద్వారా కిడ్నాప్ చేయాలని ప్రణాళికలు వేశారు. ఇదే విషయాన్ని అక్బర్ రోడ్‌లోని తన నివాసానికి వెళ్లి ఇందిరా గాంధీకి రామ్‌నాథ్ చెప్పారు. కానీ, ఆ ప్రణాళికతో ఎక్కువ మంది మరిణించొచ్చని ఇందిరా గాంధీ అన్నారు. దీంతో అది తిరస్కరణకు గురైంది’’అని కథనంలో పేర్కొన్నారు.

భింద్రన్‌వాలేను బయటకు రప్పించడానికి భారత భద్రతా సంస్థలు ప్రణాళికలు వేయడం ఇదేమీ తొలిసారిగా కాదు. ఆయన చౌక్ మెహతాలో నివాసం ఉన్నప్పటి నుంచి, గురునానక్ నివాస్‌కు వెళ్లినప్పటి వరకు చాలా ప్రణాళికలు రచించారు.

భారత విదేశాంగ శాఖ మాజీ మంత్రి స్వరణ్ సింగ్ అల్లుడు, రా ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన జీఎస్‌బీ సిద్ధు కూడా ‘‘ద ఖలిస్తాన్ కాన్‌స్పిరసీ’’ పుస్తకంలో ఈ విషయాలను స్పష్టంచేశారు. భింద్రన్‌వాలేను పట్టుకోవడానికి భారత భద్రతా సంస్థలు చాలా కృషి చేసినట్లు పేర్కొన్నారు.

ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1951 బ్యాచ్ అధికారి రామ్ టేక్‌చంద్ నాగరాణి.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ (డీజీఎస్)గా పనిచేసేవారు. సైన్యం, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్)లకు చెందిన 150 మంది భద్రతా సిబ్బందిని దీని కోసం ఎంపిక చేశారు. అలాగే రెండు ఎంఐ హెలికాప్టర్లు వీరి కోసం కేటాయించారు. అవసరమైతే ఏవియేషన్ సెంటర్ విమానాలు కూడా తీసుకోవాలని సూచించారు.

రామ్ నాగరాణి 1928లో జన్మించారు. ఇప్పుడు ఆయన అనారోగ్యంతో దిల్లీలోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడే స్థితిలో లేరు. తన పుస్తకం కోసం సిద్ధు రెండేళ్ల క్రితం ఆయనతో మాట్లాడారు.

‘‘1983 డిసెంబరులో భింద్రన్‌వాలేను కిడ్నాప్ చేయడానికి రామ్‌నాథ్ తనకు బాధ్యతలు అప్పగించినట్లు నాగరాణి నాకు చెప్పారు. ప్రతి సాయంత్రం సందేశం ఇవ్వడానికి వచ్చే సమయంలో భింద్రన్‌వాలేను అపహరిద్దామని ప్రణాళికలు రచించారు. దీని కోసం రెండు ఎంఐ హెలికాప్టర్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సిద్ధంచేశారు. స్వర్ణ దేవాలయం చుట్టూ మూడు అంచెల సీఆర్‌పీఎఫ్ భద్రతను కూడా నాగరాణి ఏర్పాటుచేశారు’’అని సిద్ధు వివరించారు.

సందీప్ ఉన్నిథన్‌తో రెహాన్ ఫజల్
ఫొటో క్యాప్షన్, సందీప్ ఉన్నిథన్‌తో రెహాన్ ఫజల్

స్వర్ణ మందిరం లోపల..

‘‘ఆపరేషన్‌కు ముందు స్వర్ణ దేవాలయం లోపల ఎస్‌ఎఫ్‌ఎఫ్‌కు చెందిన ఒక ఉద్యోగిని ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు లోపల ఉన్న తర్వాత.. అక్కడ ఏం జరగుతుందో ఆయన ఒక సవివర మ్యాప్‌ను ఇచ్చారు. దీని ద్వారా స్వర్ణ దేవాలయం లోపలకు వెళ్లడానికి, బయటకు రావడానికి అనువైన ప్రదేశాలను గుర్తించారు. భింద్రన్‌వాలే, అతడి అనుచరుల ప్రతి కదలికలపైనా నిఘా వేయమని ఆ గూఢచారికి సూచించారు’’అని సిద్ధు వివరించారు.

‘‘భింద్రన్‌వాలేను హెలికాప్టర్ సాయంతో కిడ్నాప్ చేయడానికి సరైన సమయం ఏదో సూచించమని ఆయన్ను అడిగారు. ఈ సమాచారం అంతా మూడు, నాలుగు రోజుల్లో సేకరించారు. సహరాన్‌పూర్‌లోని సరస్వా దగ్గర రెక్కి కూడా నిర్వహించారు’’అని సిద్ధు చెప్పారు.

జీబీఎస్ సిద్ధు

ఫొటో సోర్స్, GBS Sidhu

ఫొటో క్యాప్షన్, జీబీఎస్ సిద్ధు

తాడు సాయంతో కమాండోలు..

ఆపరేషన్‌కు ముందు, తర్వాత సాధారణ పౌరులు ఎవరూ స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించకుండా చూసేందుకు సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయాలని నాగరాణి సూచించినట్లు సిద్ధు తెలిపారు.

భింద్రన్‌వాలే ప్రసంగం ఇచ్చేచోట రెండు హెలికాప్టర్ల సాయంతో కమాండోలను దించాలని ప్రణాళికలు వేశారు. దీని కోసం భింద్రన్‌వాలే ప్రసంగం పూర్తయ్యే సమయాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన చుట్టుపక్కల భ్రదత చాలా తక్కువగా ఉంటుంది.

కొంతమంది భింద్రన్‌వాలేను పట్టుకుంటే, మరికొంత మంది ఆయన చుట్టుపక్కల ఉండే భద్రతా సిబ్బందిని నియంత్రించాలని ప్రణాళిక వేశారు. భింద్రన్‌వాలే పక్కన ఉండే సిబ్బంది కాల్పులు జరుపుతారని కూడా ముందే అంచనా వేశారు. కమాండోలు కిందకు దిగిన వెంటనే ఈ కాల్పులు జరుగుతాయని అనుకున్నారు.

స్వర్ణ మందిర్

ఫొటో సోర్స్, Satpal Danish

ఫొటో క్యాప్షన్, స్వర్ణ మందిర్

ఆపరేషన్ కోసం కమాండోలు రెండు బృందాలు విడిపోవాలని ప్రణాళిక వేశారు. వీరిలో ఒక బృందం భింద్రన్‌వాలే బయటకు పారిపోకుండా స్వర్ణ దేవాలయ మార్గాలను బ్లాక్ చేస్తుంది. రెండో బృందం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో లాంగర్‌హౌస్ దగ్గర సిద్ధంగా ఉంటుంది. ఈ బృందమే ముందుగా నిర్దేశించిన ప్రాంతానికి భింద్రన్‌వాలేను తీసుకువెళ్తుంది.

హెలికాప్టర్‌లో ఉండే వారితోపాటు బయట ఉండే కమాండోలకు పక్కాగా సూచనలు ఇచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ హర్‌మందిర్ సాహెబ్‌లోకి వెళ్లకుండా భిండ్రావాలాను అడ్డుకోవాలని సూచించారు. ఒకవేళ అతడు హర్‌మందిర్‌లోకి వెళ్తే.. భవనాన్ని ధ్వంసం చేయకుండా.. ఆయన్ను బయటకు రప్పించడం అసాధ్యం.

రెక్కి కోసం సహరాన్‌పూర్‌లో ఏర్పాటుచేసిన స్వర్ణ దేవాలయ నమూనాను మార్చి 1984లో దిల్లీకి తీసుకొచ్చారు. సీఆర్‌పీఎఫ్‌తో కమాండోలు మెరుగ్గా సమన్వయం చేసుకునేందుకు అంతా సిద్ధంచేశారు. ఆ తర్వాత కేవలం కమాండోలు మాత్రమే ఈ ఆపరేషన్‌లో పాల్గొనాలని నిర్దేశించారు. అయితే, సైన్యం చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్‌కు అప్పటికీ ఇంకా ప్రణాళికలు కూడా రచించలేదు.

భింద్రన్‌వాలే

ఫొటో సోర్స్, GBS Sidhu

ఇందిరా గాంధీకి వివరంగా..

ఏప్రిల్ 1984లో హెలికాప్టర్ ఆపరేషన్ గురించి ఇందిరా గాంధీకి పూర్తి సమాచారం అందించాలని నాగరాణితో రామ్‌నాథ్ చెప్పారు. మొదట ఇందిరా గాంధీకి అన్ని విషయాలు చెప్పేందుకు నాగరాణి విముఖత వ్యక్తంచేశారు. ఎందుకంటే ఆపరేషన్‌లో అన్ని విషయాలూ రామ్‌నాథ్ కూడా తెలుసు కాబట్టి. అయితే రామ్‌నాథ్ ఒత్తిడి చేయడంతో ఇందిరా గాంధీకి అన్ని వివరించేందుకు నాగరాణి అంగీకరించారు.

‘‘అన్నీ విన్న తర్వాత.. ఈ ఆపరేషన్‌లో ఎంతమంది చనిపోవచ్చు? అని ఇందిరా గాంధీ ప్రశ్నించారు. మనం రెండు హెలికాప్టర్లు కోల్పోవచ్చు. 20 మంది కమాండోలు మరణించే అవకాశముంది’’అని నాగరాణి చెప్పినట్లు సిద్ధు వివరించారు.

స్వర్ణ మందిర్

ఫొటో సోర్స్, Getty Images

సమ్మతి లభించలేదు

ఎంత మంది సాధారణ పౌరులు మరణించే అవకాశముంది? అని కూడా ఇందిరా అడిగారు. దానికి నా దగ్గర సమాధానం లేదు. ఈ ఆపరేషన్ ఏప్రిల్ 13న వైశాఖి పర్వదినం రోజు చేపట్టాలి. ఆ సమయంలో ఎంతమంది స్వర్ణ దేవాలయం లోపల ఉంటారో తెలియదు. లోపల ఉండే వారిలో 20 శాతం మంది సాధారణ ప్రజలు కూడా మరణించొచ్చు’’అని నాగరాణి చెప్పినట్లు సిద్ధు వివరించారు.

అయితే, అంతమంది మరణించడానికి తాను అంగీకరించనని ఇందిరా గాంధీ స్పష్టంచేశారు. దీతో ఆపరేషన్ సన్‌డౌన్ పక్కన పెట్టేశారు.

ఎక్కువ మంది చనిపోతారనే కారణంతో ఈ ఆపరేషన్‌ను తిరస్కరించినప్పటికీ.. ఆ తర్వాత నిర్వహించిన బ్లూస్టార్ ఆపరేషన్‌లో ఇంకా ఎక్కువ మంది సైనికులు, సాధారణ పౌరులు మరణించారు. దీనికి ఇందిరా గాంధీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)