కరోనావైరస్: దిల్లీ నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ సదస్సులో ఏం జరిగింది... అక్కడికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంది వెళ్ళారు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలో జరిగిన ఒక ముస్లిం ఆధ్యాత్మిక కార్యక్రమం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యను పెంచేసింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా రావడం, వారంతా దేశవ్యాప్తంగా తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లాక, వారితో దగ్గరగా మసిలిన వారికి కరోనా రావడంతో అకస్మాత్తుగా కేసులు, మరణాల సంఖ్య పెరిగింది.
సోమవారం ఒక్క రోజే తెలంగాణలో ఆరు మరణాలు, ఏపీలో కొత్తగా 17 కేసులు వచ్చాయి. తెలంగాణలో మరణించిన వారంతా దిల్లీ వెళ్లిన వారు, లేదా వారితో దగ్గరగా కలసి మెలిసిన వారు. ఇక ఏపీలోని 17 మందిలో 14 మంది దిల్లీ వెళ్లిన వారు లేదా వారి కుటుంబ సభ్యులే.

ఫొటో సోర్స్, Reuters/DANISH SIDDIUI
ఇంతకీ దిల్లీలో ఏం జరిగింది?
తబ్లీగీ జమాత్ అనే సంస్థ దిల్లీలో రెండేళ్లకోసారి ఆధ్యాత్మిక సదస్సు నిర్వహిస్తుంది. దిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఇది జరుగుతుంది. హజ్రత్ నిజాముద్దీన్ మసీదు పెద్ద మౌలానా సాధ్ దీనికి అధ్యక్షత వహిస్తారు. అక్కడ మత ప్రబోధకుల ప్రవచనాలుంటాయి. ఈ ఏడాది మార్చి 15-17 మధ్య ఇది జరిగింది. అది పూర్తయ్యాక వారంతా తిరిగి వెళ్తారు.
దీనికి తెలుగు రాష్ట్రాల నుంచి 1500-2000 మంది సుమారు హాజరై ఉంటారని అంచనా. హైదరాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన ఇక్రం అలీ అనే వ్యక్తి ఇక్కడ నుంచి చాలా మందిని తీసుకువెళ్లారు. ఏపీ నుంచి 369 మంది, తెలంగాణ నుంచి దాదాపు 1030 మంది ఉన్నట్టు ఇప్పటి వరకూ అంచనా వేస్తున్నారు. వీరిలో అత్యధికంగా 600 పైగా హైదరాబాద్ నుంచే ఉండగా, నిజామాబాద్ నుంచి 80 మంది వరకూ ఉన్నట్టుగా మిగిలిన వారంతా 30 జిల్లాల నుంచీ ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే, వీరందరికీ కరోనా ఉందో లేదో నిర్ధరణ కాలేదు.

- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

ఆ సదస్సుకు వేల మంది వచ్చినట్టు అంచనా వేస్తుండగా, వారిలో వందల సంఖ్యలో విదేశీయులు ఉన్నారు. ఇంకా 200 మందికి పైగా విదేశీయులు దిల్లీలోనే ఉన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వచ్చి, లాక్ డౌన్ వల్ల వెళ్లలేని వారు ఇంకా అక్కడే ఉన్నారు. ఆ ప్రాంతాన్ని మొత్తం దిల్లీ ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది.
విదేశాల నుంచి వచ్చిన వీరే అక్కడ వ్యాధికి కారణం అయ్యారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మౌలానా మీద కేసు పెట్టారు దిల్లీ పోలీసులు. అంతేకాదు, టూరిస్టు వీసాపై వచ్చి మతపరమైన కార్యాక్రమంలో పాల్గొనడం వీసా ఉల్లంఘన అవుతుందనే కోణంలో కూడా కేంద్ర విచారణ చేస్తోంది.
ఇక తెలంగాణలోని కరీంనగర్ కి వచ్చిన ఇండోనేషియా వారు కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారేనన్న వార్తలు వచ్చాయి కానీ ఇంకా ధ్రువీకరించలేదు. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలతో పాటూ తమిళనాడుపై కూడా గట్టిగానే పడింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇలా దిల్లీ నుంచి వచ్చిన వారు కొందరిలో క్రమంగా శ్వాస సమస్యలు మొదలయ్యాయి. వారంతా ఇంట్లో వాళ్లతో కలుస్తారు కాబట్టి, కుటుంబంలోని కొందరికి కూడా అంటుకుంది. హైదరాబాద్లో మొదటి మరణం కేసులో కూడా ఇదే జరిగింది. వీరిలో కొందరు విదేశాలకు వెళ్లలేదు కాబట్టి, తాము క్వారంటైన్లో ఉండక్కర్లేదని భావించారు. దీంతో ఇంట్లో వాళ్లకు వేగంగా పాకింది.
అలాగని అందరూ నిర్లక్ష్యంగా లేరు. తమకు ఏ లక్షణాలూ లేకపోయినా ముందే ఆసుపత్రికి వెళ్లిన వారూ ఉన్నారు. కడపకు చెందిన ఒక వ్యక్తితో బీబీసీ మాట్లాడింది.
‘‘తాము దిల్లీ నుంచి రాగానే మిత్రుల సలహా మేరకూ, బృందంలో అందరమూ కడపలోని రిమ్స్ కి వెళ్లి చేరాం. అక్కడ మాకు పరీక్షలు చేశారు. మేమంతా బాగానే ఉన్నాం. సాయంత్రం మా రిపోర్టు వస్తుందని చెప్పారు’’ అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
నిజానికి కోవిడ్ లక్షణాలు బయట పడటానికి చాలా సమయం పడుతుంది. ముందు జాగ్రత్తగా దూరం పాటించిన వారి నుంచి ఇతరులకు అంటదు. కానీ తాము విదేశాలకు వెళ్లలేదు, తాము దూరం పాటించక్కర్లేదు అన్న భావనతో మామూలుగా తిరిగిన వారి నుంచి కొందరికి వచ్చింది. ఈలోపు జరగాల్సింది జరిగిపోయింది. సోమవారం ఒక్కరోజే దిల్లీ నుంచి వచ్చిన, లేదా వారిని కలిసిన ఐదుగురు మరణించారు. కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిపోయింది.
ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారిపైనే మొదట్లో దృష్టి పెట్టిన ప్రభుత్వాలు, తరువాత దిల్లీ నుంచి వచ్చిన వారిని కూడా ట్రేస్ చేయడం మొదలుపెట్టాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ అటువంటి వారిని గుర్తించి వెంటనే క్వారంటైన్ కి తరలించడం, పరీక్షలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘‘వారిలో వ్యాధి లక్షణాలు పెరుగుతుంటే ఐసోలేషన్ కి తరలిస్తున్నాం. ఒకవేళ లక్షణాలు పెరగకపోతే ఇంట్లోనే క్వారంటైన్ కి పంపిస్తున్నాం. క్వారంటైన్ లో ఉండగలిగిన పరిస్థితి ఇంట్లో లేకపోతే, వారిని ప్రభుత్వ క్వారంటైన్ కి పంపిస్తున్నాం’’ అని వివరించారు తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్.
"దిల్లీలో మతపరమైన కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారు, మతపరమైన పనికి కాకపోయినా ఆయా తేదీల్లో దిల్లీ నుంచి తిరుగు ప్రయాణాలు చేసిన వారు, వారిని కలిసిన వారు, కలిశామన్న అనుమానం ఉన్న వారు, వారి ఇంట్లో వాళ్లూ, దిల్లీ నుంచి వచ్చాక వారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న వారు, వారితో కలసి ప్రార్థనల్లో పాల్గొన్న వారూ.. వీరంతా తమను తాము మిగతా వారి నుంచి దూరంగా ఉంచుకోవాలి. తాము గతంలో ఏం చేసిందీ, ఎవరిని కలసిందీ ప్రభుత్వ సిబ్బందికి చెప్పాలి. ప్రభుత్వ సిబ్బందికి సహకరించాలి. అప్పుడే వ్యాధి అదుపులోకి వస్తుంది."
ఈ క్రమంలోనే దిల్లీ ప్రార్థనల కోసం వెళ్లిన వారంతా తక్షణం ప్రభుత్వానికి చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం అలాంటి ప్రకటన విడుదల చేయనప్పటికీ, తమ వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టి అంలాంటి వారిని గుర్తించే పని మొదలుపెట్టింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- ఫరూక్ అబ్దుల్లా: ఏడు నెలల నిర్బంధం నుంచి కశ్మీర్ నాయకుడి విడుదల
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా.. బ్రెజిల్ అధ్యక్షుడికి కోవిడ్-19 పరీక్షలు
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








