ఇందిరాగాంధీ అప్పట్లో ఎదుర్కొన్న సమస్య, ఇప్పుడు నరేంద్ర మోదీ ఎదుర్కొంటున్న సమస్యా ఒక్కటే: అభిప్రాయం

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జింకా నాగరాజు
    • హోదా, బీబీసీ కోసం

ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గుబులు మొదలైంది. ఎవరికీ అంతుబట్టని రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల మీద దాడులు జరగడం, తెలంగాణలో రెండు ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం దీనికి కారణం.

వానాకాలం, ఎండా కాలం లాగా, ఆలయాల మీద దాడుల కాలమా అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లా నుంచి రోజూ 'ఆలయాల మీద దాడి' అనే వార్తలొచ్చాయి. ఆలయాల గోడల మీద పెచ్చులూడినా అదొక దాడిగా ప్రచారమైంది.

ఇక గత ఏడాది డిసెంబర్‌లో విజయనగరం జిల్లా 'రామతీర్థం' ఆలయ విగ్రహం మీద దాడి జరిగినపుడు ఎంత రాజకీయ సందడి జరిగిందో చెప్పలేం. చిన్నవి, పెద్దవి కలసి మొత్తం రాష్ట్రంలో 228 దాడులు జరిగాయని రాజకీయ పార్టీలు జాబితాలను ప్రకటించాయి.

దీనితో బీజేపీ శ్రేణుల్లో ఎంత ఉత్సాహం కనిపించిందో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికేదో ముప్పు వస్తోందా అన్నంతగా కలకలం రేగింది. గుప్తనిధి దొరికినంతగా భారతీయ జనతా పార్టీలో అసహజ ఆనందం వచ్చింది.

ఆ దాడుల కాలంలో ఎక్కడ చూసినా బీజేపీ కనిపించింది. బీజేపీ గంభీరోపన్యాసాలు వినిపించాయి. రాష్ట్రానికి ఉపద్రవమేదో ఎదురవుతున్నంతగా బీజేపీ నేతలు ఆందోళన చెందారు.

రామతీర్థం ఆలయం

ఫొటో సోర్స్, ugc

జగన్‌ని రాముడు శపిస్తున్నాడన్నారు. అసలే, జాతీయ స్థాయిలో రామాలయం నిర్మాణం ఒక పెద్ద రాజకీయ సమీకరణ అవకాశంగా మారింది.

ఇలాంటపుడు ఆంధ్రలో 'రామతీర్థం రామాలయం' మీద దాడి జరిగింది. రెండు నెలల పాటు ప్రతిరోజు ఆ దాడి వార్తలే వినిపించాయి. దాడి వ్యతిరేక రాజకీయ ర్యాలీలే కనిపించాయి. ఇది రాష్ట్రంలో బీజేపీకి కొండంత బలమిస్తుందని అంతా భయపడ్డారు.

ఇక ఆంధ్రలో బీజేపీ పుంజుకుంటుందని, వచ్చేసారి అధికారంలోకి రాలేకపోయినా, బీజేపీ బలం పెరుగుతుందని రాజకీయ పండితులంతా లెక్కలేశారు. 

అయితే, దాడుల సీజన్ వచ్చినట్లే... వెళ్లిపోయింది. దాడులను ఎవరు చేశారో, ఎందుకు చేశారో, ఎందుకు మానేశారో పూర్తిగా తెలియక ముందే దాడులు ఆగిపోయాయి. రామతీర్థాన్ని అంతా మర్చిపోయారు. మళ్లీ బీజేపీ తెరమరుగైంది.

గురుమూర్తి

ఫొటో సోర్స్, ycp

ఇపుడు తిరుపతి లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఎం గురుమూర్తి విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎ.రత్నప్రభ మూడోస్థానానికి జారుకున్నారు. టీడీపీ రెండోస్థానంలో బలంగానే నిలబడింది.

పోలైన ఓట్లను విశ్లేషించుకుని, బీజేపీ సంతోషించేందుకు ప్రయత్నించవచ్చు. పార్టీ జనసేనతో జట్టుకట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇదీ బీజేపీకి ఆంధ్రలో ఎదురైన పరాభవం.

ఇలాంటి కాషాయం పాల పొంగు తెలంగాణలో కూడా ఎదురైంది. ఇది 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి నాలుగు స్థానాలు రావడంతో మొదలైంది.

గత ఏడాది నవంబర్‌లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు గెలుపొందడం రాజకీయ పార్టీలనే కాదు, ఎంతో నిగ్రహం పాటించాల్సిన పండితుల్లో కూడా కలవరం సృష్టించింది. 

ఇక తెలంగాణ రాష్ట్ర సమితి పతనం మొదలైందని, ఇప్పటి నుంచి అధికార పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వరస పరాజయాలేనని కూడికలు, తీసివేతలెన్నో వేశారు .

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన వారసుడనుకుంటున్న మునిసిపల్, ఐటి శాఖ మంత్రి కేటీ రామారావు, మరొక కీలకమయిన మంత్రి హరీష్ నియోజకవర్గాల మధ్య ఉన్న దుబ్బాకలో టీఆర్‌ఎస్ ఓడిపోవడమేమిటి? ఇది శుభ సూచకం కాదని అంతా భావిస్తున్నారు.

బండి సంజయ్

ఫొటో సోర్స్, BANDI SANJAY

ఈ వార్తలు, విశ్లేషణలు ఇంకా వస్తున్నపుడే 2020 డిసెంబర్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్యంగా 48 డివిజన్లు వచ్చాయి. దీంతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల కళ్ల ముందు టీఆర్ఎస్ కుప్పకూలిపోవడం కనిపించింది.

తెలంగాణలో బీజేపీకి బలం చేకూరుతోందని, తెలంగాణలో బీజేపీ బలపడటం అంటే తమిళనాడులో ప్రవేశించేందుకు ముఖద్వారం కావడమేనని కొందరు తెగేసి చెప్పారు.

బీజేపీ గొంతు పెంచింది. భాషకు పదును పెట్టింది. ఈ రెండు ఎన్నికలు సృష్టించిన వాతావరణం చూసి చాలా మంది తెలంగాణ మేధావులు ఆందోళన చెందారు. కొంత మంది కవులు, కళాకారులు, మేధావులు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేసి కాషాయ శక్తులను తెలంగాణకు దూరంగా ఉంచండని ప్రకటన జారీ చేశారు.

అందరికంటే ఎక్కువ భయపడింది టీఆర్ఎస్ పార్టీయేననిపిస్తుంది. అందుకే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో దుబ్బాక అనుభవం ఎదురు కాకూడదని ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్, స్వయానా తమ అభ్యర్థి నోముల భరత్ తరపున ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. పెద్ద ప్రచార సుడిగాలి సృష్టించారు.

ఈ ఎన్నిక టీఆర్ఎస్ - బీజేపీల మధ్య కాదు అనే చెప్పేందుకు టీఆర్ఎస్ ఎంత తాపత్రయ పడిందో. బీజేపీ సృష్టించిన భయం అలాంటిది.

కాని, చివరకేమైంది? టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భరత్ అఖండ విజయం సాధించారు. బీజేపీ ఎక్కడో మూడో స్థానంలో పడిపోయింది.

నరేంద్ర మోదీ, అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

2018 నుంచి బీజేపీ వరుస పరాభవాలు

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకంటే భిన్నమైన తీర్పుకాదు. అక్కడ కనిపించిన బీజేపీ వ్యతిరేక ఒరవడే ఇక్కడా కనిపిస్తుంది.

ఈ ఒరవడి 2018లోనే మొదలయింది. అప్పటి నుంచి ఇపుడు ఫలితాలొచ్చిన అయిదు అసెంబ్లీల వరకు అదే ఒరవడి కొనసాగడం కనిపిస్తుంది.

2018 ఫిబ్రవరి నుంచి ఇప్పటి దాకా దేశంలో 23 అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. 2020 దాకా జరిగిన ఎన్నికల్లో త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లలో తప్ప ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ స్వయానా అధికారంలోకి రాలేదు.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చరిత్రాత్మకమయింది. అక్కడి నుంచి మొదలయిన ఎదురు దెబ్బలు ఇంకా ఆగడంలేదు. ఒడిశా లాంటి, కొత్త రాష్ట్రాలను గెల్చుకోలేకపోవడం కాదు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లాంటి బలమైన రాష్ట్రాలను బీజేపీ కోల్పోయింది. బిహార్‌ వంటి చోట్ల సంకీర్ణాలు బాగా బలహీనపడ్డాయి.

ఇపుడు బీజేపీ అస్సాంను నిలబెట్టుకుంది తప్ప సాధించిందేమీ లేదు. అస్సాం గెలుపు, పశ్చిమబెంగాల్‌లో జరిగిన పరాభవానికి ఊరట కాలేదు.

ఎందుకంటే, బెంగాల్‌లో 200 సీట్లు గెల్చుకోవాలని ఒక వైపు నుంచి ప్రధాని మోదీ, మరొక వైపు నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా విపరీతంగా చెమటోడ్చారు.

ఈ ఎన్నికని యుద్ధంలాగా మార్చారు. అన్ని రకాలుగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి ఊపిరాడని పరిస్థితి సృష్టించారు.

ఆ రాష్ట్రంలో అన్ని విద్యలు ప్రదర్శించి బీజేపీ సాధించిందేమిటి? కాంగ్రెస్, సీపీఎం సీట్లని లాక్కోవడమే తప్ప, బెంగాల్ మీద మమతా బెనర్జీ పట్టును సడలించలేకపోయింది.

ఇక తమిళనాడు, కేరళ విషయానికి వస్తే, అక్కడ పట్టు సంపాదించేందుకు వేసిన ఎత్తులన్నీ చిత్తయ్యాయి.

తమిళనాడులో అన్నాడీఎంకే భుజాలెక్కిన బీజేపీ తమిళులను ఆకట్టుకోవాలనుకుంది. ఆ రెండూ మునిగిపోయాయి. కేరళలో బీజేపీ అయ్యప్ప గుడి రాజకీయాలు పనిచేయనే లేదు.

మోదీ బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

మోదీ, బీజేపీ బలహీనత ఏమిటి?

ఇంతవరకు మనం చూసిన ప్రధానులు అందరిలో నరేంద్ర మోదీ విశిష్టమయిన వ్యక్తి. గతంలో ఇంతగా ఉపన్యాస వశీకరణ విద్య ప్రయోగించిన ప్రధానులెవరూ లేరు.

ఆ మాటకొస్తే, ఇందిరాగాంధీ కూడా మోదీ ముందర బలాదూరే. మోదీ ముఖ వర్చస్సు కూడా చూపరులను ఆకట్టుకుంటుంది.

అయితే, రాష్ట్రాల ఎన్నికల్లో ఆయనకు ఎదురవుతున్న పరాజయాలను జాగ్రత్తగా గమనిస్తే ప్రధాని రాజకీయ వ్యూహంలో ఒక పెద్ద బలహీనత స్పష్టంగా కనిపిస్తుంది. 

న్యూదిల్లీలోని పార్లమెంటులో ఆయన చాలా బాహుబలే. బీజేపీ బలగాన్ని 303 సీట్లకు పెంచిన అసమాన శక్తి ఆయనది. అయితే, ఆయన బలహీనత కూడా అదేనేమో అనిపిస్తుంది.

న్యూదిల్లీ నుంచి దూరంగా ఏ దిక్కుకు వెళ్లినా ఆయన ప్రభావం క్రమంగా తగ్గిపోతూ చివరకు శూన్యంగా మారుతుంది.

ఉదాహరణకు తూర్పున.. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం బలంగా ఉంటుంది. బీహార్‌లో సంకీర్ణ ప్రభుత్వం బలహీనం, బెంగాల్‌లో శూన్యం.

దక్షిణం వైపు వస్తే, మధ్యప్రదేశ్‌లో అతికష్టం మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అక్కడి నుంచి ఒకడుగు తూర్పుకు వేస్తే, చత్తీస్‌గడ్‌లో అధికారం కోల్పోయింది.

మరో అడుగు కిందికి వేస్తే తెలంగాణలో శూన్యం, ఆంధ్రలో శూన్యం. ఇంకా కిందికి వేళ్తే తమిళనాడు, కేరళలో ఏం జరిగిందో చూడవచ్చు.

అలాకాకుండా వాయవ్యం వైపు వెళ్తే పంజాబ్‌లో లేదు, రాజస్థాన్‌లో ఉన్నది ఊడిపోయింది. అక్కడినుంచి పడమటికొస్తే మోదీ ప్రభావం పనిచేయలేదు, మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం వచ్చింది. గోవాలో ఎలా అధికారంలోకి వచ్చారో అందరికీ తెలుసు.

కోరమాండల్ కోస్టు వైపు వెళ్తే, ఒడిశాలో మోదీ ప్రభావం ఏ మాత్రం పనిచేయడం లేదు. అక్కడ బిజూ జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్ తిరుగులేని శక్తి.

ఇలా, న్యూదిల్లీ నుంచి దూరం జరిగే కొద్ది మోదీ ప్రభావం క్రమంగా పల్చబడటం కనిపిస్తుంది. అదే మోదీ బలహీనత. కర్నాటక లాంటి చోట్ల అధికారంలోకి రావడానికి ఎన్ని తంటాలు పడాల్సి వచ్చిందో అంతా చూశారు. ఇది మోదీ బలానికి సూచన కాదు.

ఇందిరాగాంధీ

ఫొటో సోర్స్, Getty Images

మోదీ - ఇందిరాగాంధీ.. ఇద్దరి సమస్య ఒక్కటే

ఇక్యడే ప్రధాని మోదీకి, ఒకనాటి ప్రధాని ఇందిరాగాంధీకి పోలికలున్నాయి. ఇద్దరి తాత్విక పునాది ఒక్కటే. బలమైన కేంద్రం, బలహీనమయిన రాష్ట్రాలు.

ఇద్దరూ చక్రవర్తి అశోకుడిలాగా ఆసేతు హిమాచలం పరిపాలించాలనుకున్నారు. ఇద్దరికి అధ్యక్ష తరహా పాలన కావాలి. ఇందిరా గాంధీ అధ్యక్ష తరహా పాలన కోసం రాజ్యాంగాన్ని సవరించేందుకు ప్రయత్నించారు.

అయితే, రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం అడ్డొచ్చింది. దాంతో కొద్దికొద్దిగా రాజ్యాంగాన్ని వంచుకుంటూ తనవైపు తిప్పుకున్నారు. ఆమె అధ్యక్ష పాలన వైపు మొగ్గుచూపేందుకు కారణం కూడా మోదీకి ఎదురవుతున్న సమస్యే.

న్యూదిల్లీ నుంచి దూరం జరిగేకొద్దీ రాష్ట్రాల్లో ఆమె ప్రాబల్యం తగ్గిపోతూ ఉంది. 1983 నాటికి ఆమె ఆకర్షణ ఎంతగా తగ్గిందంటే, రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు వస్తున్నాయి.

ఆ యేడాది మార్చిలో కర్నాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే (జనతా పార్టీ) నాలుగు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ఏర్పాటుచేశారు.

అందులో ఆంధ్ర (తెలుగుదేశం) ,తమిళనాడు (అన్నాడీఎంకె), పుదుచ్చేరి (డీఎంకే) ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అందులో వాళ్లేం చర్చించారోగానీ, అది అంతర్జాతీయ వార్త అయింది.

ఇందిరా గాంధీ మీద తిరుగుబాటు అనే విధంగా ఈ సమావేశం ప్రచారమయింది. 'బెంగళూరు భేటీ'కి తర్వాత కశ్మీర్, పంజాబ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు మద్దతు తెలిపారు.

ఈ చిన్న 'బెంగుళూరు భేటీ' ఎంత పెద్ద అలజడి సృష్టించిందంటే, అప్పటి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిఎం స్టీఫెన్ 'ఇది ఉత్తర దక్షిణ వేర్పాటు వాదం' అని కసురు కున్నారు. ఇది ప్రాంతీయ తత్వం నూరిపోసే సమావేశం అని కసితీరా తిట్టారు.

ఈ సమావేశం తర్వాతే, ఇందిరా గాంధీ అంతర్రాష్ట్ర సంబంధాలను పరిశీలించి మెరుగుపరిచేందుకు ఒక కమిషన్ వేశారు. అదే సర్కారియా కమిషన్.

ఇలా నలుగురు ముఖ్యమంత్రులు కలిసి గుసగుసలాడుకుంటూనే ఇందిరా గాంధీ దిగిరావడానికి కారణం ఏమిటి? న్యూదిల్లీ నుంచి దూరం జరిగే కొద్ది తన ప్రభావం తగ్గిపోతూ ఉందనే జ్ఞానోదయమే. మోదీకి ఎదురయిన సమస్య కూడా ఇదే.

బెంగాల్లో నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

రాష్రాలు మోదీని ఎందుకు తిరస్కరిస్తున్నాయి?

ప్రధాని మోదీ అజెండాలో 'రాముడుండాడు, రాజ్యముండాది' తప్ప రాష్ట్రాలు లేవు. ఆయన బలమైన భారత్‌ను కోరుకుంటున్నారు తప్ప, బలమైన రాష్ట్రాలను కోరుకోవడం లేదు.

రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యాన్ని చెరిపేసి అన్ని రాష్ట్రాలు ఒకేలా కనిపించేలా చేయడం ఆయన అజెండా. రాష్ట్రాలకు ఒకే రంగు, ఒకే జెండా, ఒకే భాష, ఒకే పార్టీ, ఒకే ఆలయం ఉండాలని ఆయన ఆశయం.

దీనితో రాష్ట్రాల ఉనికే పోతుంది. భారతదేశంలో ఇపుడు బలమైన ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. ప్రాంతీయాభివృద్ధి కోసం కృషిచేస్తున్నాయి. వాటికి బలమైన నాయకులున్నారు.

తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, ఒడిషా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో బలమైన ప్రాంతీయ నాయకులున్నారు. అందువల్ల ఈ రాష్ట్రాల ఉనికిని, దాని ప్రయోజనాలను ప్రజలు వదులుకోరు.

తెలుగుదేశం, అన్నాడీఎంకే వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యూహాత్మకంగా అపుడపుడు బీజేపీతో చేతులు కలిపినా, రాష్ట్రాన్ని బీజేపీ జాగీరును చేసేందుకు ఇష్టపడవు.

నిజానికి అవసరమొచ్చినపుడు ఈ మిత్రపక్షాలే బీజేపీని అడ్డుకున్నాయి. ముందు ముందు కూడా అడ్డుకుంటాయి.

మహారాష్ట్రలో శివసేన, ఒడిషాలో బిజూ జనతా దళ్ చేసింది, ఇపుడు డిఎంకె, తృణమూల్ చేస్తున్నది కూడా ఇదే.

అంటే సింపుల్‌గా చెప్పాలంటే, రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ నాయకులు ఉన్నంతవరకు బీజేపీని, మోదీని తమ సరిహద్దుల్లోకి రానీయరు.

'చక్రవర్తి' కలలుకంటున్న మోదీ ప్రవేశానికి వాళ్లు అనుమతి ఇవ్వరు. అందుకే, హిందీయేతర రాష్ట్రాల్లో మోదీ క్రమంగా ఓడిపోతున్నారు.

ఆయనకు మిగిలింది హిందీ, న్యూదిల్లీ, దాని దగ్గర రెండు మూడు హిందీ రాష్ట్రాలే.

విశాల భారతంలో నవీన్ పట్నాయక్, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, పినరయి విజయన్ (ఇపుడు సిపిఎం ప్రాంతీయ పార్టీయే)లు ఉన్నంతవరకు మోదీ హవా ఈ రాష్ట్రాల్లో నడవదు.

అందుకే మోదీ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఓట్లుగా, సీట్లుగా మారడం చాలా కష్టం.

వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేతర బలమైన నాయకులు, మునుపటి నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌లాగా ఒక 'పెడరల్ ఫ్రంట్'గా ఏర్పడటం సాధ్యం కాకపోవచ్చుగాని, బీజేపీని తమ రాష్ట్రాల్లోకి రానీయడం జరగదు.

వీళ్లలో కొందరు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో చేరినా బీజేపీకి నాలుగు సీట్లిచ్చి దూరంగా ఉంచుతారు తప్ప, మోదీని తమ సరిహద్దుల్లోకి రానీయరు.

(అభిప్రాయం రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)