ఎస్సీ వర్గీకరణ - మంద కృష్ణ మాదిగ: ఇపుడెక్కడుంది, ఎందుకని ఆలస్యమవుతోంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వెంకట కిషన్ ప్రసాద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
షెడ్యూల్డు కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్‌తో, 1994లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, ఈదుమూడి గ్రామంలో మొదలైన ఉద్యమం, ఆ తర్వాత, ఐదారేళ్లలోనే రాష్ట్రమంతా విస్తరించింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎంఆర్పీఎస్ ఇప్పటికీ వర్గీకరణ కోసం పట్టుపడుతుండగా, రాష్ట్ర విభజనతో పాటు చట్టపరమైన, న్యాయపరమైన, సాంకేతికమైన అనేక పరిణామాల వల్ల ఈ అంశం ఈనాటికీ ఎటూ తేలకుండానే మిగిలిపోయింది.
అసలు వర్గీకరణ దేని కోసం?
ఈ కథ అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లో మొదలవుతుంది. ఆనాడు మొత్తం 59 కులాలు షెడ్యూల్డు కులాల జాబితాలో ఉన్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,078. వీరిలో మాదిగలు 67,02,609 మంది కాగా, మాలలు 55,70,244 మంది. అంటే మాదిగల జనాభా మాలలకన్నా దాదాపు 11.3 లక్షలు ఎక్కువన్నమాట.
మొత్తం ఎస్సీ జనాభాలో ఈ రెండు కులాల జనాభానే 80 శాతం వరకూ ఉండొచ్చనేది ఓ అంచనా. మిగతా 57 కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులానిది. వీరు మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు. వృత్తి రీత్యా చూసినప్పుడు మాదిగలది చర్మకార వృత్తి. రెల్లి కులస్థులు ఒకప్పుడు మలాన్ని ఎత్తిపోస్తుండేవారు.
అయితే, ఈ కులాలన్నీ కూడా ఊరవతల వెలివాడల్లో నివసించినవే. సమాజంలో దారుణమైన అణచివేతను, అంటరానితనాన్ని, వివక్షను అనుభవించినవే. నేటికీ అట్టడుగు స్థాయిలో మిగిలిపోయినవే. అయినప్పటికీ, ఎస్సీల్లో కూడా 'ఎక్కువ', 'తక్కువ'లున్నాయి. ఉదాహరణకు, మాదిగల్ని మాలలు తక్కువగా చూస్తారు. అలాగే, మాదిగలు కూడా కొన్ని ఉపకులాల వాళ్లను తక్కువగా చూస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
మానవహక్కుల కార్యకర్త బాలగోపాల్ మాటల్లో చెప్పుకోవాలంటే, 'ఇది దోపిడీ, అణచివేతలకు సంబంధించిన అంశం కాదు. ఇది అణచివేయబడ్డ సమూహంలోనే అసమానతలకు సంబంధించిన అంశం. అయితే, దీనికి మూలాలు మాత్రం వారిపై మోపిన హిందూ వర్ణవ్యవస్థలో, అందులో ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కులవ్యవస్థలోనే ఉన్నాయి.'
ఎస్సీలకు మొత్తంగా 15 శాతం రిజర్వేషన్ కోటా ఉంది. అయితే, ఈ కోటాలో మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ నిజానికి 1970 దశకంలోనే మొదలైంది. 1972 నుంచి మొదలై, ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ మాదిగ నేతలు వారిని కలవటం, ఈ అంశాన్ని లేవనెత్తుతూ వారికి విజ్ఞప్తులు అందజేయడం జరుగుతూ వచ్చిందని బాలగోపాల్ 2000లో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'మాదిగల సంఖ్య ఎక్కువ.. లభిస్తున్న రిజర్వేషన్ కోటా తక్కువ'
జనాభాపరంగా మాలలకన్నా మాదిగల సంఖ్య ఎక్కువ అయినప్పటికీ, విద్యా, ఉద్యోగావకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తేల్చింది. ఈ విషయంలో, మందకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం, "ఆనాటికి మాదిగలు 18 వేల ఉద్యోగాల్లో ఉండగా, వాటిలో 80-90 శాతం నాల్గో తరగతి ఉద్యోగాలే. మరోవైపు, మాలలు అన్ని రకాలవీ కలిపి 72 వేల ఉద్యోగాల్లో ఉన్నారు."
అంటే, రిజర్వేషన్ ద్వారా ఎస్సీలకు లభించిన ఉద్యోగాల్లో దాదాపు 80 శాతం మాలలకు, దాని ఉపకులాల వారికి దక్కగా, మాదిగ, దాని ఉపకులాలకు దక్కింది కేవలం సుమారు 20 శాతమే.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
రాజకీయ రంగంలో కూడా ఈ తేడా స్పష్టంగానే ఉండింది. "ఆనాటికి రాష్ట్రంలో 39 అసెంబ్లీ సీట్లు ఎస్సీలకు ఉండగా, వాటికి ఎన్నికైన వారిలో 30 మంది మాలలు కాగా, మాదిగలు కేవలం 9 మంది మాత్రమే. ఆరు పార్లమెంటు స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అయి ఉంటే, వాటిలో ఒకే ఒక్క స్థానం మాదిగలకు దక్కగా, మిగిలిన ఎంపీలందరూ మాలలే" అన్నారు మందకృష్ణ.
ఈ నేపథ్యంలోనే ఎస్సీ కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి, ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఎస్సీ రిజర్వేషన్ కోటాను పంచాలనే డిమాండ్‌తో ముందుకు వచ్చింది ఎంఆర్పీఎస్.
బీసీ కులాల్లో ఇలాంటి ఏబీసీడీ విభజన ముందు నుంచే ఉంది కాబట్టి, నిజానికి, ఎంఆర్పీఎస్ లేవనెత్తిన డిమాండ్‌ను కూడా అదే దృష్టితో చూస్తూ పరిష్కరించాల్సింది. కానీ అలా జరగలేదు. అది అనేక మలుపులు తిరుగుతూ, ఈనాటికీ మాదిగలకు తీరని కలగానే మిగిలిపోయింది.

ఫొటో సోర్స్, UGC
దీనిపై అభ్యంతరాలతో ముందుకొచ్చిన మాల మహానాడు
మాదిగల వర్గీకరణ డిమాండ్‌పై మొట్టమొదట మాలలు అభ్యంతరం చెప్పారు. సబ్-కేటగరైజేషన్ సామాజిక వైషమ్యాలకు దారి తీస్తుందని వారన్నారు. పీవీ రావు ఆధ్వర్యంలో ఏర్పడ్డ మాల మహానాడు 'ఇది ప్రాంతీయ వ్యత్యాసమే తప్ప మాదిగలకు అన్యాయం ఏమీ జరగలేదు' అని వాదించింది. 'మాదిగలకు చర్మకార వృత్తి ఉంది కాబట్టి వారికి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే పథకాలుంటాయి. కానీ, మాలలకు ఆ అవకాశం లేదు' అని వాదించింది మాల మహానాడు.
ఇది మొత్తంగా ఎస్సీల ఐక్యతను దెబ్బతీసే కుట్ర అని కూడా విమర్శించారు. అంతేకాదు, ఇది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన ఉద్యమమని కూడా వారన్నారు. ఎందుకంటే, అప్పటికి రాష్ట్రంలో మాలలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి, మాదిగల్ని తనవైపు తిప్పుకోవడం ద్వారా రాజకీయ సమీకరణాల్ని మార్చాలనేది ఆయన వ్యూహం అనే విమర్శ వర్గీకరణ వ్యతిరేకుల వైపు నుంచి బలంగానే వినిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాత జరిగిన పరిణామాలేంటి?
మరోవైపు, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా, 1997 జూన్ 6న ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 15 శాతం ఎస్సీ కోటాను విభజిస్తూ ఓ జీవోను విడుదల చేసింది.
'ఏ' గ్రూపులో రెల్లి, దాని అనుబంధ కులాలు సహా మొత్తం 12 కులాలను కలుపుతూ వారికి ఒక శాతం కోటాను ఇచ్చారు. వీటిని అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించారు. ఇక 'బీ' గ్రూపులో మాదిగ, దాని ఉపకులాలు -మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7 శాతం కోటాను కేటాయించారు. 'సీ'లో మాల, దాని ఉపకులాలు - మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6 శాతం కోటా ఇచ్చారు. 'డీ'లో ఆది ఆంధ్రులతో పాటు మొత్తం 4 కులాలను చేర్చి, 1 శాతం కోటాను నిర్ణయించారు.
వీటిలో, ఆనాటికి ఏ, బీ గ్రూపుల కులాలు తక్కువ లబ్ధి పొందాయని, సీ, డీ గ్రూపుల కులాలు తమ జనాభా శాతానికి మించి లబ్ధిని పొందాయని కూడా గుర్తించారు.
అయితే మాల మహానాడు దీనిపై కోర్టుకు వెళ్లింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధికి మించిందనీ, రాజ్యాంగవిరుద్ధమైందనీ ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం, ఈ వర్గీకరణ చేయడానికి ముందు, ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను సంప్రదించాల్సి ఉండిందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇదే మేజర్ పాలసీ మ్యాటర్ కాదు కాబట్టి అది తప్పనిసరి కాదని వాదించింది. మొత్తానికి, వర్గీకరణ ప్రక్రియకు అలా ఆదిలోనే హంసపాదు పడింది.

ఫొటో సోర్స్, Getty Images
వర్గీకరణ అమలైన ఆ ఐదేళ్లు
ఆ తర్వాత, 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టం చేసింది. అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కే. ఆర్. నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో ఎస్సీలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరిస్తూ, వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు.
కానీ 2004 నవంబర్‌లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుక్కెదురైంది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్ వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ప్రకటించింది సుప్రీంకోర్టు. దాంతో పంచాయితి మళ్లీ మొదటికే వచ్చింది.
ఈ ఐదేళ్ల కాలంలో మాదిగలకు 22 వేల వరకూ ఉద్యోగాలు వచ్చాయని మందకృష్ణ అంటారు.
ఆ తర్వాత మాదిగల నుంచి మళ్లీ ఒత్తిళ్లు పెరగటంతో 2004లో వైస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. దానికి ప్రతిస్పందనగా, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఉషా మెహ్రా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
2008 మేలో మంత్రి మీరాకుమార్‌కు కమిషన్ నివేదికను సమర్పించింది. అందులో... రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు సవరణ చేయాలని, ఆ ఆర్టికల్‌లో 3వ క్లాజును చేర్చడం ద్వారా, రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంటును ఆమోదించవచ్చని ఉషా మెహ్రా సిఫార్సు చేశారు.
కానీ కేంద్రం దీన్ని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకున్నట్టుగా గానీ, దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేసినట్టుగా గానీ ఎలాంటి దాఖలాలు లేవు. 2014 ఎన్నికలప్పుడు... తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ కూడా ఇప్పటికీ హామీగానే ఉండిపోయింది. అయితే, ఇది ఎల్లకాలం అపరిష్కృతంగానే ఉంటేనే రాజకీయ పార్టీలకు లాభమనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది.

ఫొటో సోర్స్, Manda Krishna Madiga/FB
ఈ ఉద్యమం ఏం సాధించింది?
ఈ ఉద్యమం ప్రధానంగా రెండు విజయాలు సాధించింది. 1990 దశకంలో మాదిగ ఉద్యమానికి మందకృష్ణ, కృపాకర్ ఇద్దరూ డైనమిక్ నేతలుగా ముందుకొచ్చారు. తమ పేర్ల చివర్లో మాదిగ అనే పదాన్ని చేర్చుకోవడం ద్వారా దాన్ని తమ ఆత్మగౌరవ ఉద్యమంగా కూడా మార్చారు. శాస్త్రి, శర్మ, రెడ్డి, రావు, నాయుడు, చౌదరి లాంటి కుల సూచక పదాలకు మాత్రమే గౌరవమర్యాదలు లభిస్తున్న సమాజంలో, అప్పటి దాకా అవమానానికి సూచికగా లేదా తిట్టుగా మాత్రమే ఉపయోగిస్తూ వచ్చిన 'మాదిగ' అనే పదాన్ని పేరులో సగర్వంగా నిలుపుకోవడం ఒక పెద్ద మార్పేనని చెప్పాలి. ఆనాటి వరకూ తమను తాము మాదిగ అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్లు దాన్ని బాహాటంగా, నిస్సంకోచంగా చెప్పుకునే వాతావరణాన్ని కల్పించింది ఈ ఉద్యమమే అని విశ్లేషకుల అభిప్రాయం.
అలాగే, ఏబీసీడీ వర్గీకరణ అమలైన ఆ నాలుగేళ్ల కాలంలో మాదిగలకు సముచిత న్యాయం దక్కిందనేందుకు ఆధారాలున్నాయి. మందకృష్ణ అందించిన వివరాల ప్రకారం.. ఆ ఐదేళ్ల కాలంలోమాదిగలకు దాదాపు 22 వేల ఉద్యోగాలు లభించాయి. అది అలాగే కొనసాగి ఉంటే సమన్యాయం దక్కి ఉండేదని ఆయన అభిప్రాయం. అట్లాగే, అసెంబ్లీలో 45 ఎస్సీ స్థానాల్లో దాదాపు సగం సీట్లు దక్కాయి.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్ర విభజనతో తలెత్తిన కొత్త సవాళ్లేంటి?
2014లో రాష్ట్ర విభజన తర్వాత కొన్ని కొత్త సవాళ్లు ముందుకు వచ్చాయి. వీటిలో ప్రధానమైంది - ఈ సమస్యకున్న ప్రాంతీయ స్వభావం.
2011 జనగణన ప్రకారం తెలంగాణలోని పది జిల్లాల్లో కలిపి, మాదిగ జనాభా మాల జనాభాకన్నా దాదాపు 17 లక్షలు అధికం. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ మాలల జనాభానే ఎక్కువ. కాబట్టి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాల, మాదిగల జనాభా నిష్పత్తి ఒకే విధంగా లేదు.
ఇకపోతే, మునుపటి అవిభాజిత ఆంధ్రప్రదేశ్‌లో లబ్ధి పొందింది ఆంధ్ర ప్రాంతానికి చెందిన మాలలే తప్ప తెలంగాణ మాలలు కాదు అనేది మరో వాదన. ఆంధ్రప్రదేశ్‌కు భిన్నంగా, తెలంగాణలో మాలలది, మాదిగలది విద్యా, ఉద్యోగాల్లో కొంచెం అటు ఇటుగా ఒకే పరిస్థితి అన్న వాదనను బలపర్చే లెక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి.
కాబట్టి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో వర్గీకరణను బలంగా కోరుకున్న మాదిగల ముందు ఇప్పుడు కొత్త సవాళ్లు తలెత్తాయి. వాటికి కొత్త పరిష్కారాలు వెదికే పరిస్థితి ముందుకొచ్చింది.

ఫొటో సోర్స్, Manda Krishna Madiga/FB
వర్గీకరణ ఓ దేశవ్యాప్త సమస్య
వర్గీకరణ అంశం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది కాదు. పంజాబ్‌లో ఎస్సీ కోటాలో వాల్మీకీ, మజహబీ సిక్కులకు ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో చట్టాలుండేవి. ఆ తర్వాత వాటిని న్యాయస్థానాల్లో సవాల్ చేశారు. తమిళనాడులో, జస్టిస్ ఎంఎస్ జనార్థనం నివేదిక ఆధారంగా, ఎస్సీలకున్న 16 శాతం కోటాలో 3 శాతాన్ని అరుంధతీయార్ కులానికి కేటాయించారు.
బిహార్‌లో కూడా ఎస్సీల్లో అత్యంత వెనుకబడ్డ కులాలను గుర్తించడం కోసం 2007లో మహా దళిత్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా షెడ్యూల్డు కులాలకు వాటి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్ కోటా దక్కడం లేదు. అదే సమయంలో విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా కొన్ని షెడ్యూల్డు కులాలకే ఎక్కువ లాభాలు సమకూరాయి.
పైగా వీటిలో తేడాలు కూడా ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ఒక కులం నష్టపోతే, అదే కులం మరో రాష్ట్రంలో అధిక లబ్ధి పొందిన కులంగా ఉంది. ఉదాహరణకు, తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు నష్టపోయిన పక్షంగా ఉంటే, ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం మాదిగలతో సమానమైన చమార్ కులస్థులు తమ జనాభా దామాషాను మించి లబ్ధిని పొందారు.
కాబట్టి ఏ ప్రత్యేక కులానికీ దీనిపై దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించే ఉద్దేశం గానీ, అందుకు అవకాశాలు గానీ లేవు. అలాగే, దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే బహుజన్ సమాజ్ పార్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తోంది. దానికి కారణం స్పష్టమే. అలా చేస్తే రిజర్వేషన్ కోటాలో అధిక లబ్ధిని పొందుతున్న కులాలను దూరం చేసుకోవటమే అవుతుంది.

ఫొటో సోర్స్, UGC
వర్గీకరణ అంశానికి అసలు పరిష్కారం ఏంటి?
వాస్తవానికి ఒకటి, రెండు తప్ప అధికార పార్టీలు సహా, దాదాపు రాజకీయ పార్టీలన్నీ కూడా వర్గీకరణకు ఆమోదం తెలిపినవే. కానీ పరిష్కారం కోసం ఏవీ ముందుకు రాకపోవడానికి కారణం, వాటి రాజకీయ ప్రయోజనాలేనని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అభిప్రాయం.
కాగా, వర్గీకరణ ఉద్యమానికి ముందు నిలిచిన ఎంఆర్పీఎస్ నాయకత్వం కూడా కొంత కాలం తెలుగుదేశంతో, మరి కొంత కాలం కాంగ్రెస్‌తో, ఇప్పుడు బీజేపీతో సన్నిహితంగా ఉంటోందనే విమర్శలున్నాయి. దీంతో, ఆయా రాజకీయ పార్టీలు తమ ఓట్ల కోసం ఈ ఉద్యమాన్ని వాడుకునేందుకు అవకాశం కలుగుతుందే తప్ప, ఇది వర్గీకరణ సమస్య పరిష్కారానికి మాత్రం ఉపయోగపడటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.
అయితే, ఎంఆర్పీఎస్ మాత్రం దీనిపై పార్లమెంటులో బిల్లుని ప్రవేశపెట్టేలా బీజేపీని ఒత్తిడి చేయటం కోసమే తమ ప్రయత్నాలని చెప్తోంది. రాజ్యాంగ సవరణ ద్వారా తప్ప మరో విధంగా ఇది పరిష్కారమయ్యేందుకు వీలు లేదని ఎంఆర్పీఎస్ అనుబంధ సంస్థ 'మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్' అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి బీబీసీతో అన్నారు.
మరోవైపు, వినోద్ కుమార్, దీన్ని రాష్ట్రాల స్థాయిలోనే పరిష్కరించుకోగలమంటున్నారు. 'రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయా జిల్లాల్లో ఎస్సీ కులాల జనాభా పొందికను బట్టి కోటాను వేర్వేరుగా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం స్థానిక ఉద్యోగాల్లో జోనల్ పద్ధతిలో ఎస్సీ రిజర్వేషన్‌ను అమలు చేస్తే అందరికీ సమన్యాయం దక్కుతుంది. ఇందు కోసం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసమే ప్రత్యేకంగా ఉనికిలోకి వచ్చిన ఆర్టికల్ 371-డీ ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి, దానికి రాష్ట్రపతి ఆమోదాన్ని పొందవచ్చు' అని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, రాజ్యాంగ సవరణ ద్వారానే ఎస్సీ వర్గీకరణను సాధించుకోవడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని కూడా ఆయనంటారు. ఎందుకంటే, దానికి పార్లమెంటు ఉభయసభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదంతో పాటు సగానికి పైగా రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం కూడా అవసరం అవుతుంది.
ఇక న్యాయ పరిష్కారం విషయానికొస్తే, 2020 అగస్టులో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ, ఎస్టీల్లో కూడా కొన్ని కులాలు మిగతా కులాలకన్నా వెనుకబడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. అట్టడుగున ఉన్నవారికి రిజర్వేషన్ ఫలాలు అందాల్సి ఉందని ప్రకటిస్తూ, ఈ అంశాన్ని మరింత విస్తృతమైన ధర్మాసనానికి బదిలీ చేసింది.
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ కులాల వర్గీకరణ చేయనే వద్దని మాల మహానాడు నేతలు తాజాగా మరోసారి ఎస్సీ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని ఆ సంస్థ నేతలు చెన్నయ్య వాదిస్తున్నారు.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా, ముందే చెప్పుకున్నట్టుగా, స్పష్టంగా కంటికి కనిపిస్తున్న ఒక సమస్యకు సూటియైన, న్యాయమైన పరిష్కారాన్ని కనిపెట్టడంలో దేశ రాజకీయ, న్యాయ, శాసనవ్యవస్థలు దాదాపు మూడు దశాబ్దాలుగా వైఫల్యం చెందాయని మాత్రం చెప్పక తప్పదు.
ఇవి కూడా చదవండి:
- Exclusive: పవన్ కల్యాణ్ ఎప్పుడూ కాపులకు మద్దతు తెలపలేదు. కానీ..
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- ఫైనల్ పరీక్షలు రాయకుండా విద్యార్థుల్ని ప్రమోట్ చేయొద్దు - సుప్రీం కోర్టు తీర్పు
- రెండో ప్రపంచ యుద్ధం జపాన్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేసింది?
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా












