జో బైడెన్: ఎనిమిది కీలక అంశాలపై ఈయన వైఖరి ఎలా ఉండబోతోంది

జో బైడెన్ JOE BIDEN

అమెరికా 2020 అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నానని అధికారికంగా ప్రకటించినపుడు, రెండు అంశాల్లో, అంటే దేశాన్ని నిర్మించే కార్మికులకు అడగా ఉంటానని, దేశంలో ప్రజల మధ్య విభజనలను తగ్గించే విలువలకు కట్టుబడి ఉంటానని జో బైడెన్ చెప్పారు.

కరోనా మహమ్మారి, జాతి అసమానతల నుంచి అమెరికా సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో కార్మికులకు కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తానని, పర్యావరణ భద్రత, ఆరోగ్యం పొందే హక్కు, అంతర్జాతీయ సంబంధాలను పునరుద్ధరిస్తానని ఆయన మాట ఇచ్చారు.

ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ కీలకంగా భావిస్తున్న ఆ 8 అంశాలు ఇవే.

కరోనావైరస్

నేషనల్ టెస్ట్ అండ్ ట్రేస్ ప్రోగ్రాం

ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న అత్యంత కఠినమైన సమస్య కరోనా మహమ్మారి. దీనిని అధిగమించేందుకు బైడెన్ చేపట్టబోతున్న తక్షణ చర్య దేశంలో అందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు చేయించడం.

'నేషనల్ కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రోగ్రాం' ఏర్పాటు కోసం ఆయన లక్ష మందిని కూడా నియమించాలని అనుకుంటున్నారు.

కరోనా పరీక్షలు చేసేందుకు ప్రతి రాష్ట్రంలో కనీసం 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు బైడెన్ చెప్పారు. గవర్నర్లు అందరూ ఆయా రాష్ట్రాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలని చెబుతున్నారు.

ఉద్యోగాలు

కనీస వేతనాలు, గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు

కరోనావైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తక్షణ చర్యల్లో భాగంగా చిన్న వ్యాపారాలకు రుణాలు ఇచ్చేందుకు, కుటుంబాలకు నేరుగా అందించే నగదు సాయాన్ని పెంచడానికి అవసరమైన చర్యలు చేపడతానని బైడెన్ భరోసా ఇచ్చారు.

వీటిలో సామాజిక భద్రత చెల్లింపులుగా నెలకు అదనంగా 200 డాలర్లు చెల్లించాలనే ప్రతిపాదన, ట్రంప్ పాలనలోని పన్నుల్లో కోతలు, ఫెడరల్ రుణాల్లో 10 వేల డాలర్ల విద్యార్థుల రుణమాఫీ ఉన్నాయి.

డెమోక్రాట్లకు మద్దతుగా ఉన్న రెండు రాష్ట్రాల్లో యువత, కార్మికులను సంతోష పెట్టే లక్ష్యంతో బైడెన్ తీసుకొచ్చిన విస్తృత ఆర్థిక విధానాలను 'బిల్డ్ బ్యాక్ బెటర్ ప్లాన్' అని పిలుస్తున్నారు.

ఫెడరల్ ప్రభుత్వం కనీస వేతనాలను గంటకు 15 డాలర్లుగా చేయాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. 2020లో ఇది పార్టీకి ప్రచారాంశంగా కూడా మారింది.

ఆయన 'గ్రీన్ ఎనర్జీ' కోసం 2 ట్రిలియన్ డాలర్లు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడం వల్ల, ఆ రంగంలోని కార్మికులకు సహకారం లభిస్తుందని చెబుతున్నారు.

కొత్త రవాణా ప్రాజెక్టుల కోసం 'బై అమెరికన్' చట్టాలను అమలు చేయడానికి కట్టుబడి ఉండడంతోపాటూ అమెరికా వస్తువులను కొనడానికి 400 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను ఖర్చు చేస్తామని బైడెన్ వాగ్దానం చేశారు.

ఉత్పత్తి, సేవలు, పరిశోధనలు, సాంకేతిక రంగాల్లో ప్రభుత్వం 330 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని బైడెన్ ప్రణాళికలో ఉన్నాయి.

అమెరికా

న్యాయ సంస్కరణలు, మైనారిటీలకు గ్రాంట్లు

ఈ ఏడాది జాతి వివక్ష వ్యతిరేక ఆందోళనలతో అమెరికా అట్టుడికింది. దేశంలో జాత్యహంకారం ఉందని చెప్పిన ఆయన, మైనారిటీలకు అండగా నిలిచేందుకు విస్తృతంగా చేపట్టే ఆర్థిక, సామాజిక కార్యక్రమాల ద్వారా దానిని కచ్చితంగా ఎదుర్కోవచ్చని అంటున్నారు.

30 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో మైనారిటీలకు వ్యాపారపరంగా సహకారం అందించడం ఆయన 'బిల్డ్ బ్యాక్' కార్యక్రమంలో ఒక కీలక అంశంగా ఉంది.

ఇక వివిధ నేరాల్లో న్యాయం విషయానికి వస్తే 1990లో 'నేరాల విషయంలో కఠినంగా ఉంటారని' తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు ఆ ఇమేజిని వదిలించుకుంటున్నారు.

బైడెన్ ఇప్పుడు ప్రతిపాదిస్తున్న విధానాల్లో జైలు శిక్షలను తగ్గించడం, న్యాయ వ్యవస్థలో జాతి, లింగ, ఆర్థిక అసమానతలను రూపుమాపడం లాంటివి ఉన్నాయి.

విడుదలైన ఖైదీలకు పునరావాసం కల్పించాలని కూడా ఆయన భావిస్తున్నారు.

జైలు శిక్షలు తగ్గించడం, కనీస శిక్షలను తొలగించడం, గతంలో నమోదైన గంజాయి కేసులను కొట్టివేయడం, మరణ శిక్షకు అంతం పలికేలా రాష్ట్రాలను ప్రోత్సహించాలని బైడెన్ అంటున్నారు.

వాతావరణ మార్పులు

ప్రపంచ పర్యావరణ ఒప్పదంలో తిరిగి చేరడం

వాతావరణ మార్పులను ముంచుకొస్తున్న ముప్పుగా చూడాలని బైడెన్ చెబుతున్నారు.

పారిస్ ఒప్పందంలో తిరిగి చేరడం ద్వారా ఉద్గారాలను అరికట్టడంలో మరింత వేగంగా పనిచేసేలా, మిగతా ప్రపంచాన్ని కూడగడతానని అన్నారు.

ఈ ఒప్పందంలో భాగంగా 2005 స్థాయిల ఆధారంగా 2025 నాటికి 28 శాతం గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడానికి అమెరికా కట్టుబడి ఉంది. కానీ, డోనల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఈ ఒప్పందం నుంచి వైదొలిగింది.

కొత్త హరిత ఒప్పందం గురించి చెప్పని బైడెన్, తన పార్టీలోని లెఫ్ట్ వింగ్ ముందుకు తెచ్చిన వాతావరణం, ఉద్యోగాల ప్యాకేజీ కోసం గ్రీన్ టెక్నాలజీస్ రీసెర్చిలో 1.7 ట్రిలియన్ డాలర్ల ఫెడరల్ పెట్టుబడులు పెడుతున్నారు. వాటిలో కొన్ని ఆయన మరో పదేళ్లలో ఖర్చు చేయబోయే ఆర్థిక ప్రణాళిక నిధులలో కూడా కలుస్తాయి.

2050 నాటికి అమెరికా జీరో ఉద్గారాలకు చేరుకోవాలని ఆయన భావిస్తున్నారు. గత ఏడాది 60కి పైగా దేశాలు దీనికి వాగ్దానం చేశాయి.

కర్బన ఉద్గారాలు అత్యధికంగా విడుదలయ్యే మరో రెండు దేశాలైన చైనా, భారత్ దీనిలో ఇంకా భాగం కావాల్సి ఉంది.

బైడెన్ ఆర్థిక ప్రణాళికలోని ఈ పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను తయారు చేయడంలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయి.

విదేశాంగ విధానం

అమెరికా ప్రతిష్ఠను పునరుద్ధరించడం, చైనాతో ఒప్పదం

అధ్యక్షుడిగా తాను మొట్టమొదట జాతీయ సమస్యలపై దృష్టి పెడతానని బైడెన్ చెప్పారు.

మిత్ర దేశాలతో, ముఖ్యంగా నాటో కూటమితో అమెరికా సంబంధాలను సరి చేస్తానని కూడా ఆయన మాట ఇచ్చారు. అమెరికా ఇచ్చే నిధుల్లో కోతపెట్టి అణచివేస్తానని నాటో కూటమిని ట్రంప్ పదే పదే బెదిరించారు.

దారుణమైన పర్యావరణం, వాణిజ్య పద్ధతులకు చైనా జవాబుదారీగా ఉండాలని కూడా బైడెన్ చెప్పారు.

అయితే, ఏకపక్షంగా విధించే సుంకాలకు బదులు, చైనా నిర్లక్ష్యం చేయలేని విధంగా ఇతర ప్రజాస్వామ్య దేశాలతో ఒక అంతర్జాతీయ కూటమిని ఆయన ప్రతిపాదించారు. అయితే, దీనిపై ఆయన అస్పష్టతతో ఉన్నారు.

ఆరోగ్యం

ఒబామా కేర్‌ను విస్తరించడం

మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనలో ఉపాధ్యక్షుడుగా ఉన్నప్పుడు తను ఆమోదించిన 'పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్' పథకాన్ని కూడా విస్తరిస్తానని, ఈ పథకం ద్వారా 97 శాతం మంది అమెరికన్లకు బీమా వర్తించేలా చేస్తానని బైడెన్ చెప్పారు.

తమ పార్టీలోని లెఫ్ట్ వింగ్ సభ్యుల 'యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్; ప్రతిపాదనను ఆయన ఆపివేసినా, 'పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్' అమెరికన్లు అందరికీ చేరే ఆప్షన్ ఇస్తానని బైడెన్ మాటిచ్చారు.

ఈ బీమా వృద్ధులు వైద్య ప్రయోజనాలు పొందే అర్హత వయసును 65 నుంచి 60కి తగ్గిస్తుంది.

ఫెడరల్ బడ్జెట్ లెక్కలు వేసే కమిటీ, బైడెన్ ఈ పథకం కోసం పదేళ్లలో 2.25 ట్రిలియన్ డాలర్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది.

ఇమిగ్రేషన్

ట్రంప్ విధానాల రద్దు

అధ్యక్షుడిగా పదవి చేపట్టిన మొదటి వంద రోజుల్లోనే ట్రంప్ విధానాలను తిప్పికొడతానని బైడెన్ వాగ్దానం చేశారు.

వాటిలో అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో తల్లిదండ్రులను వారి పిల్లల నుంచి వేరు చేయడం, ఆశ్రయం కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య పరిమితులను ఉపసంహరించడం, ఎన్నో మెజారిటీ ముస్లిం దేశాలకు ప్రయాణాలు చేయడంపై ఉన్న నిషేధానికి తెరదించడం లాంటివి ఉన్నాయి.

పిల్లలుగా ఉన్నప్పుడు అక్రమంగా అమెరికాలోకి చేరుకుని, ఒబామా పాలనా విధానాల ప్రకారం దేశంలో ఉండడానికి అనుమతి పొందిన 'డ్రీమర్స్'ను కాపాడుతానని కూడా బైడెన్ వాగ్దానం చేశారు. ఫెడరల్ విద్యార్థి ఆర్థికసాయం అందుకోడానికి కూడా వారు అర్హులేనన్నారు.

విద్యా విధానం

యూనివర్సల్ ప్రీ-స్కూల్, ఫ్రీ కాలేజ్ విస్తరణ

మిగతా చెప్పుకోదగిన మార్పుల్లో, పార్టీలో ఆదరణ పొందిన విద్యార్థి రుణాల మాపీ, ట్యూషన్ లేని ఉచిత కాలేజీల విస్తరణ, యూనివర్సల్ ప్రీ-స్కూల్ యాక్సెస్ లాంటి ఎన్నో బారీ విద్యా విధానాలకు బైడెన్ మద్దతు పలికారు.

ట్రంప్ పాలనలో పన్ను కోతలను రద్దు చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని వీటికి ఖర్చు చేస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)