అసదుద్దీన్ ఒవైసీ పెద్ద నాయకుడని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎందుకు అంటున్నారు?

యోగి ఆదిత్యనాథ్, అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యోగి ఆదిత్యనాథ్, అసదుద్దీన్ ఒవైసీ
    • రచయిత, వాత్సల్య రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్‌లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్య నాథ్ నేతృత్వంలో ముందుకు వెళ్తామని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్పష్టంచేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌తోపాటు చాలా మంది పార్టీ నాయకులు ఇదే విషయాన్ని చెప్పారు.

అయితే, యోగి ఆదిత్యనాథ్‌కు ఎవరి నుంచి అతిపెద్ద సవాల్ ఎదురవుతోంది?

2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో జతకట్టిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి ఇక్కడి విపక్షాల్లో అందరికంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు.

యోగి ఆదిత్యనాథ్‌కు దీటుగా తమ పార్టీ బరిలోకి దిగబోతోందని ఇప్పటికే మాజీ సీఎం, ఎస్పీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ స్పష్టంచేశారు. మరోవైపు మాయావతి కూడా బీఎస్పీలో దీనికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ప్రియాంకా గాంధీ పర్యవేక్షణలో కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ కూడా తెలిపారు.

అయితే, వీరెవరి గురించీ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడటం లేదు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నాయకుడు అసదుద్దీన్ ఒవైసీనే తమకు ప్రధాన పోటీదారని ఆయన చెబుతున్నారు. ఒవైసీ విసిరే సవాల్‌ను తాము స్వీకరిస్తామని అంటున్నారు.

‘‘దేశంలోని పెద్ద నాయకుల్లో ఒవైసీ ఒకరు. ఆయన కంటూ ప్రజల్లో గుర్తింపు ఉంది. ఆయన మాకు సవాల్ విసిరితే, దాన్ని స్వీకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మళ్లీ బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుంది. దీనిలో ఎలాంటి సందేహాలూ లేవు’’అని ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.

ఒవైసీ విసిరిన సవాల్‌పై స్పందిస్తూ యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆదిత్యనాథ్ మరోసారి ఉత్తర్ ప్రదేశ్ సీఎం కాకుండా మేం అడ్డుకుంటాం’’అని ఒవైసీ వ్యాఖ్యానించారు.

ఒవైసీ వ్యాఖ్యలు సాధారణమైనవే. ఎందుకంటే ఆయన ఉత్తర్ ప్రదేశ్‌లో తమ పార్టీకి పునాదులు వేసేందుకు చాలా కాలం నుంచీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, ఆయన్ను పెద్ద నాయకుడిగా ఆదిత్యనాథ్ అభివర్ణించడం ఇప్పుడు సందేహాలకు తావిస్తోంది.

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అసదుద్దీన్ ఒవైసీ

ఒవైసీ పార్టీ బలమెంత?

ఒవైసీ పార్టీకి గట్టి పునాదులు ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే. అక్కడ కూడా 2018 ఎన్నికల్లో కేవలం ఏడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పార్టీ గెలిచింది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్‌ ఎంపీగా ఒవైసీ ఎన్నికయ్యారు. మరోవైపు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ ఎంపీగా పార్టీకి చెందిన సయ్యద్ ఇంతియాజ్ అలీ గెలుపొందారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఎలాంటి ప్రభావాన్నీ చూపలేకపోయింది.

2017లో ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 38 మంది అభ్యర్థులను నిలబెట్టింది. వీరిలో 37 మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. మొత్తంగా పార్టీకి దక్కింది 2.46 శాతం ఓట్లే.

మరోవైపు 384 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన బీజేపీ 41.57 శాతం ఓట్లను దక్కించుకుంది.

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అసదుద్దీన్ ఒవైసీ

ఎందుకు అలా అన్నారు?

ఇలాంటి పరిస్థితుల్లో ఒవైసీని పెద్ద నాయకుడిగా యోగి ఆదిత్యనాథ్ ఎందుకు పిలిచారు? బీజేపీ రాజకీయాలను దగ్గరుండి పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్టు ప్రదీప్ సింగ్ దీనిపై బీబీసీతో మాట్లాడారు.

‘‘ఎలాంటి పరిస్థితుల్లోనూ తమకు ముస్లిం ఓట్లు రావని బీజేపీకి బాగా తెలుసు. దీంతో ముస్లిం ఓట్లను చీలిస్తే, తమకు ప్రయోజనం జరగుతుందని పార్టీ భావిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో బీఎస్పీ, ఎస్పీల మధ్యే ముస్లింల ఓట్లు చీలేవి. ఇప్పుడు ఒవైసీ ద్వారా ముస్లిం ఓటు బ్యాంకును మరింత చీల్చాలని పార్టీ భావిస్తోంది. ఒవైసీని పెద్ద నాయకుడిగా అభివర్ణిస్తే.. ఆయనకు వచ్చే ఓట్లు పెరుగుతాయని, ఫలితంగా ఎస్పీ, బీఎస్పీల ఓటు బ్యాంకు తగ్గుతుందని బీజేపీ భావిస్తోంది.’’

‘‘ముఖ్యంగా ముస్లింల ఓట్లు ఎస్పీకి ఎక్కువగా పడుతుంటాయి. ఆ పార్టీ ఓటు బ్యాంకును ఒవైసీ సాయంతో చీల్చాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.’’

రాష్ట్రంలో ముస్లింల ఓట్లు 19 శాతం వరకూ ఉంటాయి. 100కుపైగా స్థానాల్లో వీరు గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటారు. ఇక్కడ ముస్లిం ఓట్లు చీలిపోతే, చివరగా లబ్ధి పొందేది బీజేపీనే.

మాయావతి, యోగి ఆదిత్యనాథ్, అఖిలేశ్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాయావతి, యోగి ఆదిత్యనాథ్, అఖిలేశ్ యాదవ్

గతంలో ఏం జరిగింది?

2017 అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ 97 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ 67 మంది ముస్లింలకు టికెట్లు ఇచ్చింది. వీరిలో 24 మంది ముస్లిం అభ్యర్థులు అసెంబ్లీలోకి అడుగుపెట్టగలిగారు. ముస్లింలు అధికంగా ఉండే దేవ్‌బందీ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించగలిగింది.

రాష్ట్రంలో ఒవైసీ అభ్యర్థులు బరిలోకి దిగిన చోట్ల బీజేపీ లబ్ధి పొందినట్లు మనం గమనించొచ్చని ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలపై ఏళ్లుగా వార్తలు రాస్తున్న సీనియర్ జర్నలిస్టు శరత్ ప్రధాన్ చెప్పారు.

‘‘బీజేపీకి ఒవైసీ సాయం చేస్తున్నారని కొందరు అంటున్నారు. మరోవైపు తనకు అలాంటి ఉద్దేశమేదీ లేదని ఒవైసీ చెబుతున్నారు. ఒవైసీ కావాలని చేసినా లేదా అనుకోకుండా చేసినా.. పరోక్షంగా బీజేపీకే లబ్ధి చేకూరుతోంది. ఒవైసీ ఎలా అనుకుని చేసినా ఫలితాలు మాత్రం బీజేపీకి అనుకూలంగానే ఉంటాయి.’’

గత ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ఈ సందర్భంగా శరత్ ఉదహరించారు.

‘‘బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఒవైసీ పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. కానీ చివరకు ఏం జరిగింది? అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. లేదంటే అక్కడ ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పడి ఉండేదని నేను గట్టిగా నమ్ముతున్నా’’అని శరత్ అన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీతో సహా ఆరు ఇతర పార్టీలతో కలిసి ఇక్కడ ఒవైసీ పార్టీ బరిలోకి దిగింది. వీరు 20 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టారు. వీరిలో ఐదుగురు విజయం సాధించారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా ‘‘భాగీదారీ సంకల్ప్ మోర్చా’’ పేరుతో ఒవైసీ ఓ కూటమిని ఏర్పాటు చేశారు. దీనిలో ఓం ప్రకాశ్ రాజ్‌భర్ పార్టీ సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ కూడా ఉంది. మొత్తంగా వీరు 100 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలోకి దింపనున్నారు.

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, @ASADOWAISI

ఫొటో క్యాప్షన్, అసదుద్దీన్ ఒవైసీ

వ్యూహాలు అలానే ఉన్నాయి...

‘‘ఇప్పుడు ఒవైసీ అనుసరిస్తున్న వ్యూహాలతో.. ఆయనతోపాటు బీజేపీకి కూడా లబ్ధి చేకూరుతుంది’’అని ప్రదీప్ అన్నారు.

‘‘ఆయన వంద సీట్లలో పోటీచేస్తామని చెప్పారు. ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఆయన దృష్టిసారిస్తున్నారు. దీంతో బీజేపీ పని కూడా తేలిక అవుతుంది.’’

‘‘ఒవైసీది మంచి వ్యూహంగా బీజేపీ కూడా భావిస్తోంది. అందుకే ఆయన్ను పెద్ద నాయకుడిగా చెబుతోంది. ముస్లింలు ఎంత ఎక్కువగా ఆయన వైపు తిరిగితే బీజేపీకి అంత లాభం’’అని ప్రదీప్ వ్యాఖ్యానించారు.

‘‘ఒవైసీ చక్కగా మాట్లాడతారు. ముస్లింలకు ఇప్పటివరకు ఏ పార్టీ మేలు చేయలేదని ఒవైసీ అంటున్నారు. అందుకే తమ పార్టీ ముస్లింల కోసం ఏర్పడిందని అంటున్నారు. మతం పేరుతో ఆయన రాజకీయాలు చేయాలని చూస్తున్నారు’’అని శరత్ అన్నారు.

యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యోగి ఆదిత్యనాథ్

అంత తేలిక కాదు

అయితే, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఒవైసీ ప్రభావం చూపడం అంత తేలికకాదు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అది రుజువైంది కూడా.

ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పెద్ద నాయకుడిగా ఉత్తర్ ప్రదేశ్ నాయకులు చూస్తారా? అనేదే అసలు ప్రశ్న.

అయితే, ఆయన ఎంత పెద్ద నాయకుడు అనేది ప్రశ్నకాదని ప్రదీప్ అన్నారు. ‘‘సమాజ్‌వాదీ విజయ అవకాశాలకు గండి కొట్టడానికే ఆయన ఇక్కడకు వచ్చారని ముస్లింలు భావిస్తే, ఆయన వ్యూహం బెడిసికొడుతుంది.’’

‘‘అదే సమయంలో తమకు మేలు చేయడానికే ఇక్కడకు వచ్చానని ఒవైసీ నిరూపించుకోగలిగితే ఆయన పార్టీకి ముస్లింలు అండగా నిలుస్తారు. అయితే అది అంత తేలిక కాదు.’’

అసదుద్దీన్ ఒవైసీ
ఫొటో క్యాప్షన్, అసదుద్దీన్ ఒవైసీ

‘‘నాకు తెలిసినంత వరకు ఒవైసీ పార్టీకి అంత ప్రయోజనం ఉండకపోవచ్చు. ఒకవేళ వారికి గట్టి స్థానిక నాయకులు దొరికితే అప్పుడు సమీకరణాలు మారుతాయి. కానీ, దాదాపు 90 శాతం స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవని అనిపిస్తోంది.’’

మరోవైపు శరత్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. ‘‘యువకులపై ఒవైసీ ప్రభావం చూపిస్తున్నారు. అయితే, ఆ ఒక్క వర్గంపై ఆశలు పెట్టుకుని యూపీ అసెంబ్లీలో చోటు సంపాదించడం కష్టం.’’

‘‘ముస్లింలను ఇప్పుడు ఎలా లక్ష్యంగా చేసుకుంటున్నారో అందరికీ తెలుసు. మోహన్ భగవత్ ఏమైనా మాట్లాడనీ.. కానీ ముస్లింల ఓట్లు మాత్రం గంపగుత్తంగా ఒకరికే పడతాయి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా బలమైన పార్టీని వారు ఎంచుకుంటారు. ప్రస్తుతం అది సమాజ్‌వాదీ పార్టీనే’’అని ఆయన అన్నారు.

‘‘అయితే, ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. సమీకరణాలు మారడానికి ఈ సమయం చాలు. ఇదే ఆశతో ఒవైసీ ఇక్కడ అడుగుపెడుతున్నారు’’అని ప్రదీప్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)