గురు గ్రంథ సాహిబ్‌ను చివరి గురువుగా సిక్కులు ఎందుకు భావిస్తారు? అందులో ఏం రాసి ఉంది?

ఫొటో సోర్స్, Getty Images
సిక్కుల మత గ్రంథం గురు గ్రంథ సాహిబ్‌ను సజీవంగా ఉన్న చివరి గురువుగా ఆ మతం వారు భావిస్తారు.
తన తరువాత వేరే గురువులు ఎవరూ ఉండరని, గురు గ్రంథ సాహిబ్ మాత్రమే ఎప్పటికీ గురువుగా ఉంటుందని సిక్కుల పదవ గురువు గురుగోవింద్ సింగ్ 1708లో తన మరణానికి ముందు ప్రకటించారు. మానవ గురువుల పరంపరకు స్వస్తి పలికి ఈ మత గ్రంథాన్నే చివరి గురువుగా పేర్కొన్నారు.
గురు గ్రంథ సాహిబ్ ప్రాముఖ్యత
గురు గ్రంథ సాహిబ్ అనేది శ్లోకాలు, ద్విపదలు, శబ్దాలు, సూక్తుల సమాహారం. ఇందులో సిక్కు గురువుల రచనలే కాక హిందూ, ముస్లిం పండితుల రచనలు కూడా ఉంటాయి.
సిక్కు గురువులు రాసిన పదాలను గుర్‌బానీ అంటారు. అంటే గురువుల వాణి అని అర్థం. అవి స్వయంగా భగవంతుని మాటలని, వాటిల్లో ఏ తప్పూ ఉండదని సిక్కుల విశ్వాసం.
ఇవన్నీ పంజాబీ భాష లిపి గురుముఖిలో రాసినవి. ఈ లిపి భగవంతుని నోటి నుంచి ఉద్భవించిందన్నది వారి విశ్వాసం. అందుకే గురు గ్రంథ సాహిబ్ పట్ల అంత భక్తి, శ్రద్ధలు పాటిస్తారు. అది పుస్తకమైనా సజీవంగా ఉన్న గురువుతో సమానం.
దీన్ని గురుద్వారాలోని ప్రార్థనా మందిరంలో ఉంచుతారు. ఏ భవనంలో గురు గ్రంథ సాహిబ్ ఉంటుందో దాన్ని గురుద్వారాగా పరిగణిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
గురు గ్రంథ సాహిబ్‌లో ఏముంది?
సిక్కు మతం మూలకర్త, మొదటి గురువు గురు నానక్ చెప్పిన శ్లోకాలు, ప్రార్థనలు గురు గ్రంథ సాహిబ్‌లో ఉంటాయి.
వారి రెండవ గురువు గురు అంగద్, ఐదవ గురువు గురు అర్జన్‌దేవ్ వీటిని భద్రపరిచి, సంకలనం చేసారు.
గురు గ్రంథ సాహిబ్‌లో మొత్తం 1,430 పేజీలు ఉంటాయి. దీని ప్రతీ కాపీలో ప్రతీ పేజీ ఒకేలా ఉంటాయి. దీన్నే సరూప్ అంటారు.
గురు గ్రంథ సాహిబ్‌లో 5,894 శబ్దాలు ఉన్నాయి. వీటిల్లో 974 శబ్దాలు గురు నానక్ చెప్పినవి.
రెండవ గురువు 62, మూడవ గురువు 907, నాలుగో గురువు 679, తొమ్మిదో గురువు 115 శబ్దాలు రచించారు.
ఇవి కాకుండా, దేవుడు ఒక్కడే అని నమ్మే కొంతమంది హిందూ, ముస్లిం పండితులు రచించిన ద్విపదలను కూడా ఇందులో చేర్చారు.
వీటిలో కబీర్, రవిదాస్, బాబా ఫరీద్‌ల రచనలు కొన్ని ఉన్నాయి. కబీర్ గరిష్టంగా 541 ద్విపదలు రచించారు.
అంతే కాకుండా, వెనుకబడిన వర్గాల వారు రచించిన కొన్ని పంక్తులను కూడా గురు గ్రంథ్ సాహిబ్‌లో చేర్చారు. సిక్కు మతంలో అందరినీ గౌరవిస్తారని తెలిపేందుకు సూచనగా వారి రచనలను చేర్చారు.
గురు అర్జన్ దేవ్ కాలంలో 1604లో గురు గ్రంథ్ సాహిబ్ సంకలనం పూర్తయింది. దీన్ని అమృతసర్‌లోని స్వర్ణదేవాలయంలో ఉంచారు.
ఈ మూల గ్రంథం అనేక ఇతర భాషల్లో వెలువడింది. అనేకమంది దీన్ని అనువదించారు.
గురు గ్రంథ సాహిబ్‌లోని మొదటి శబ్దాన్ని మూల మంత్రం అంటారు. ఇది సిక్కు మతం మూల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని వివరిస్తుంది.
గురు గ్రంథ సాహిబ్ మొదటి పంక్తిలోని పదాలు.. 'ఇక్ ఓంకార్' అంటే దేవుడు ఒక్కడే అని అర్థం.

ఫొటో సోర్స్, Getty Images
గురువుకు ఇచ్చే గౌరవం, పాటించవలసిన నియమాలు
గురు గ్రంథ సాహిబ్ సిక్కుల చివరి గురువు. మానవ గురువులకు ఇచ్చే గౌరవాన్ని దీనికి ఇవ్వాలన్నది వారి విశ్వాసం.
గురు గ్రంథ సాహిబ్‌ను దర్శించేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని నియమాలు ఇవి:
- గురుద్వారాలోకి ప్రవేశించే ముందు ప్రతి ఒక్కరూ తమ చెప్పులు విప్పి కాళ్లు, చేతులు కడుక్కోవాలి.
- గురుద్వారా లోపల, గురు గ్రంథ సాహిబ్ ముందు వస్త్రంతో తల కప్పుకొని తీరాలి.
- గురు గ్రంథ సాహిబ్‌ను ఒక పలకపై ఉంచుతారు. దీన్ని తఖ్త్ అంటారు.
- ఈ పలకను గురు గ్రంథ్ సాహిబ్ మంజీ కింద ఉంచుతారు. ఈ మంజీ గురు గ్రంథ సాహిబ్‌కు ఏర్పాటు చేసిన మంచం. దీన్ని మంజీ సాహిబ్ అంటారు.
- దాని పైన గోపురంతో కూడిన పల్లకి ఉంటుంది. ఇది గురు గ్రంథ సాహిబ్ ఉంచిన మొత్తం ప్రదేశానికి పైకప్పులా ఉంటుంది. దీన్ని పాల్కి సాహిబ్ అంటారు.
- ఈ పల్లకిని చున్నీ లేదా చందోవేతో కప్పి ఉంచుతారు. ఇది ఒక మండపంలా ఉంటుంది. దాని కింద, అందంగా అలంకరించిన వస్త్రాల్లో చుట్టిన గురు గ్రంథ సాహిబ్‌ను ఉంచుతారు.
- గురుద్వారాలోని ప్రార్థనా మందిరాన్ని దర్బార్ సాహిబ్ అంటారు.
- ప్రార్థనల కోసం గుమిగూడిన భక్తుల సమూహాన్ని సంగత్ అంటారు. సంగత్‌లో కూర్చున్న వ్యక్తుల తలలు గురు గ్రంథ సాహిబ్ కంటే ఎత్తుగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
- ప్రార్థనా మందిరానికి వచ్చిన భక్తులు గురు గ్రంథ సాహిబ్‌కు నైవేద్యాలు సమర్పిస్తారు.
- భక్తులు ఎప్పుడూ గురు గ్రంథ సాహిబ్‌కు వీపు చూపరు.
- గురు గ్రంథ సాహిబ్ పఠించే వ్యక్తిని గ్రంథి అంటారు.
- గురు గ్రంథ్ సాహిబ్ పఠించే సమయంలో, చౌరీ లేదా చవర్‌తో గాలి వీస్తారు. ఇది, జడలబర్రె (యాక్) వెంట్రుకలతో ప్రత్యేకంగా తయారు చేసిన విసనకర్ర.
- గురు గ్రంథ సాహిబ్‌ను రాత్రిపూట ఒక ప్రత్యేక గదిలో ఉంచుతారు.
ఇవి కూడా చదవండి:
- 5,000 రకాల వంటలు చేసే రోబో, ధర ఎంతంటే
- కరోనా అనంతర ప్రపంచంలో 'మతం భవిష్యత్తు' ఎలా ఉంటుంది? - వీడియో
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టారు.. 72 ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం.. ఇమ్రాన్‌ఖాన్‌కు థ్యాంక్స్ చెప్పిన మోదీ
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- చలికాలం: కోల్డ్‌వేవ్ అని ఎప్పుడు ప్రకటిస్తారు, అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- బలవంతపు మతమార్పిడికి 10 ఏళ్ల జైలు: కర్ణాటకలో తమపై దాడులు పెరుగుతున్నాయంటూ క్రైస్తవుల ఆందోళన
- ‘శకుంతలా దేవి నా జాతకం చూసి తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- నలుగురిని ట్రక్కుతో గుద్ది చంపిన యువకుడిని రక్షించేందుకు 30 లక్షల మంది పోరాడుతున్నారు, ఎందుకు
- సిక్కుల ఊచకోత: 3 రోజుల్లో 3 వేల మంది హత్య
- దేశ విభజన సమయంలో సిక్కు కుటుంబాన్ని కాపాడేందుకు లాహోర్ ముస్లిం యువకుడు ఏం చేశారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









