నాగార్జునసాగర్‌ విజేత నోముల భగత్: కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డిని ఓడించిన లాయర్

నాగార్జున సాగర్ ఉపఎన్నిక

ఫొటో సోర్స్, Nomula Bagath/twitter

ఫొటో క్యాప్షన్, నరసింహయ్య స్థానంలో నోముల భగత్ కుమార్ కు టీఆర్ఎస్ సీటును కేటాయించింది.
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నాగార్జున సాగర్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో నోముల భగత్‌ కుమార్ విజయం సాధించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ప్రధానంగా పోటీ పడిన ఈ ఉప ఎన్నికల్లో భగత్ కుమార్ 18,872 ఓట్ల ఆధిక్యంతో తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కుందూరు జానారెడ్డిపై విజయం సాధించారు.

ఈ స్థానంలో గత ఎన్నికల్లో భగత్ కుమార్ తండ్రి నోముల నర్సింహయ్య టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఆయన కోవిడ్ వైరస్‌తో మరణించడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది.

37 సంవత్సరాల నోముల భగత్ విద్యావంతుడు. బీటెక్, ఎంబీఏ, ఎల్ఎల్‌బీ(లా డిగ్రీ), ఎల్ఎల్ఎం(లాపీజీ) చేశారు. కొన్నేళ్లుగా పాలిటిక్స్‌లో తన తండ్రికి సహకరిస్తూ వచ్చిన ఆయన, ఈ ఎన్నికలతో మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.

బీటెక్ చదివిన తర్వాత 2008-2012 మధ్య కాలంలో వివిధ ప్రైవేటు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేశారు. 2014లో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి, హైకోర్టులో న్యాయవాదిగా మారారు. 2016లో న్యాయశాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు.

నాగార్జున సాగర్ ఉపఎన్నిక

ఫొటో సోర్స్, Nomula Bagath/twitter

ఫొటో క్యాప్షన్, నాగార్జున సాగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
నాగార్జున సాగర్ ఉపఎన్నిక

ఫొటో సోర్స్, Nomula Narsimhaiah/FACEBOOK

ఫొటో క్యాప్షన్, నరసింహయ్య సీపీఎం నుంచి టీఆర్ఎస్‌లో చేరారు.

నోముల నర్సింహయ్య రాజకీయాలు

నోముల భగత్ తండ్రి నరసింహయ్య సుదీర్ఘకాలం సీపీఎంలో పని చేశారు. పాత నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండల ఎంపీపీగా, 1999-2004 మధ్య నకిరేకల్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ కాలంలోనే అసెంబ్లీలో సీపీఎం శాసన సభాపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పార్టీతో విభేదించిన నరసింహయ్య 2014లో టీఆర్‌ఎస్‌లో చేరి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి జానారెడ్డి చేతిలో ఓడిపోయారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ జానారెడ్డిపై విజయం సాధించారు. 2020లో కోవిడ్-19 వైరస్ సోకడంతో నరసింహయ్య మృతి చెందారు.

నాగార్జున సాగర్ ఉపఎన్నిక

ఫొటో సోర్స్, trspartyonline/twitter

ఫొటో క్యాప్షన్, ఎన్నికల అఫిడవిట్‌లో లాయర్‌నని, వ్యవసాయ దారుడినని పేర్కొన్నారు.

అఫిడవిట్‌లో ఏం చెప్పారు?

ఎన్నికల అఫిడవిట్‌లో వ్యవయసాయం, లా ప్రాక్టీసును తన వృత్తిగా పేర్కొన్న నోముల భగత్ కుమార్ తన భార్య వ్యాపారంలో ఉన్నట్లు పేర్కొన్నారు.

వ్యవసాయం, డైరీ, కౌలు నుంచి తనకు, వ్యాపారం నుంచి తన భార్యకు ఆదాయం వస్తుందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

నోముల నరసింహయ్య సొంతూరు నకిరేకల్ మండలం పాలెం గ్రామం. అయితే, వీరు నాగార్జున సాగర్ నియోజక వర్గంలోని హాలియాలో స్థిరపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)