ట్రాన్స్‌జెండర్ నటించిన 'స్వచ్ఛమైన ప్రేమ' నగల ప్రకటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఎందుకంటే..

భీమ జ్యూవెల్లరీ

ఫొటో సోర్స్, Bhima jewellery

ఫొటో క్యాప్షన్, భీమ జ్యూవెల్లరీ ప్రకటనను సామాజిక మాధ్యమాల్లో 2 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు చూశారు
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లింగమార్పిడితో మహిళగా మారిన ఒక మోడల్ నటించిన భారతీయ సంప్రదాయ జ్యువెల్లరీ ప్రకటన భారత్‌లో అందరి మనసులను దోచుకుంటోంది.

100 సెకన్ల నిడివితో ఉన్న ఆ ప్రకటనలో... మీసాలు, గడ్డం, శరీరంలో వచ్చే మార్పులతో ఇబ్బంది పడుతోన్న ఓ టీనేజర్, ఆత్మవిశ్వాసంతో కూడిన అందమైన వధువుగా మారే క్రమాన్ని అద్భుతంగా చూపించారు.

ఈ ప్రకటనలో 22 ఏళ్ల మీరా సింఘానియా రెహాని నటించారు. కేరళకు చెందిన జ్యువెల్లరీ హౌస్ 'భీమ' ఈ ప్రకటనను రూపొందించింది. ట్రాన్స్ జెండర్ అయిన మీరాపై తన కుటుంబం చూపించే ప్రేమ, అమ్మాయిగా అంగీకరించే తీరును, ఆమె జీవితంలోని ప్రతీ ప్రత్యేక సందర్భంలోనూ నగలను బహుమతిగా ఇవ్వడాన్ని ఈ ప్రకటనలో చిత్రీకరించారు.

'స్వచ్ఛమైన ప్రేమ' పేరుతో రూపొందించిన ఈ ప్రకటనను, ఏప్రిల్‌లో విడుదలైనప్పటి నుంచి యూట్యూబ్‌లో 9 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 14 లక్షల మంది చూశారు.

ఢిల్లీ యూనివర్సిటీ సోషియాలజీ విద్యార్థి అయిన మీరా, పార్ట్ టైమ్ మోడల్‌గా పనిచేస్తున్నారు. మొదటిసారి ఈ ప్రకటన గురించి విన్నప్పుడు ప్రకటనలో నటించాలా వద్దా అని చాలా సంశయించినట్లు ఆమె చెప్పారు.

''వాణిజ్యపరమైన అంశాల కోసం నా ట్రాన్స్ ఐడెంటిటీ ఉపయోగపడాలని నేనెప్పుడు అనుకోలేదు. అంతేకాకుండా ప్రకటనలో గడ్డంతో అబ్బాయిలా కనిపించాలంటే చాలా సంకోచించాను.''

''కానీ స్క్రిప్టు మొత్తం చదివి, డైరెక్టర్ గురించి తెలుసుకున్న తర్వాత ప్రకటనలో నటించడానికి ఒప్పుకున్నాను. అందులో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రకటన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది'' అని ఆమె బీబీసీతో చెప్పారు.

భీమ జ్యూవెల్లరీ

ఫొటో సోర్స్, Bhima Jewellery

ఫొటో క్యాప్షన్, గడ్డంతో ఉన్న టీనేజర్, అందమైన వధువుగా మారడాన్ని ప్రకటనలో చూపించారు

భారత్‌లో 20 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు అంచనా. చట్ట ప్రకారం ట్రాన్స్ జెండర్లకు కూడా మిగిలిన వారితో సమానంగా హక్కులు ఉండాలని 2014 ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

కానీ వారిపట్ల ఉండే చులకనభావం ఇంకా అలాగే ఉంది. చాలామంది ట్రాన్స్‌జెండర్లను వారి సొంత కుటుంబాలే దూరం పెడతాయి. గత్యంతరం లేక వీరంతా పెళ్లిళ్లు, బారసాల వంటి వేడుకల్లో పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ మరికొందరైతే భిక్షమెత్తుతూ జీవిస్తారు. కొందరు వ్యభిచార వృత్తిలోకి దిగుతారు.

భారత్‌లో కేరళ రాష్ట్రం ట్రాన్స్‌జెండర్లతో కాస్త స్నేహపూర్వకంగా మెదులుతుంది. లైంగిక మైనారిటీ సమూహమైన ఈ ట్రాన్స్‌జెండర్ల పట్ల ఉండే చులకనభావాన్ని రూపుమాపేందుకు 2015లో కేరళ రాష్ట్రం 'ట్రాన్స్‌జెండర్ పాలసీ'ని ప్రవేశపెట్టింది. ఈ పాలసీని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. కానీ దేశంలోని మిగతా ప్రాంతాల కన్నా కేరళలోనే ట్రాన్స్‌ఫోబియా ఎక్కువగా కనబడుతుంది.

'భీమ' జ్యూవెల్లర్స్ ఆన్‌లైన్ మార్కెటింగ్ హెడ్ నవ్యా రావు ఆలోచన ఫలితంగానే ఈ ప్రకటనను రూపొందించారు. తొలుత ఈ ఆలోచన గురించి చెప్పినప్పుడు సహోద్యోగులు భయపడ్డారని ఆమె బీబీసీతో చెప్పారు.

''అంతకుముందు మేం ప్రకటనలన్నీ సాధారణ పెళ్లి కూతుళ్లతోనే చేశాం. అందుకే ఈ ప్రకటన చేశాక ప్రజలు దీన్ని ఆదరిస్తారా? దీని గురించి ఎలా స్పందిస్తారో అని మేం ఆందోళన చెందాం.''

''మా విక్రయ కేంద్రాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడి గ్రామీణ ప్రజలు ఇలాంటి సున్నిత అంశాల పట్ల ఎలా స్పందిస్తారో మాకు సరిగా తెలియదు. కానీ ఈ ప్రకటన ద్వరా ఒక మంచి సామాజిక సందేశాన్ని అందించాలని, ఈ అంశం పట్ల బాహటంగా మాట్లాడే అవకాశం కల్పించాలని మేం నిర్ణయించుకున్నాం'' అని నవ్యా రావు వివరించారు.

96 ఏళ్ల చరిత్ర కలిగిన భీమ జ్యువెల్లర్స్‌కు దక్షిణ భారతంలో డజన్ల కొద్దీ విక్రయ కేంద్రాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనూ బ్రాంచ్‌లు ఉన్నాయి.

ఈ ప్రకటన విఫలమయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తనకు తెలుసని నవ్య చెప్పారు. గతేడాది ప్రముఖ జ్యూవెల్లరీ షాప్ 'తనిష్క్' సంస్థ కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొందని ఆమె గుర్తు చేసుకున్నారు. మతాంతర వివాహం థీమ్‌తో ప్రకటనను రూపొందించిన తనిష్క్.... సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకత రావడంతో ఆ ప్రకటనను విరమించుకుంది.

''ప్రకటనలో హిందు వివాహాన్ని చూపించారు. దీంతో ఈ అంశంపై తీవ్ర వివాదం చెలరేగుతుందని అనుకున్నా. ఎందుకంటే హిందు మతంలోని పితృస్వామ్య వ్యవస్థనే ఈ అంశం నేరుగా సవాలు చేస్తుంది'' అని మీరా చెప్పారు.

భీమ జ్యూవెల్లరీ

ఫొటో సోర్స్, Bhima Jewellery

ఫొటో క్యాప్షన్, ట్రాన్స్ జెండర్‌పై తన కుటుంబం చూపించే ప్రేమ, వాత్సల్యాన్ని ప్రకటన ప్రతిబింబిస్తుంది

కానీ ఈ ప్రకటన కొందరికే నచ్చలేదు. మిగతా ప్రజల నుంచి వచ్చిన స్పందనతో చాలా సంతోషంగా ఉందని నవ్యా రావు అన్నారు.

''ఈ ప్రకటనను కొందరు విమర్శించారు. సమాజంలో ఉండకూడని, అసహజమైన వ్యవస్థకు మేం మద్దతు ఇస్తున్నామని కొందరు ఆరోపించారు. కానీ చాలామంది మమ్మల్ని అభిమాన సందేశాలతో ముంచెత్తారు. చాలా ఎల్జీబీటీక్యూఐ కమ్యూనిటీలు ఈ ప్రకటన తమ హృదయానికి దగ్గరగా నిలిచిందని మమ్మల్ని ప్రశంసించాయి'' అని ఆమె వివరించారు.

ఈ ప్రకటన 'విప్లవాత్మకమైనదని' రచయిత, ఫైర్ వర్క్ వీడియో ప్లాట్‌ఫామ్ స్ట్రాటజిస్టు సుధా పిళ్లై ప్రశంసించారు.

''మలయాళ న్యూస్ చానెల్‌లో నేను ఈ ప్రకటన చూశాను. వారు నగలు అమ్మడం కాకుండా, అందరి చూపు తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారేమో అనుకున్నా. అనుకున్నట్లుగానే వారు అందరి దృష్టిని ఆకర్షించారు.'' అని ఆమె చెప్పారు.

''ఒక సంప్రదాయక సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని నేనెప్పుడూ చూడలేదు. సంప్రదాయక నగల వ్యాపారి రిస్క్‌తో కూడిన ఈ నిర్ణయం తీసుకోవడమే విప్లవాత్మకమైనది.''

ఈ ప్రకటన అద్భుతంగా, అందంగా ఉందని చాలామంది ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ఇది చూశాక కళ్లలో నీళ్లు తిరిగినట్లు చెప్పారు.

'' మేం కోరుకున్న వ్యక్తి తెరపై కనిపించేలా చేసినందుకు ధన్యవాదాలు. మీ ప్రకటనలో ట్రాన్స్‌జెండర్‌కు ప్రాధాన్యత ఇవ్వడం నా కళ్లలో నీళ్లు తెప్పించింది. తొలిసారిగా మా జీవితాలు కూడా ముఖ్యమైనవే అనే భావన కలుగుతోంది. మేం కూడా సంతోషంగా ఉండటానికి అర్హులమే అనిపిస్తుంది. 'భీమ'... ఇది చాలా ప్రత్యేకమైనది'' అని యూ ట్యూబ్‌లో ఒకరు కామెంట్ చేశారు.

'భారత్‌లో నిర్మించే సినిమాలు ట్రాన్స్‌జెండర్లను వ్యంగ్యంగానే చూపిస్తాయి. ఇలాంటి ప్రకటనలు సినిమాల ధోరణిలో మార్పు కలిగిస్తాయి' అని పిళ్లై వ్యాఖ్యానించారు.

''చలనచిత్రాల కన్నా ప్రకటనలు, టీవీ సీరియల్స్ చాలా ప్రభావవంతమైనవి. ఇవి ఇళ్లలోని టీవీల్లో నిరంతరం ప్రసారమవుతూనే ఉంటాయి. కాబట్టి ప్రజల అభిప్రాయాలను మార్చే శక్తి వీటికి ఉంటుంది. మొదట్లో వాటికి కాస్త వ్యతిరేకత ఎదురుకావొచ్చు కానీ మెల్లిమెల్లిగా వాటి ప్రభావాన్ని చూపిస్తాయి.''

సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ప్రకటన గురించి ప్రశంసించినప్పుడు భారతీయ సంప్రదాయవాదుల నుంచి ట్రోల్స్ ఎదురయ్యాయని పిళ్లై చెప్పారు.

''కొందరి అభిప్రాయాల్లో బేధాలు ఉన్నాయి. కానీ అలాంటివారి సంఖ్య చాలా తక్కువే. 95 శాతం మంది సానుకూలంగా స్పందించారు. ఇది ఆహ్వానించదగిన అంశం'' అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)