రఘునందన్ రావు: దుబ్బాకలో గెలిచిన రఘునందన్ రావు ఎవరు.. ఒకప్పుడు టీఆర్ఎస్ ఆయన్ను ఎందుకు బహిష్కరించింది

రఘునందనరావు

ఫొటో సోర్స్, facebook

మాధవనేని రఘునందనరావు... తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి.

మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన రఘునందనరావు వృత్తిరీత్యా న్యాయవాది, పాత్రికేయుడు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన మొట్టమొదటిసారి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.

రఘునందనరావు

ఫొటో సోర్స్, facebook

విలేకరిగా.. అసదుద్దీన్ ఒవైసీకి లాయర్‌గా..

1990 ప్రాంతంలో స్వస్థలం సిద్ధిపేట నుంచి హైదరాబాద్ శివారు పారిశ్రామిక ప్రాంతం పటాన్‌చెరుకు వచ్చిన రఘునందనరావు అక్కడ ఒక తెలుగు దినపత్రికలో అయిదేళ్ల పాటు విలేకరిగా పనిచేశారు.

ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగానూ పనిచేశారు.

ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఆయన న్యాయవాదిగా పనిచేశారు.

రఘునందనరావు

ఫొటో సోర్స్, facebook

టీఆరెఎస్‌తో ప్రయాణం.. బహిష్కరణ

2001లో రఘునందనరావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన ఆయన టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో మెంబర్‌గానూ పనిచేశారు.

మంచి వాగ్ధాటి, వాదనా పటిమ గల నాయకుడిగా పేరున్న రఘునందనరావు అప్పట్లో టీఆర్ఎస్‌కు బలమైన గొంతుగా నిలిచేవారు.

అయితే, 2013లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని కలిశారన్న ఆరోపణలతో పార్టీ ఆయన్ను బహిష్కరించింది. రఘునందనరావు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు.

టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురయిన తరువాత ఆయన బీజేపీలో చేరారు.

రఘునందనరావు(ఎడమ)

ఫొటో సోర్స్, facebook/raghunandanarao

ఫొటో క్యాప్షన్, రఘునందనరావు(ఎడమ)

2014 నుంచి దుబ్బాకలో పోటీ

బీజేపీలో చేరిన తరువాత 2014లో దుబ్బాక నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో రఘునందనరావుకు 15,131 ఓట్లు రాగా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.

ఆ తరువాత 2018లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఈసారి 22,595 ఓట్లు పొందారు.

2014, 18 రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డే ఇక్కడ విజయం సాధించారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు

న్యాయవాదిగా పనిచేసిన రఘునందనరావు క్లయింటు అయిన ఒక మహిళ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాఫీలో మత్తు కలిపి తనపై రఘునందనరావు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

ఈ ఆరోపణలు అవాస్తవమని రఘునందరావు ఖండించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)