కేరళ: అమ్మాయిల స్కూలు యూనిఫాంపై కొన్ని ముస్లిం సంఘాలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నాయి

యూనిసెక్స్ యూనిఫాంలలో విద్యార్థి, విద్యార్థినిలు

ఫొటో సోర్స్, BINURAJ TP

ఫొటో క్యాప్షన్, యూనిసెక్స్ యూనిఫాంలలో విద్యార్థి, విద్యార్థినిలు

కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీనేజీ విద్యార్థినులు యూనిఫాంగా ప్యాంటు ధరించడానికి అనుమతించారు. దాంతో, అక్కడ వివాదం చెలరేగింది.

బీబీసీ జర్నలిస్ట్ గీతా పాండే, కేరళకు చెందిన అష్రఫ్ పదన్న ఈ వివాదంపై అందిస్తున్న కథనం.

బుధవారం ఉదయం శృంగి సీకే తన కొత్త యూనిఫాం వేసుకుని స్కూలు బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో పక్క నుంచి వెళుతున్న ఓ మహిళ ఆమె దగ్గరకు వెళ్లి డ్రెస్ చాలా బావుందని పొగిడారు. ఆ ప్రశంసలు ప్రత్యేక అనుభూతిని కలిగించాయని శృంగి చెప్పారు.

"నేను చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నానని ఆమె చెప్పారు. నాకు చాలా గర్వంగా అనిపించింది" అని బీబీసీకి 17 ఏళ్ల శృంగి తెలిపారు. బాలుసెరి పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నారామె.

కానీ, స్కూలుకు వెళ్లే దారిలో అనేకమంది నిరసన ప్రదర్శనలు నిర్వహించడం గమనించారు శృంగి. వారందరినీ పోలీసులు నియంత్రిస్తున్నారు.

అబ్బాయిల్లాగా అమ్మాయిలూ చొక్కా, ప్యాంటు వేసుకోవడంపై వారంతా అభ్యంతరాలు లేవనెత్తారు.

అంతకుముందు ఆడపిల్లలు స్కూలు యూనిఫాంగా పంజాబీ డ్రెస్సులు, వాటిపై జాకెట్లు ధరించేవారు.

అమ్మాయిలు స్కూలు యూనిఫాంగా చొక్కా, ప్యాంటు వేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న ముస్లిం సంఘాలు

ఫొటో సోర్స్, BINURAJ TP

ఫొటో క్యాప్షన్, అమ్మాయిలు స్కూలు యూనిఫాంగా చొక్కా, ప్యాంటు వేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న ముస్లిం సంఘాలు

యూనిఫాం ఎందుకు మార్చారు?

అబ్బాయిల్లాగే తాము కూడా ప్యాంటు ధరించేందుకు అనుమతించాలని గత ఏడాది 11వ తరగతి విద్యార్థినులు (ఇప్పుడు 12కు వచ్చినవారు) సూచించారని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ఇందు ఆర్ తెలిపారు.

"వాళ్లు చెప్పిన దాంట్లోనూ పాయింట్ ఉంది. స్కూలు బయట ఎలాగూ వాళ్లు జీన్స్, టీ షర్టులు వేసుకుంటారు. స్కూలు డ్రెస్ మీద వేసుకునే కోటు కేరళ వాతావరణానికి సరిపడదు. చాలా ఉక్కగా ఉంటుంది. అందుకే దీని గురించి మేము మా సిబ్బందితో చర్చించాం. తరువాత, పేరెంట్ టీచర్ అసోసియేషన్ (పీటీఏ) మీటింగ్ పెట్టాం. ఈ ప్రతిపాదనకు చాలామంది అంగీకరించారు. అందుకే స్కూలు యూనిఫాం మార్చేశాం" అని ఇందు చెప్పారు.

"ఒకరో ఇద్దరో తల్లిదండ్రులు మాత్రమే తటస్థ యూనిఫాంల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు పొడుగు చేతులున్న చొక్కాలు ధరించవచ్చని, తలపై స్కార్ఫ్ కట్టుకోవచ్చని, కావాలంటే జాకెట్ కూడా వేసుకోవచ్చని వారికి నచ్చజెప్పాం. కానీ, చాలా తక్కువమంది అమ్మాయిలే కోటు వేసుకుంటామని చెప్పారు."

ప్రిన్సిపాల్ ఇందు బీబీసీకి కొన్ని ఫొటోలు పంపించారు. కొత్త యూనిఫాం వేసుకున్న అమ్మాయిలు చాలా సరదాపడుతూ సెల్ఫీలు తీసుకున్నారు. ఆనందంతో ఎగిరి గంతేసిన క్షణాలను ఆ ఫొటోల్లో చూడవచ్చు.

కొత్త యూనిఫాం చాలా "సౌకర్యంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉందని" శృంగి అన్నారు.

"యునిసెక్స్ యూనిఫాంకు మారిన తొలి ప్రభుత్వ పాఠశాల మాదే. ఈ విప్లవంలో మేం ఒక భాగమైనందుకు సంతోషంగా ఉంది" అన్నారామె.

కేరళ ప్రభుత్వం కూడా కొత్త యూనిఫాంకు మద్దతిచ్చింది.

" కాలంతో పాటే డ్రెస్ కోడ్, పాఠశాలల్లో విద్యా వ్యవస్థ కూడా మారాలి. విద్యార్థి దశలోనే లింగ వివక్షకు వ్యతిరేకంగా టీనేజీ విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు మరిన్ని పాఠశాలలు చొరవ తీసుకుంటాయని మేము ఆశిస్తున్నాం" అని విద్యా శాఖ మంత్రి వి. శివన్‌కుట్టి బీబీసీతో అన్నారు.

అంతకుముందు విద్యార్థినిలు పంజాబీ డ్రెస్ మీద జాకెట్ వేసుకునేవారు

ఫొటో సోర్స్, BINURAJ TP

ఫొటో క్యాప్షన్, అంతకుముందు విద్యార్థినిలు పంజాబీ డ్రెస్ మీద జాకెట్ వేసుకునేవారు

ముస్లిం సంఘాల వ్యతిరేకత

అయితే, సంప్రదాయ ముస్లింలు ఈ యూనిఫాంను వ్యతిరేకిస్తున్నారు. తమ పిల్లలపై దీన్ని రుద్దుతున్నారని ఆరోపించారు.

"పీటీఏ జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మా పిల్లలను అబ్బాయిల్లా చొక్కా, ప్యాంటు వేసుకోమని బలవంతం చేస్తున్నారు. పేద కుటుంబాలకు ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా" అని యునిసెక్స్ యూనిఫాంలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ముస్లిం కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు ముజాహిద్ బాలుసెరి అన్నారు.

కేరళ రాష్ట్ర కమ్యూనిస్టు ప్రభుత్వం ఆలోచనల్లో ఇదీ ఓ భాగమని ముజాహిద్ భావిస్తున్నారు.

"వారి నాస్తిక భావజాలాన్ని పిల్లలపై రుద్దే అజెండా ఇది. దీనివల్ల పిల్లలు తప్పుదోవ పడతారు."

"మా మత విశ్వాసాలపై రాజీ పడే సమస్యే లేదు. అమ్మాయిలు, అబ్బాయిలు వారి వారి గుర్తింపులను వదులుకోకూడదు. వారి మధ్య భేదం కనిపించాల్సిందే. అమ్మాయిలు, అబ్బాయిల్లా బట్టలు వేసుకోవడమంటే ఫ్రీ సెక్స్‌కు దారి చూపిస్తున్నట్టే. ఇది జెండర్ వైవిధ్యాన్ని రూపుమాపి సెక్స్ స్వేచ్ఛను ప్రోత్సహిస్తున్నట్టు అవుతుంది" అని ఆయన అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలే గత వారం ఇతర ముస్లిం సమూహాల నుంచి కూడా వచ్చాయి.

అయితే, వీరి వ్యాఖ్యలపై కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

అమ్మాయిలపై ఆంక్షలు విధించేందుకు మత ఛాందస సంఘాలు చేస్తున్న ప్రయత్నమని విమర్శకులు అన్నారు.

భారతదేశంలో కేరళకు అధిక అక్షరాస్యత గల ప్రగతిశీల రాష్ట్రంగా గుర్తింపు ఉంది. దేశంలో 100 శాతం అక్షరాస్యత సాధించిన ఏకైక రాష్ట్రంగా తరచుగా పేర్కొంటారు.

పాఠశాలల్లో బాలికలు 48.96 శాతం ఉంటారు. పై చదువుల కోసం యూనివర్సిటీలకు వెళ్లే అమ్మాయిల సంఖ్యా ఎక్కువే.

కానీ, కేరళలో కూడా పితృస్వామ్యం లోతుగా పాతుకుపోయి ఉందని విమర్శకులు అంటారు.

వీడియో క్యాప్షన్, కారం శ్రీలత: కోయగూడెం నుంచి ఐఐటీ సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని

కేరళలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థినులు ఇప్పటికే ప్యాంట్లు ధరిస్తున్నారని, ఇప్పుడు కొత్తగా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని ప్రిన్సిపాల్ ఇందు అన్నారు.

2018లో ఒక ప్రభుత్వ జూనియర్ పాఠశాల చిన్న పిల్లలకు యునిసెక్స్ యూనిఫాంలను ప్రవేశపెట్టిందని ఆమె చెప్పారు.

"జెండర్ సమానత్వం తీసుకురావడమే కొత్త యూనిఫాంల లక్ష్యం. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు అని విడదీసి మాట్లాడతాం. వాళ్లకు వేరు వేరు బొమ్మలు కొంటాం. అబ్బాయిలకు కార్లు, గన్నులు కొనిస్తే, అమ్మాయిలకు బొమ్మలు కొనిస్తాం. అబ్బాయిలకు నీలం రంగు దుస్తులు, అమ్మాయిలకు గులాబీ రంగు దుస్తులు కొంటాం. వాళ్లు ఎదుగుతున్న కొద్దీ ఈ వ్యత్యాసాలన్నీ పటిష్టమై దుస్తులు, షూస్ ఇలా అన్నింట్లోనూ తేడాలు కనిపిస్తాయి.’’

కానీ, చొక్కా, ప్యాంటులు సౌకర్యంగా ఉంటాయని అమ్మాయిలు భావిస్తే, అవి ధరించేందుకు అనుమతించాలి. ఆడ, మగ తేడా లేకుండా పిల్లలందరికీ సమానమైన స్వేచ్ఛ, అవకాశాలు ఇవ్వాలి" అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, పండ్లు అమ్ముకునే చదువురాని వ్యక్తి.. సొంత డబ్బుతో స్కూలు కట్టించారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)