బోస్టన్ కాలేజ్: బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య.. గర్ల్‌ఫ్రెండ్‌కు జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు

ఫొటో సోర్స్, URTULA FAMILY VIA SUFFOLK DA'S OFFICE/CBS BOSTON
రెండేళ్ల క్రితం తన బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్యకు తానే పరోక్షంగా కారణమని బోస్టన్ కాలేజీ మాజీ విద్యార్థిని అంగీకరించారు.
ఈ కేసులో 23 ఏళ్ల ఇన్‌యంగ్ యు అనే విద్యార్థినికి రెండున్నరేళ్ల సస్పెండెడ్ జైలు శిక్ష పడింది. అమెరికాను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ కేసులో ఆమెకు ఎలాంటి ప్రయోజనం అనుమతించబోమని కోర్టు పేర్కొంది.
''ఈ కేసులోని వాస్తవాలకు సంబంధించినంత వరకు మీడియా ప్రదర్శనలు, చర్చలు, ప్రచారాల ద్వారా ఆమెకు ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందకూడదని'' న్యాయమూర్తి రాబర్ట్ ఉల్మాన్ వ్యాఖ్యానించారు.
2019 మే 20న మరికొన్ని గంటల్లో గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకోవాల్సిన ఆమె ప్రియుడు, 22 ఏళ్ల అలెగ్జాండర్ ఉర్తులా ఒక గ్యారెజ్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఉర్తులాపై తిట్లతో విరుచుకుపడ్డ ఇన్‌యంగ్ ఆయనను చచ్చిపోవాల్సిందిగా కోరినట్లు ప్రాసిక్యూటర్లు చెప్పారు.
మసాచుసెట్స్‌లోని బోస్టన్ సఫోక్ కౌంటీ సుపీరియర్ కోర్టు గురువారం ఆమెకు శిక్ష విధించింది. 10 సంవత్సరాల పాటు సస్పెండెడ్ జైలు శిక్షను విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఇందులో తప్పనిసరి మానసిక ఆరోగ్య చికిత్స తీసుకోవడంతో పాటు, 300 గంటల సమాజ సేవ చేయాలని కోర్టు ఆదేశించింది.
సస్పెండెడ్ టర్మ్ కాలంలో ఆమె కోర్టు నిబంధనల ప్రకారం నడుచుకుంటే త్వరగా జైలు నుంచి బయటపడొచ్చు. ఒకవేళ ఆమె ఈ ప్రొబేషన్ కాలంలో నిబంధనలు ఉల్లంఘిస్తే, మళ్లీ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.
దీని గురించి మాట్లాడేందుకు ఇన్‌యంగ్ నిరాకరించారు. ఇన్‌యంగ్ చాలా కలత చెందినట్లు ఆమె లాయర్ తెలిపారని బోస్టన్ హెరాల్డ్ వెబ్‌సైట్ పేర్కొంది.
''18 నెలల పాటు సాగిన వారి బంధంలో ఉర్తులాను శారీరకంగా, మాటలతో, మానసికంగా ఇన్‌యంగ్ వేధించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయిందని'' సఫోక్ డిస్ట్రిక్ట్ అటార్నీ రాచెల్ రోలిన్స్ 2019 అక్టోబర్‌లో చెప్పారు.
''రాన్రాను ఆమె మరింత తరచుగా తిట్టడం, అవమానించడం, వేధింపులు ఎక్కువ కావడంతో అది ఉర్తులా మరణానికి దారి తీసిందని'' ఆమె పేర్కొన్నారు.
ఉర్తులా మరణించడానికి ముందు రెండు నెలల్లో వీరిద్దరూ 75 వేలకు పైగా మెసేజ్‌లు పంపుకున్నట్లు రాచెల్ తెలిపారు.
ఇన్‌యంగ్ తన సందేశాల్లో ' వెళ్లి చావు', 'చచ్చిపో' అని ఉర్తులాను కోరేదని న్యాయవాది చెప్పుకొచ్చారు.
''మే 20వ తేదీన ఉర్తులా లొకేషన్‌ను ట్రాక్ చేసుకుంటూ ఇన్‌యంగ్ రెనాసెన్స్ గ్యారేజ్‌కు వెళ్లారు. అక్కడే ఉర్తులా ఆత్మహత్య చేసుకున్నారు'' అని ఆమె పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- 1983 వరల్డ్ కప్: జింబాబ్వేపై కపిల్ దేవ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ను బీబీసీ ఎందుకు టెలికాస్ట్ చేయలేదు?
- SC వర్గీకరణ: ఇపుడెక్కడుంది, ఎందుకని ఆలస్యమవుతోంది
- షాంపూల్లో క్యాన్సర్ కారకాలు.. 30కి పైగా బ్రాండ్లను రీకాల్ చేసిన అమెరికా కంపెనీ
- 2022 జనవరి 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేయాలంటే గుర్తుంచుకోవాలసిన విషయాలు..
- సినిమా టికెట్ల వివాదం: నటుడు నాని ఎందుకలా స్పందించారు? మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నారు?
- కేరళ: అమ్మాయిల స్కూలు యూనిఫాంపై కొన్ని ముస్లిం సంఘాలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నాయి
- ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువే, భయపడాల్సిన పనిలేదు.. మీరు తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















