‘హైదరాబాద్‌ను యూటీగా మార్చే ప్రమాదం’: లోక్‌సభలో అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పినట్లు ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. జమ్మూకశ్మీర్ విభజన చట్టం సవరణ బిల్లుపై శనివారం లోక్‌సభలో జరిగిన చర్చలో అసదుద్దీన్ మాట్లాడారు.
‘‘చెన్నై, బెంగళూరు, ముంబయి, అహ్మదాబాద్, లఖ్‌నవూలనూ కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీలు)గా మార్చేస్తారు. ఇదే బీజేపీ విధానం. అందులో భాగంగానే కశ్మీర్‌ను ఒక ఉదాహరణగా మార్చారు’’ అని అన్నారు.
‘‘ఇప్పుడు దీన్ని చూసి కరతాళ ధ్వనులు చేసే సెక్యులర్‌గా చెప్పుకొనే కొన్ని పార్టీల వారు భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలను యూటీలుగా మార్చినప్పుడు గగ్గోలు పెట్టడం ఖాయం. ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు అప్పటి పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’’ అని ఒవైసీ హెచ్చరించారు.
‘‘జమ్మూకశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడం తప్పు. దీనివల్ల అక్కడి ప్రజల్లో మరింత అసంతృప్తి పెరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేటప్పుడు సాధ్యమైనంత త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తామన్న వాగ్దానం నుంచి కేంద్రం వెనక్కు తగ్గుతోంది’’ అని ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరితో రాజ్యసభలో ఒక్క కశ్మీరీ పార్లమెంటేరియన్ లేకుండా పోయారని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

ఏపీలో మార్చి 15కు అటూ ఇటుగా మునిసిపల్ ఎన్నికలు?
కరోనా కారణంగా వాయిదా పడిన పురపాలక ఎన్నికలు వచ్చే నెల 15వ తేదీకి కాస్త అటూఇటూగా జరగనున్నట్టు తెలిసిందని.. ఈ ఎన్నికల కొనసాగింపునకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం జారీ చేయవచ్చనేది సమాచారమని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. ఒకవేళ ఏ కారణాలవల్లనైనా ఆ రోజు నోటిఫికేషన్‌ను ఇవ్వడం కుదరని పక్షంలో ఈ నెల 17న వెలువడవచ్చునని తెలిసింది. నిబంధనల ప్రకారం ‘కొనసాగింపు నోటిఫికేషన్’ జారీ అయిన నాలుగు వారాల్లోపే ఎన్నికలు జరగాల్సి ఉంది. కాబట్టి వచ్చే నెల 15వ తేదీకి ఒకటి, రెండు రోజులు అటూఇటూగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని సమాచారం. నోటిఫికేషన్‌ను జారీ చేసిన నాటి నుంచే ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వస్తుంది.
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు గతేడాది మార్చి 23వ తేదీన ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అదే నెల 11వ తేదీన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అందులో.. తొలి రెండు రోజులు నామినేషన్ల స్వీకరణ, 14న వాటి పరిశీలన, 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు.
అదే రోజున పోటీలో మిగిలిన అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేసి.. 23వ తేదీ ఎన్నికలు నిర్వహించి, 27న ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని ఎస్‌ఈసీ తెలిపింది.
రాష్ట్రంలోని మొత్తం 16 నగర పాలక సంస్థల్లో 12 సంస్థలకు, 104 పురపాలక సంఘాలు- నగర పంచాయతీల్లో 75 సంఘాలకు ఎన్నికలు జరపాలని అప్పట్లో నిర్ణయించారు. కొత్త ప్రాంతాలు, గ్రామాల విలీనం, వార్డుల పునర్వ్యవస్థీకరణపై అభ్యంతరాలు, న్యాయస్థానాల్లో కేసుల దృష్ట్యా నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లకు, 29 మున్సిపాలిటీలు- నగర పంచాయతీలకు ఎన్నికలను అప్పట్లో జరపరాదని నిర్ణయించింది.
12 నగర పాలక సంస్థల్లోని 671 డివిజన్లు, 75 పురపాలక సంఘాలు- నగర పంచాయతీల్లోని 2,123 వార్డుల కోసం జరపదలచిన ఆ ఎన్నికలకు నామినేషన్ల సమర్పణ గడువు ముగిసేసరికి మొత్తం 18,649 దాఖలయ్యాయి. ఎన్నికల ప్రచారమూ ముమ్మరంగా సాగింది.
అయితే అదే సమయానికి దేశవ్యాప్తంగానూ, రాష్ట్రంలోనూ కరోనా తన ఉద్ధృతిని చూపుతోంది. ఇలాంటి తరుణంలో మున్సిపల్ ఎన్నికలు జరపడం సరికాదని ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా వేస్తూ గతేడాది మార్చి 15న ఉత్తర్వులిచ్చారు. అప్పటికే నామినేషన్ల స్క్రూటినీ ముగియగా, ఆ మరుసటి రోజున ఉపసంహరణలు జరిగి, అభ్యర్థుల తుది జాబితాను ఎస్‌ఈసీ ప్రకటించాల్సి ఉంది.
వచ్చేవారం మొదట్లో ఎస్‌ఈసీ ఈ ఎన్నికల కొనసాగింపు నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లయితే, ఆ ప్రక్రియ గతేడాది ఎక్కడైతే ఆగిందో మళ్లీ అక్కడే పునఃప్రారంభమవనుంది. అంటే.. అప్పటికే దాఖలైన నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణలు, తుది జాబితాల ప్రకటన - అనంతరం ఎన్నికలు జరుగుతాయన్న మాట!

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ చుట్టూ.. రూ. 13 వేల కోట్ల వ్యయంతో రీజినల్ రింగ్ రోడ్డు
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలపాలని కేంద్రం నిర్ణయించిందని.. త్వరలో లిఖిత పూర్వకంగా స్పష్టత ఇవ్వనుందని ‘సాక్షి’ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు 30 కిలోమీటర్ల ఆవల 338 కి.మీ. మేర ఆర్‌ఆర్‌ఆర్ రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. హైదరాబాద్‌కు 50–70 కి.మీ. దూరంలో ఉన్న దాదాపు 20కి పైగా చిన్న పట్టణాలను కలుపుతూ జాతీయ రహదారుల అనుసంధానంతో ఈ రింగు ఏర్పడనుంది.
జాతీయ రహదారుల ప్రాజెక్టుగా కేంద్రమే సొంత వ్యయంతో దీన్ని నిర్మించాల్సి ఉంది. అయితే దాదాపు రూ. 13 వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మించే ఈ రోడ్డు వల్ల ఆర్థిక ప్రయోజనం అంతగా ఉండనందున నాట్ వయోబుల్ ప్రాజెక్టుగా కేంద్రం దీన్ని ఇటీవలి వరకు అటకెక్కించింది.
రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేయడం, కేంద్రం సూచించిన మార్పులు చేపట్టేం దుకు సమ్మతించటంతో కేంద్రం దీనికి ఆమోదం తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు మరికొద్ది రోజుల్లో లిఖితపూర్వకంగా స్పష్టత ఇవ్వనుంది.
ఇటీవలే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్ని రాష్ట్రాల రోడ్లు, భవనాల శాఖ మంత్రులతో నిర్వహించిన సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చారు. త్వరలో సీఎంతో ఈ విషయంపై భేటీ అవుతానని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నిరసన హక్కుకు పరిమితులున్నాయి: సుప్రీంకోర్టు
నిరసన తెలిపే హక్కుకు పరిమితులున్నాయంటూ.. ఏదైనా ఘటన జరిగినప్పుడు అప్పటికప్పుడు కొన్ని ఆందోళనలు జరగడం సహజమే అయినప్పటికీ బహిరంగ ప్రదేశంలో రోజుల తరబడి నిరసనలు చేపట్టడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొందని ‘నవ తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండున్నర నెలలుగా ఉద్యమిస్తున్న ప్రస్తుత తరుణంలో సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిరసనలు తెలిపే హక్కు అపరిమితం కాదని స్పష్టం చేసింది.
దేశంలో నిరసనలు తెలిపే హక్కు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ..నిరసనలు చేస్తామంటే కుదరదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
2019లో చోటుచేసుకున్న షాహీన్‌బాగ్ నిరసనలపై దాఖలైన రివ్యూ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. షాహీన్‌బాగ్ నిరసనలు చట్ట వ్యతిరేకమంటూ సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు చెప్పింది. దానిపై పలువురు సామాజిక కార్యకర్తలు రివ్యూ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజరు కిషన్‌కౌల్, అనురుద్ధ బోస్, కృష్ణమురారితో కూడిన ధర్మాసనం కొట్టివేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏదైనా అంశంపై విభేదించినప్పుడు అప్పటికప్పుడు నిరసనలకు దిగడంలో తప్పులేదని, కానీ బహిరంగ స్థలాలను ఆక్రమించుకుని సుదీర్ఘంగా నిరసనలు చేపట్టడం మాత్రం సరికాదని తెలిపింది. ఇది ఇతరుల హక్కులకు కూడా భంగం కలిగించడమేనని వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి:
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- అమెజాన్ 'బంగారు నదుల' గుట్టు బయటపెట్టిన నాసా ఫొటోలు
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ది గ్రేట్ ఇండియన్ కిచెన్: ఇంట్లో మహిళల పట్ల చూపిస్తున్న వివక్షను కళ్లకు కట్టించిన చిత్రం
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- జీలాండియా: మునిగిపోయిన ఎనిమిదో ఖండం జాడ 375 ఏళ్లకు దొరికింది, దాని రహస్యాలెన్నో
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది..
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
- నేపాల్ వెళ్తే జేబు ఖాళీయే
- కేజీఎఫ్: కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ఇప్పుడు ఎందుకు వెలవెలబోతున్నాయి... ఏపీలో చిగురిస్తున్న ఆశలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









