తబ్లీగీ జమాత్‌ను సౌదీ అరేబియా ఏ భయం కారణంగా నిషేధించింది?

తబ్లీగీ జమాత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 2007 ఫిబ్రవరిలో జరిగిన తబ్లీగీ జమాత్ ఈవెంట్ ముగింపు దృశ్యం
    • రచయిత, మొహమ్మద్ జుబైర్ ఖాన్
    • హోదా, జర్నలిస్ట్

''సౌదీ అరేబియా దేశం ఒకే జమాత్ మార్గంలో నడుస్తోంది. ఒకే జమాత్, ఒకే మతం అనే విశ్వాసం నుంచి ప్రజల్ని విడగొట్టడానికి బయట నుంచి వచ్చిన వేరే జమాత్‌లు ప్రయత్నించాయి. దీనిద్వారా సౌదీ ప్రజల ఐక్యతను విడగొట్టాలని చూశాయి. అలాంటి వాటిలో ఒకటి తబ్లీగీ జమాత్. ఇది సౌదీ అరేబియా దేశానికి తమను తాము మిత్రులం (అహ్‌బాబ్) అని చెప్పుకుంటుంది.''

''దీని మూలాలు భారతదేశ ఉపఖండంలో ఉన్నాయి. ఇస్లాం అనుసరించే అనేక నియమాలకు విరుద్ధంగా తబ్లీగీ జమాత్ వ్యవహరిస్తుంది. ఇది ఆహ్వానం లేకుండానే విందులకు వెళ్తుంది. ఈ జమాత్‌లోనే తీవ్రవాద గ్రూపులు కూడా పుట్టుకొచ్చాయి. దీన్ని అనుసరించేవారు బాధితులుగా మారతారు.''

వీడియో క్యాప్షన్, వందేళ్ల హిందూ ఆలయంలో పూజలు చేసిన పాకిస్తాన్ చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్

''సౌదీ అరేబియా జైళ్లలో ఉన్న తీవ్రవాద గ్రూపులకు చెందిన వారిని విచారించగా, వారు గతంలో తబ్లీగీ జమాత్‌తో కలిసి పనిచేసినట్లుగా తెలిసింది. తబ్లీగీ జమాత్‌తో సంబంధాలు నెరపడం చట్టబద్ధం కాదని సౌదీ అరేబియా ఫత్వా కమిటీ నిర్ణయించింది.''

''తబ్లీగీ ఆహ్వానాన్నివ్యతిరేకించడం తప్పనిసరి. ఇలాంటి గ్రూపులు మన ఐక్యతను ముక్కలు చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆహ్వానాన్ని మన్నించకూడదు'' అని శుక్రవారం సౌదీలోని జామా మసీదులో ఖుత్బా (ప్రబోధం)ను వెలువరించారు.

సౌదీ అరేబియాలోని మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు దాదాపు అన్ని జామా మసీదుల్లో ఇలాంటి ప్రబోధాలు ఇచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సౌదీ అరేబియాలో తబ్లీగీ జమాత్ గురించి శుక్రవారం ఖుత్బాలో ప్రజలను హెచ్చరించాలని మత వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్ లతీఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్- షేక్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీనిపై పాకిస్తాన్‌లోని తబ్లీగీ జమాత్ అగ్రనేతల స్పందన కోసం ప్రయత్నించగా, వారు దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు.

అయితే, భారతదేశంలోని దారుల్ ఉలూమ్ దేవబంద్ మదర్సా దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. తబ్లీగీ జమాత్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి అందులో అని పేర్కొంది.

తబ్లీగీ జమాత్‌పై నిషేధం విధించడం కొత్తేమీ కాదని... తాజా ట్వీట్లు, ఖుత్బాల ద్వారా పాత ఆంక్షలు పునరావృతం అవుతున్నాయని సౌదీ అరేబియా మత వ్యవహరాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తోన్న ఒక వ్యక్తి చెప్పారు.

తబ్లీగీ జమాత్‌

ఫొటో సోర్స్, Getty Images

సౌదీ అరేబియాలో ఈ ఆంక్షల కథ ఏంటి?

సౌదీ అరేబియాలో ఆంక్షల గురించి తెలుసుకోవాలంటే, దానికన్నాముందు అక్కడ సాగుతోన్న పాలన గురించి తెలుసుకోవాలని అని సుదీర్ఘకాలం పాటు మత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేసిన ఒక అధికారి చెప్పారు.

సౌదీ అరేబియాలో రాజకీయ, మత సమ్మేళనాలకు సంబంధించిన పని చేయడానికి అక్కడి చట్టం ఒప్పుకోదు.

అదేవిధంగా సౌదీ అరేబియాకి వెళ్లడం, అక్కడ వర్క్‌ పర్మిట్ లేదా వీసా పొందడం, అక్కడి నివసించడానికి విధించిన షరతులను పరిశీలిస్తే... సౌదీలో మత ప్రచారాలు, ఉపదేశాల కోసం వీసాలు, వర్క్ పర్మిట్‌లు అనుమతించరనే సంగతి మరింత బాగా అర్థం అవుతుంది.

ఒకవేళ ఒక వ్యక్తి వైద్య వృత్తి నిర్వర్తించడానికి సౌదీ అరేబియాకు వస్తే, అతనికి ఆసుపత్రుల్లో వైద్యం చేయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. వైద్యానికి సంబంధించిన రంగంలో మాత్రమే అతను పనిచేయాల్సి ఉంటుంది. అతను తబ్లీగ్ (మత ప్రభోధం లేదా బోధన) చేయడానికి అనుమతి లేదు. మత ప్రభోదం లేదా ప్రచారం చేయడానికి కొన్ని సంస్థలను, కొందరు వ్యక్తులను అక్కడి ప్రభుత్వమే నిర్ణయించింది.

ఇదే విధంగా బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, ఆఫ్రికా, భారత్, పాకిస్తాన్ లేదా ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు ఉపాధ్యాయులుగా లేదా అనువాదకులుగా వీసా లభిస్తే.. వారు సౌదీలో కేవలం అనువాదకుడిగా లేదా ఉపాధ్యాయులుగా మాత్రమే ఉంటారు. వీసాలో పేర్కొన్న దానికి విరుద్ధంగా వారు వేరే ఏదైనా పనిచేస్తే చట్టరీత్యా దాన్ని నేరంగా పరిగణిస్తారు.

తబ్లీగీ జమాత్‌

ఫొటో సోర్స్, Getty Images

తబ్లీగీ జమాత్ భారత్‌లో ఉద్భవించింది. ప్రపంచమంతటా దీన్ని తబ్లీగీ జమాత్ అనే పిలుస్తారు. కానీ దీన్ని సౌదీ అరేబియాలో మాత్రం 'అహ్‌బాబ్' పేరుతో పిలుస్తుంటారు. ఎందుకంటే తబ్లీగీ జమాత్ పేరుతో పనిచేయడానికి సౌదీ అరేబియా అనుమతించదు.

సౌదీ చట్టాల నుంచి తప్పించుకోవడానికే 'అహ్‌బాబ్' అనే పేరును ఉపయోగిస్తున్నారు. ఈ పదాన్ని అక్కడి సాధారణ పరిభాషలో విస్తృతంగా ఉపయోగిస్తారు.

ప్రపంచం నలుమూల్లో ఉన్న తబ్లీగీ జమాత్‌కు చెందిన వ్యక్తులు సౌదీ అరేబియాలో ప్రవేశించడానికి వివిధ పద్ధతులను అవలంభిస్తారు. తరచుగా వివిధ దేశాల్లో ఒక సంవత్సరం పాటు పర్యటించే జమాత్ బృందాలు ఉమ్రా, హజ్ లేదా పర్యాటక వీసాల పేరుతో ఇక్కడికి వస్తుంటాయి.

ఈ వీసాల ఆధారంగా వారు రెండు లేదా మూడు నెలలు సౌదీ అరేబియాలో ఉంటారు. ఈ సమయంలో వారు ప్రజల మధ్యకు వెళ్లి తబ్లీగ్ పనిని పూర్తిచేస్తారు. వారికి గల్ఫ్ దేశాలకు చెందిన కొంతమంది మద్దతు కూడా లభిస్తుంది.

ఈ నేపథ్యంలో, సౌదీ అరేబియా విదేశీ, మత వ్యవహారాల శాఖ కొన్ని సంవత్సరాల క్రితమే కఠినమైన చర్యలు తీసుకుంది. వీసా తీసుకొని వచ్చి సౌదీలో మత ప్రచారం చేసేవారికి వ్యతిరేకంగా చట్టాలు చేసేందుకు సంస్థలను ఏర్పాటు చేసింది.

నమాజ్

ఫొటో సోర్స్, Getty Images

దీని కారణంగా చాలామంది ప్రజలు తబ్లీగ్ పనిచేస్తూ పట్టుబడి, సౌదీ చట్టాల ప్రకారం శిక్షలు అనుభవిస్తున్నారు.

అదే సమయంలో తీవ్రవాదంపై ప్రపంచం యుద్ధం ప్రకటించినప్పుడు, తబ్లీగీ జమాత్ ముసుగులో చాలా మంది సౌదీ పౌరులు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లకు వెళ్లారు.

దీని తర్వాత సౌదీ అరేబియా పౌరులపై కూడా ఆంక్షలు విధించారు. మత ప్రబోధం లేదా ప్రచారాల కోసం సౌదీ పౌరులకు వీసాలు మంజూరు చేయొద్దని పాకిస్తాన్ దౌత్యవేత్తలను కోరారు. ఇది ఇప్పటికీ కూడా అమల్లోనే ఉంది.

ఈ సమస్యలపై మాట్లాడేందుకు తబ్లీగీ జమాత్‌లోని వ్యక్తులను సంప్రదించగా, వారు వీటిపై మాట్లాడేందుకు నిరాకరించారు.

''తబ్లీగీ జమాత్ సభ్యులు చనిపోయినప్పుడు లేదా వారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా జమాత్ బాధితుల గురించి మాట్లాడదు. దాని పని అది చేసుకుంటూ పోతుంది'' అని చాలా ఏళ్లుగా మతపరమైన సంస్థలపై రిపోర్టింగ్ చేస్తోన్న కరాచీకి చెందిన జర్నలిస్ట్ అజ్మత్‌ఖాన్ చెప్పారు.

తబ్లీగీ జమాత్‌

ఫొటో సోర్స్, Getty Images

తబ్లీగీ జమాత్ ఏం చేస్తోంది?

అజ్మత్ ఖాన్ చెప్పినదాని ప్రకారం, ఏ రహస్య కార్యకలాపాల్లోనూ తబ్లీగీ జమాత్ పాల్గొనదని స్పష్టమైంది. ఈ సంస్థకు చెందిన వ్యక్తులు రాజకీయాల్లో పాల్గొనరు. దీని అగ్ర నాయకత్వం కూడా ఏదైనా ఒక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు లేదా నాయకులలాగా వ్యవహరించరు. వీరికి రాజకీయ, ఆర్థిక, సామాజిక ఎజెండా ఉండదు. వారు ప్రతీ వర్గాన్ని తమలో కలుపుకుంటారు.

''తమ సంస్థలో ఎందుకు చేరుతున్నారు? ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు? అని ఇది ఏ ఒక్కరినీ ప్రశ్నించదు. తమలో చేరాలనుకునేవారిని స్వాగతిస్తుంది'' అని ఆయన చెప్పారు. తబ్లీగీ జమాత్, ఇస్లాం గురించి మాట్లాడుతుంది. ఇందులో చేరేవారికి కల్మా, నమాజ్, ఖురాన్ చదవడం నేర్పిస్తారు.

గత కొన్ని సంవత్సరాలలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, భారత్, ఆఫ్రికా, బ్రిటన్, అమెరికా దేశాల్లో తబ్లీగీ జమాత్ చాలా ప్రాచుర్యం పొందిందని అజ్మత్ ఖాన్ వెల్లడించారు. సభ్యుల నుంచి మరీ కఠినమైన క్రమశిక్షణను కోరుకోకపోవడం, తమ సభ్యులకు సంబంధించిన ఏ బాధ్యతను స్వీకరించకపోవడం దీనికి ఒక కారణంగా ఆయన చెప్పారు.

తీవ్రవాదంపై ఎదురుదాడి జరిగిన సమయంలో అనేక మంది తీవ్రవాదులు వారిలో కలిసిపోయినట్లు అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి. కానీ తబ్లీగీ జమాత్ మాత్రం దానికి బాధ్యత వహించలేదు. దీనిపై అది అనేక నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

సౌదీ అరేబియా ఎందుకు తీవ్రంగా స్పందించింది?

చాలా కాలంగా మతపరమైన అంశాలపై రిపోర్టింగ్ చేస్తోన్న జర్నలిస్ట్ సబూక్ సయ్యద్ ప్రకారం, సౌదీ అరేబియాలో తీవ్రవాద సంస్థలైన అల్‌ఖైదా, ఇఖ్వాన్-ఉల్-ముస్లిమిన్‌ సభ్యులతో పాటు మత సంస్థలకు చెందిన వ్యక్తులు కూడా తబ్లీగీలో చేరి తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలో సౌదీ అరేబియా క్రమంగా సంప్రదాయవాద విధానాలను వదిలిపెడుతోంది

పాకిస్తాన్ లేదా ఇతర దేశాలకు చెందిన తబ్లీగీ బృందాల కంటే సౌదీ అరేబియాలో భారత్‌కు చెందిన తబ్లీగీ బృందాల భాగస్వామ్యం అధికంగా ఉందనే అభిప్రాయం ఉన్నట్లు సయ్యద్ చెప్పారు. ఇటీవల భారత్‌లో తబ్లీగీ సంస్థపై నిషేధం విధించారు.

తబ్లీగీ జమాత్‌లో భాగంగా ఉన్న కొంతమంది సౌదీ పౌరులను పాకిస్తాన్ భద్రతా ఏజెన్సీలు అరెస్టు చేసిన ఘటనలు ఉన్నట్లు ఆయన చెప్పారు. వీటి తర్వాత, గత కొంతకాలంగా సౌదీ పౌరులకు మతప్రభోధం పేరుతో వీసాలు దొరకడం లేదు. సౌదీ ప్రభుత్వం నిర్ణయాలు కూడా దీనికి ఒక కారణం కావొచ్చు.

తాజా సౌదీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ప్రజలు అహ్‌బాబ్ పేరుతో చెలామణీ అవుతోన్న తబ్లీగీ జమాత్‌లో చేరినట్లు సౌదీ ప్రభుత్వం అనుమానిస్తోందని సబూక్ తెలిపారు.

సౌదీ అరేబియా నిషేధించిన ఇలాంటి సంస్థలు, అహ్‌బాబ్ లేదా తబ్లీగీ జమాత్ పేరుతో తమ కార్యక్రమాలు కొనసాగించడం వల్ల దేశానికి ప్రమాదం కలుగుతుందని తాను అనుమానిస్తున్నానని అన్నారు.

ముస్లిం ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

సౌదీ అరేబియా చట్టాల ప్రకారం ఇస్లాంను బోధించడం, ఇస్లాం చట్టం గురించి ప్రచారం చేయడం, మత ప్రచారం, ఇస్లాంకు సంబంధించిన ఫత్వాలు జారీ చేసేందుకు ఏ పార్టీకి కూడా అనుమతి లేదు. ఈ పనులన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోని వివిధ మంత్రిత్వ శాఖలు చేస్తుంటాయి. కాబట్టి, ఈ పనులు చేసేందుకు తబ్లీగీ జమాత్ లేదా అహ్‌బాబ్‌లకు కూడా ఆస్కారం లేదు.

అధికారులు చేసిన తాజా ట్వీట్లు, శుక్రవారం ఉపన్యాసంలో తబ్లీగీ జమాత్ గురించి మాట్లాడటం చూస్తుంటే ఇది అహ్‌బాబ్ సభ్యులకు హెచ్చరిక జారీ చేస్తున్నట్లుగా ఉందని సయ్యద్ అన్నారు. తబ్లీగీ కార్యకలాపాలు ఏవైనా సౌదీ ప్రభుత్వం దృష్టికి వస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం ఉందని ఆయన భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)