రెమ్‌డెసివర్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్‌ విక్రయాలకు ప్రభుత్వమే కారణమా

కరోనా వైరస్
ఫొటో క్యాప్షన్, రెమ్‌డెసివిర్ కోసం చాలామంది కరోనా బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
    • రచయిత, శ్రీనివాస్ లక్కోజు
    • హోదా, బీబీసీ కోసం

ఎబోలా వ్యాధి నియంత్రణ తయారుచేసిన రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ కరోనా వైరస్‌‌పైనా కూడా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలడంతో దేశవ్యాప్తంగా దానికి డిమాండ్ బాగా పెరిగింది.

అయితే, ప్రాణాన్ని కాపాడుతుందన్న నమ్మకంతో బాధితులు, ముందు జాగ్రత్త కోసం కొందరు దాన్ని కొనుగోలు చేస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్‌కు వెళ్తోంది.

సరఫరా విధానాల వల్లే రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెట్‌కు తరలుతోందని నిపుణులు చెబుతుండగా, నిల్వలు సరిపడా ఉన్నాయని, అక్రమ అమ్మకాలను అడ్డుకుంటున్నామని ఏపీ ప్రభుత్వ అధికారులు అంటున్నారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, HETERO

ఫొటో క్యాప్షన్, కోవిడ్ చికిత్స లో రెమ్‌డెసివిర్ ప్రభావవంతంగా పని చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంత డిమాండ్?

కరోనా పాజిటివ్ అని తెలియగానే...చాలా మంది రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కొనేందుకు సిద్దపడిపోతున్నారు. కొందరు ముందు జాగ్రత్తగా కొని దాచి పెట్టుకుంటున్నారు. దీంతో ఆ ఇంజెక్షన్ మెడికల్‌ షాపుల్లో సులభంగా దొరకడం లేదు.

డిమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య కూడా చాలా తేడా ఉంది. ఇదే బ్లాక్ మార్కెట్‌కు దారి తీస్తోంది.

కరోనా వైరస్‌ చికిత్సలో ఇది కొంత మేర ప్రభావవంతంగా పని చేస్తోందని పరిశోధనల్లో తేలింది. ''కరోనా సోకిన వారిలో 85% మందికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు.

అందులో కేవలం 15% మంది ఆసుపత్రిలో చేరితే, వారిలో 10% మందికి ఆక్సిజన్ అవసరం, మరో 5% మందికి వెంటిలేటర్ అవసరం ఉంటుంది.

ఆక్సిజన్ అవసరం ఉండి, ఊపిరి తీసుకోవడం సమస్యగా మారుతున్న వారికి మాత్రమే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ అవసరం.'' అని విశాఖపట్టణానికి చెందిన డాక్టర్ రమణ మూర్తి బీబీసీతో అన్నారు.

ఆయన కొవిడ్ బాధితులకు చికిత్స విభాగంలో పని చేస్తున్నారు.

''ఏప్రిల్ 29 నాటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 1000 నుంచి 1200 మందికి మాత్రమే రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ అవసరం ఉంది. కానీ వైరస్‌ సోకిన ప్రతి ఒక్కరూ ఆ ఇంజెక్షన్ సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు'' అని డాక్టర్ మూర్తి అన్నారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకే రెమ్‌డెసివిర్ సరఫరా చేసేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి.

బ్లాక్ మార్కెట్ ఎందుకు మొదలైంది?

కరోనా మొదటి వేవ్ సమయంలోనే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌కు డిమాండ్ కనిపించింది. ఆ సమయంలో దేశ రాజధాని దిల్లీ సహా పలు ప్రాంతాలలో ఈ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్‌కు తరలింది.

''కరోనా రోగులకు ఇది ప్రాణదాత అన్న భావన రావడంతోనే దీనికి డిమాండ్ మొదలైంది. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ.2500 నుంచి రూ.4500 మధ్య ఉండగా, బ్లాక్ మార్కెట్‌లో రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు అమ్మిన సందర్భాలు కనిపించాయి. డబ్బులున్న వారు అవసరం లేకపోయినా కొని దాచి పెట్టుకున్నారు. ఇది దారుణం '' అని డాక్టర్ రమణ మూర్తి అన్నారు.

బేరంలో ఆలస్యమైతే ధర పెరిగిపోతుంది

చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కరోనా బాధితుడికి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ అవసరం వచ్చింది. దీన్ని సంపాదించే సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన బీబీసీతో పంచుకున్నారు.

ఓ ఆసుపత్రిలో సిబ్బందే బ్లాక్ మార్కెట్ వ్యక్తి నెంబర్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ''ఆ నంబర్‌కు ఫోన్ చేశాను. వారు మరో రెండు, మూడు నెంబర్లు ఇచ్చి అక్కడ ప్రయత్నించమన్నారు.

చివరకు ఓ వ్యక్తిని సంప్రదించినప్పుడు ఒకే ఇంజెక్షన్ ఉందని, ధర రూ.30వేలు అని చెప్పారు. డబ్బు సిద్దం చేసుకుని రేపు ఉదయం ఫోన్ చేస్తా అని చెప్పాను. ఉదయం ఫోన్ చేయగానే, ఇప్పుడు దాని ధర రూ.45 వేలు అన్నారు '' అని బాధితుడు వివరించారు.

అదేంటి అని అడిగితే ‘‘రూ.60 వేలు పెట్టి కొనడానికి కూడా సిద్దంగా ఉన్నారు, మీరే నిర్ణయించుకోండి’’ అని అవతలి వ్యక్తి తేల్చి చెప్పేసినట్లు బాధితుడు వివరించారు.

'' విధిలేని పరిస్థితుల్లో రూ.45 వేలు పెట్టి కొనాల్సి వచ్చింది'' అని ఆయన వెల్లడించారు.

రెమ్‌డెసివిర్ పేరుతో తనకు జరిగిన మోసాన్ని ఓ కరోనా బాధితుడి భార్య సెల్ఫీ వీడియో ద్వారా వివరించారు.

'' నా భర్త చికిత్సకు రెమ్‌డెసివిర్ కావాలని వైద్యులు చెప్పారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది తమ వద్ద ఆ ఇంజెక్షన్లు ఉన్నాయంటూ ఫోన్ చేశారు.

6 ఇంజెక్షన్లకు రూ. 3.50 లక్షలకు బేరం కుదిరింది. అప్పు చేసి ఆ డబ్బు కట్టాను. కానీ ట్రీట్‌మెంట్ సమయంలో నా భర్తకు రెమ్‌డెసివిర్ కాక, వేరే ఇంజెక్షన్లు ఇచ్చారు. దీంతో ఆయనకు సీరియస్ అయింది.

తర్వాత ఆయన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేశాను. కానీ నా డబ్బులు అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు'' అని ఆమె వాపోయారు.

రెమ్‌డెసివిర్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన వారిలో చాలామంది అనుభవాలు దాదాపు ఇలాగే ఉన్నాయి.

కరోనా వైరస్
ఫొటో క్యాప్షన్, రెమ్‌డెసివిర్ కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది.

రెమ్‌డెసివిర్ కొరతే లేదు...

రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు కొరతే లేదని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఏపీలోని ప్రైవేటు ఆసుపత్రులకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ప్రభుత్వమే సరఫరా చేస్తోందన్నారు.

ప్రభుత్వాసుపత్రులు, నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో రెమ్‌డెసివిర్, ఆక్సిజన్, ఇతర మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, బ్లాక్‌ మార్కెట్‌కు తరలి పోకుండా జిల్లా స్థాయిల్లో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

''బయటకు వెళ్లి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కొనుగోలు చేయమంటూ రోగులకు లేఖలు ఇస్తున్న ఆస్పత్రులలో తనిఖీ చేస్తున్నాం.

రెమెడెసివిర్ ధరలు గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చాయి. కొరత ఉన్నచోట వెంటనే అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాం'' అని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.

ఏప్రిల్ 28 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 28,994 డోసుల రెమ్‌డెసివిర్ అందుబాటులో ఉందని సింఘాల్ చెప్పారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎబోలా కోసం రెమ్‌డెసివిర్ ను తయారు చేశారు.

కరోనా సెకండ్‌ వేవ్‌తో రెమ్‌డెసివిర్ డిమాండ్ అమాంతం పెరిగింది. మందుల షాపుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ ఇంజెక్షన్‌ను ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ద్వారా డ్రగ్ కంట్రోల్ బోర్డు సరఫరా చేస్తోంది.

అయితే, ప్రభుత్వం కోవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించిన వాటికి మాత్రమే రెమ్‌డెసివిర్ సరఫరా అవుతోందని, ఇది సరైన విధానం కాదని విశాఖ కెమిస్ట్ సొసైటీ అధ్యక్షుడు బగ్గం శ్రీనివాసరావు అన్నారు.

''నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులకు సప్లయ్ చేయాలని ఉత్పత్తి సంస్థలను ప్రభుత్వం ఆదేశించడంతోనే బ్లాక్‌ మార్కెట్ మొదలైంది. ఈ ఆదేశాలతో మిగిలిన ఆసుపత్రుల్లో, షాపుల్లో రెమ్‌డెసివిర్ దొరకడం లేదు.

దీనికి బదులుగా అన్ని ఆసుపత్రుల్లో, మందుల షాపుల్లో రెమ్‌డెసివిర్ అందుబాటులోకి తేవాలి. అవసరమైతే డ్రగ్స్ డిపార్ట్‌మెంట్ నేరుగా సరఫరా చేయాలి'' అని శ్రీనివాసరావు అన్నారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Reuters

బ్లాక్‌ మార్కెట్ బట్టబయలు

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెట్ దందా నడుస్తున్నట్లు తేలింది. విశాఖ, గుంటూరు నగరాలలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ రెండు చోట్లా కరోనా సోకిన వారి బంధువులుగా నటిస్తూ బ్లాక్ మార్కెట్ దందాను పోలీసులు గుర్తించారు.

''గుంటూరులో ఒక్కో రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్ రూ.38,000 వేల చొప్పున 6 ఇంజక్ష‌న్‌లను రూ.2,28,000 ల‌క్ష‌ల‌కు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇంజ‌క్ష‌న్లు డెలివ‌రీ ఇచ్చే స‌మ‌యంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం.'' అని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాకు చెప్పారు.

కొన్ని రోజుల కిందట విశాఖలో ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో కరోనా బాధితులుగా నటిస్తూ, బ్లాక్ మార్కెట్‌లో రెమ్‌డెసివిర్ అమ్ముతున్న నలుగురు ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందిని రీజినల్ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

''రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ నిల్వలపై నిఘా పెట్టాం. ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మే వారిని పట్టుకునేందుకు పోలీసులు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రగ్‌ కంట్రోల్, మెడికల్ అండ్ హెల్త్ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి.'' అని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ మీడియాతో అన్నారు.

''రెమ్‌డెసివిర్‌ ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నట్లు తెలిస్తే 100కు, 1902కు కాల్ చేసి చెప్పండి'' అని సవాంగ్ ప్రజలకు సూచించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా రెమ్‌డెసివర్‌ వాడకం గురించి పలుమార్లు స్పష్టత ఇచ్చింది. ఆసుపత్రులలో మాత్రమే ఈ మందు వాడాలని.. ఇదేమీ లైఫ్ సేవింగ్ డ్రగ్ కాదని చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)