పాకిస్తాన్: ‘నా భర్తను చంపినవాడిని పెళ్లాడాను, తరువాత ఒక రాత్రి చంపేశాను’

భర్త హంతకుడిని చంపిన మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అజీజుల్లాహ్ ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"నేను నా మొదటి భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. హంతకుడితో స్నేహం చేశాను. తర్వాత అతడిని పెళ్లాడాను. చివరికి ప్రతీకారం తీర్చుకున్నాను".

పాకిస్తాన్ గిరిజన ప్రాంతమైన బాజౌర్ జిల్లాలోని ఒక మహిళ పోలీసుల ఎదుట చెప్పిన విషయం ఇది.

నేరం చేసినట్లుగా అంగీకరించిన ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు చద్‌దరా జైలుకు పంపించారు.

తన భర్త జమీన్ మరణానికి ప్రతీకారం తీర్చుకోడానికి మూడేళ్లుగా ప్రయత్నించానని, దాని కోసం పక్కా ప్లాన్ వేశానని నిందితురాలు చెప్పారు.

పోలీసుల దర్యాప్తులో...

"ఇది చాలా జటిలమైన కేసు, దీనికోసం చాలా దర్యాప్తు చేశాం. చివరికి అసలు రహస్యం తెలుసుకున్నాం" అని బాజౌర్ జిల్లా ఇనాయత్ ఖిలా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విలాయత్ ఖాన్ బీబీసీతో చెప్పారు.

నిందితురాలి మొదటి భర్త జమీన్ మూడేళ్ల క్రితం చనిపోయాడు. కానీ అతడిది హత్యా, సహజ మరణమా అనేది తెలియలేదు.

కానీ, నిందితురాలు మాత్రం తన భర్త మరణం గురించి వ్యక్తిగతంగా వివరాలు సేకరించానని, భర్తను ఆయన స్నేహితుడు గులిస్తాన్ ఖాన్ విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపాడని పోలీసులకు చెప్పారు.

"కానీ, ఆమె భర్త జమీన్‌ను హత్య చేసినట్లు ఎక్కడా కేసు నమోదు కాలేదు. మూడేళ్ల క్రితం ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్ కూడా లేదు. అతడిని హత్య చేసినట్లు ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదు" అని పోలీసులు చెప్పారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో కొన్నేళ్లలో పార్శీలంటూ ఎవరూ మిగలరా?

కేసు ఇలా మొదలైంది

గులిస్తాన్ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపారని పోలీసులు సమాచారం అందింది.

సమాచారం వచ్చిన తర్వాత ఆ ప్రాంతం నుంచి ఎవరూ బయటికి వెళ్లకుండా చూడాలని స్థానిక చెక్ పోస్ట్ పోలీసులను అప్రమత్తం చేసిన ఇన్‌స్పెక్టర్ విలాయత్ ఖాన్ తన టీంతో హత్య జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.

"మేం అక్కడికి చేరుకునేసరికి బెడ్ మీద రక్తంతో తడిసిన మృతదేహం ఉంది. ఒక బుల్లెట్ తలలో, మరో బుల్లెట్ శరీరంలో కుడివైపు దిగాయి. నిందితురాలు మృతుడి దగ్గరే కూర్చుని ఉన్నారు. ఇంటి బయటంతా జనం భారీగా గుమిగూడారు. మేం అందరినీ దూరంగా పంపించి దర్యాప్తు ప్రారంభించాం. సాక్ష్యాలు సేకరించాం" అని విలాయత్ బీబీసీకి చెప్పారు.

భర్త హంతకుడిని చంపిన మహిళ

ఫొటో సోర్స్, Getty Images

అఫ్గాన్ శరణార్థి, గిరిజన మహిళ వివాహం

పోలీసు రిపోర్టులో ఉన్న వివరాల ప్రకారం.. నిందితురాలు తన మొదటి భర్త అఫ్గానిస్తాన్‌లోని కునార్‌కు చెందిన అఫ్గాన్ శరణార్థి అని చెప్పారు.

ఆయన పెషావర్‌లో పనిచేసేవారని తమ కుటుంబం చాలా సంతోషంగా జీవించేదని తెలిపారు. వారికి ఒక కూతురు కూడా ఉందని పోలీసులు చెప్పారు.

"నా భర్త జమీన్‌కు గులిస్తాన్ అనే వ్యక్తితో స్నేహం ఉండేది. ఆయన పెషావర్‌లో సంపాదించిన డబ్బును, అవసరమైనప్పుడు తీసుకుందామని గులిస్తాన్‌కు పంపించేవారు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. కొంతకాలం తర్వాత అనారోగ్యంతో తిరిగొచ్చిన భర్త ఆ డబ్బు తిరిగి ఇమ్మన్నప్పుడు గులిస్తాన్ ఇవ్వలేదు. తన దగ్గర డబ్బు లేదన్నారు" అని మహిళ పోలీసులకు చెప్పారు.

"గులిస్తాన్ నా భర్తకు డబ్బివ్వడానికి బదులు, నీకు ఆరోగ్యం సరిగా లేదుగా, నేను మందులు తీసుకొస్తా అన్నాడు. రెండు ఇంజెక్షన్లు, కొన్ని మాత్రలు తీసుకొచ్చాక, నది తీరానికి తీసుకెళ్లి ఒక ఇంజెక్షన్ వేశాడు. ఇంకొకటి ఇంటికి వెళ్లాక వేస్తానని, జబ్బు తగ్గిపోతుందని చెప్పాడు"

కానీ, ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత తన భర్త ఆరోగ్యం మరింత దిగజారిందని, నేలపై పడిపోయాడని, అక్కడున్న వాళ్లు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయారని నిందితురాలు వాంగ్మూలంలో చెప్పారు.

ప్రతీకారం కోసం ప్లాన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రతీకారం తీర్చుకోడానికి పక్కా ప్లాన్

తన భర్త జమీన్ ఎలా చనిపోయాడనే వివరాలు సేకరించినప్పుడు, గులిస్తాన్ తన భర్తకు ఒక ఇంజెక్షన్ ఇచ్చాడని, ఆ తర్వాత ఆయన పరిస్థితి దిగజారినట్టు తెలిసిందని మహిళ పోలీసులకు వివరించారు.

గులిస్తాన్ ఖాన్ తన భర్తను చంపాడని తనకు అనిపించిందని, అప్పుడే భర్త మరణానికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నానని ఆమె చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

"ఆమె ఐదారు నెలలపాటు భర్త మరణానికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని చూశారు. కానీ ఆమెకు ఆ అవకాశం దొరకలేదు, దాంతో గులిస్తాన్‌కు దగ్గరై ప్రతీకారం తీర్చుకోవాలని ఒక ప్లాన్ వేశారు" పోలీసులు చెప్పారు.

తర్వాత గులిస్తాన్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న నిందితురాలు అతడికి మెసేజులు పెట్టారు. అయితే, అయనకు అప్పటికే పెళ్లైంది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. దాంతో అతడికి డబ్బు ఆశ చూపి ఆమె పెళ్లికి ఒప్పించారని పోలీసులు రిపోర్టులో ఉంది.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో హిందూ యువతుల బలవంతపు మతమార్పిడి

అవకాశం కోసం వేచిచూసి

గులిస్తాన్‌ను పెళ్లి చేసుకున్నాక ప్లాన్ ఎలా అమలు చేసిందీ నిందితురాలు పోలీసులకు చెప్పారు.

"నా దగ్గర బాగా డబ్బుందని, దానితో కారు కొనుక్కోమని, మంచి జీవితం గడుపుదామని గులిస్తాన్‌కు చెప్పాను. గత ఏడాది ఈద్‌కు ముందు మేం పెళ్లి చేసుకున్నాం. ఆరు నెలల వరకూ మాకు ఒక ఇల్లంటూ లేదు. వేరే వారి ఇళ్లలో ఉంటూ వచ్చాం. తర్వాత అద్దెకు ఇల్లు తీసుకుందామని గులిస్తాన్‌కు చెప్పాను"

"ఇనాయత్ ఖలీలో నెలకు మూడు వేల అద్దెకు ఒక ఇల్లు తీసుకున్నాం. ఆ తర్వాత మనం ఇక్కడ చాలా దూరంలో ఉంటున్నాం. ఇంట్లో దొంగలు పడితే ఎలా, ఒక పిస్టల్ కూడా కొనుక్కుందాం అని గులిస్తాన్‌కు చెప్పిందామె. దాంతో, అతడు రూ.13,500 పెట్టి ఒక పిస్టల్ కొనుక్కొచ్చాడు".

"నా మొదటి భర్త చనిపోయి మూడేళ్లైపోయింది. రెండేళ్లు నేను ఎప్పుడు, ఎలా ప్రతీకారం తీర్చుకుందామా అనే ఎదురుచూశా. ఇంట్లో పిస్టల్ ఉండడంతో దాన్ని ఎప్పుడు ఉపయోగిద్దామా అని అవకాశం కోసం ఎదురుచూశాను" అని చెప్పారు.

ఆ రోజు ఏమైందంటే..

"ఆరోజు రాత్రి నేను మేలుకునే ఉన్నా. రాత్రి సుమారు ఒంటి గంటకు వేరే గదిలోకి వెళ్లాను.

పిస్టల్‌లో బుల్లెట్లు నింపి గులిస్తాన్ గదిలోకి వచ్చాను. ఆయన నిద్రపోతున్నారు.

నేను కాల్పులు జరపాలని చూశాను. కానీ అది ఫైర్ కాలేదు. పిస్టల్ పనిచేయలేదు.

దాంతో వేరే గదిలోకి వెళ్లి పిస్టల్ చెక్ చేశారు. గులిస్తాన్ గదిలోకి వచ్చి మొదట ఆయన తలలో, తర్వాత శరీరంలో కుడివైపు కాల్చాను" అని నిందితురాలు పోలీసులతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్: బలూచిస్తాన్‌లో వందలాది మంది పురుషులు అదృశ్యం.. వారంతా ఏమైపోతున్నారు?

కాల్పులు జరిపిన తర్వాత తెల్లారేవరకూ అక్కడే కూర్చున్న ఆమె.. ఎవరో తన తన భర్తను చంపేశారని చుట్టుపక్కలవారికి చెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

"మొదట ఆమె నేను హత్య చేయలేదని చెప్పారు. కానీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఆమె ఒప్పుకున్నారు. పెట్టె లోపల దాచిన పిస్టల్ గురించి కూడా చెప్పారు. తర్వాత పోలీసులు ఆ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు" అని విలాయత్ ఖాన్ చెప్పారు.

స్థానికులు మాత్రం గులిస్తాన్ మంచివాడని, ఆయన స్వభావం మంచిదని చెబుతున్నారు.

ఈ హత్య కేసులో నిందితురాలిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు తర్వాత ఆమెను జైలుకు పంపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)