1983 ప్రపంచకప్: ‘‘అప్పట్లో నాలాంటి క్రికెట్ పిచ్చోళ్ళ సంఖ్య తక్కువ.. వాళ్లు కలలో కూడా ఊహించని విజయం.. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా తెలియలేదు’’

ఫొటో సోర్స్, BCCI
- రచయిత, సి. వెంకటేష్
- హోదా, క్రీడా విశ్లేషకులు
1983 ప్రపంచ కప్ విజయం ఒక కల లాంటిది. అది నిజం అని నమ్మడానికి నాలాంటి వాళ్ళకు కొంత సమయం పట్టింది. '83' సినిమా వల్ల ఇప్పుడు రివైండ్ బటన్ నొక్కి మళ్ళీ ఆ కలను కళ్ళ ముందు ప్రత్యక్షం చేసుకునే అవకాశం కలుగుతోంది.
టెలివిజన్ కవరేజ్‌కు నోచుకోని కపిల్ దేవ్ 175 నాటౌట్ ఇన్నింగ్స్‌కు ఈ సినిమా దృశ్యరూపం కల్పిస్తుందన్న ఎగ్జయిట్‌మెంట్ కూడా చాలా ఉంది. అదొక్కటే కాదు.... బల్విందర్ సాంధు 'బనానా ఇన్‌స్వింగర్', కపిల్ పట్టిన రిచర్డ్స్ క్యాచ్, సెమీస్‌లో పాటిల్ వీరంగం ఇలాంటివన్నీ వెండి తెర మీద చూసేయాలన్న తహ తహ తరుముకొస్తోంది.
1983 నాటికి నేను ఒకానొక తెలుగు పత్రికలో అప్రెంటీస్ సబ్ ఎడిటర్‌ని. క్రికెట్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఆ ఆటకు సంబంధించిన బోలెడన్ని సంగతులు రాసేయాలని కలలు మోసుకుంటూ జర్నలిజంలోకి దూకిన బాపతు. కానీ అప్పట్లో తెలుగు న్యూస్ పేపర్లలో స్పోర్ట్స్ పేజి అనేదే ఉండేది కాదు.
అసలు అప్పట్లో నాలాంటి క్రికెట్ పిచ్చోళ్ళ సంఖ్య కూడా బొత్తిగా తక్కువ. అయితే అలాంటి వీరాభిమానులు కూడా మన జట్టు కప్ పట్టుకొస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, మన ఆటగాళ్ళు కూడా అస్సలు అనుకోలేదు.

ఫొటో సోర్స్, @RANVEEROFFICIAL
అందుకే కొంత మంది ప్లేయర్లు మొదటి రౌండు పోటీల తర్వాత అటు నుంచి అటే అమెరికా యాత్ర ప్లాన్ చేసుకున్నారు. కొత్త పెళ్ళికొడుకు క్రిష్ణమాచారి శ్రీకాంత్, న్యూయార్క్‌లో హానీమూన్ చేసుకుందామనుకున్నాడు. పాపం, మన జట్టు సెమీఫైనల్‌కి క్వాలిఫై అవడంతో వాళ్ళ ఫ్లైట్ టికెట్లు వృధా అయ్యాయి. మనం లగాన్ సినిమా చూశాం. 1983 రియల్ లైఫ్ లగాన్ లాంటిది.
ప్రతి మ్యాచ్ లైవ్ చూసే అవకాశం అప్పట్లో లేదు. రేడియోలో వినాల్సిందే, అది కూడా ఇంగ్లీషు కామెంటరీతో. ప్రపంచ కప్‌లో మన మొదటి మ్యాచ్‌లో చాంపియన్ వెస్టిండీస్‌ని ఓడించేయడం విని మహదానందపడ్డాము. తర్వాతి మ్యాచ్‌లో జింబాబ్వే మీద కూడా గెలిచేసరికి అంచనాలు బాగా పెరిగిపోయాయి. కానీ మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మన టీమ్‌ని చిత్తుగా ఓడించింది. రివర్స్ మ్యాచ్‌లో విండీస్ చేతిలో కూడా కపిల్ సేనకు ఓటమి తప్ప లేదు. మొదటి రెండు విజయాలతో ఎక్కిన మత్తు ఆ వరస పరాజయాలతో ఒక్కసారిగా దిగిపోయింది.
టన్‌బ్రిడ్జ్‌వెల్స్ అనే చిన్న పట్టణంలో జింబాబ్వేతో మన రివర్స్ మ్యాచ్. ప్రపంచ కప్ మ్యాచ్‌లు టెలికాస్ట్ చేస్తున్న బి.బి.సి సంస్థ సిబ్బంది అదే రోజు సమ్మె చేస్తుండటం వల్ల ప్రత్యక్ష ప్రసారం కాదు కదా కనీసం రికార్డు కూడా చేయలేదు.
భారత జట్టు యువ నాయకుడు ఆ మ్యాచ్‌లో ఒక అద్భుతం సృష్టిస్తాడని ఎవరు మాత్రం ఊహించి వుంటారు? ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పైన ఇండియా 17 పరుగులకే ఐదు వికెట్లు పోగొట్టుకుంది.
అప్పుడు బ్యాటింగ్‌కు దిగిన కపిల్ దేవ్ 16 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టి 138 బంతుల్లో 175 పరుగులు చేయడంతో ఒక్క సారిగా సీను మారిపోయింది. మన జట్టుకు 'కపిల్స్ డెవిల్స్ ' అని పేరు పెట్టి మిగతా వాళ్ళు సీరియస్‌గా తీసుకోవడం మొదలయింది. కెప్టెన్ ఆడిన ఆ అసాధారణ ఇన్నింగ్స్, టీమ్‌కు కూడా ఎంత ఇన్‌స్పిరేషన్ ఇచ్చిందంటే ఇక 'తగ్గేదే ల్యా' అన్నట్టు ప్లేయర్లంతా రెచ్చిపోయారు.
మొదటి మ్యాచ్‌లో 162 పరుగుల తేడాతో మనని ఓడించిన ఆస్ట్రేలియా మీద రివర్స్ మ్యాచ్‌లో 118 రన్స్ తేడాతో మన వాళ్ళు గెలిచేశారు. ఇంకేముంది, ఎవ్వరూ ఊహించని విధంగా టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
సెమీస్ నుంచి దూరదర్శన్‌లో మ్యాచ్‌ల లైవ్ టెలికాస్ట్ ఉంది. నేను ఆఫీసులో పర్మిషన్ పెట్టి త్వరగా ఇంటికి చేరుకునే సరికి అప్పటికే మ్యాచ్ మొదలయింది. మా చిన్ని బ్లాక్ అండ్ వైట్ డైనోరా టీవీలో చూస్తున్నా కూడా ఇంగ్లండ్ వెళ్ళి స్టేడియంలో కూర్చున్న ఫీలింగ్ కలిగింది.
మంచి ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ తరువాత ఇంగ్లండ్ వికెట్లు టపటపా రాలాయి. బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు మొహిందర్ అమర్‌నాథ్, కీర్తి ఆజాద్ బ్రహ్మాండంగా బౌలింగ్ వేశారు. టార్గెట్ 214 పరుగులే అయినా ఇండియా బ్యాటింగ్ స్లో అవ్వడంతో కొంచెం టెన్షన్ మొదలయింది. కానీ సందీప్ పాటిల్ 160 స్ట్రయిక్ రేట్‌తో టీ20 స్టయిల్లో హాఫ్ సెంచరీ చేసి ఇంకా ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిపించేశాడు.

ఫొటో సోర్స్, facebook/ch.venkatesh.98
ఇంగ్లీషు దొరలు ఈ ఓటమి అస్సలు జీర్ణించుకోలేక పోయారు. అసలు ఈ మ్యాచ్ జరగక ముందే ఇంగ్లండ్ పత్రికలు వెస్టిండీస్‌తో తమ జట్టు ఫైనల్ ఆడుతుందని ఫిక్సయిపోయి, ఆ ఫైనల్ మ్యాచ్ గురించే ఎక్కువగా రాశాయి.
ఫైనల్ మీద మాకెవరికీ పెద్దగా నమ్మకం లేదు. మన టీమ్ అక్కడి వరకు రావడమే పెద్ద బోనస్. అందులోనూ వెస్టిండీస్ మీద నెగ్గడమా...నో ఛాన్స్! ఏదో అద్భుతం జరగొచ్చునేమోనన్న ఆశ ఒకటి మాత్రం మిణుకు మిణుకు మంది.
ఆ రోజు తేదీ జూన్ 25 - నా పుట్టిన రోజు. సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నా. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన ఇండియా, మొదట్లోనే గవాస్కర్ వికెట్ పోగొట్టుకుంది. అయితే శ్రీకాంత్ కొన్ని డేరింగ్ షాట్స్ కొట్టి ఆశలు రేకెత్తించాడు. అమర్‌నాథ్‌తో కలిసి అతను స్కోరును 50 దాటించాడు. కానీ తరువాత వికెట్లు వెంట వెంటనే పడ్డాయి. 183 కే ఆలౌట్. ఇంకా 5.2 ఓవర్లు మిగిలిపోయాయి కూడా. మిణుకు మిణుకు ఆశ కూడా లేదిప్పుడు.

ఫొటో సోర్స్, Getty Images
వెస్టిండీస్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే సాంధు ఓ మ్యాజిక్ డెలివరీతో డేంజరస్ బ్యాట్స్‌మన్ గ్రీనిడ్జ్‌ను పెవిలియన్‌కు పంపాడు. కానీ తర్వాత వచ్చిన వివ్ రిచర్డ్స్ చెలరేగిపోయాడు. ముఖ్యంగా మదన్ లాల్ పైన విరుచుకు పడ్డాడు.
కానీ అదే మదన్ లాల్ బౌలింగ్‌లో రిచర్డ్స్ ఇచ్చిన క్యాచ్‌ను కపిల్ దేవ్ వెనక్కి పరిగెత్తుతూ అందుకున్నాడని రేడియోలో విన్నాం. (అప్పుడు దూరదర్శన్‌లో వార్తల టైమ్. మ్యాచ్ టెలికాస్ట్ ఆగిపోయింది. మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆ సూపర్ క్యాచ్ మేము లైవ్‌లో చూడలేక పోయాం.)
మళ్ళీ టీవీలో మ్యాచ్ వచ్చేసరికి ఇంకొన్ని వికెట్లు పడ్డాయి. 76 ఫర్ 6...కానీ ఎందుకో మనవాళ్ళు గెలుస్తారన్న నమ్మకం కలగలేదు. భయపడినట్టుగానే డుజాన్, మార్షల్ కలిసి స్కోరును 119 వరకు తీసుకెళ్ళారు. అప్పుడు అమర్‌నాథ్ బౌలింగ్‌కు దిగి ఆ ఇద్దరినీ ఔట్ చేశాడు. ఇక మిగతా వికెట్లు కూడా తొందరగానే దొరికేశాయి.
ఘనత వహించిన విండీస్ 143కే ఆలౌట్! ఇండియా ఇప్పుడు ప్రపంచ చాంపియన్!! నమ్మబుద్ధి కావట్లేదు. నిజంగా కప్పు గెలిచేశామా? మా పక్క పోర్షన్లో ఉన్న సింధీ వాళ్ళు స్వీట్లు పంచారు. అసలు ఈ విజయాన్ని ఎలా సెలెబ్రేట్ చేసుకొవాలో కూడా మాకు అర్థం కాలేదు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి గెలుపు తాలూకు అనుభవం ఉంటే కదా.

ఫొటో సోర్స్, C Venkatesh
నేను పని చేస్తున్న పత్రికలో తాటికాయంత అక్షరాలతో టైటిల్ పెట్టి ఈ గెలుపు వార్త రాసేద్దామని బయలుదేరబోయాను. కానీ నాన్న వద్దన్నాడు.
అదో పెద్ద నిరాశ. ఆ వార్త రాయలేక పోయినా ఆ తరువాత బోలెడన్ని క్రీడావార్తలు, వ్యాసాలు రాసే అవకాశం ఆ విజయం నాకు కల్పించింది.
ఆ గెలుపు పుణ్యమాని 'కొత్తా దేవుడండీ' అన్నట్టు క్రికెట్ ఒక మతంగా దేశంలో నలుమూలలా విస్తరించింది. తెలుగు పత్రికల్లో స్పోర్ట్స్ పేజీలకు చోటు దక్కింది. నా బోటి వారు స్పోర్ట్స్ జర్నలిస్టులయ్యే ఛాన్స్ దొరికింది. గేమ్ చేంజర్ అంటే ఇదేరా...
ఇవి కూడా చదవండి:
- ఉత్తర తెలంగాణపై దండెత్తిన కోతులు.. కొండ ముచ్చులు వీటికి చెక్ పెట్టగలవా?
- అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లు ప్రమాదకరమా? కళ్లు పచ్చగా ఉంటే బాక్సులో పెట్టాలా? ఎండలో పెడితే సరిపోతుందా?
- బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య.. గర్ల్‌ఫ్రెండ్‌కు జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
- 1983 వరల్డ్ కప్: జింబాబ్వేపై కపిల్ దేవ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ను బీబీసీ ఎందుకు టెలికాస్ట్ చేయలేదు?
- SC వర్గీకరణ: ఇపుడెక్కడుంది, ఎందుకని ఆలస్యమవుతోంది
- షాంపూల్లో క్యాన్సర్ కారకాలు.. 30కి పైగా బ్రాండ్లను రీకాల్ చేసిన అమెరికా కంపెనీ
- 2022 జనవరి 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేయాలంటే గుర్తుంచుకోవాలసిన విషయాలు..
- సినిమా టికెట్ల వివాదం: నటుడు నాని ఎందుకలా స్పందించారు? మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నారు?
- కేరళ: అమ్మాయిల స్కూలు యూనిఫాంపై కొన్ని ముస్లిం సంఘాలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నాయి
- ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువే, భయపడాల్సిన పనిలేదు.. మీరు తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













