కోవిడ్: అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 21 మంది రోగుల మృతి.. కొరత కారణం కాదంటున్న అధికారులు

అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోన వైరస్ బాధితుల్లో కనీసం 21 మంది ఆక్సిజన్ సమస్యతో మరణించారని బంధువులు ఆరోపించారు.
అధికారులు మాత్రం ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి లోపం లేదని, కరోనాతోపాటు వివిధ ఆరోగ్య సమస్యల కారణంగానే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 14మంది రోగులు మరణించారని చెబుతున్నారు.
శనివారం ఒక్కరోజే అనంతపురంలో 1,880 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బెడ్స్‌కు కొరత ఏర్పడింది.
చాలామంది పేషెంట్లు అంబులెన్స్‌లలోనే ఉంటూ బెడ్స్ కోసం ఎదురు చూశారు. రాత్రయ్యే వరకు బెడ్స్ దొరక్క పోవడం, ఆక్సిజన్ అందక పోవడంతో 21 మంది మృతి చెందారని బాధితుల బంధువులు ఆరోపించారు.
ఒక మహిళ మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది రోడ్డు మీదే వదిలేశారని, గంటల తరబడి ఆ మృతదేహం పేషెంట్ల మధ్యే పడి ఉందని బాధితుల బంధువులు చెప్పారు.

సమస్య ఎందుకు మొదలైంది?
కర్ణాటక నుంచి కూడా అనంతపురం నగరానికి కరోనా పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని, ఇప్పటికే నగరంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులో బెడ్స్ కొరత ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు.
బెడ్స్ కోసం ఆసుపత్రి ముందే పడిగాపులు కాసిన రోగులు, వారి బంధువులు ఒక దశలో ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
ఆక్సిజన్ సరఫరాలో లోపం మీదంటే మీదంటూ ప్లాంట్ టెక్నీషియన్లు, వైద్య సిబ్బంది ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని పేషెంట్ల బంధువులు ఆరోపించారు.

ఆక్సిజన్ పైప్‌లో 4.5ml గా ఉండాల్సిన ప్రెజర్ కేవలం 2 ml మాత్రమే ఉందని, జిల్లా కలెక్టర్ మాత్రం ఎలాంటి లోపం లేదని చెబుతున్నారని బంధువులు ఆరోపించారు.
మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని, వాటన్నింటినీ రికార్డుల్లో చేర్చడం లేదని కూడా వారు అన్నారు.

ఆక్సిజన్ ప్లాంట్‌లో లోపాలున్నాయా?
బాధితులు ఆందోళనకు దొగడంతో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆసుపత్రిని తనిఖీ చేశారు.
మరోవైపు అనంతపురం జిల్లాలోని ఆర్.డి.టి. బత్తలపల్లి కోవిడ్ ఆసుపత్రిలో కరోనాతో ఏడుగురు మృతి చెందినట్లు తహసీల్దార్ ధ్రువీకరించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడు రోజులుగా ఆక్సిజన్ సరఫరాలో లోపాలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇప్పుడు ఇలా జరగడం దురదృష్టకరమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఆక్సిజన్ ప్లాంట్ లో సాంకేతిక సమస్య ఉండగా, చెన్నై నుంచి వచ్చిన టెక్నీషియన్లు రిపేర్లు చేస్తున్నారు.
కర్నూలులో అనుమతి లేని కోవిడ్ ఆసుపత్రిలో నలుగురు మృతి
మరోవైపుపు కర్నూలు నగరంలోని కె.ఎస్. కేర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో నలుగురు కోవిడ్ బాధితులు మృతి చెందినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు భయంతో ఇతర ఆసుపత్రులకు వెళ్లిపోయారు.
అనుమతి లేకుండానే కోవిడ్ చికిత్సలపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వచ్చి తనిఖీలు చేయగా.... ఐసీయూలో నాలుగు మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు చనిపోయారని అనుమానాలున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
అయితే చనిపోయిన వారిలో ఎవరూ ఆక్సిజన్ అందక మృతి చెందలేదని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.
దీనిపై విచారణ జరిపించిన జిల్లా కలెక్టర్, ఆక్సిజన్ కొరతతో రోగులు మృతి చెందారనే వార్తలో నిజం లేదని తమ విచారణ బృందం తేల్చిందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ అనుమతి లేకుండా కోవిడ్ పేషేంట్స్‌ను అనధికారికంగా అడ్మిట్ చేసుకుని ట్రీట్‌మెంట్ ఇచ్చిన కె.ఎస్.కేర్ ఆసుపత్రి యజమాన్యంపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసు బుక్ చేశామని కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు.
ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్‌ను అరెస్టు చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- టైటానిక్: ఆనాటి ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ ఆరుగురు చైనీయులు ఏమయ్యారు... జాతి వివక్ష వారిని వెంటాడిందా?
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ
- అమెరికాతో ఒప్పందం తర్వాత తాలిబన్లు ఏం చేయబోతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








