జికా వైరస్: కేరళలో 15 కేసులు, దోమలతోనే కాదు సెక్స్ వల్ల కూడా వ్యాపించే వైరస్

ఈడిస్ ఈజిప్టి దోమల ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది

ఫొటో సోర్స్, Spl

ఫొటో క్యాప్షన్, దోమల ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది

కేరళలో 15 జికా వైరస్ కేసులు గుర్తించడంతో అన్ని జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

తిరువనంతపురం జిల్లాలో జికా వైరస్ కేసులను గుర్తించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ధ్రువీకరించారు.

ఇంతకుముందు 2016-17లో గుజరాత్‌లో జికా వైరస్ కేసులు గుర్తించారు.

దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్ వల్ల పిల్లల్లో మెదడు పరిమాణం తగ్గిపోవడంతో పాటు గిలన్ బరె సిండ్రోమ్ అనే ఆటో ఇమ్యూన్(రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని కణాలపైనే దాడి చేయడం) వ్యాధి వచ్చే అవకాశమూ ఉంటుంది.

సాధారణంగా దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్ సెక్స్ వల్ల కూడా వ్యాపిస్తుంది.

దోమలు

ఫొటో సోర్స్, Getty Images

తిరువనంతపురంలో కొత్తగా గుర్తించిన జికా వైరస్ కేసులన్నీ హెల్త్ కేర్ రంగంలో పనిచేస్తున్నవారిలోనే గుర్తించారు.

తమిళనాడు సరిహద్దుల్లోని ఒక పట్టణానికి చెందిన 24 ఏళ్ల గర్భిణికి మొట్టమొదట ఈ వైరస్ సోకిందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

జ్వరం, తలనొప్పి, ఒళ్లంతా దద్దుర్లతో బాధపడుతున్న ఆమెను జూన్ 28న ఆమెను తిరువనంతపురంలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. జులై 7న ఆమె ప్రసవించింది.

''ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉంది. సాధారణ ప్రసవమైంది. వైరస్ సోకడానికి ముందు ఆమె కేరళ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన దాఖలాలు లేవు'' అని మంత్రి చెప్పారు.

''రుతు పవనాల కారణంగా కురుస్తున్న వర్షాలతో దోమలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అవి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి'' అన్నారామె.

వైరస్ ప్రబలిన ప్రాంతాలకు ప్రభుత్వం అధికారుల బృందాలను పంపించిందని కేరళ హెల్త్ సెక్రటరీ రాజన్ ఖోబ్రగడే 'బీబీసీ'తో చెప్పారు.

ఆ బృందాలు ప్రజలకు జికా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తాయని.. గర్భిణులు, జంటలు ఈ వ్యాధికి గురికాకుండా జాగ్రత్తలు చెబుతాయని తెలిపారు.

భారత్‌లో తొలి కరోనా కేసు కూడా కేరళలోనే 2020 జనవరిలో గుర్తించారు.

కేరళలో కోవిడ్ సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ గత వారం రోజులుగా పాజిటివ్ కేసుల రేటు 10 శాతం కంటే ఎక్కువగానే ఉంటోంది.

వీడియో క్యాప్షన్, జికా వైరస్: కేరళలో 15 కేసులు, దోమలతోనే కాదు సెక్స్ ద్వారానూ వ్యాపించే వైరస్

మొట్టమొదట ఎక్కడ గుర్తించారు?

జికా వైరస్‌ను మొట్టమొదట 1947లో యుగాండాలోని జికా అటవీ ప్రాంతంలోని కోతులలో గుర్తించారు. ఇది అంతకుముందు లేని కొత్త వైరస్ అని 1952లో తేల్చారు.

మనుషులలో మొదట ఎప్పుడంటే?

* మనుషులకు కూడా ఈ వైరస్ సోకినట్లుగా 1954లో నైజీరియాలో గుర్తించారు.

* ఆ తరువాత ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలు, పసిఫిక్ ద్వీప దేశాల్లోనూ జికా వైరస్ కేసులు బయటపడ్డాయి.

* 2015 మే నెలలో బ్రెజిల్ ఇది తీవ్రంగా వ్యాపించింది.

భారత్‌లో మొదటి కేసు ఎప్పుడు? ఏ రాష్ట్రంలో?

2016-17లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో జికా వైరస్ కేసులు నమోదయ్యాయి.

జికా వైరస్ భారతీయులకూ సోకే ప్రమాదం ఉందని 1953లోనే ఒక పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.

ఎలా వ్యాపిస్తుంది?

* జికా వైరస్ దోమల ద్వారానే కాకుండా సెక్స్ వల్ల కూడా వ్యాపిస్తుంది.

లక్షణాలు ఏమిటి?

* జ్వరం, కీళ్ల నొప్పులు, దద్దుర్లు, కళ్లు ఎర్రబారడం దీని లక్షణాలు

* జికా వైరస్ సోకిన ప్రతి అయిదుగురిలో ఒకరికి మాత్రమ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ వల్ల కొందరు ప్రాణాలు కూడా కోల్పోతారు.

చికిత్స ఉందా?

* ఈ వ్యాధికి ఇంతవరకు చికిత్స లేదు. దోమలు కుట్టకుండా జాగ్రత్త పడడమే దీనికి పరిష్కారం.

దోమల నివారణకు చర్యలు తీసుకోవడం వల్ల వ్యాధి బారిన పడకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)