ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసేస్తున్నారు.. ఎవరేమంటున్నారు?

ఫొటో సోర్స్, Botsa Satyanarayana, Nani
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని పలు సినిమా థియేటర్లపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని థియేటర్లపై దాడులు చేస్తూ, సీజ్ చేస్తున్నారు. ఇలాగైతే తాము శాశ్వతంగా థియేటర్లు మూసుకోవాల్సి వస్తుందని యాజమాన్యాలు అంటున్నాయి.
ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, సర్కార్ వారి పాట వంటి భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపధ్యంలో, సినిమా పరిశ్రమ విషయంలో ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై ఎగ్జిబిటర్లు, థియేటర్ యాజమన్యాలు గురువారం విజయవాడలో సమావేశం అవుతున్నాయి.

ఫొటో సోర్స్, UGC
థియేటర్లపై దాడులకు కారణం ఏంటి?
కృష్ణా, పశ్చిమగోదావరి, విజయనగరం, చిత్తూరు జిల్లాలోని పలు థియేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించడం లేదంటూ కొన్ని థియేటర్లను సీజ్ చేశారు.
ఇందులో ప్రధానంగా టికెట్ల ధరలతో పాటు క్యాంటీన్ ధరలు, థియేటర్‌లో సౌకర్యాలు, సీటింగ్, కోవిడ్ 19 నిబంధనలు పాటించడం వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకుంటున్నారు.
గత రెండు రోజులుగా రాష్ట్రంలో థియేటర్లపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. థియేటర్ల యాజమాన్యంతో, అందులో పని చేస్తున్న కార్మికులు, ఆట ముగిసిన తర్వాత ప్రేక్షకులతో అధికారులు మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు.
ఇటీవల విడుదలైన అఖండ, పుష్ప వంటి సినిమాల టిక్కెట్ల ధరలు ఎలా ఉన్నాయి, బెనిఫిట్ షోలు వేశారా లేదా అనే అంశాలపై ప్రశ్నిస్తున్నారు. అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించినట్లు తేలితే థియేటర్లను సీజ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, ugc
కోర్టులో కేసు
అంతకు ముందు, సినిమా టిక్కెట్ల ధరను నియంత్రిస్తూ ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై ప్రభుత్వం జీవో నెం. 35ను విడుదల చేసింది.
అయితే, ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో తాము థియేటర్లు నిర్వహించలేమని, భారీ సినిమాలు విడుదలయ్యేటప్పుడు ధరలను నిర్ణయించే అధికారం తమకే ఇవ్వాలంటూ సినిమా థియేటర్ల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి.
దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్.. పాత విధానంలోనే టికెట్లు విక్రయించుకోవాలని, ధరల పెంపుపై జేసీ నుంచి అనుమతి తీసుకోవాలని ఆదేశిస్తూ జీవో నెంబరు 35ను సస్పెండ్ చేసింది. ఈ తీర్పుపై ప్రభుత్వం డివిజనల్ బెంచ్‌లో సవాల్ చేసింది. దీనిపై విచారణ గురువారం జరగనుంది.

ఫొటో సోర్స్, UGC
ఒక వైపు సీజ్...
అధికారులు దాడులు చేసి, నిబంధనలు పాటించడం లేదంటూ రాష్ట్రంలో పలు ధియేటర్లను సీజ్ చేశారు. అందులో విజయవాడ, విజయనగరం, పశ్చిమగోదావరి థియేటర్లు ఉన్నాయి.
విజయనగరం జిల్లాలో కలెక్టర్ సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ జీసీ కిషోర్ కుమార్ కూడా థియేటర్లను తనిఖీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఆరు సినిమా థియేటర్లను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు, అధిక ధరలకు టికెట్ల విక్రయించనట్టు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు జేసీ తెలిపారు.
అధిక ధరలకు టికెట్స్ విక్రయిస్తున్నారంటూ భోగాపురం మండలం గోపాలకృష్ణ థియేటర్‌ను, నెల్లిమర్లలోని ఎస్ త్రీ సినిమాస్ థియేటర్, కొత్తవలసలో లక్ష్మీ, జయ, నరసింహ థియేటర్లను సీజ్ చేశామని చెప్పారు.

ఫొటో సోర్స్, ugc
మరోవైపు స్వచ్చందంగా మూసివేత
ప్రభుత్వం కావాలనే దాడులు చేయిస్తోందంటూ ఎగ్జిబిటర్లు అంటున్నారు. విజయనగరం, విజయవాడ, పశ్చిమగోదావరి, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో దాడులు చేసి ఇప్పటికే పలు థియేటర్లను సీజ్ చేశారు.
టిక్కెట్ల రేట్లు అధికంగా ఉన్నాయని, థియేటర్‌లో సౌకర్యాలు లేవనే కారణాలతో అధికారులు థియేటర్లను సీజ్ చేస్తున్నారు.
“జీవో నెంబరు 35ను కోర్టు సస్పెండ్ చేసినా కూడా ప్రభుత్వం దాడుల పేరుతో థియేటర్ యాజమన్యాలను ఇబ్బంది పెట్టడం సరైన చర్య కాదు. ఇలాగే కొనసాగితే థియేటర్లు మూసుకోవడమే తప్ప మరో మార్గం లేదు. నిన్న కృష్ణా జిల్లాలో 20 థియేటర్‌లను సీజ్ చేసినట్టు తెలిసింది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో 50 థియేటర్లను యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసివేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 300 థియేటర్లను మూసివేసే పరిస్థితి ఉంది. మళ్లీ సానుకూల పరిస్థితులు వచ్చే వరకు తాము థియేటర్లను తెరవబోమని యజమానులు అంటున్నారు. మా పరిస్థితి కూడా రేపో మాపో అలాగే ఉంటుంది. సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వ నిర్ణయం రాజకీయ కక్ష సాధింపు చర్యగానే కనిపిస్తోంది. దీనిక థియేటర్ యాజమాన్యాలు బలి కావాల్సి వస్తోంది” అని కిన్నెర థియేటర్ యాజమాని పి. సాంబమూర్తి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, ugc
కరోనా, జీవోలు, ఓటీటీలు.. అన్నీ దెబ్బతీశాయి
ఇప్పటికే అఖండ, పుష్ఫ వంటి భారీ సినిమాలు విడుదలైన సందర్భంగా కొన్ని చోట్ల బెనిఫిట్ షో వేశారని, టిక్కెట్ల ధరలు పెంచారనే ఆరోపణలతో కొన్ని థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.
రానున్న రోజుల్లో ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. సంక్రాంతి సీజన్‌గా చెప్పుకునే ఈ సమయంలో ప్రభుత్వం నిబంధనల పేరుతో థియేటర్లను తీవ్రంగా దెబ్బకొడుతోందని ఎగ్జిబిటర్లు అంటున్నారు.
“ఎంతో కాలంగా వేచి చూస్తున్న పెద్ద హీరోల సినిమాలు విడుదలై, కరోనా దెబ్బ నుంచి సినిమా థియేటర్లు బయటపడే సమయం ఇది. కానీ, ప్రభుత్వం జీవో 35, మరో జీవో 142లతో పాటు వరుసగా థియేటర్లపై చేస్తున్న దాడులు థియేటర్ యాజమాన్యాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతానికి హైకోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా గట్టెక్కినా, డివిజిన్ బెంచ్ ప్రభుత్వ జీవోకు అనుకూలంగా తీర్పునిస్తే థియేటర్లు మూసివేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్న తరుణంలో టికెట్ ధరలు తగ్గిస్తుంటే కనీసం నిర్వహణ ఖర్చులు కూడా రావు. ఇప్పటికే ఓటీటీలు, యూట్యూబ్ వల్ల ఏపీలో వందలాది థియేటర్లు మూతబడ్డాయి. టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే థియేటర్లు మూతబడటమే కాకుండా, వాటిని నమ్ముకున్న వేలాదిమంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతారు” అని ఎగ్జిబిటర్ ప్రసాద రెడ్డి బీబీసీకు తెలిపారు.
జీవోలు 35, 142ల్లో ఏముంది?
సినిమా టిక్కెట్ల ధరలను నియంత్రిస్తూ విడుదల చేసిన జీవో నెంబరు 35 కోర్టుల జోక్యంతో కాస్త సద్దుమణిగినట్లు కనిపించినా, తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 142తో మళ్లీ వివాదం రాజుకుంది.
జీవో 142 ప్రకారం, టికెట్ల అమ్మకాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. టిక్కెట్ల అమ్మకాలు, నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం అప్పగించింది. ఇదంతా రైల్వే టిక్కెట్ల కోసం ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తున్న వెబ్ సైట్ తరహాలోనే ఉంటుందని పేర్కొంది.

ఫొటో సోర్స్, UGC
'ఇది కక్ష సాధింపు కాదు'
థియేటర్లపై కక్ష సాధింపుతోనే అధికారులు దాడులు చేస్తున్నారనే మాటలో నిజం లేదని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ బీబీసీతో చెప్పారు.
నిబంధనలు పాటించే థియేటర్లను తామేమి సీజ్ చేయడం లేదని, సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం, నిబంధనలు పాటించని థియేటర్లనే సీజ్ చేస్తున్నామన్నారు. చాలా థియేటర్లనలో కనీసం ఫైర్ సేఫ్టీ లైసెన్స్ కూడా రెన్యూవల్ చేసిన దాఖలాలు కనపడటం లేదని చెప్పారు.
తాము నిబంధనల ప్రకారం పని చేస్తున్నామని, ప్రేక్షకులకు వినోదాన్ని అందించే సినమా పరిశ్రమపై తామెలాంటి కక్ష సాధింపు చర్యలకూ పాల్పడటం లేదని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించడం అంటే ప్రేక్షకులను అవమానించినట్లేనని హీరో నాని తన నూతన చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా కొట్టుకే కలెక్షన్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పారు. ప్రేక్షకుడు కోరుకునే వినోదం కోసం టికెట్ ధర పెంచినా, కొనే సామర్థ్యం వారికి ఉందని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటారా?
సినిమా టిక్కెట్ వివాదంపై మంత్రి బొత్స స్పందించారు. విజయనగరం జిల్లాలోని ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి ధాన్యం సేకరణపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్బంలో సినిమా టిక్కెట్ల వివాదంపై కూడా మాట్లాడారు.
“టిక్కెట్ ధరను రూ.500 పెడితే మంచిదా? ధరలు తగ్గించండంటే సినీ పరిశ్రమపై ఒత్తిడి తెస్తున్నట్లా? వినోదమైన సినిమా సామాన్యుడి బలహీనత. దానిని క్యాష్ చేసుకుంటామంటే ఎలా? థియేటర్ యజమానులకు టిక్కెట్ ధరల విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా జాయింట్ కలెక్టర్‌ను సంప్రదించాలి. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం ఇది. అంతే కానీ, టిక్కెట్ల ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం ఎందుకు అవమానించినట్లు అవుతుంది? ధరలను తగ్గించడం లేదా నియంత్రించడం అవమానించినట్లు ఎలా అవుతుంది? థియేటర్ యాజమాన్యాలు మా ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ ధరలు నిర్ణయిస్తామంటే ఎలా కుదురుతుంది? సినిమా టిక్కెట్ల ధరలు అందరికీ, ముఖ్యంగా సామాన్యుడికి అందుబాటులో ఉండాలి” అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఏ సినిమాకైనా ఒకే టికెట్ ధర నిబంధనపై వివాదం ఏమిటి? దీన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు
- ఆంధ్రప్రదేశ్: నరసాపురం దగ్గర కిలోమీటరు ముందుకొచ్చి ఊళ్లను మింగేసిన సముద్రం, మళ్లీ వెనక్కి ఎందుకు వెళ్తోంది
- కొత్త సినిమాల టికెట్ ధరలు పెంచుకోవచ్చు - హైకోర్టు ఉత్తర్వులు
- ప్రేమ, విరహం, భక్తి, రక్తి, విప్లవం, వినోదం అన్నీ తెలిసిన కలం
- ‘నా జీవితం ఆధారంగా తీసిన జై భీమ్ సినిమాను నేను చివరి దాకా చూడలేదు’ - బీబీసీ ఇంటర్వ్యూలో నిజజీవిత సినతల్లి పార్వతి
- నాణ్యమైన బంగారు గనుల్లో కంటే మిన్నగా.. టన్ను మొబైల్ వ్యర్థాల్లో 300 రెట్లు బంగారం...
- ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న జుగాడ్ జీప్.. ఎక్స్ఛేంజ్ కింద బొలెరో వాహనాన్ని ఇస్తానన్న పారిశ్రామికవేత్త
- గురు గ్రంథ సాహిబ్‌ను చివరి గురువుగా సిక్కులు ఎందుకు భావిస్తారు? అందులో ఏం రాసి ఉంది?
- ఫైనాన్షియల్ ప్లానింగ్: కొత్త ఉద్యోగంలో చేరగానే ఏం చేయాలి?
- బలవంతపు మతమార్పిడికి 10 ఏళ్ల జైలు: కర్ణాటకలో తమపై దాడులు పెరుగుతున్నాయంటూ క్రైస్తవుల ఆందోళన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












