ముంబయి ఇండియన్స్: అయిదో సారి ఐపీఎల్ విజేత.. దిల్లీ కేపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Mumbai indians

ముంబయి ఇండియన్స్ ఐదో సారి ఐపీఎల్ చాంపియన్ ట్రోఫీని చేజిక్కించుకుంది.

దుబయిలో జరిగిన ఫైనల్ పోరులో ముంబయి జట్టు దిల్లీ కేపిటల్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది.

ఇంకా 8 బంతులు మిగిలుండగానే ముంబయి జట్టు విజయం అందుకుంది.

68 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును విజయానికి చేరువ చేశాడు.

ఓపెనర్ క్వింటన్ డికాక్ 20 పరుగులు చేసి స్టోయినిస్ బౌలింగ్‌లో మొదటి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(19) సింగిల్‌కు ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ శర్మ కోసం రనౌట్ అయ్యాడు.

తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత శర్మ జట్టు స్కోరును వంద దాటించాడు.

కానీ 17వ ఓవర్లో జట్టు స్కోర్ 137 పరుగుల దగ్గర కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు.

51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసిన రోహిత్ అనిచ్ నాట్జే బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి లలిత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు.

తర్వాత వచ్చిన పొలార్డ్(9), హార్దిక్ పాండ్య(3) పరుగులు చేసి అవుట్ అయ్యారు.

కృనాల్ పాండ్య(1), ఇషాన్ కిషన్(33) నాటౌట్‌గా నిలిచారు.

ఇషాన్ కిషన్ 19 బంతుల్లో 1 సిక్స్, 3 ఫోర్లతో 33 పరుగులు చేశాడు.

దిల్లీ బౌలర్లలో అన్రిచ్ నార్ట్జేకు 2, రబాడా, స్టోయినిస్‌కు చెరో వికెట్ లభించాయి.

రోహిత్, శ్రేయాస్

ఫొటో సోర్స్, facebook/ipl2020

157 పరుగుల లక్ష్యం ఇచ్చిన దిల్లీ

అంతకుముందు టాస్ గెలిచిన దిల్లీ కేపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.

ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ స్టోయినిస్‌ను అవుట్ చేసిన బౌల్ట్ దిల్లీకి షాక్ ఇచ్చాడు.

తర్వాత రహానే(2) శిఖర్ ధవన్(15) కూడా అవుట్ అవడంతో 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దిల్లీ మరింత కష్టాల్లో పడింది.

ఆ సమయంలో రిషబ్ పంత్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి జట్టు స్కోరును వంద దాటించారు.

రిషబ్ పంత్ హాఫ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత 15 ఓవర్లో జట్టు స్కోర్ 118 పరుగుల ఉన్నప్పుడు కౌల్టర్ నెయిల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 38 బంతులు ఆడిన పంత్ 2 సిక్సులు, 4 ఫోర్లతో 56 పరుగులు చేశాడు.

అతడి స్థానంలో వచ్చిన హెట్‌మెయర్ 5 పరుగులకే పెవిలియన్ చేరగా, 20వ ఓవర్లో అక్సర్ పటేల్ కూడా బారీ షాట్ కొట్టబోయి బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చాడు.

చివరి బంతికి శ్రేయస్ రెండో పరుగుకు ప్రయత్నించినపుడు రబాడా రనౌట్ అయ్యాడు.

ఒక వైపు వికెట్లు పడుతున్నా, చివరి వరకూ క్రీజులో నిలిచిన శ్రేయస్ అయ్యర్ 50 బంతుల్లో 2 సిక్సులు, 6 ఫోర్లతో 65 పరుగులు చేశాడు.

ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు, కౌల్టెర్ నెయిల్ 2, జయంత్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు.

ట్రోఫీ

ఫొటో సోర్స్, Ipl2020

ఐదోసారి ట్రోఫీ కోసం ముంబయి.. బోణీ చేయాలని దిల్లీ

ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోవాలని ముంబయి ఇండియన్స్, ఫైనల్ చేరిన మొదటిసారే చాంపియన్‌గా నిలవాలని దిల్లీ తహతహలాడుతున్నాయి.

సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమైన ఐపీఎల్-13లో ఇది 60వ మ్యాచ్.

8 జట్లు తలపడిన టోర్నీలో నవంబర్ 3 నాటికి ప్లేఆప్ చేరే జట్లు ఏవో ఒక క్లారిటీ వచ్చింది.

18 పాయింట్లతో ముంబయి, 16 పాయింట్లతో దిల్లీ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలు సాధించినా, చివరి రెండు స్థానాల కోసం బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా జట్లు పోటీపడ్డాయి.

చివరికి మూడూ 14 పాయింట్లు సాధించినా మెరుగైన రన్ రేటుతో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి.

పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ముంబై ఇండియన్స్, దిల్లీ కేపిటల్స్ మొదటి ప్లే ఆఫ్‌లో తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో దిల్లీని ఓడించిన ముంబయి నేరుగా ఫైనల్ చేరగా, ఓడిన దిల్లీకి క్వాలిఫయర్ మ్యాచ్ ద్వారా మరో అవకాశం లభించింది.

మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాయల్ చాలెంజర్స్, సన్ రైజర్స్ రెండో ప్లే ఆఫ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించిన హైదరాబాద్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో దిల్లీని ఢీకొంది.

క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ ను ఓడించిన దిల్లీ కేపిటల్స్ ముంబయితో ఫైనల్ పోరుకు సిద్ధమైంది.

రోహిత్

ఫొటో సోర్స్, Ipl/bcci

ముంబయి హాట్ ఫేవరెట్

ఇప్పటివరకూ ఐపీఎల్-13లో దిల్లీ-ముంబయి మధ్య జరిగిన మూడు మ్యాచుల్లో విజయం ముంబయినే వరించింది.

క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ ఇచ్చిన దిల్లీ కేపిటల్స్ టైటిల్ కైవసానికి దూకుడు చూపుతోంది.

ముంబయి బ్యాటింగ్ బలంగా ఉంది. అలాగే ఆ జట్టులోని బుమ్రా, బోల్డ్ బౌలింగ్ ఎదుర్కోవడానికి దిల్లీ ఇబ్బంది పడుతోంది.

ఆ జట్టు ఆశలన్నీ శిఖర్ ధవన్, ఆల్ రౌండర్ స్టోయినిస్ మీదే ఉన్నాయి.

ముంబయి, దిల్లీ మధ్య తొలి క్వాలిఫయర్‌ జరిగిన దుబాయ్‌ స్టేడియంలోనే ఫైనల్‌ కూడా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)