డోనల్డ్ ట్రంప్ వైట్ హౌజ్ విడిచి వెళ్లనని మొండికేస్తే ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
244 ఏళ్ల అమెరికా చరిత్రలో ఎన్నికల్లో ఓడిన తర్వాత వైట్ హౌజ్‌ను వదిలి వెళ్లేందుకు అధ్యక్షులు నిరాకరించిన సందర్భం ఎప్పుడూ లేదు.
అయితే, ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తాజా ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో తనకు ఎదురైన ఓటమిని అంగీకరించడం లేదు.
అందుకే, ఒకవేళ ట్రంప్ వైట్ హౌజ్‌ను వదిలివెళ్లేందుకు నిరాకరిస్తే ఏం జరుగుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల్లో బైడెన్ చేతుల్లో ట్రంప్ ఓడినట్లు ప్రకటనలు రాగానే ట్రంప్ ఎన్నికల ప్రచార బృందం ఓ ప్రకటన విడుదల చేసింది.
''జో బైడన్ తనను తాను విజేతగా తప్పుగా చూపించుకుంటున్నారు. కొన్ని మీడియా సంస్థలు ఆయనకు సాయం చేసేందుకు హద్దులు దాటి ప్రయత్నిస్తున్నాయి. నిజం బయటకు రాకూడదనివాళ్లు కోరుకుంటున్నారు'' అని ట్రంప్ ప్రచార బృందం వ్యాఖ్యానించింది.
ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓట్ల కౌంటింగ్, ఫలితాల వెల్లడి ప్రక్రియలపై ఆయన కోర్టుల్లో దావాలు ఇంకా వేస్తారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత అధ్యక్షడి పదవి కాలం జనవరి 20 మధ్యాహ్నంతో ముగిసిపోతుందని అమెరికా రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది.
ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో అవసరమైన మెజార్టీ జో బైడెన్ సాధించారు. రాబోయే నాలుగేళ్లు అధ్యక్షుడిగా ఉండేందుకు ఆయనకు హక్కు ఉంది.
అయితే, ఎన్నికల ఫలితాలను సవాలు చేసేందుకు న్యాయపరమైన, చట్టపరమైన అవకాశాలు కొన్ని ట్రంప్ ముందు ఉన్నాయి. కానీ, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆయన చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవు.

ఫొటో సోర్స్, Getty Images
సైన్యం పంపించేస్తుందా?
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నన్ని రోజులూ ట్రంప్ తాను ఓటమిని అంగీకరించబోనని చెబుతూ వస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగితే తప్ప తాను ఓడిపోనన్నది ఆయన ఉద్దేశం.
ఈ నేపథ్యంలో ఒకవేళ ట్రంప్ అధికారాన్ని బైడెన్‌కు అప్పగించేందుకు నిరాకరిస్తే, ఏం జరుగుతుందా అన్నది చాలా మంది ముందున్న సందేహం.
ఈ అంశం గురించి జో బైడెన్ ఇదివరకే ఓ టీవీ ఇంటర్యూలో మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత ‘ట్రంప్ వైట్ హౌజ్‌ను ఖాళీ చేసి వెళ్లేందుకు నిరాకరిస్తే పరిస్థితి ఏంటన్నది ఆలోచించారా?’ అని బైడెన్‌ను కమెడిన్ ట్రెవర్ నోవా ప్రశ్న అడిగారు.
అందుకు... ''అవును. ఆలోచించాను. అలాంటి పరిస్థితి వస్తే, సైన్యం ఆయన్ను వైట్ హౌజ్ నుంచి పంపించేస్తుందని భావిస్తున్నా'' అని బైడెన్ బదులు ఇచ్చారు.
అమెరికా సీక్రెట్ సర్వీస్ కూడా ఇలా ట్రంప్‌ను వైట్ హౌజ్ నుంచి బయటకు తీసుకువెళ్లవచ్చని భావిస్తున్నారు.
అధ్యక్షుడి భద్రత బాధ్యత సీక్రెట్ సర్వీస్‌దే. మాజీ అధ్యక్షులకు కూడా ఈ విభాగం భద్రత అందిస్తుంది.
ఇటు బైడెన్ విజయం ఖాయం అవ్వగానే సీక్రెట్ సర్వీస్ ఆయనకు భద్రతను పెంచింది. అధ్యక్షుడికి కల్పించే స్థాయిలోనే భద్రత కల్పిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
సైనిక బలగాల సాయంతో ట్రంప్ అక్రమంగా అధికారంలో కొనసాగే అవకాశాలున్నాయా?
బీబీసీ కొందరు నిపుణులను ఇదే ప్రశ్న అడిగింది.
''అధ్యక్ష అధికారాలను దుర్వినియోగం చేస్తూ, ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా పదవిలో కొనసాగడం చాలా కష్టం. కానీ, అది ఊహకు అందని పరిణామమైతే కాదు. ఇలా జరిగితే అమెరికాకు, అమెరికా పౌర-సైనిక సంబంధాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యానికి కూడా ఇది పెద్ద దెబ్బ'' అని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డకోటా రడెసిల్ అన్నారు.
ట్రంప్ సైనిక బలగాల మద్దతుతో పదవిలో కొనసాగే అవకాశాలున్నాయని తానైతే అనుకోవడం లేదని డకోటా అన్నారు.
''సైన్యం రాజ్యాంగానికి విధేయతతో ఉంటుంది. అధికారంలో ఉన్న నాయకుడికి కాదు. అమెరికా సైన్యంలో అత్యున్నత అధికారి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ మార్క్ మిల్లీ ఎన్నికల్లో సైన్యానికి ఎలాంటి పాత్రా ఉండదని పదే పదే చెప్పారు'' అని ఆయన వివరించారు.
పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కీషా బ్లేన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
''సైనిక బలగాలు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకుంటాయా అన్న సందేహం రావడమే అమెరికాలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయన్నదానికి అద్దం పడుతోంది. నాలుగేళ్ల క్రితం చాలా మంది అమెరికన్లకు ఇలాంటి ఆందోళనే లేదు. ట్రంప్ ఇటీవల పోర్ట్‌ల్యాండ్, వాషింగ్టన్‌ల్లో (అల్లర్ల సమయంలో) ఫెడరల్ ఏజెంట్లను మోహరించారు. ఇది ఆందోళన కలిగించే పరిస్థితే. ఇలా జరుగుతుందని అనడం లేదు. కానీ, ఈ ఏడాది జరిగినవి చూస్తుంటే, దేన్నీ కొట్టిపారేయలేం అనిపిస్తోంది'' అని ఆయన అన్నారు.
కొన్ని నెలల క్రితం జాత్యహంకారానికి వ్యతిరేకంగా అమెరికాలో ఆందోళనలు చెలరేగాయి. వీటిని కట్టడి చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపే యోచన కూడా ట్రంప్ చేశారు.
''దేశవ్యాప్తంగా ఆందోళనలను కట్టడి చేసేందుకు సైన్యాన్ని మోహరించేందుకు ఇన్సరెక్షన్ యాక్ట్-1807ను ప్రయోగించకుండా ట్రంప్‌ను అప్పుడు జనరల్ మిల్లీ ఒప్పించారు. ట్రంప్ ఒకవేళ ఉత్తర్వులు ఇచ్చినా ఆ సమయంలో సైనిక అధికారులు పాటించేందుకు సిద్ధంగా లేరు'' అని జూన్ 5న న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసింది.
చివరికి ఫెడరల్ ఫ్రభుత్వంతో పాటు రాష్ట్రాల నియంత్రణలోనూ ఉండే నేషనల్ గార్డ్ బలగాలను ఆందోళనలు అదుపుచేసేందుకు వినియోగించుకోవాలని ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
హోం ల్యాండ్ భత్రత శాఖ కింద పనిచేసే సైనికేతర బలగాలను వాషింగ్టన్, పోర్ట్‌ల్యాండ్ లాంటి రాష్ట్రాల్లో వినియోగించారు.
సైనికేతర బలగాలను ఇలా మోహరించేలా ఆదేశించే అధికారం ట్రంప్‌కు ఉంటుంది.
అలా అని, రాజకీయ ప్రయోజనం నెరవేర్చుకోవడంలో అధ్యక్షుడికి సహకరించేందుకు ఆ బలగాలు ముందుకువస్తాయని అనుకోలేం. బలగాలను వాడుకుని, ట్రంప్ అధికారంలో కొనసాగే అవకాశాలు దాదాపు ఉండవు.
హింస చెలరేగుతుందా?
''వివాదాస్పద ఎన్నికల్లో ట్రంప్ గెలిచినట్లుగా పరిగణించాలని సూచిస్తూ కార్యనిర్వాహక వ్యవస్థకు ట్రంప్ అధ్యక్ష హోదాలో ఉత్తర్వు ఇవ్వొచ్చు. న్యాయ శాఖలోని తన రాజకీయ మిత్రుల ద్వారా కూడా ఇలాంటి ఆదేశం ఇవ్వొచ్చు. కానీ, ఇదో తీవ్ర అనుచిత చర్య అవుతుంది. తన పదవీకాలం ముగిసిన (జనవరి 20) తర్వాత కూడా ట్రంప్ తనకే సెల్యూట్ చేయాలని అనడం సైన్యాన్ని ఇబ్బందికర పరిస్థితిలో పెట్టొచ్చు'' అని ప్రొఫెసర్ డకోటా రడెసిల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక అమెరికాలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు హింసకు కూడా దారి తీయొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి ఓటమిని అంగీకరించకుంటే, పౌర వ్యవస్థ గాడి తప్పే ప్రమాదం ఉందని ప్రొఫెసర్ కీషా బ్లెయిన్ అన్నారు. ట్రంప్ వాదన నిరసనలకు, హింసకు తావు తీసేలానే ఉందని అభిప్రాయపడ్డారు.
ట్రంప్ మద్దతుదారులు వీధుల్లో ఆయుధాలు పట్టుకుని తిరగడం కూడా ఇదివరకు కనిపించింది.

ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన రోజు ఏం చేశారు... ఎలా ఉన్నారు?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








