సనా రామ్‌చంద్: పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికైన తొలి హిందూ మహిళ

ఫొటో సోర్స్, PAKISTAN HINDU YOUTH COUNCIL
- రచయిత, రియాజ్ సుహైల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"నా మొబైల్‌లో అన్ని సోషల్ మీడియా యాప్స్ తీసేశాను. అన్ని సామాజిక సంబంధాలకు దూరంగా ఉన్నాను. ఎనిమిది నెలలు మనసు లగ్నం చేసి సీఎస్ఎస్ కోసం ప్రిపేర్ అయ్యాను. విజయం సాధించాను."
సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ (సీఎస్ఎస్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికైన తొలి హిందూ మహిళ డాక్టర్ సనా రామ్ చంద్ చెప్పిన మాటలివి. ఆమెను అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి.
సింధ్‌లో సుమారు 20 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. వీళ్లల్లో అధికశాతం మహిళలు విద్య, ఆరోగ్యానికి సంబంధించిన చదువులకే ప్రాముఖ్యం ఇచ్చేవారు.
కానీ, గత కొద్ది కాలంగా ట్రెండ్ మారింది. ఇప్పుడు పోలీసు, న్యాయవ్యవస్థకు సంబంధించిన చదువుల్లోకి అమ్మాయిలు వస్తున్నారు.
2020లో జరిగిన సీఎస్‌ఎస్ పరీక్షకు మొత్తం 18,553 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఎంపికైన 221 మంది అభ్యర్థులలో 79 మంది మహిళలు.
వారిలో డాక్టర్ సనా రామ్ చంద్ ఏకైక హిందూ మహిళ.

ఫొటో సోర్స్, SANA RAMCHAND
గ్రామీణ ప్రాంతాల్లో చదువు
డాక్టర్ సనా సింధ్ ప్రాంతలో షికార్‌పూర్ జిల్లాలోని చిన్న ఊర్లో నివాసముంటున్నారు. ఆమె స్కూలు, కాలేజీ చదువులు అక్కడే పూర్తయ్యాయి. సనా తండ్రి ఆరోగ్య రంగంలో పని చేస్తున్నారు.
సనా, ఇంటర్ తరువాత సింధ్‌లోని చాండ్కా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి, కరాచీ సివిల్ హాస్పిటల్‌లో హౌస్ సర్జన్‌గా చేశారు.
ప్రస్తుతం ఆమె సింధ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ (ఎస్ఐయూటీ)లో యూరాలజీలో ఎఫ్‌సీపీఎస్ చేస్తున్నారు. మరి కొన్ని నెలల్లో ఆమె సర్జన్ అవుతారు.
కాలేజీ రోజుల్లో డాక్టర్ కావడమే లక్ష్యంగా ఉండేదని సనా చెప్పారు. చదువుల్లో ఆమె ఎప్పుడూ ముందు ఉండేవారు. పలు పతకాలు కూడా సాధించారు.
ఎంబీబీఎస్ చేసిన తరువాత ఎఫ్‌సీపీఎస్ కూడా బాగానే ముందుకు సాగుతోంది. సీఎస్ఎస్ పరీక్ష రాస్తారని కలలో కూడా అనుకోలేదని ఆమె అన్నారు.
ఆస్పత్రులు, రోగుల పరిస్థితి చూడడంతో మారిన నిర్ణయం
సింధ్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి, రోగుల పరిస్థితి చూసి సనా చాలా కలత చెందారు. దాంతో, సీఎస్ఎస్ రాయాలని నిర్ణయించుకున్నారు.
"నేను సర్జన్ అవ్వాలని, యూరాలజిస్ట్ కావాలని ముందే నిర్ణయించుకున్నాను. ఈ విభాగంలో చాలా తక్కువమంది మహిళలు పని చేస్తున్నారు. చాండ్కా ఆస్పత్రి, మరొక ప్రభుత్వ ఆస్పత్రి చూసిన తరువాత నా మనసు కకావికలం అయిపోయింది. ఇక్కడ రోగుల పట్ల శ్రద్ధ లేదు. వనరులూ లేవు. ఇక్కడ పని చేయడం చాలా కష్టం అనిపించింది.
బ్యూరోకసీలో ఉంటే ఏదో ఒక మార్పు తీసుకురావచ్చనే ఆశ కలిగింది. ఒక డాక్టర్‌గా నేను రోగులకు చికిత్స మాత్రమే చేయగలను. డాక్టర్లకు ఉన్న పరిధి తక్కువ. అదే బ్యూరోక్రసీలో ఉంటే వ్యవస్థలో మార్పులు తీసుకురావొచ్చు. అనేక సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఈ ఆలోచనే నాకు టర్నింగ్ పాయింట్" అని డాక్టర్ సనా వివరించారు.
సనాకు 2019లో ఈ ఆలోచన వచ్చింది. అప్పటి నుంచీ శ్రద్ధగా చదివి 2020లో సీఎస్ఎస్ పరీక్ష రాశారు.
ఇప్పటికీ ఆమె ఎఫ్‌సీపీఎస్ చదువు కొనసాగిస్తున్నారు. డాక్టర్‌గా తన విధులను నిర్వర్తిస్తున్నారు. కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తూనే ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యారు.

ఫొటో సోర్స్, SANA RAMCHAND
సోషల్ మీడియాకు స్వస్థి పలికారు, నిద్ర తగ్గించారు
అందరికీ నా విజయమే కనిపిస్తుంది కానీ దాని వెనుక నా కష్టం కనిపించదు అంటున్నారు డాక్టర్ సనా. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు డాక్టరుగా తన విధులు నిర్వర్తించిన తరువాత సనా నేరుగా లైబ్రరీకి వెళ్లేవారు.
"నా మొబైల్ నుంచి అన్ని సోషల్ మీడియా యాప్స్ తొలగించాను. అన్ని సామాజిక బంధాలకు దూరంగా ఉన్నాను. నా కజిన్ పెళ్లికి కూడా వెళ్లలేదు. రోజుకు ఆరేడు గంటల నిద్ర కూడా ఉండేది కాదు. వస్తూ, పోతూ దార్లో కూడా చదువుకునేదాన్ని. మొబైల్‌లో ఇంగ్లిష్ వార్తాపత్రికలు పెట్టుకున్నాను. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు అవన్నీ చదివేదాన్ని.
ఉద్యోగం మానలేను. చదువూ మానుకోలేను. ఉద్యోగం చేస్తూ, చదువూ కొనసాగించవచ్చు అనిపించింది. ఇదంతా మన సంకల్పబలంపై ఆధారపడి ఉంటుంది. మనం ఎంత గట్టిగా సంకల్పించుకుంటే అంత విజయం సాధిస్తాం.
మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాలంటే ఒక్కటే సూత్రం.. పూర్తిగా మనసు లగ్నం చేసి చదవాలి. శ్రద్ధ పెట్టి, అంకితభావంతో వీలైనన్ని ఎక్కువ గంటలు చదువుతూ ఉండాలి" అని డాక్టర్ సనా చెప్పారు.
తల్లిదండ్రుల మనసు మారింది
మొదట్లో సనా తల్లిదండ్రులు సీఎస్ఎస్ పరీక్ష పట్ల విముఖత చూపించారు. కానీ ఆమె విజయం సాధించడంతో వారు కూడా సంతోషించారు.
తన తల్లిదండ్రులను ఒప్పించడానికి కష్టపడాల్సి వచ్చిందని సనా చెప్పారు. "ఒకసారి ప్రయత్నం చేస్తాను. విఫలమైతే డాక్టర్ వృత్తి కొనసాగిస్తానని చెప్పి ఒప్పించాను.
రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక నా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో నా తల్లిదండ్రుల మనసు మారింది. వాళ్లు చాలా సంతోషించారు. నన్ను ఇంటర్వ్యూ దిశగా ప్రోత్సహించారు. పూర్తి సహాయసహకారాలు అందించారు" అని సనా తెలిపారు.
సనాకు నలుగురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. అన్నదమ్ములు లేరు.
"మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఏమీ తక్కువ కారు. బ్యూరోక్రసీలో చాలామంది మహిళలు ఉన్నారు. వారెన్నో మంచి పనులు చేస్తున్నారు. వారే నాకు స్ఫూర్తి.
సీఎస్ఎస్ రాయాలని ఎవరూ ఎవరికీ చెప్పనవసరం లేదు. ఇది ఎవరికి వారే గ్రహించాలి. అందులో విజయం సాధిస్తే పాకిస్తాన్ మొత్తం ప్రశంసిస్తోంది. వాళ్లు విజయం సాధించగా లేనిది నేను ఎందుకు సాధించలేను? అని ఎవరికి వారే అనుకోవాలి" అని సనా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్: పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలలో కేసుల పెరుగుదలకు ఇండియన్ వేరియంటే కారణమా
- 'పెళ్లైతే భర్త పేరు తగిలించుకోవాలా?': పాకిస్తాన్ అమ్మాయిల్లో మారుతున్న ట్రెండ్
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ వేరియంట్ 1000 రెట్లు స్పీడా... అందుకే ఏపీ ప్రజలంటే ఇతర రాష్ట్రాలు భయపడుతున్నాయా
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- బాలాకోట్ వైమానిక దాడికి రెండేళ్లు.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు
- సైనోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం.. ఇప్పటికే కోట్ల మందికి పంపిణీ
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








