అమెరికా ఎన్నికల ఫలితాలు: ఆ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఆపేయాలంటూ ట్రంప్ కేసులు వేస్తున్నారు... ఎందుకు?

ఫొటో సోర్స్, Reuters / EPA
అమెరికా అధ్యక్ష పోటీలో విజేతల తుది ఫలితం ఇంకా వెల్లడి కానప్పటికీ పోటీలో ఉన్న ఇరువురు అభ్యర్థులు జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ మాత్రం గెలుపు తమదంటే తమదేనని స్వీయ ప్రకటన చేసేసుకున్నారు. ఇరు వర్గాలకు చెందిన మద్దతుదారులు ఈ ఎన్నికల ఫలితాలపై న్యాయపోరాటాలకు సిద్ధమవుతున్నారు.
విజేతను నిర్ణయించేందుకు కీలకంగా ఉండే విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ట్రంప్ మద్దతుదారులు సవాలు చేస్తున్నారు.
అయితే, మిషిగన్‌లో బైడెన్ గెలిచినట్లు బీబీసీ భావిస్తోంది. ఆయన విస్కాన్సిన్‌లో గెలిచినట్లు అమెరికా మీడియా చెబుతోంది. పెన్సిల్వేనియాలో ఇంకా ఎటువంటి ఫలితం వెలువడలేదు.
ఈ మూడు రస్ట్ బెల్ట్ రాష్ట్రాలలో గనక బైడెన్ విజయం సాధిస్తే ఆయన దేశాధ్యక్షుడిగా గెలిచినట్లే.
నెవాడా, అరిజోనాలో కూడా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
గత 120 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఈ సారి 66.9 శాతం పోలింగ్ నమోదయిందని యూఎస్ ఎలక్షన్ ప్రాజెక్ట్ నివేదిక చెబుతోంది.
ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం బైడెన్ కి 7.50 కోట్ల మంది ఓటర్ల మద్దతు లభించిందని.. ఇంత అధికంగా మెజారిటీ ఇప్పటి వరకూ ఎవరికీ రాలేదని ఈ నివేదిక తెలిపింది. డోనాల్డ్ ట్రంప్‌కి 6.72 కోట్ల మంది ఓట్లు వేశారు. ఇది 2016 కంటే 40 లక్షలు ఎక్కువ.

ట్రంప్, బైడన్ బృందాలు ఏమంటున్నాయి?
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి తామే విజేతలుగా నిలుస్తామని బైడెన్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
"నేను అమెరికా అధ్యక్షునిగా ఈ దేశాన్ని పరిపాలిస్తాను. ఈ పదవి వివక్షాపూరిత వ్యవస్థ కాదు" అని ఆయన అన్నారు.
అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న కమలా హారిస్ ఆయనతో కలిసి అధికార బదిలీ సక్రమంగా జరగడం కోసం ఒక వెబ్‌సైటును కూడా ప్రారంభించారు.
పదవి స్వీకరించిన మొదటి రోజు నుంచే వేగంగా పనులు మొదలు పెట్టడానికి వీలుగా తమని తాము సంసిద్ధం చేసుకుంటున్నట్లు వీరి బృందం ఆ వెబ్‌సైటులో పేర్కొంది.
పెన్సిల్వేనియాలో ‘‘చట్టబద్ధమైన బ్యాలట్ల’’ లెక్కింపు ప్రకారం ట్రంప్ విజేత అని ఆయన బృందం ప్రకటించుకుంటే.. బైడెన్ కూడా పెన్సిల్వేనియా విషయంలో తాము ఆశావహంగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు.
"ఈ వారాంతానికల్లా ట్రంప్ అధ్యక్షుడిగా, పెన్స్ ఉపాధ్యక్షుడిగా మరో నాలుగేళ్ల వరకు అమెరికాను పరిపాలించేందుకు ఎన్నికవుతారు" అని ట్రంప్ బృందం సీనియర్ సహాయకుడు జేసన్ మిల్లర్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPA
ట్రంప్ గెలిచే అవకాశం ఉందా?
ఈ వార్త రాసే సమయానికి బైడెన్ 243 ఎలక్టరల్ కాలేజి స్థానాలు గెలిచారు. ట్రంప్‌కి 214 స్థానాలు లభించాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించాలన్నా మొత్తం 270 ఎలక్టరల్ కాలేజి ఓట్లు పొందాలి.
అమెరికా ఎన్నికలలో జాతీయ స్థాయిలో కాకుండా రాష్ట్రాల స్థాయిలో పోటీలను ఓటర్లు నిర్ణయిస్తారు. ప్రతి రాష్ట్రానికి ఆయా రాష్ట్రాల జనాభాకి అనుగుణంగా ఎలక్టరల్ కాలేజి ఓట్లు లభిస్తాయి. మొత్తం 538 ఎలక్టరల్ కాలేజి ఓట్లు ఉన్నాయి.
ట్రంప్ 270 సీట్లు సంపాదించాలంటే.. విస్కాన్సిన్‌లో (10 ఓట్లు) ఓడిపోయినా కానీ.. జార్జియా (16 ఓట్లు), నార్త్ కరోలినా (15), పెన్సిల్వేనియా (20)లతో పాటు ఆరిజోనాను (11) కానీ, నెవడాను (6) కానీ గెలుచుకోవాల్సి ఉంటుంది.
జార్జియాలో అన్ని బ్యాలట్లనూ లెక్కించే వరకూ రాత్రంతా ఓట్ల లెక్కింపు కొనసాగిస్తామని అధికారులు చెప్పారు. ఇంకా సుమారు 50,000 ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఇక్కడ ట్రంప్ ఆధిక్యం నెమ్మదిగా తగ్గుతోందని.. ఇప్పుడు 24,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని న్యూయార్క్ టైమ్స్ చెప్తోంది.
ఆరిజోనాలో బైడెన్ ప్రస్తుతం 68,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తదుపరి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక్కడ డెమొక్రట్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని సీబీఎస్ అంచనా వేసింది.
ఫిలడెల్ఫియాలో ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మరి కొన్ని రోజులు పట్టవచ్చు. నెవాడాలో కూడా బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యాయ సవాళ్ల సంగతేమిటి?
ఓట్ల లెక్కింపును ఆపాలంటూ ట్రంప్ మద్దతుదారులు ఇప్పటికే అనేక కేసులు వేశారు. కానీ, ట్రంప్ ఇంకా కాస్త వెనుకబడివున్న ఆరిజోనా, నెవాడా వంటి రాష్ట్రాల్లో మాత్రం.. ఓట్ల లెక్కింపును కొనసాగించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.
మిషిగన్‌లో ఓట్ల లెక్కింపును ఆపాలని ట్రంప్ మద్దతుదారులు కేసు వేశారు. బ్యాలెట్లను తెరవటం, ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించడానికి తమకు ‘అర్థవంతమైన అనుమతి’ని నిరాకరించారని ఆ కేసులో పేర్కొన్నారు.
మిషిగన్‌లోని డెట్రాయిట్‌లో ఒక ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర.. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించటానికి తమను లోపలికి పంపించాలంటూ కొందరు ఆందోళనకు దిగటంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ కథనం ప్రకారం.. అక్కడ అప్పటికే 200 మంది ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
పెన్సిల్వేనియాలో కూడా పారదర్శకతతో ఓట్ల లెక్కింపు జరిగేవరకూ ఓట్ల లెక్కింపు ఆపాలంటూ ట్రంప్ మద్దతుదారులు రెండు కేసులు వేశారు. ఈ రాష్ట్రంలో మూడు పాయింట్లలో ట్రంప్ ఆధిక్యతలో ఉన్నారు. అయితే ఇంకా కొన్ని వేల ఓట్లను లెక్కించాల్సి ఉంది.
జార్జియాలో కూడా ఓట్ల లెక్కింపును ఆపాలంటూ ట్రంప్ కేసుల ప్రక్రియను ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో ఒక కౌంటీలో ఓట్లకు.. ఆలస్యంగా చేరిన 53 పోస్టల్ బ్యాలెట్లను చట్టవిరుద్ధంగా కలిపేసినట్లు రిపబ్లికన్ పరిశీలకులు గమనించారని ఆయన మద్దతుదారులు ఆరోపించారు.
విస్కాన్సిన్‌లో కూడా ‘‘పలు కౌంటీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయ’’ని ఆరోపిస్తూ రాష్ట్రంలో ఓట్లను రీకౌంట్ చేయాలని ట్రంప్ లాంఛనంగా కోరుతారని ఆయన బృందం చెప్పింది.
విస్కాన్సిన్‌లో ఇప్పటి వరకు అయితే బైడెన్ 20,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రత్యర్థుల మధ్య ఓట్ల తేడా ఒకటి కంటే తక్కువ శాతం మాత్రమే ఉంటే.. ఓట్లను మళ్లీ లెక్కించాలని అడగవచ్చు. సాధారణంగా ఓట్లను తిరిగి లెక్కించినప్పుడు ఈ లెక్కల్లో వందల సంఖ్యలో మాత్రమే తేడాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
2016లో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలో పోల్ అయిన ఓట్లే ట్రంప్‌ని శ్వేత సౌథం వరకు తీసుకుని వెళ్లాయి.
ఇంకా అనేక ఓట్లను లెక్కించాల్సి ఉండగా, ట్రంప్ మాత్రం బుధవారం తానే విజేతనని ప్రకటించేసుకున్నారు. ఇలా ప్రకటన చేయడాన్ని పలువురు డెమొక్రట్లు, రిపబ్లికన్లు కూడా తీవ్రంగా విమర్శించారు.
ఈ ఎన్నికల ప్రక్రియను సుప్రీంకోర్టుకు తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పారు. చట్టబద్ధమైన సవాళ్ళను ఎదుర్కోవడానికి నిధులు సమకూర్చమని అతని మద్దతుదారులు రిపబ్లికన్ దాతలను అభ్యర్థిస్తున్నారు. ఇలాంటి సవాళ్లు రాష్ట్రాల స్థాయిలో ఉత్పన్నమయి అమెరికాలో అత్యున్నత న్యాయ స్థానానికి చేరుతాయి.
"ఈ పోటీ ఇంకా ముగియలేదు. మేమింకా పోరాడతాం" అని రిపబ్లికన్ నేషనల్ కమిటీ చెయిర్ వుమన్ రోనా మెక్ డానియెల్ చెప్పారు.
ఈ న్యాయపరమైన కేసులను కొన్ని వారాల పాటు ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ ఐదు డాలర్లు చొప్పున (సుమారు 370 రూపాయిలు) విరాళంగా ఇవ్వాలని కోరుతూ డెమొక్రటిక్ పార్టీ అపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ట్వీట్ చేసారు.
చట్టపరమైన బ్యాలట్లను చెల్లవని చెప్పడానికి ట్రంప్ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని బైడెన్ మద్దతుదారులకు న్యాయ సలహాదారునిగా ఉన్న బాబ్ బోయెర్ చెప్పారు.
ట్రంప్ టెక్సస్, ఒహాయో, ఐయోవా స్థానాలను కైవసం చేసుకున్నారు. అలాగే ఫ్లోరిడాలో కూడా సులభంగా విజయం సాధించారు.

ఫొటో సోర్స్, Reuters
కాంగ్రెస్ ఎన్నికల సంగతి ఏమిటి?
ఇక కాంగ్రెస్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఈసారి సులభంగా గెలుస్తామని డెమొక్రాట్లు భావించారు. కానీ, వారి ఆశలు నీరు కారాయి.
సెనేట్ మీద అధికారం చేజిక్కించుకోవడానికి అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తున్నాయి. కొలరాడో, అరిజోనాలో డెమొక్రాట్లు రెండు సీట్లు గెలుచుకున్నారు. కానీ అలబామాలో ఓటమి పాలయ్యారు.
నార్త్ కరోలినాలో సెనేట్‌కి జరుగుతున్న పోటీలో ఇంకా తుది ఫలితాలు వెలువడలేదు.
సెనేట్‌లో 53 స్థానాలకు గాను 47 స్థానాలలో రిపబ్లికన్లు ఉన్నారు.
ప్రతినిధుల సభకు జరుగుతున్న పోటీలో డెమొక్రాట్లకు మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ప్రతినిధుల సభలో వారు 15 స్థానాలను గెలుస్తారనే పార్టీ భావించింది.
కానీ, ఇప్పటికే ఏడుగురు డెమొక్రటిక్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ఒక మహిళ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేది ఎప్పుడు?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- 'కరోనావైరస్ తొలి వ్యాక్సీన్ మేం తయారు చేశాం... నా బిడ్డకు కూడా టీకా ఇచ్చాం' - రష్యా అధ్యక్షుడు పుతిన్
- ‘‘దేశ ప్రజలకు ప్రత్యక్ష నగదు సహాయం చేయాలి’’: మన్మోహన్ మూడు సలహాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- ’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








