కరోనావైరస్‌: కేరళలో ఐదేళ్ల చిన్నారి – ఆస్ట్రేలియాలో తల్లిదండ్రులు... ప్రయాణాలపై ఆంక్షలతో భారత్‌లో చిక్కుకున్న పిల్లలు

అయిదేళ్ల జొహానా కోవిడ్ మహమ్మారి కారణంగా భారతదేశంలో చిక్కుకుపోయిన 173 మంది పిల్లల్లో ఒకరు.

ఫొటో సోర్స్, DRISYA DILIN

    • రచయిత, టిఫనీ వెర్థీమర్
    • హోదా, బీబీసీ న్యూస్

2019 నవంబరు నుంచి నా కూతురు భారత్‌లోనే ఉండిపోయింది. తనను విడిచి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. - ఉద్వేగంతో తండ్రి దిలిన్‌ చెప్పిన మాటలివి.

అయిదేళ్ల జొహానా కోవిడ్ మహమ్మారి కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన 173 మంది పిల్లల్లో ఒకరు. ప్రస్తుతం జొహానా తన తాత, అమ్మమ్మలతో కలిసి ఉంటోంది.

జొహానా తల్లిదండ్రులు దృశ్య, దిలన్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఆ పాపను ప్రభుత్వం ప్రత్యేకంగా నడిపిన విమానాల్లో సిడ్నీ తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ తోడుగా వెళ్లడానికి ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడం కుదరలేదు. స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విమానాల్లో 14 సంవత్సరాల లోపు పిల్లలను ఒంటరిగా అనుమతించరు. భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య విమానాలు నడిపే కాంటాస్ విమానయాన సంస్థ కూడా మైనర్లను ఒంటరిగా ప్రయాణించడానికి అనుమతించదు.

ప్రస్తుత పరిస్థితుల్లో దృశ్య, దిలిన్‌లు భారత్‌కు వచ్చి, తమ కుమార్తెను తీసుకుని సిడ్నీ రావడానికి అనుకూల పరిస్థితులు లేవు. ఎందుకంటే రెండు దేశాల మధ్య పరిమిత సంఖ్యలోనే ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు.

"మా చిన్నారి ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. పాప మాపై బెంగ పెట్టుకుంది" అని ఆయన శుక్రవారం ఆస్ట్రేలియా సెనేట్ కమిటీకి చెప్పారు.

అయిదేళ్ల జొహానా కోవిడ్ మహమ్మారి కారణంగా భారతదేశంలో చిక్కుకుపోయిన 173 మంది పిల్లల్లో ఒకరు.

ఫొటో సోర్స్, DRISYA DILIN

ఫొటో క్యాప్షన్, అయిదేళ్ల జొహానా కోవిడ్ మహమ్మారి కారణంగా భారతదేశంలో చిక్కుకుపోయిన 173 మంది పిల్లల్లో ఒకరు.

ఇక జొహానా తల్లితండ్రులకు మిగిలిన ఏకైక మార్గం ఎయిర్ ఇండియా విమానం లేదా ఏదైనా ప్రైవేటు విమానంలో ఆ పాపను వెనక్కి రప్పించుకోవాలి.

జొహానా తల్లిదండ్రులు చివరకు బెంగళూరు నుంచి సిడ్నీ వెళ్లే ఓ ఛార్టర్డ్ విమానంలో ఓ టికెట్ సంపాదించగలిగారు.

ఈ విమానం మే 6న సిడ్నీ చేరాల్సి ఉంది. కానీ, భారత్‌లో పెరిగిన కోవిడ్ కేసుల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది.

తమకు ఇదే చివరి ఆశగా ఉండేదని దిలిన్ బీబీసీకి చెప్పారు. "ఒక్కోసారి ఆశ కలుగుతుంది. ఆ వెంటనే ఇలాంటి నిర్ణయాలు మా ఆశలను కూల్చేస్తాయి. మేం చాలా కృంగిపోయాం" అని ఆయన చెప్పారు.

దృశ్య, దిలిన్ వారి కథను ఆస్ట్రేలియా సెనేట్ కమిటీకి వినిపించారు. భారత్‌లో చిక్కుకుని ఉండిపోయిన ఆస్ట్రేలియా పౌరులను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ కమిటీ పరిశీలిస్తోంది.

జొహానా రావల్సిన విమానంలో ఆ పాపతో పాటు మరో ఏడుగురు పిల్లలు ఉన్నారని దృశ్య ఈ కమిటీకి చెప్పారు.

ఈ దంపతులు తమ లాంటి సమస్యను ఎదుర్కొంటున్నవారితో సోషల్ మీడియాలో సంప్రదించారు. కొంత మంది జొహానా కంటే చిన్న వయసు పిల్లలు కూడా ఉన్నారు.

"అలాంటి పిల్లలందరినీ... ఎవరూ తోడు లేకపోయినా ప్రత్యేక విమానాల్లో కాని, ప్రైవేటు ఛార్టర్డ్ విమానాల్లో కాని వెనక్కి తీసుకుని రావాలని వారందరి తరపునా నేను అభ్యర్ధిస్తున్నాను" అని దిలిన్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

Presentational white space

కేవలం పిల్లల కోసమే విమానం పంపడం గురించి ఇంకా ఆలోచించలేదని సీనియర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫారెన్‌ అఫైర్స్‌ అండ్‌ ట్రేడ్‌ (డీఎఫ్‌ఏటీ) అధికారి లినెట్ వుడ్ చెప్పారు.

అయితే, ఆ పిల్లలను వెనక్కి తెచ్చేందుకు ఆ పిల్లల కుటుంబాలతో కలిసి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు.

డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎవరూ తోడు లేని 20 మంది మైనర్లను ఆస్ట్రేలియాకు తీసుకుని వచ్చినట్లు భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బ్యారీ ఓ ఫారెల్ చెప్పారు.

దృశ్య, దిలన్ ఆస్ట్రేలియాకు వెళ్లక ముందు మలేసియాలో నివసించే వారు. మలేసియాలో ఉండగానే కేరళలో ఉండే తాతయ్య ఇంట్లో జొహానాను వదిలి వెళ్లారు.

ఆ తర్వాత కొన్ని నెలలకు వీరు మలేసియా నుంచి సిడ్నీ వెళ్లారు.

జొహానాను సిడ్నీ తీసుకుని వెళ్దామని అనుకునే లోపు గత ఏడాది భారత్‌లో కోవిడ్ వ్యాప్తి మొదలైంది. దీంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలను భారత్‌ రద్దు చేసింది.

దాంతో జొహానా భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. జొహానా... మలేసియా వీసా కూడా గడువు దాటిపోయింది.

"జొహానా చాలా పెద్దదై ఉంటుంది. తనను మళ్లీ ఎప్పుడు చూస్తామో తెలియట్లేదు. మేం కోల్పోయిన సమయం తిరిగి రాదు" అని సెనేట్ కమిటీకి దిలిన్ చెప్పారు.

"మేం మా కూతురు బాల్యాన్ని దగ్గరగా చూసే అవకాశాన్ని కోల్పోయాం. ఇప్పటికే సంవత్సరం దాటింది" అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పారు.

దృశ్యకు తన కూతురు గుర్తొచ్చి నిద్ర పట్టక రాత్రంతా ఏడుస్తూనే ఉంటారు.

"మా అమ్మాయి పడుతున్న మానసిక బాధ మాకు అర్థమవుతుంది. పుస్తకాలు లాంటివి కొంటూ తనను సంతోషంగా ఉంచడానికి మేం ప్రయత్నిస్తున్నాం. కానీ, తల్లిదండ్రుల లోటును ఇంకేదీ తీర్చలేదు" అని దిలిన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)