Temperatures: కోల్డ్‌వేవ్ అని ఎప్పుడు ప్రకటిస్తారు, అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలో పలు ప్రాంతాల్లో చలి గాలులు పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని దిల్లీలో కూడా శనివారం నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికాలంలో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల స్థాయి కంటే 5 డిగ్రీలు తగ్గిపోయాయి. సాధారణంగా దిల్లీలో డిసెంబర్ నెలలో 12.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయాయి.
దిల్లీలో సోమవారం 3.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ శాఖ పేర్కొంటోంది.
దిల్లీలో డిసెంబరు 24, 25 వరకు పశ్చిమ గాలుల ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
రాజస్థాన్‌లోని ఫతేపూర్ (చురు, శిఖర్) ప్రాంతాల్లో గత వారంలో -3.3 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. చురు లో -1.1 డిగ్రీల సెల్సియస్ నమోదయింది.
భోపాల్‌లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి వీచే చలి గాలులు ఈ ఉష్ణోగ్రతలకు కారణమని ఐఎండీ పేర్కొంటోంది. డిసెంబరు 24 వరకు ఉత్తరాఖండ్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ముస్సోరీలో ఉష్ణోగ్రతలు శనివారం -2 డిగ్రీలు నమోదయ్యాయి.
సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని లంబసింగిలో 6 డిగ్రీల సెల్సియస్, చింతపల్లిలో 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రం తెలిపింది. తెలంగాణాలో కూడా ఆదిలాబాద్, మెదక్ తదితర జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
దేశంలో, ముఖ్యంగా ఉత్తరాదిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

కోల్డ్ వేవ్ అని ఎప్పుడు గుర్తిస్తారు?
"ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువ లేదా 4.5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయినప్పుడు కోల్డ్ వేవ్ గా గుర్తిస్తాం " అని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద చెప్పారు. 10 డిగ్రీల సెల్సియస్ లేదా అంత కన్నా తక్కువ నమోదైనప్పుడు కూడా కోల్డ్ వేవ్ ప్రకటిస్తారు.
పశ్చిమం నుంచి వీచే గాలుల వల్ల కూడా కోల్డ్ వేవ్ వస్తుందని ఆమె చెప్పారు. వీటిని అధ్యయనం చేస్తూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తారని తెలిపారు. ఉత్తర భారత్ లో శీతల పవనాలు పెరగడంతో పాటు అత్యంత తీవ్రమైన శీతాకాలాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే మూడు నెలల్లో సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

హెచ్చరికలు ఎలా జారీ చేస్తారు?
తుపానుల సమయంలో, వడగాల్పులు, చలి గాలులు తీవ్రంగా వీచినప్పుడు వాతావరణ శాఖ కొన్ని రంగుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తుంది. రాబోయే ప్రమాదం గురించి ముందుగానే హెచ్చరించి తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ వార్నింగ్స్ జారీ చేయడం వెనుకున్న ముఖ్య ఉద్దేశం.
వీటిని ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులకనుగుణంగా అప్‌డేట్ చేస్తూ ఉంటారు. భారత వాతావరణ శాఖ ప్రధానంగా 4 రంగుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తుందని సునంద చెప్పారు.
గ్రీన్ - ఆకుపచ్చ రంగు అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అర్ధం. ఈ సమయంలో వాతావరణ శాఖ ఎటువంటి సూచనలు జారీ చేయదు.
ఎల్లో- పసుపు రంగు హెచ్చరిక జారీ చేస్తే కొన్ని రోజుల పాటు ప్రతికూల వాతావరణ ప్రభావం ఉంటుందని అర్ధం. దీని వల్ల రోజు వారీ కార్యకలాపాలకు, నిత్యజీవనానికి ఆటంకం కలగవచ్చని సూచిస్తుంది.
ఆరెంజ్-వాతావరణం తీవ్రంగా ప్రతికూలంగా మారినప్పుడు, రోడ్డు, రైలు రవాణాకు, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నప్పుడు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తుంది.
రెడ్ అంటే అత్యంత ప్రమాదకరమని, ప్రమాదాలను నివారించేందుకు తక్షణ చర్యలనుతీసుకోవలసిన అవసరాన్ని సూచిస్తుందని చెప్పారు.
ఈ హెచ్చరికలు ప్రపంచ వ్యాప్తంగా ఒకేలా ఉంటాయి.
వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు భారత వాతావరణ శాఖ ఒక ప్రత్యేక మ్యాట్రిక్స్‌ను అనుసరిస్తుంది. దానిని ద్వారా పరిస్థితులు, వాటి ప్రభావాన్ని అంచనా వేసి ఏ రంగు వార్నింగ్ పంపాలో నిర్ణయిస్తారు. దీంతో పాటు, ముప్పును సూచించే ఇతర అంశాల ఆధారంగా కూడా నిర్ణయం తీసుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
హెచ్చరికలు సరే...మనమేం చేయాలి?
చలి కాలంలో శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వారు సాధారణ వ్యక్తుల కంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడకు చెందిన డాక్టర్ యనమదల మురళీకృష్ణ బీబీసీకి వివరించారు. రాత్రి 8 తర్వాత, పొద్దున్న 8 లోపు బయట చలిలోకి వెళ్లకుండా ఉండగలిగేటట్లు చూసుకోవాలని చెప్పారు.
‘సి’ విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారం, ఇంకా పళ్లు, కాయగూరలు, ప్రోటీన్ లాంటివి తీసుకోవాలి. చర్మానికి మాయిశ్చరైజర్లను, లేదా నూనెను పట్టించుకోవడం అవసరం. లేకపోతే చర్మం పొడి బారిపోయి పగుళ్లు వాటిల్లే అవకాశముంటుంది.
సూర్యరశ్మిలో గడపడం కూడా మంచిదే. ఇంటి లోపలకు కూడా సూర్యరశ్మిని రానివ్వాలని డాక్టర్ మురళీకృష్ణ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో వాకింగ్‌కు వెళ్లడం మంచిది కాదనీ, వెచ్చగా ఉండే ఊలు దుస్తులు ధరించడం ముఖ్యమని ఆయన సూచించారు.
వేడిగా ఉండే ఆహారం, గోరువెచ్చని నీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని, చలిగా ఉందికదా అని అసలు నీళ్లు తీసుకోకుండా ఉండటం మంచిది కాదని వైద్య నిపుణులు సూచించారు.
థర్మల్ లైనింగ్ ఉన్న కర్టెన్లను వాడటం వల్ల కూడా చలిని కొంత వరకు నిరోధించవచ్చని కన్స్యూమర్ విశ్లేషకురాలు అర్చన లూథ్రా బీబీసీకి చెప్పారు. వాడని గదుల తలుపులు మూయడం కూడా మంచిది. బాగా చలిగా ఉన్న ప్రాంతాల్లో హీటర్లను కూడా కొంత సమయం వాడుకోవచ్చని ఆమె చెప్పారు.
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మాస్క్ ధరించడం మానకూడదని, ఇది కోవిడ్‌తో పాటు సాధారణ జలుబు, దగ్గు నుంచి కూడా కాపాడుతుందని డాక్టర్ మురళీకృష్ణ సూచించారు.

ఫొటో సోర్స్, mausam.imd.gov.in
ఇవి కూడా చదవండి:
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- ఒమిక్రాన్: 11 రాష్ట్రాలకు పాకిన కొత్త వేరియంట్, బయటపడే మార్గం లేదా
- అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్: ఇది ఎక్కువగా తింటే మెదళ్లు పాడైపోతాయా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి ?
- తిరుపతి: ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అమరావతి అభివృద్ధి చేయొచ్చు - చంద్రబాబు
- పుష్ప రివ్యూ: సుకుమార్ ఆ పని చేయకపోవడమే ప్లస్, మైనస్
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- హీరోయిన్ను చంపేసిన దుండగులు.. కొడుకు కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చి కాల్పులు
- స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













