పష్తూన్ ఉద్యమాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం అణగదొక్కేస్తున్నాయా?

నకిలీ ఎన్ కౌంటర్ లో మరణించిన నకీబుల్లా మెహసూద్

ఫొటో సోర్స్, FACEBOOK / NAQIBMEHSUD

ఫొటో క్యాప్షన్, నకిలీ ఎన్ కౌంటర్ లో మరణించిన నకీబుల్లా మెహసూద్
    • రచయిత, షుమైలా జాఫ్రీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్

పట్టపగలే హింస, గ్యాంగ్ వార్‌లకు కరాచీ నగరం సుప్రసిద్ధం. అలాంటి ఆ నగరంలో 2018 జనవరి 13న ఓ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 27 ఏళ్ల నకీబుల్లా మెహసూద్‌, మరో ముగ్గురు యువకులు మృతి చెందారు.

వీరంతా అఫ్గానిస్తాన్‌ను ఆనుకుని ఉన్న దక్షిణ వజీరిస్తాన్‌లోని గిరిజన ప్రాంతానికి చెందినవారు.

మరణించినవారిని ఉగ్రవాదులుగా భావిస్తున్నామని ఈ ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్ అధికారి రావ్ అన్వర్ అన్నారు. నకీబుల్లాకు ఐఎస్‌తో పాటు తెహ్రిక్-ఎ-తాలిబాన్, పాకిస్తాన్ లష్కరే-ఎ-జాంగ్వీ లాంటి సంస్థలతో సంబంధముందని పోలీసులు చెప్పారు.

అయితే తీవ్రవాదులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్న నకీబుల్లా నిజానికి అప్పుడు అభివృద్ధిలోకి వస్తున్న ముగ్గురు పిల్లల తండ్రి అని తేలింది. నకీబుల్లాతోపాటు ముగ్గురు యువకుల మరణానికి కారణమైన ఎన్ కౌంటర్ నకిలీ అని, చనిపోయిన వారంతా అమాయకులని పాకిస్తాన్‌కు చెందిన యాంటీ టెర్రర్ కోర్ట్ తేల్చి చెప్పింది.

పాక్ ప్రభుత్వంపై మంజూర్ పష్తీన్ చేస్తున్న ఉద్యమానికి ఆదరణ లభించింది
ఫొటో క్యాప్షన్, పాక్ ప్రభుత్వంపై మంజూర్ పష్తీన్ చేస్తున్న ఉద్యమానికి ఆదరణ లభించింది

నకిలీ ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు

నకీబుల్లా మృతదేహాన్ని ఐదు రోజుల తర్వాత కుటుంబానికి అప్పగించారు. ఆ తర్వాత ఖననం కోసం దక్షిణ వజీరిస్తాన్‌కు తరలించారు. ఎన్‌కౌంటర్‌లో నకీబుల్లా మరణించాడని తెలియగానే ప్రజలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిరసనగా వేలాదిమంది వీధుల్లో ఆందోళనలు నిర్వహించారు.

నకీబుల్లా హత్యకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు మంజూర్ పష్తీన్ అనే యువకుడు నాయకుడిగా మారారు. నకిలీ ఎన్ కౌంటర్లను అంతం చేయాలని, గిరిజనులను ఒక పథకం ప్రకారం అంతమొందించే వైఖరిని ప్రభుత్వం విడనాడాలని మంజూర్ డిమాండ్ చేశారు.

మంజూర్ అప్పటికే పష్తూన్‌లలో ఒక వర్గానికి చెందిన ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు. దక్షిణ వజీరిస్తాన్‌లోని పష్తూన్ తెగలో మెహసూద్ అనేది అతిపెద్ద కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ తరఫున పోరాడేందుకు 'మెహసూద్ తహాఫుజ్ మూవ్ మెంట్' అనే పార్టీని ఏర్పాటు చేశారు మంజూర్.

వజీరిస్తాన్‌లో తీవ్రవాదులకు, ప్రభుత్వ దళాలకు మధ్య దశాబ్దాలుగా యుద్ధం కొనసాగింది. దీని కారణంగా సుమారు 20లక్షలమంది ప్రజలు అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వలస పోవాల్సి వచ్చింది. విధ్వంసంలో ప్రజలకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలైంది.

అమెరికాలో 9/11 దాడుల తరువాత పాకిస్తాన్ కూడా ఉగ్రవాద సంస్థలపై దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా వజీరిస్తాన్‌లో లక్షలాదిమంది అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది.

నకీబుల్లా హత్యకు నిరసనగా ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని మంజూర్ నిర్ణయించారు. జనవరి 26న ఆయన ర్యాలీ ప్రారంభించినప్పుడు ఆయన వెంట కొన్ని డజన్లమందే ఉన్నారు. కానీ అది ఇస్లామాబాద్ చేరేసరికి భారీ ఎత్తున ప్రజలు అందులో పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొనడానికి చాలా దూరం నుంచి ప్రజలు తరలి వచ్చారు. వారిలో ఎక్కువమంది ప్రభుత్వానికి, తీవ్రవాదులకు మధ్య యుద్ధం కారణంగా తమ వారిని కోల్పోయినవారే. తమ కుటుంబాల నుంచి కనిపించకుండా పోయినవారి చిత్రపటాలను పట్టుకుని వారు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఇస్లామాబాద్ ప్రెస్ క్లబ్ వెలుపల పది రోజుల ధర్నాకు దిగారు మంజూర్. అదే సమయంలో మెహసూద్ తహాఫుజ్ మూవ్ మెంట్ ‘ఎంటీఎం’ను పష్తూన్ తహాఫుజ్ మూవ్ మెంట్ ‘పీటీఎం’గా మారుస్తున్నట్లు ప్రకటించారు మంజూర్

నకిలీ ఎన్ కౌంటర్‌కు బాధ్యుడైన రావ్ అన్వర్‌ను అరెస్టు చేయాలని, అంతకు ముందు గిరిజన ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సైనిక పోస్టులను, ల్యాండ్ మైన్లను తొలగించాలని పీటీఎం డిమాండ్ చేసింది. గిరిజన ప్రాంతాలలోని పురుషులను బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేసే ప్రక్రియను కూడా ఆపాలని కోరింది.

ఈ డిమాండ్లతో పీటీఎం జరుపుతున్న ర్యాలీకి మానవహక్కుల సంఘాలు, పలు పౌర సంఘాలు కూడా మద్ధతిచ్చాయి. ఈ ఉద్యమంపై స్పందించిన పాకిస్తాన్ సైనిక నాయకులు కొందరు దీనిని ‘సహేతుక’ ఉద్యమంగా అభివర్ణించారు. మంజూర్ నాయకత్వ ప్రతిభను కొనియాడారు.

అయితే పాకిస్తాన్ సైనిక నాయకత్వంపై కూడా మంజూర్ విమర్శలు చేయడం ప్రారంభించారు. గిరిజనుల కష్టాలకు సైన్యమే కారణమని ఆరోపించారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసమే తాము ఉద్యమిస్తున్నట్లు మంజూర్ పష్తీన్ బీబీసీతో అన్నారు.

"మా పోరాటం శాంతియుతంగా ఉంటుంది. కాని మేం తరువాత ఎలా ప్రవర్తిస్తామో అది మా నాయకుల వైఖరిపై ఆధారపడి ఉంటుంది. వారు తాము పాల్పడిన దురాగతాలను అంగీకరిస్తారా ? మమ్మల్ని పౌరులుగా గుర్తించడానికి సిద్ధంగా ఉన్నారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘మమ్మల్ని టిష్యూ పేపర్ లాగా వాడుకుంటున్నారని వారు ఒప్పుకుంటారా’’ అని మంజూర్ అన్నారు.

"సైన్యం మాపై బాంబులు వేయాలనుకుంటే వేస్తుంది. రేషన్ పంపాలనుకుంటే పంపుతుంది. ఇతరులను చంపడానికి శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది" అన్నారు మంజూర్.

పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా ఇస్లామాబాద్ లో భారీ ర్యాలీ జరిగింది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా ఇస్లామాబాద్ లో భారీ ర్యాలీ జరిగింది

సైన్యం నుంచి సమాధానం

సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని పీటీఎం ఉద్యమకారులు చేస్తున్న విమర్శలతో ఆర్మీ నాయకత్వం కాస్త అసౌకర్యానికి గురయ్యింది.

2018లో ISPR కు చెందిన అప్పటి డీజీ లెఫ్టినెంట్ జనరల్ ఆసిఫ్ గఫూర్ పీటీఎం వైఖరిని తప్పుబట్టారు. పాకిస్తాన్‌ను అస్థిరపరిచేందుకు శత్రువుల ఎజెండాతో పీటీఎం పని చేస్తోందని ఆయన ఆరోపించారు. అఫ్గాన్, భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పీటీఎంకు నిధులు సమకూరుస్తున్నాయని గఫూర్ అన్నారు.

"తీవ్రవాదులు స్థానికుల ప్రాణాలు తీస్తుంటే ఈ ఉద్యమ నాయకులంతా ఎక్కడున్నారు’’ అని ప్రశ్నించారు గఫూర్. ‘‘పాకిస్తాన్ సైన్యమే వీరికి తీవ్రవాదుల నుంచి రక్షణ ఇచ్చి తప్పించుకునే మార్గం చూపించింది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అభివృద్ధి పనులు కూడా ప్రారంభమయ్యాయి’’ అన్నారాయన.

"మీ టైమ్ అయిపోయింది" అంటూ పీటీఎంను హెచ్చరించారు గఫూర్. "మీరు సైన్యం మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటారు ?’’ అని ఆయన ప్రశ్నించారు.

ఇరువైపుల నుంచి విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి. పీటీఎంకు, అధికారులకు మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ప్రధాన స్రవంతి మీడియలో పీటీఎం వార్తల కవరేజిని నిషేధించారు. కొందరు నేతలను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

అయితే పీటీఎంకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు నెగెటివ్ ప్రభావాన్ని చూపాయి. పష్తూన్ లు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పీటీఎంకు ఆదరణ పెరిగింది.

పీటీఎం

విలీనంతో ఉద్యమం చల్లారిందా?

2018 మే 31న గిరిజన ప్రాంతలను ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో విలీనం చేశారు. పార్లమెంటులో దీనిపై ఏకాభిప్రాయం ఏర్పడింది. ఈ ప్రాంతపు పరిపాలనను నియంత్రించే ప్రత్యేక నియమాలు రద్దయ్యాయి.

పూర్వం ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలనా కాలంలో చేసిన ప్రత్యేక చట్టాల ద్వారా పరిపాలించారు. కానీ విలీనంతో పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల ప్రజలలాగే గిరిజన ప్రాంతాల ప్రజలకు కూడా హక్కులు లభించాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలులో ఉన్న చట్టాలు ఇక్కడ కూడా అమల్లోకి వచ్చాయి.

ఈ విలీనానికి సైన్యం కూడా సహకరించింది. అయితే పీటీఎం సృష్టించిన ఒత్తిడి కారణంగానే స్థానికుల డిమాండ్ లు త్వరగా నెరవేరాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రజల డిమాండ్ కారణంగా సైన్యం రాజకీయ శక్తులన్నింటిని ఏకం చేసి గిరిజన ప్రాంతాలను (Federally Administered Tribal Areas - FATA) ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో విలీనం చేయడానికి ఒప్పించగలిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

పష్తూన్ ఉద్యమం

ఫొటో సోర్స్, EPA

సిద్ధాంతాలు కాదు...డిమాండ్లతోనే సంఘర్షణ

FATA ప్రధాన స్రవంతిలో చేరి ఏడాదికిపైగా అయ్యింది. దీంతో ఇప్పుడు పీటీఎం తన ప్రాధాన్యతను కోల్పోయిందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘డిమాండ్ల ఆధారంగా జరిగే ఉద్యమాలు అవి నెరవేరగానే చల్లబడతాయి. పీటీఎం విషయంలో అదే జరిగింది. మంజూర్ పష్తీన్ నాయకత్వంలో జరిగిన ఉద్యమం తాలూకు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చింది’’ అన్నారు ప్రొఫెసర్ హుసేన్ సుహ్రవర్ది.

స్థానిక గిరిజనుల సమస్యలను లేవనెత్తడంలో పీటీఎం విజయం సాధించిందని, ప్రభుత్వం, సైన్యం వారి డిమాండ్ లన్నీ నెరవేర్చాయని, దీంతో ఉద్యమం చల్లబడిందని ప్రొఫెసర్ సుహ్రవర్ది అన్నారు.

విదేశాల నుంచి నిధుల అంశం కూడా పీటీఎం ఆదరణపై ప్రభావం చూపిందని సుహ్రవర్ది అన్నారు. సహజంగా రాజ్యాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరుగుతోందంటే ప్రజలు కూడా ఆలోచిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

పార్టీలోని అంతర్గత విభేదాలు కూడా దాన్ని దెబ్బతీశాయని సుహ్రవర్ది అన్నారు. ఎన్నికలలో పాల్గొనే విషయంలో ఆ పార్టీలో గందరగోళం ఉందని వివరించారు సుహ్రవర్ది.

యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో పీటీఎంకు భారీ ఎత్తున మద్దతు లభించడం వాస్తవమేననీ, అయితే విదేశీ నిధులు దాని ఇమేజ్‌పై ప్రభావం చూపాయని రాజకీయ విశ్లేషకుడు రహీముల్లా యూసఫ్ జాయ్ అన్నారు.

‘‘విదేశాల్లో పష్తూన్ అనుకూల ప్రదర్శనలు జరిగినప్పుడు అఫ్గానిస్తాన్ కు చెందిన పష్తూన్ లు కూడా పాల్గొంటారు. ఇది విదేశీ నిధుల అనుమానాన్ని పెంచుతోంది. ఈ అనుమానం పష్తూన్ ప్రాంతంలో పీటీఎం ప్రతిష్టను కొంత వరకు దెబ్బ తీసింది’’ అన్నారు రహీముల్లా.

విదేశీ నిధుల గురించి ప్రభుత్వం, సైన్యం పరిధులు మీరి విమర్శలు చేస్తుండటంతో ఏదో ఒక ఆధారం లేకపోదన్న అభిప్రాయం కూడా వినిపించింది. అయితే ఆరోపణలను నిరూపించాలని పీటీఎం డిమాండ్ చేస్తోంది. తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని సైన్యం చెబుతున్నా, వాటిని ఇంత వరకు బైటపెట్టలేదు.

అటు ప్రభుత్వంంగానీ, ఇటు సైన్యంగానీ ఆధారాలు బైటపెట్టకపోవడం యువతలో పీటీఎంకు ఆదరణ పెరగడానికి కారణమని రహీముల్లా వ్యాఖ్యానించారు. ‘‘ పీటీఎం ఇప్పటికీ ఉద్యమాలు చేస్తోంది. వాటికి ఆదరణ లభిస్తోంది. ఈ ఉద్యమాన్ని పాకిస్తాన్‌లో సజీవంగా ఉంచాలంటే అది చట్ట పరిధిలో పోరాడాల్సి ఉంటుంది’’ అన్నారు రహీముల్లా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)