బిహార్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్‌కు 70 సీట్లు ఇచ్చి తేజస్వి యాదవ్ పెద్ద తప్పు చేశారా?

ఫొటో సోర్స్, TWITTER @YADAVTEJASHWI
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో భాగమై 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 20 స్థానాల కంటే ఎక్కువ గెలుచుకునేలా కనిపించడం లేదు. అంటే దాని స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది.
బిహార్ రాజకీయాల్లో గొత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రదర్శనను బట్టి చూస్తే, ఇది అంత ఆందోళనకరమైన విషయమేం కాదు.
2015 ఎన్నికల్లో ఆర్జేడీ, జనతాదళ్ యునైటెడ్(జేడీయూ)తో మహా కూటమిలో 41 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 27 స్థానాలు గెలుచుకుంది.
కాంగ్రెస్ ఈసారి గత ఎన్నికల స్థాయిలో కూడా ప్రభావం చూపలేదు.
2010లో కూడా మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌కు కేవలం నాలుగు స్థానాలే దక్కాయి.
ఇక 2005 విషయానికి వస్తే, బిహార్‌లో రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి ఫిబ్రవరిలో, ఇంకోసారి అసెంబ్లీ రద్దైన తర్వాత అక్టోబర్‌లో.
ఫిబ్రవరిలో 84 స్థానాల్లో పోటీ చేసిన పది సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ అక్టోబర్‌లో 51 సీట్లలో పోటీ చేసి 9 స్థానాల్లో విజయ సాధించగలిగింది.
2000లో ఉమ్మడి బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినపుడు కూడా కాంగ్రెస్ మొత్తం 324 స్థానాల్లో పోటీ చేసి 23 స్థానాలే గెలుచుకోగలిగింది. 1995లో 320 స్థానాలకు 29 సీట్లు, 1990లో 323లో 71 స్థానాల్లో విజయం సాధించింది.
1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసిన 323 స్థానాల్లో 196 సీట్ల గెలిచిన కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం అదే చివరిసారి.
ఇది జరిగి 35 ఏళ్లు గడిచిపోయాయి. కానీ, ఆ పార్టీ పూర్వ వైభవం తిరిగి వచ్చేలా కనిపించడం లేదు. అప్పటి నుంచి, ఇప్పటివరకూ బిహార్‌లో ఆ పార్టీ తన ఉనికిని వెతుక్కుంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
తేజస్వి తప్పనిసరి పరిస్థితుల్లో 70 సీట్లు ఇచ్చారా?
ఈ ప్రశ్నకు సమాధానంగా ఎన్నికల ముందు సరైన సన్నాహాలు లేకపోవడమే కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు కారణమని సీనియర్ జర్నలిస్ట్ మణికాంత్ ఠాకూర్ అన్నారు.
"కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి సన్నాహాలూ చేయలేదనేది అందరికీ కనిపిస్తోంది. పార్టీ అసలు ఎన్నికలకు సన్నద్ధంగా లేదు. ఆ పార్టీ దగ్గర గట్టి పోటీ ఇవ్వగలిగిన అభ్యర్థులు కూడా లేరు.
మహా కూటమిలో 70 స్థానాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయింది" అన్నారు మణికాంత్.
"కాంగ్రెస్‌కు 20-21 సీట్లు వస్తాయనిపిస్తోంది. అవి కూడా వామపక్షాలు, ఆర్జేడీ ఓట్లు పడ్డాయి కాబట్టే. కాంగ్రెస్‌కు కూటమి వల్ల ప్రయోజనం లభించింది. కానీ, కాంగ్రెస్‌ను కలుపుకోవడం వల్ల మహా కూటమికి ఏదైనా లాభం కలిగిందని పక్కాగా చెప్పలేం" అన్నారాయన.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన తర్వాత ఆ పార్టీకి మహాకూటమిలో 70 సీట్లు ఇచ్చి తేజస్వి తప్పు చేశారా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
దీనిపై "కాంగ్రెస్ పట్ల తేజస్వి ఉదారంగా ఉన్నారు. కానీ, దాని ఫలితం సరిగా లేదు. కాంగ్రెస్‌కు 70 సీట్లు ఇచ్చి తప్పు చేశామని ఇప్పుడు తేజస్వికి కూడా అనిపిస్తుంటుంద"ని సీనియర్ జర్నలిస్ట్ సురేంద్ర కిశోర్ అభిప్రాయపడ్డారు.
అటు, మణికాంత్ ఠాకూర్ మాత్రం తేజస్వీ యాదవ్ తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌కు 70 స్థానాలు ఇచ్చారంటున్నారు.
"మహాకూటమిలో తమకు 70 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం తేజస్వి యాదవ్‌పై ఒత్తిడి తెచ్చింది. ఇవ్వకపోతే, కూటమి నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. కాంగ్రెస్ కూటమి నుంచి వేరుగా వెళ్తే, తేజస్వి పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. ఆయన దగ్గర పెద్దగా ఆప్షన్స్ లేవు" అన్నారు మణికాంత్.

ఫొటో సోర్స్, Getty Images
బిహార్ ఫలితాల్లో కేంద్ర నాయకత్వం పాత్ర
బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు కేంద్ర నాయకత్వం బలహీనంగా ఉండడం కూడా ఒక కారణమని సురేంద్ర కిశోర్ చెబుతున్నారు.
కాంగ్రెస్ 2014 తర్వాత కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది. పార్టీపై కేంద్ర నాయకత్వం పట్టు బలహీనపడుతోంది.
"మండల కమిషన్, భాగల్పూర్ అల్లర్లు, మందిర ఉద్యమాల ప్రతికూల ప్రభావం కాంగ్రెస్‌పై పడింది. ఆ పార్టీ మండల్ కమిషన్‌ను సమర్థించలేదు. దాంతో బిహార్‌లో కాంగ్రెస్ బలహీనం అయ్యింది. లాలూ బలం పుంజుకున్నారు. అటు రామ మందిర ఉద్యమ సమయంలో కాంగ్రెస్ స్పష్టంగా ఏ పక్షానా నిలబడలేదు. దాంతో అది ఫలితం అనుభవించాల్సి వచ్చింద"ని కిశోర్ చెప్పారు.
భాగల్పూర్ జిల్లాలో 1989 మత ఘర్షణలు 1990 రామమందిర ఉద్యమం బిహార్ రాజకీయాల్లో సైతం హిందుత్వ ఎజెండాను ప్రభావవంతంగా మార్చాయి. ఆ ప్రభావం ఎన్నికలపై ఉంటూ వచ్చింది.
కాంగ్రెస్ తనను ఒక లౌకిక పార్టీగా చెప్పుకుంటుంది. కానీ, ఓటర్లకు లౌకిక పార్టీలకు ప్రత్యామ్నాయం కనిపించిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడుతూ వస్తోంది.
"బిహార్‌లో లాలూ యాదవ్ ముస్లిం ఓటర్లకు ఒక ప్రత్యామ్నాయంగా నిలిచారు. దాంతో కాంగ్రెస్ అక్కడ చిక్కిపోతూ వచ్చింది" అంటారు సురేంద్ర కిశోర్.
ఇవి కూడా చదవండి:
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులేమిటి? ఏయే చార్జ్షీట్లలో ఏముంది?
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
- దక్షిణాది ప్రజల ఇష్టమైన టిఫిన్ దోశకు పుట్టినిల్లు ఏది కర్ణాటకా.. తమిళనాడా
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- "మేం దళితులం కాబట్టి.. మా శవాలకు కూడా దిక్కులేదు.. ఇతరులెవరికీ ఇలాంటి పరిస్థితి ఉండదేమో"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








