కేరళ: బీజేపీ నాయకుల పేర్లు వినిపిస్తున్న ఆ ‘‘బ్లాక్ మనీ కేసు’’ అసలు కథ ఏంటి....ఎందుకు మలుపులు తిరుగుతోంది?

ఫొటో సోర్స్, Twitter/@BJP4Keralam
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేరళలో ‘‘ముడుపుల వ్యవహారం’’గా మీడియాలో సంచలనం రేపుతున్న కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంటోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరైనవారిలో బీజేపీ జిల్లా స్థాయి నాయకులు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
రాహ్‌జనీలో ఓ కారు ప్రమాదం అనంతరం రూ.3.5 కోట్ల చోరీ చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. అయితే, ఈ కారు ప్రమాదమే ఫేక్ అంటూ వార్తలు వచ్చాయి.
ఈ ప్రమాదంపై ఆరెస్సెస్ కార్యకర్త, బీజేపీకి ఎన్నికల సామగ్రి సమకూర్చిన ఏకే ధర్మరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు, ఏప్రిల్ 3న ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
అయితే, ఈ కేసు చాలా మలుపులు తిరిగింది. ప్రస్తుతం ఇది కేరళ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్ కుమారుడిని పోలీసులు విచారించే వరకు వచ్చింది.
తమ పార్టీ పరువు, ప్రతిష్ఠలను దెబ్బ తీసేందుకే ఇలా చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
ఈ కేసు గురించి తమకు మరిన్ని వివరాలు సమర్పించాలని కోచి జోన్ పోలీసు విభాగాన్ని ఈడీ కోరిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం అసెంబ్లీలో చెప్పారు.
ఇంతకీ కేరళలో సంచలనం రేపుతున్న ఈ కేసు కథ ఎలా మొదలైంది? బీజేపీ నాయకులు దీనిలోకి ఎలా వచ్చారు?

ఫొటో సోర్స్, Twitter/P Vijayan
అసలు ఏం జరిగింది?
ఈ కేసుపై ఓ సీనియర్ పోలీసు అధికారి బీబీసీతో మాట్లాడారు. అయితే, ఆయన తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు.
‘‘బహుశా, కర్ణాటక నుంచి ఆ డబ్బును తీసుకొస్తూ ఉండొచ్చు. త్రిశూర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుండగా ఆ కారు ప్రమాదం జరిగింది’’.
‘‘ఘటనపై ధర్మరాజన్ డ్రైవర్ షంజీర్ వచ్చి ఫిర్యాదు చేశారు. త్రిశూర్-కోడాకార్ జంక్షన్ వద్ద ప్రమాదం జరిగిందని వివరించారు. మొదట తమ దగ్గరున్న రూ.25 లక్షలు చోరీకి గురయ్యాయని చెప్పారు. ఎంత డబ్బు చోరీ అయ్యిందన్న విషయంలో, ఆ తర్వాత మాట మార్చారు’’.
‘‘పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కారులో రూ.3.5 కోట్లు చోరీకి గురయ్యాయని ధర్మరాజన్ చెప్పారు. అరెస్టుల అనంతరం, నిందితుల దగ్గర నుంచి మేం రూ.1.12 కోట్లను రికవరీ చేయగలిగాం. అరెస్టైన 21 మందిలో కొందరు నేరుగా చోరీకి పాల్పడగా.. ఇంకొందరు దీనికి వెనుక కుట్ర పన్నారు’’.
‘‘ఈ డబ్బులు అళప్పుజలోని ఓ పార్టీ కార్యకర్త దగ్గరకు తీసుకెళ్తుండగా చోరీకి గురయ్యాయి’’.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 96 మంది సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేసినట్లు అసెంబ్లీలో విజయన్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Twitter/CMO Kerala
‘‘నిందితులు రూ.1.12 కోట్లతో 347 గ్రాముల బంగారం, కొన్ని మొబైల్ ఫోన్లు, వాచ్‌లు కొన్నారు. ఇవన్నీ ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నాం’’అని పోలీసు అధికారి చెప్పారు.
‘‘మొదట రూ.25 లక్షలు చోరీకి గురయ్యాయని చెప్పడంతో ఐపీసీలోని సెక్షన్ 395 కింద కేసు రిజిస్టర్ చేశాం. అయితే, ధర్మరాజన్ వాంగ్మూలం అనంతరం 412, 212, 129బీ సెక్షన్‌లు అదనంగా జోడించాం’’.
‘‘ఇప్పటివరకు అందిన సమాచారం, నిందితులు నుంచి సాక్షుల వరకు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ‘సిట్’ ముందుకు వెళ్తుంది. విచారణలో భాగంగానే సురేంద్రన్ కుమారుడు దిపిన్, అతడి డ్రైవర్ లిబీష్‌ల పేర్లు వినిపించాయి’’అని ఆయన చెప్పారు.
అయితే, ఈ డబ్బుల వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధమూలేదని దిపిన్, లిబీష్ తెలిపారు. బీజేపీ నాయకుడు, పార్టీ త్రిశూర్ జిల్లా అధ్యక్షుడు కేకే అనీష్, పార్టీ ప్రధాన కార్యదర్శి కె. గణేశన్‌లను కూడా ‘సిట్‘ ప్రశ్నించింది.
అయితే, తమను లక్ష్యంగా చేసుకుని కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి బి. గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Twitter/BJP Kerala
బీజేపీ ఏం చెబుతోంది?
ఈ కేసుపై బీబీసీతో గోపాలకృష్ణన్ మాట్లాడారు. ‘‘చోరీ జరిగిన రోజు రాత్రి చాలామంది బీజేపీ నాయకులకు ధర్మరాజన్ ఫోన్లు చేశారు. పార్టీ అధ్యక్షుడు సురేంద్రన్‌కు కూడా అప్పుడే ఫోన్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన అనంతరం పార్టీ జిల్లా కార్యాలయానికి వచ్చి జిల్లా అధ్యక్షుణ్ని కలిశారు’’.
‘‘అదే సమయంలో ఎన్నికలకు సంబంధించిన సామగ్రి కోసం ధర్మరాజన్‌కు చాలా మంది ఫోన్లు చేశారు. అయితే చోరీ జరిగిన రోజు రాత్రి ఎవరెవరికి ధర్మరాజన్ ఫోన్లు చేశారు. వారందరిపైనా పోలీసులు దృష్టి సారించారు. అయితే, చోరీతో బీజేపీ నాయకులకు సంబంధముందని కొందరు వార్తలు రాశారు. వాటిలో ఎలాంటి నిజమూ లేదు’’.
‘‘ధర్మరాజన్ ఫోన్ రికార్డులు చూసినప్పుడు, సురేంద్రన్ కుమారుడి పేరు బయటకు వచ్చింది. బహుశా అధికారులు ఆయన్ను కూడా ప్రశ్నించొచ్చు. అంతేకానీ, వారికి చోరీతో ఎలాంటి సంబంధమూ లేదు’’అని గోపాలకృష్ణన్ వివరించారు.
‘‘ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేరళ ముఖ్యమంత్రి, యూడీఎఫ్ కలిసి మా పార్టీ ప్రతిష్ఠను దెబ్బ తీయాలని చూస్తున్నారు’’. అన్నారు గోపాలకృష్ణన్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, BJP
సొంత పార్టీ నాయకులపైనే చర్యలు
విచారణ ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ కేసు కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా బీజేపీ తమ సొంత పార్టీ నాయకులపైనే చర్యలు తీసుకుంది.
ఉదాహరణకు బీజేపీ ఓబీసీ మోర్చా నాయకుడు రిషీ పల్పు సభ్యత్వాన్ని పార్టీ రద్దు చేసింది. ఈ కేసు వెనుక ఉన్నవారంతా రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయనపై చర్యలు తీసుకున్నారు.
విపక్ష నాయకులు మాట్లాడినట్లు వ్యాఖ్యలు చేసినందుకే రిషిపై చర్యలు తీసుకున్నామని గోపాలకృష్ణన్ చెప్పారు. ‘‘ఈ సమయంలో పార్టీలో సామరస్యత చాలా ముఖ్యం. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదు’’. అని ఆయన అన్నారు.
ఈ కేసుపై విచారణకు బీజేపీ కూడా ఒక కమిటీ ఏర్పాటుచేసింది. దర్యాప్తు అనంతరం పార్టీ అధిష్టానానికి ఈ కమిటీ నివేదిక సమర్పిస్తుంది.
ఈ కమిటీలో మెట్రోమ్యాన్‌గా ప్రఖ్యాతి గాంచిన శ్రీధరన్, మాజీ డీజీపీ జాకబ్ థామస్, రిటైర్డ్ ఐఏఎస్‌లు సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ నివేదిక సమర్పించిందో లేదో తనకు తెలియదని గోపాలకృష్ణన్ చెప్పారు. ‘‘దాని గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై శ్రీధరన్‌ను సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, ఆయన ఫోన్‌కు స్పందించలేదు.

ఫొటో సోర్స్, Twitter/@surendranbjp
డబ్బులు దేని కోసం...
ఇంతకీ ఆ కారులో తరలిస్తున్న డబ్బులు దేని కోసమో చెబుతూ రెండు రకాల వాదనలు తెరపైకి వచ్చాయి. తమకు ప్రత్యర్థిగా నిలబడుతున్న ఓ వ్యక్తికి ఈ డబ్బులు ఇచ్చి, పక్కకు తప్పించాలని చూశారనే వాదన దీనిలో మొదటిది.
రెండోది ఆ అభ్యర్థికి డబ్బులు ఇచ్చి, తమకు అనుకూలంగా మార్చుకోవడం రెండోది. ఈ రెండు ఆరోపణలతో మీడియాలో చాలా వార్తలు ప్రచురితం అయ్యాయి.
కేరళలోని జేఆర్ఎస్ పార్టీకి చెందిన గిరిజన నాయకుడు సీకే జానుకు ఎన్‌డీఏ తరఫున పోటీ చేసేందుకు లక్షల రూపాయలు చెల్లించారని వార్తలు వచ్చాయి. అయితే, అటు బీజేపీ, ఇటు జాను... ఇద్దరూ ఈ వార్తలను ఖండించారు.
మరోవైపు తన నామినేషన్ వెనక్కి తీసుకునేందుకు రూ.2 లక్షలు, ఒక మొబైల్ ఫోన్ ఇస్తామని బీజేపీ చెప్పిందని బీఎస్పీ అభ్యర్థి కే సుందర్ వ్యాఖ్యానించారు. తన తల్లికి కూడా రూ.50,000 ఇస్తామని చెప్పారని అన్నారు.
సురేంద్రన్ పోటీ చేసిన నియోజకవర్గం నుంచే సుందర్ కూడా పోటీ చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు.
సుందర్ చెబుతున్నవన్నీ కట్టుకథలని బీజేపీ అన్నది. అయితే ఈ ఆరోపణలపై కాసర్‌గోడ్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
‘‘ముడుపుల వ్యవహారం’’ కేసులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. కానీ విచారణ మాత్రం ఫుల్ స్పీడ్‌లో చేపడుతున్నామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టంచేశారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్ వ్యాక్సీన్లు ఎంతవరకు సురక్షితం?
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- కోవిడ్-19: పిల్లలకు ఎక్కువగా వ్యాపిస్తే ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందా?
- బ్లాక్ ఫంగస్: భారత్‌లో అధిక సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులకు డయాబెటిస్ కారణమా?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- ఉత్తర కొరియా: విదేశీ వీడియోలు చూస్తే 15 ఏళ్ల జైలు శిక్ష.. సీడీలు, పెన్‌డ్రైవ్‌లతో దొరికితే మరణ శిక్ష
- ఏసీలు చల్లబరుస్తున్నాయా.. లేక వేడెక్కిస్తున్నాయా?
- దిల్లీ: ఐసీయూ వార్డు విడిచిపెట్టి వెళ్లిపోయిన డాక్టర్లు.. ఆక్సిజన్ అందక చనిపోయిన రోగులు
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








