బిహార్ ఎన్నికల ఫలితాలు: అసదుద్దీన్ ఒవైసీ కారణంగా ఆర్‌జేడీకి నష్టం.. బీజేపీకి లాభం జరిగిందా?

అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం, ముస్లింలు, ఓటర్లు, బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, AIMIM

    • రచయిత, దిల్ నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో 24 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా సీట్లలో ముస్లిం జనాభానే మెజార్టీ. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఇక్కడ ఐదు సీట్లను కైవసం చేసుకుంది.

అమోర్, కోచాధామ్, బాయసీ, బహాదుర్‌గంజ్, జోకీహాట్ సీట్లలో ఎంఐఎం విజయం సాధించింది.

సీమాంచ‌ల్‌లో ముస్లిం ఓటర్లు ఎంఐఎం కన్నా లౌకికవాద నినాదంతో ముందుకు వచ్చిన ఆర్జేడీ మహాకూటమి వైపు మొగ్గు చూపుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

కానీ, ఫలితాలు ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నట్లు సూచిస్తున్నాయి.

‘‘సీమాంచల్ జనాభా మార్పు కోసం ఓట్లు వేస్తున్నారు. తాము పనిచేసినా, చేయకపోయినా ముస్లింలు తమకే ఓట్లు వేస్తారని లౌకక పార్టీలు భావించాయి. కానీ, ఈ సారి ఓటర్లు కొత్త ముఖాలను ఎన్నుకుంటున్నారు’’ అని ‘ఖబర్ సీమాంచల్’ పత్రిక వ్యవస్థాపకుడు హసన్ జావెద్ అన్నారు.

అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం, ముస్లింలు, ఓటర్లు, బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

అనుభవజ్ఞులు ఓడుతున్నారు

అమోర్ సీటులో కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ జలీల్ మస్తాన్ 36 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ, ఆయనకు ఈసారి ఎన్నికల్లో 11 శాతం ఓట్లు పడ్డాయి. ఎంఐఎం అభ్యర్థి అఖ్తర్ ఉల్ ఇమాన్ 55 శాతం ఓట్లతో గెలుపొందారు.

బహాదుర్‌గంజ్ సీటులో కాంగ్రెస్ అభ్యర్థి తౌసీఫ్ ఆలమ్ గత 16 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు పది శాతం ఓట్లే పడ్డాయి. ఎంఐఎం అభ్యర్థి అంజార్ నయీమీ 47 శాతం ఓట్లతో విజయం సాధించారు.

సీమాంచల్ ప్రాంతంలోని 24 సీట్లలో ఎన్‌డీఏ 11 స్థానాల్లో, మహాకూటమి 7 స్థానాల్లో, ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించాయి. ఒక సీటులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

కిశన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఆరు ఎమ్మెల్యే సీట్లలో నాలుగు ఎంఐఎం ఖాతాలో పడ్డాయి. క్రితంసారి ఎన్నికల్లో ఈ సీట్లలో మహాకూటమి గెలిచింది.

అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం, ముస్లింలు, ఓటర్లు, బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, @LadeedaFarzana

‘ముస్లింలు ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్నారు’

‘‘ముస్లిం ఓటర్లు తమకుంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నారు. బీజేపీని ఓడించే ఓటు బ్యాంకుగా మాత్రమే తమని చూడటం వారికి నచ్చట్లేదు. తమ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వారు ఆశిస్తున్నారు’’ అని ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పుష్య మిత్ర అభిప్రాయపడ్డారు.

‘‘సీమాంచల్ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోయింది. వంతెనలు, కల్వర్టులు కూలిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కచ్చా వంతెనల మీద జనం ప్రయాణిస్తున్నారు. లౌకికవాదం పేరుతో గెలుస్తున్నవారు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టడం లేదు’’ అని అన్నారు.

కాంగ్రెస్, ఆర్జేడీ పాత అభ్యర్థులను మార్చుకోవాలన్న డిమాండ్లు ఈ ప్రాంతంలో వచ్చాయని, అయితే ఆ పార్టీలు అలా చేయలేదని హసన్ జావెద్ అన్నారు. ఫలితంగా ఎంఐఎంకు బలపడే అవకాశం వచ్చిందని అభిప్రాయపడ్డారు.

‘‘సీమాంచల్ రాజకీయాల్లో కొత్త తరానికి స్థానం దక్కడం లేదు. పాత వాళ్లే పాతుకుపోయి కూర్చున్నారు. కానీ, యువ ముస్లిం ఓటర్లు కొత్త నేతలను కోరుకున్నారు’’ అని పుష్య మిత్ర అన్నారు.

అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం, ముస్లింలు, ఓటర్లు, బిహార్ ఎన్నికలు

ఫొటో సోర్స్, BBC WORLD SERVICE

ఓట్లు చీలలేదు

ఎంఐఎం ఎన్నికల బరిలో నిలవడంతో ఆర్జేడీ, కాంగ్రెస్ సీట్లకు నష్టం జరిగింది. అలా, అని ఎంఐఎం ఓట్లు చీల్చిందని భావించలేం.

20 స్థానాల్లో ఈసారి ఎంఐఎం పోటీ చేసింది. ఆ పార్టీ ఐదు స్థానాలో గెలిచింది. అయితే, మిగతా సీట్లలో ఆ పార్టీకి ఎక్కువ ఓట్లేమీ రాలేదు.

నరపత్‌గంజ్ సీటును ఉదాహరణగా తీసుకుంటే, ఈ స్థానంలో ఆర్జేడీ కన్నా బీజేపీ 14 వేల ఓట్ల పైచిలుకు ఆధిక్యంతో గెలుపొందింది. ఈ సీటులో ఎంఐఎం అభ్యర్థికి వచ్చిన ఓట్లు దాదాపు నాలుగు వేలు మాత్రమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)