ఆంధ్రప్రదేశ్: సినిమా టికెట్ల ధరలను నిర్దేశిస్తూ ఇచ్చిన జీవోని రద్దు చేసిన హైకోర్టు

సినిమా

ఫొటో సోర్స్, Reuters

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లలో టికెట్ల ధరలను నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని హైకోర్టు రద్దు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుని నగరాల్లోని మల్టీప్లెక్సుల వరకూ వివిధ థియేటర్లలో టికెట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తూ జీవో నెం. 35 జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. థియేటర్ల యజమానులు ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు. వారి తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణరావు, దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలు హేతుబద్ధంగా లేవని, సినిమా టికెట్ల ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ పిటీషనర్లు కోర్టుకి తెలిపారు. దానితో ఏకీభవించిన కోర్టు జీవో నెం. 35ని రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు, ప్రజలకు సినిమా అందుబాటులో ఉంచడం కోసం ఈ జీవో తీసుకొచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. టికెట్ల విక్రయం ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా చేపట్టి, పోర్టల్ ని ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

చైనాలోని ఒక థియేటర్‌లో క్రిమి నివారణ రసాయనాలు చల్లుతున్న సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

జీవో నెం. 35ని గత ఏప్రిల్ లో విడుదల చేసింది. డిసెంబర్ 1న అధికారికంగా ధరలు నిర్ణయించి ప్రకటన చేశారు. దాని ప్రకారం అత్యధికంగా రూ. 250, అత్యల్పంగా రూ. 5 చొప్పున టికెట్ల ధరలను ప్రకటించారు. ఈ నిర్ణయంతో సినిమా పరిశ్రమ మెరుగుపడుతుందని పేర్కొన్న ప్రభుత్వం, ఆ ధరలను మించి టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

టికెట్ల ధరలను అన్ని సినిమాలకు ఒకే రీతిలో నిర్ణయించడం వల్ల చిన్న సినిమాలకు కొంత మేలు కలిగినా, పెద్ద సినిమాలకు నష్టం తప్పదంటూ ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా రంగం బతికేందుకు పెద్ద సినిమాలకు ఉపశమనం కల్పించాలని కొందరు కోరారు.

బీసీ సెంటర్లలో ధరలు చాలా తక్కువగా ఉండడం వల్ల నష్టాలు తప్పవంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు కోర్టులో థియేటర్ యాజమాన్యాలు చేసిన వాదనలను కోర్టు అంగీకరించడంతో ఈ జీవో అమలుని కోర్టు నిలిపివేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)