కోవిడ్-19: పిల్లలకు ఎక్కువగా వ్యాపిస్తే ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందా?

ఫొటో సోర్స్, Getty Images /NurPhoto
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
ప్రముఖ వైరాలజిస్టుల నుంచి పిల్లల వైద్య నిపుణుల వరకూ మూడవ వేవ్ కరోనావైరస్ పిల్లలను ఎక్కువగా తాకుతుందనే విషయాన్ని సందేహం లేకుండా చెబుతున్నారు.
తొలి వేవ్ వచ్చినప్పుడు ఆర్‌టి పిసిఆర్ పరీక్షల్లో పాజిటివ్ నిర్ధరణ అయిన వారిలో 4 శాతం మంది పిల్లలు ఉన్నారు. రెండవ వేవ్‌లో ఇప్పటి వరకు 10 శాతం మంది పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలుస్తోంది.
అంటే, ఇది దేశ జనాభాలో ఉన్న 30 కోట్ల మంది పిల్లల్లో 14 శాతం మందికి కోవిడ్ సోకినట్లు అర్ధం.
ఫిబ్రవరి 2021లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన సీరో సర్వేలో 25.3 శాతం మంది పిల్లలకు యాంటీబాడీలు ఉన్నట్లు తెలిసింది. అంటే, వీరందరికీ కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకి ఉంటుంది.
"సీరో సర్వేలలో మొదటి, రెండవ వేవ్‌లలో ఇన్ఫెక్షన్ సోకిన వారిని కలిపితే, భారతదేశంలో 40 శాతం మంది పిల్లలకు వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అంటే, ఇంకా 60 శాతం మందికి ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది" అని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ రవి బీబీసీకి చెప్పారు. ఆయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, బెంగళూరులో న్యూరో వైరాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
ఆయన ప్రస్తుతం కర్ణాటకలో సార్స్ సి ఓ వి 2 జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడానికి నోడల్ అధికారిగా ఉన్నారు. వైరస్‌లో కొత్త మ్యూటంట్లను కనిపెట్టి పర్యవేక్షించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ పని చేస్తుంది. పాజిటివ్ నిర్ధరణ అయిన వారిపై సీరోసర్వేలను నిర్వహించరు.
అయితే, డాక్టర్ రవి చేసిన గణాంకాల అంచనాను కొంత మంది ఎపిడెమియాలజిస్టులు అంగీకరించటం లేదు.
కానీ, భారతదేశం మూడవ వేవ్ ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పిన ప్రాథమిక విషయాన్ని మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు. భవిష్యత్తులో ఈ వైరస్ ఎలా ప్రవర్తిస్తుందనే అంశం పై ఎటువంటి భరోసా లేదని అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images / TAUSEEF MUSTAFA
"ఈ మహమ్మారి సమయంలో అదృష్టవశాత్తూ పిల్లల్లో మరణాలు తక్కువగానే ఉన్నాయి. కానీ, భవిష్యత్తులో ఇలా జరుగుతుందనే గ్యారంటీ లేదు" అని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్, వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జయప్రకాశ్ ముళియిల్ అన్నారు.
"దిల్లీలో జరిగిన సీరో సర్వే ఫలితాలు చూస్తే, ఈ ఇన్ఫెక్షన్ సోకడానికి ఒక ప్రత్యేక వయసు ఏమీ లేదని అర్ధం అవుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఇది కుటుంబం అంతటికీ సోకే ఇన్ఫెక్షన్. ఇంట్లో ఒకరికి వస్తే, పిల్లలకు కూడా వస్తోంది" అని ముళియిల్ అన్నారు.
డాక్టర్ రవి చెప్పిన అభిప్రాయంతో దిల్లీ, చెన్నై, బెంగళూరులో ఉన్న ముగ్గురు పిల్లల వైద్య నిపుణులు ఏకీభవిస్తున్నారు.
వాస్తవాలేంటి...
"దేశ జనాభాలో 30 కోట్ల మంది పిల్లల జనాభా ఉంది. వీరిలో ఇంకా చాలా మంది ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది" అని డాక్టర్ రవి చెబుతున్నారు.
"అంటే, 18 కోట్ల మంది ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చు. ఇందులో ఇప్పటికే 3. 6 కోట్ల మందికి ఇన్ఫెక్షన్ సోకింది. అందులో 1 శాతం మందికి చికిత్స తీవ్ర స్థాయిలో అవసరం కావచ్చు. దానికి మనం సిద్ధంగా ఉన్నామా?" అని డాక్టర్ రవి ప్రశ్నిస్తున్నారు.
దీనికి, పిల్లల వైద్య నిపుణులంతా సిద్ధంగా లేమనే సమాధానం చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images / ajijchan
నేను డాక్టర్ రవి చెప్పిన దానితో ఏకీభవిస్తున్నాను. పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకాలని ఎవరూ అనుకోరు. కానీ, ఒక వేళ సోకితే, మన దగ్గర అందుకు తగిన వైద్య సదుపాయాలు ఉన్నాయా? లేవనే చెప్పాలి అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలో ప్రొఫెసర్ డాక్టర్ గిరిధర్ బాబు అన్నారు.
"మన సంసిద్ధత హాస్యాస్పదంగా ఉంది" అని డాక్టర్ ముళియిల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
కేవలం ఇన్ఫెక్షన్ సోకి తేలికపాటి లక్షణాలు ఉన్నవారికి ఇంటి దగ్గరే ఉంచి చికిత్స ఇప్పించవచ్చు. లేదా, ఆసుపత్రిలో చేర్చవచ్చు. కానీ, ఇన్ఫెక్షన్ తీవ్రంగా సోకిన ఆ 1 శాతం మందికి ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరమవుతుంది. అదే అతి పెద్ద సవాలుగా మారుతుంది అని పిల్లల వైద్య నిపుణులు అంటున్నారు.
"దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో, మరి కొన్ని పెద్ద పట్టణాల్లో తప్ప, పిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు లేవు. వైద్య సదుపాయాలు ఉత్తరాది రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కేవలం పెద్ద వారికి మాత్రమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉన్నాయి" అని చెన్నైలోని కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అధిపతి డాక్టర్ బలరామచంద్రన్ అన్నారు.
అయితే, దేశంలో ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో కలిపి పిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల సంఖ్య పై స్పష్టత లేదు. దేశంలో 40,000 పిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉన్నట్లు ఒక డాక్టర్ చెబుతున్నారు.
దేశంలో ఆమోదం పొందిన 70 పిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉన్నట్లు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ చాప్టర్ ఇండియా చెయిర్ పర్సన్ డాక్టర్ చిరెన్ గుప్తా చెప్పారు.
అయితే, వీటి సంఖ్య పై మాత్రం స్పష్టత లేదు. పెద్దవాళ్ళ ఐసీయూను పిల్లల ఐసీయూగా మార్చడం అంత సులభమేమీ కాదు.
"ఉదాహరణకు పెద్దవాళ్లకు పెట్టే ఆక్సిజన్ మాస్కు ను పిల్లలకు పెట్టలేరు" అని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఆషా బెనకప్ప చెప్పారు.
"పిల్లలను సంరక్షించేందుకు మన దగ్గర తగిన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, మానవ వనరులు తగినంతగా లేవు. నేను నిజంగా పిల్లల గురించి విచారిస్తున్నాను" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, EPA
సవాళ్లు ఏంటి?
చాలా రకాల సవాళ్లు ఉన్నాయి. ఒక వేళ ఏప్రిల్ నెలలో ఎక్కువ మంది పిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడితే, మే నెలలో ఐసీయూలలో చేరే పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.దీనినే మల్టీ సిస్టం ఇన్ఫలమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అని అంటారు.
"పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ సోకిన 3-4 వారాల్లో ఈ సిండ్రోమ్ అభివృద్ధి చెందుతుంది. దీనిని పోస్ట్ కోవిడ్ ఇన్ఫలమేటరీ రియాక్షన్ అని అంటారు. దీంతో పిల్లలు బాగా జబ్బు పడతారు. ఈ చికిత్స చాలా ఖరీదుతో కూడుకుంది" అని డాక్టర్ రామచంద్రన్ చెప్పారు.
ఈ రకమైన సిండ్రోమ్‌ను గత సంవత్సరం ఏప్రిల్‌లో మొదట యూకేలో గుర్తించారు. భారతదేశంలో దీనిని డాక్టర్ రామచంద్రన్ బృందం గుర్తించి దీనికి చికిత్సను సూచించారు. ఈ చికిత్స పీడియాట్రిక్ ప్రచురణలో కూడా ప్రచురతిమయయింది.
"పిల్లల బరువును బట్టి 24 గంటల్లో నరాల్లోంచి ఇంజక్షన్ కూడా ఇస్తారు. ఇది ప్రతి కేజీ బరువుకు 2 గ్రాముల ఇంజక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది చవకగా అయ్యే చికిత్స. అదే పిల్లాడు 20 కేజీలు ఉంటే ఆ పిల్లలకు సుమారు 40 గ్రాముల ఇంజక్షన్ అవసరమవుతుంది. దీనికి సుమారు 64,000 ఖర్చు అవుతుంది. దీంతో పాటు ఆసుపత్రి ఖర్చులు అదనంగా ఉంటాయి అని డాక్టర్ రామచంద్రన్ చెప్పారు.
పిల్లల ఐసీయూలో మౌలిక సదుపాయాలు సృష్టించడానికి అయ్యే ఖర్చు గురించి డాక్టర్ బెనకప్ప వివరించారు.
"10 నుంచి 15 లక్షలు ఖర్చయ్యే వెంటిలేటర్ల అవసరంతో పాటు శిక్షణ పొందిన సిబ్బంది, ఇన్ఫ్యూషన్ పంపులు, ఇతర పరికరాలు అవసరం ఉంటుంది. పిల్లలు ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంటే, పరికరాలు, మానవ వనరులు కలిపి 25- 30 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది" అని ఆమె అన్నారు.
సాధారణ ఐసీయూలలో ఉండే సిబ్బంది పని తీరుకు పిల్లల ఐసీయూలో పని చేసేవారి పని తీరుకు కూడా తేడా ఉంటుంది.
"పిల్లలకు ఎలా ఇంజక్షన్ చేయాలనేది తెలియాలి. పిల్లలను చూసే నర్సు పెద్దవాళ్ళను కూడా చూడగలరు. కానీ, పెద్దవాళ్లకు చికిత్స చేసేందుకు శిక్షణ పొందిన నర్సులు పిల్లలకు చికిత్స చేయలేరు. పిల్లల నర్సులు నేర్పుతో, ప్రేమతో పని చేయగలరు" అని డాక్టర్ బెనెకప్ప అన్నారు.
నిజానికి దేశంలో తగినన్ని ఐసీయూలు, అందులో పని చేసేందుకు తగినంత మంది పిల్లల నర్సులూ కూడా లేరు. ఇందులో పని చేయడానికి నర్సులకు శిక్షణ ఇవ్వాలి. అలాగే, పిల్లలతో పాటు తల్లులు కూడా ఉండేందుకు అదనపు మౌళిక సదుపాయాలు కూడా సృష్టించాలి" అని డాక్టర్ గుప్తా అన్నారు.
"8 ఏళ్ల వయసు లోపు ఉన్న పిల్లలు ఎక్కువగా తల్లి పై ఆధారపడతారు. అలాగే, 6 ఏళ్ళ లోపు పిల్లలకు బొమ్మల అవసరం కూడా ఉంటుంది. అందుకే తల్లులకు కూడా ఐసీయూలో స్థలం కేటాయించాలి" అని డాక్టర్ బెనకప్ప అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images /SUJIT JAISWAL
కానీ, ఈ వైరస్ నిరంతరం రూపాంతరం చెందుతూనే ఉండటం అతి పెద్ద సవాలుగా ఉంది.
"గత సంవత్సరం అక్టోబరులో ఇన్ఫెక్షన్ సోకిన వారు తిరిగి ఇన్ఫెక్షన్ బారిన పడుతున్న కేసులు వస్తున్నాయి. ఇది కేవలం పెద్దవారికి మాత్రమే పరిమితం కాదు. పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్ రెండవ సారి సోకుతోంది. వచ్చే సంవత్సరం మరో కొత్త మ్యూటంట్ పుడుతుందేమో కూడా చెప్పలేం" అని డాక్టర్ గుప్తా అన్నారు.
కొన్ని సానుకూల, ప్రతికూల అంశాలు
ఇన్ఫెక్షన్ తీవ్రత పిల్లల్లో తక్కువగా ఉంటుందని ఆస్ట్రాజెనేక వ్యాక్సీన్ అభివృద్ధికి సహకరించిన డాక్టర్ ఆండ్రూ పోలార్డ్ చెప్పిన మాటలతో డాక్టర్ రామచంద్రన్, డాక్టర్ రవి అంగీకరిస్తున్నారు.
ఇది కాస్త ఊరటనిచ్చే విషయం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
"పిల్లల ఊపిరితిత్తులు పెద్దగా కలుషితం కాకుండా ఉండటం కానీ, లేదా వారికి ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు లేకపోవడం వల్ల కానీ, పిల్లల్లో ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగా ఉండటానికి కారణాలని చెప్పవచ్చు" అని డాక్టర్ రామచంద్రన్ అన్నారు.
కోవిడ్ సోకిన పిల్లలకు పిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స చేసేందుకు నర్సులకు డాక్టర్లకు శిక్షణ ప్రారంభిస్తామని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ చాప్టర్ ఇండియా ప్రకటించింది.
కానీ, 12 -18 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకు వ్యాక్సీన్ ఎప్పుడు అభివృద్ధి చేస్తారు, ఎంత మందికి వ్యాక్సీన్ ఇస్తారనేది మాత్రం ఒక తెలియని అంశంగా ఉంది. వచ్చే నాలుగు నెలల్లో ఎంత మంది పెద్దవారికి వ్యాక్సీన్ ఇస్తారనేది కూడా తెలియదు. మౌలిక సదుపాయాలు సరిగ్గా లేని పరిస్థితుల్లో మాస్కు వేసుకుని కోవిడ్ నిబంధనలను ఎంత మంది పాటిస్తారో కూడా తెలియదు" అని డాక్టర్ రవి అన్నారు.
"మనల్ని మనం సంసిద్ధంగా ఉంచుకోవాలి. ఈ రెండవ వేవ్ ను ఒక పాఠంగా తీసుకుని మూడవ వేవ్ కు సిద్ధం కావాలి. మనం 100 మందికి కాదు, 1000 మంది కోసం సంసిద్ధంగా ఉండాలి. చిన్న చిన్న పట్టణాల్లో, నగరాల్లో ఉన్న చిన్న ఆసుపత్రుల పై దృష్టి పెట్టాలి" అని డాక్టర్ గుప్తా అన్నారు."నేను తప్పు చెబుతున్నాను అని ఎవరైనా నిరూపిస్తే దానికి నేను ఆనందిస్తాను. కానీ, మనం కళ్ళు మూసుకుని ఉంటుండగా పట్టుబడకూడదు. ఒక వేళ కోవిడ్ కేసుల సంఖ్య పెరగకపోయినా కూడా మనం భవిష్యత్తులో పిల్లల వైద్య సంరక్షణ కోసం తగిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఉంది" అని డాక్టర్ రవి అన్నారు.
డాక్టర్ రవి చెప్పిన అంశాలతో డాక్టర్ ముళియిల్‌తో పాటు, ఇతర పిల్లల వైద్య నిపుణులు కూడా ఏకీభవించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: చైనాకు పాకిన ఇండియన్ వేరియంట్ B1617.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
- కోవిడ్: కలవరపెడుతున్న రంజాన్ షాపింగ్.. ఇసుకేస్తే రాలనట్లుగా పాతబస్తీ రోడ్లు
- కోవిడ్-19: DRDO కనిపెట్టిన '2-DG' ఔషధం కరోనావైరస్ను ఎదుర్కొనే బ్రహ్మాస్త్రం కాబోతోందా?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ‘మా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది చనిపోయారు.. ఏమీ చేయలేకపోయాను’
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- కోవిడ్: ప్రోనింగ్ అంటే ఏమిటి.. కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఈ పద్ధతితో ప్రాణాలు కాపాడవచ్చా
- కోవిడ్ టెస్ట్‌లకు వాడిన కిట్లను శుభ్రం చేసి తిరిగి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








