ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు: విచారణకు ఆదేశించిన కేసీఆర్... తెలంగాణలో అసైన్డ్ భూముల లెక్క తేల్చాలన్న ఈటల

ఫొటో సోర్స్, EetalaPC
తెలంగాణలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. ఆ విషయం ప్రత్యేకంగా కొన్ని తెలుగు న్యూస్ చానళ్లలో ఒకేసారి ప్రసారం అయింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. తనపై జడ్జితోనే విచారణ చేసుకోమని సవాల్ విసిరిన మంత్రి రాజేందర్, మొత్తం తెలంగాణలో అసైన్డ్ భూముల లెక్క తేలాలన్నారు.
ఆరోపణలు ఏంటి?
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన కొందరు రైతుల నుంచి ప్రభుత్వం అసైన్ చేసిన భూములను ఈటల రాజేందర్, ఆయన అనుచరులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ కొందరు భూమి యజమానులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఫిర్యాదు చేశారు.
చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్వ, చాకలి కృష్ణ, చాకలి నాగులు, చాకలి పరశురాం, ఎరుకల దుర్గయ్య, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములు అనే వ్యక్తులు ఈ ఫిర్యాదు చేశారు. ఆ గ్రామాల్లోని సర్వే నంబరు 130/5, 130/9, 130/10 లలో ఒక్కొ కుటుంబానికి ఒక ఎకరం 20 గుంటల చొప్పున ఉన్న భూమిని, సర్వే నంబర్ 130/2లో ఎరుకుల కుటుంబానికి ఉన్న 3 ఎకరాల భూమిని రాజేందర్ స్వాధీనం చేసుకున్నట్టు వారు ఆరోపించారు.

మీడియా పాత్ర
శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి కొన్ని తెలుగు చానళ్లలో ముందుగా ఈ వార్తలు ప్రసారం అయ్యాయి. పలు చానళ్లు ఆ గ్రామానికి వెళ్లి అక్కడి వారితో ఇంటర్వ్యూలు చేశాయి. అయితే, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచే నడిచే న్యూస్ చానల్ టీ-న్యూస్ కూడా ఈ వార్తను ప్రసారం చేసింది. 'ఆరోగ్యం మంత్రికి కబ్జా జబ్బు' పేరుతో ఆ చానెల్ ఈ వార్తను ప్రసారం చేసింది.

ఫొటో సోర్స్, facebook/TelanganaCMO
స్పందించిన సీఎం
మీడియాలో ఈ కథనాలు వచ్చిన కొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. ''మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే విషయంలో తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డిజి పూర్ణచందర్ రావును సీఎం అదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాథమిక నివేదికను అందజేసి, అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి, నివేదికలను అందజేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు'' అని ఆ ప్రకటనలో ఉంది.
ఈ మొత్తం ఆరోపణలపై రాత్రి 9 గంటల ప్రాంతంలో షామీర్ పేటలోని తన నివాసం దగ్గర ఈటల రాజేందర్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా రాజేందర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వ్యాపారం ప్రస్థానాన్ని, తనకున్న ఆస్తుల గురించీ వివరించారు. ఆ భూములు లాక్కోలేదనీ ప్రభుత్వ అనుమతితో తీసుకున్నాననీ వివరించారు. ఈ వ్యవహారం అంతా ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి నరసింగరావుకు తెలుసని అన్నారు. తాను ఆత్మగౌరవాన్ని అమ్ముకోనని ప్రకటించారు.
''అక్కడ వ్యాపార విస్తరణకు భూమి కావాలి. అదే సందర్భంలో ఆ భూమిలో ఏమీ పడడం లేదు. నిరుపయోగంగా ఉన్నాయని రైతులు వాపోతేనే వారి దగ్గర నుంచి తీసుకున్నాను. రైతులు స్వచ్ఛందంగా ఇస్తే కనుక ఆ భూమి తీసుకోవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి నరసింగరావు స్వయంగా నాతో చెప్పారు. అసైన్డ్ హక్కు దారులే స్వయంగా భూమి అప్పగించారు.'' అన్నారు రాజేందర్.
తనపై వచ్చిన ఆరోపణలపై సీఎస్, విజిలెన్స్ డీజీతో పాటూ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక్క ఆరోపణ నిరూపితమైనా సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ''దేశంలో ఎన్ని సంస్థలున్నాయో అన్నిటితో విచారణ చేయించండి. నేనెప్పుడూ అక్రమాలు చేయలేదు. నాతో పాటూ అసలు తెలంగాణలో ఉన్న మొత్తం అసైన్డ్ భూములన్నటిపైనా విచారణ చేయించండి.'' అన్నారు రాజేందర్. ప్రభుత్వం అనేక అవసరాల కోసం అసైన్డ్ భూములను సేకరిస్తోందని గుర్తు చేశారు.
తన జీవిత తొలినాళ్లలో ఎలా పోరాడిందీ, సాంఘిక హాస్టళ్ల నుంచి వ్యాపారవేత్తగా ఎలా ఎదిగిందీ వంటివన్నీ విలేకర్ల సమావేశంలో వివరించారు ఈటల. ''ఓయూలో ఎందరో విద్యార్థుల్ని అక్కున చేర్చుకున్నాం. టీఆర్ఎస్ సభలకు ఎంతో ఖర్చుపెట్టాం. అప్పుడెవరూ అడగలేదు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అని. ఈటల చరిత్ర అందరికీ తెలుసు.'' అని వ్యాఖ్యానించారు రాజేందర్. తన కులం, తన భార్య కులం, పిల్లల పేర్లకు సంబంధించిన వివరణలూ ఇచ్చారు ఆయన.

ఫొటో సోర్స్, EetalaPC
ఈటలను మంత్రిగా తప్పించాలన్నదే కేసీఆర్ ఉద్దేశం
''కేసీఆర్ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈటలను మంత్రిగా తప్పించాలని ఆయన అనుకుంటున్నారు. ఆయనకు ఆ అధికారం కూడా ఉంది. కేసీఆర్ తన కేబినెట్ లో అసంతృప్త స్వరం ఉండాలి అనుకోవడం లేదు. అటు రాజేందర్ కూడా నువ్వు నా దేవుడివి అని కేసీఆర్‌ను అనడం లేదు. పైగా పదే పదే నేనూ ముఖ్యమంత్రి పదవికి అర్హుడనేనంటూ రాజేందర్ బయటపడుతూనే ఉన్నారు. కేసీఆర్ కూడా తనకు వంద శాతం విధేయతతో లేని వారు వద్దనుకుంటున్నారు. దీంతో ఆయన్ను తప్పించే ప్రయత్నం జరుగుతోంది అనేది స్పష్టం'' అని బీబీసీతో చెప్పారు సీనియర్ జర్నలిస్టు దుర్గం రవిందర్.
''అయితే అటు ఈటల మాటలను విశ్లేషిస్తే ఆయన సాంకేతికంగా సరిగానే మాట్లాడుతున్నారు కానీ, నైతికంగా తప్పు. సాధారణంగా అసైన్డ్ భూములు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తే, దాన్ని తిరిగి కేటాయించే అధికారం కేబినెట్‌కే ఉంటుంది. ఆ కేబినెట్‌లో ఈయన సభ్యుడు. ఆ నిర్ణయం పెండింగులో ఉన్నప్పుడు ఇది జరిగింది. అయితే రాజేందర్ చేతిలో ప్రస్తుతం ఆ భూమి లేదు. సాధారణంగా మంత్రివర్గ సభ్యులు వ్యాపారం చేయకూడదు. ఈయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న వ్యాపారాల గురించి మాట్లాడారు. అదొకరకంగా బినామీ అన్నట్టే అవుతుంది.''
రాజీనామా ఊహాగానాలు
ఈ ఆరోపణలు వచ్చిన తరువాత ఈటల రాజేందర్ రాజీనామా చేస్తారా అంటూ పలు ఊహాగానాలు వచ్చాయి. కానీ వాటన్నిటికీ తెరదించుతూ, ప్రభుత్వానికే ఎదురు సవాల్ విసిరారు రాజేందర్. తనపై మరిన్ని సంస్థలతో విచారణ జరిపించాలంటూనే, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ప్రమేయం ఉందని చెబుతూనే, మొత్తం తెలంగాణలో అసైన్డ్ భూముల లెక్క తేలాలి అంటూ బంతి అవతలి కోర్టులో వేశారాయన.
కొంత కాలంగా ఈటల రాజేందర్ పలు వేదికలపై ఆసక్తి కలిగించే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. పదవులు తమ హక్కు అనీ, గులాబీ జెండాకు తామూ ఓనర్లమేననీ వంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. ఇవన్నీ కేసీఆర్ పై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసే వ్యాఖ్యలేనని పలువురు విశ్లేషిస్తారు. అదే సందర్భంలో ఆ మధ్య జరిగిన టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ''కొత్త పార్టీ పెట్టడం అంత తేలిక కాదు'' అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
కేసీఆర్ మొదటి విడత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ఆరోగ్య మంత్రి రాజయ్యను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

స్పందించిన ప్రతిపక్షాలు
''సీఎం కేసీఆర్ తన తప్పులని కప్పి పుచ్చుకునేందు మంత్రి ఈటల రాజేందర్ ని బలిపశును చేసే కుట్ర చేస్తున్నారు.'' అని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు దాసోజు శ్రవణ్.
''ఈటల కబ్జాలు చేస్తే తప్పకుండా శిక్షించాలి. కానీ అంతకంటే ముందు టీఆర్ఎస్ పార్టీలో శిక్షపడాల్సిన వారు చాలా మందే వున్నారు. ముందు కేటీఆర్ కి శిక్షపడాలి. జన్వాడలో అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటున్న కేటీఆర్ కబ్జాలను వీడియో సాక్ష్యాలతో బయటపెట్టిన కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు. మంత్రి మల్లా రెడ్డి కనిపించిన భూమిని కబ్జా చేసుకుంటూ పోతున్నారు. కరీంనగర్ లో భూకబ్జాలకు పాల్పడిన గంగుల కమలాకర్ మీద చర్యలు ఎందుకు లేవు ? ఖమ్మంలో భూకబ్జాలకు పాల్పడిన పువ్వాడ అజయ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు? మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ అక్రమాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? ప్రభుత్వం విఫ్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జనగామ ఎమ్మల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, పటాన్ చెరులో మహిపాల్ రెడ్డి... ఇలా టీఆర్ఎస్ నాయకులపై చర్యలు ఎందుకు లేవు'' అని ప్రశ్నించారు శ్రవణ్.
అటు వైయస్ షర్మిళ కార్యాలయం నుంచి ఇందిరా శోభన్ స్పందించారు. ''కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ బెదిరించి లాకున్న భూములపై విచారణ చేయాలి. కేటీఆర్ జనవాడి ఫామ్ హౌస్ కబ్జా, కేసీఆర్ ఫాంహౌస్ నుంచి యాదాద్రి రోడ్డు కోసం రైతులు భూములు లాక్కోవడం, ఇతర నాయకుల భూకబ్జా ఆరోపణలపై విచారణ చేయాలి. కేసీఆర్ ఉద్యమ నాయకులను అవమానిస్తారు'' అన్నారు ఇందరా శోభన్.
అయితే ఈ అంశంపై స్పందన కోసం బీబీసీ పలువురు టీఆర్ఎస్ నాయకులను సంప్రదించగా, వారు స్పందించడానికి నిరాకరించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- బెల్లం: ఆహారమా... ఔషధమా?
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్‌కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








