బిహార్: పోలీసు కస్టడీలో చనిపోయిన కోసీ డాన్ పప్పూ దేవ్ ఎవరు, నేపాల్లో ఏం చేశారు?

పప్పూ దేవ్

ఫొటో సోర్స్, TEJASWI THAKUR/BBC

ఫొటో క్యాప్షన్, పప్పూ దేవ్(కూర్చున్నవారిలో కుడివైపు)
    • రచయిత, సీటూ తివారి
    • హోదా, బీబీసీ కోసం

బిహార్ కోసి అంచల్ డాన్‌గా చెప్పే పప్పూ దేవ్ ఆదివారం ఉదయం పోలీసు కస్టడీలో మృతిచెందారు.

దేవ్ తనకు చాతీలో నొప్పిగా ఉందని చెప్పారని, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో ఆయన చనిపోయారని సహర్సా పోలీసులు చెప్పారు

మరోవైపు స్థానిక మీడియాలో, బయటికొచ్చిన పప్పూ దేవ్ మృతదేహం ఫొటోల్లో ఆయన శరీరంపై గాయాల గుర్తులు కనిపిస్తున్నాయి.

బీబీసీ ఈ సందర్భంగా పప్పూ దేవ్ భార్య పూనమ్ దేవ్‌తో మాట్లాడింది.

"నేను పట్నాలో ఉంటున్నాను. ఆయన కొట్టడం వల్లే చనిపోయారా, కాదా అనేది నాకింకా తెలీదు. నేను అక్కడికి వెళ్లి చూసిన తర్వాతే అది చెప్పగలను" అని ఆమె తెలిపారు.

పోలీస్ స్టేషన్..

ఫొటో సోర్స్, TEJASWI THAKUR/BBC

అసలు కేసేంటి?

పప్పూ యాదవ్‌ను అరెస్ట్ చేసినపుడు పోలీసులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

అందులో "డిసెంబర్ 18న సాయంత్రం సహర్సా జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరాహీలో పప్పూ దేవ్, ఆయన మద్దతుదారులు ఒక భూమిని బలవతంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం రావడంతో పోలీసులు పప్పూ దేవ్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పప్పూదేవ్, ఆయన అనుచరులకు పోలీసులకు మధ్య ఫైరింగ్ జరిగింది".

"ఈలోపు పప్పూ దేవ్ పోలీసుల నుంచి తప్పించుకోడానికి ఒక గోడ మీద నుంచి దూకారు. ఆ తర్వాత ఆయనకు చాతీలో నొప్పిగా అనిపించిందని చెప్పారు. అదే రోజు రాత్రి రెండు గంటలకు ఆయన్ను మేం సదర్ ఆస్పత్రిలోని ఐసీయూలో అడ్మిట్ చేశాం" అని పోలీసులు చెప్పారు.

సదర్ ఆస్పత్రి డాక్టర్లు ఆయన చికిత్స కోసం వేరే ఆస్పత్రికి రెఫర్ చేశారు. కానీ అక్కడికి తీసుకెళ్లక ముందే ఆదివారం వేకువజామున 4 గంటల సమయంలో పప్పూ దేవ్ చనిపోయారు.

"రెండేళ్ల క్రితం జైలు నుంచి విడుదలైన తర్వాత పప్పూ వరుసగా భూముల దందాలో చురుగ్గా ఉన్నారు. భూములు బలవంతంగా కబ్జా చేయడం, కండబలం ఉపయోగించి వాటిని ఆక్రమించడం చేసేవారు. ఆయన చనిపోవడానికి కూడా భూమి కారణం అయ్యింది. కానీ, పోలీసులు మాత్రం ఆయన ఛాతీ నొప్పితో చనిపోయారని చెబుతున్నారు. దారుణంగా కొట్టడం వల్లే పప్పూ దేవ్ చనిపోయారు" అని స్థానిక జర్నలిస్ట్ తేజస్వి ఠాకూర్ చెప్పారు.

ఆస్పత్రి దగ్గర జనం

ఫొటో సోర్స్, TEJASWI THAKUR/BBC

అసలు పప్పూ దేవ్ ఎవరు?

90వ దశకంలో బిహార్‌లో కిడ్నాప్ దందాతోపాటూ, బిహార్‌లోని సహర్సా, ముజఫర్‌పూర్, పూర్ణియా, కటిహార్, కిషన్‌గంజ్, ఖగాడియా, బెగుసరాయ్‌లో పప్పూ యాదవ్ పేరు ఎప్పుడూ చర్చల్లో నిలిచింది.

"90వ దశకంలో కోసీ ప్రాంతంలో మూడు బలమైన గ్యాంగులు ఉండేవి. ఆనంద్ మోహన్ గ్రూప్, పప్పూ యాదవ్ గ్రూప్, పప్పూ దేవ్ గ్రూప్. ఈ మూడు రాజ్‌పుత్, యాదవ్, భూమిహార్ గ్యాంగులు కావడంతో కుల రాజకీయాలు చేసేవి. పప్పూ దేవ్, ఆనంద్ మోహన్ గ్యాంగుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు మాకు సమాచారం వచ్చేది" అని మాజీ ఐపీఎస్ అమితాబ్ కుమార్ బీబీసీకి చెప్పారు.

'ఎమ్మెల్యే', 'కంపెనీ' పేర్లతో వివాదాల్లో నిలిచిన పప్పూ దేవ్ ప్రధానంగా సహర్సా జిల్లా బిహరా గ్రామానికి చెందినవారు. ఆయన తండ్రి దుర్గానంద్ దేవ్ పూర్ణియాలో విద్యుత్ విభాగంలో పనిచేసేవారు.

1994లో పప్పూ దేవ్ పేరు పతాక శీర్షికలకు ఎక్కింది.

"పూర్ణియాలో ఉంటున్న పప్పూ దేవ్ బూటన్ సింగ్ గ్యాంగ్‌లో చేరారు. కానీ, ఆ తర్వాత ఆ గ్యాంగ్‌లో ఉన్న చాలా ఖరీదైన ఒక యూఎస్ కార్బైన్, ఏకే 47 తుపాకీతో పప్పూ దేవ్ పారిపోయారు. సహర్సాలో తన సొంత గ్యాంగ్ తయారుచేసుకున్నారు" అని తేజస్వి చెప్పారు.

వీడియో క్యాప్షన్, దక్షిణాఫ్రికా: డ్రగ్ మాఫియా, క్రిమినల్స్ మధ్య నుంచి ఎదిగిన ఒక ఒలింపిక్ కల

మీడియా రిపోర్టుల ప్రకారం పప్పూ దేవ్ అరాచకాలు బిహార్ నుంచి నేపాల్ వరకూ వ్యాపించినట్టు తెలుస్తోంది.

నేపాల్లో విరాట్‌నగర్ పారిశ్రామికవేత్త తులసీ అగ్రవాల్‌ను కిడ్నాప్ చేసి, కోట్లు వసూలు చేయడంతో పప్పూ దేవ్ చర్చల్లో నిలిచారు.

తర్వాత ముజఫర్‌పూర్ రిజిస్ట్రార్ సూర్యదేవ్ నారాయణ్ సింగ్ కిడ్నాప్, సబ్ రిజిస్ట్రార్ సురేష్ కుమార్, అజయ్ కుమార్ హత్యల్లో ఆయన పేరు బయటికొచ్చింది.

దైనిక్ భాస్కర్ పత్రిక వివరాల ప్రకారం పప్పూ దేవ్ మీద బిహార్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 150కి పైగా దోపిడీ, కిడ్నాప్, హత్య కేసులున్నాయి.

బిహార్‌లో నేరాల గురించి రిపోర్ట్ చేసే తాపమాన్ పత్రికలో ప్రచురితమైన ఒక రిపోర్ట్ ప్రకారం

2003లో నేపాల్ విరాట్‌నగర్ దగ్గర పప్పూ దేవ్ రూ.50 లక్షల నకిలీ భారత కరెన్సీతో పోలీసులకు పట్టుబడ్డాడు.

ఆ తర్వాత 2014 జనవరి 6 వరకూ నేపాల్ జైల్లో ఉన్నారు. కానీ, ఆ తర్వాత కూడా పోలీసులు ఆయన్ను 2014లో మరోసారి నేపాల్ సరిహద్దుల్లోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పప్పూ దేవ్ దాదాపు ఆరేళ్లు జైల్లో గడిపారు.

రాజకీయాలు, కాంట్రాక్టుల్లో అదృష్టం పరీక్షించుకున్నారు

పప్పూ దేవ్, ఆయన భార్య పూనమ్ దేవ్ రాజకీయాలతోపాటూ కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌లో కూడా చురుకుగా ఉండేవారు.

"మేం దేవ్ కన్‌స్ట్రక్షన్ పేరుతో ఒక కంపెనీ నడిపేవాళ్లం. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్‌ని. మేం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల రోడ్ నిర్మాణ కాంట్రాక్టులను చేసేవాళ్లం" అని పూనమ్ దేవ్ బీబీసీకి చెప్పారు.

ఇక రాజకీయాల విషయానికి వస్తే పూనమ్ దేవ్ ఎల్జేపీ అభ్యర్థిగా 2005లో బిహ్‌పూర్(భాగల్పూర్) నుంచి, 2015లో మహిషి(సహర్సా) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

ఖగడియాలోని పర్‌బతా నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని పప్పూ దేవ్ 2020లో ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)