ఉత్తర తెలంగాణపై దండెత్తిన కోతులు.. కొండ ముచ్చులు వీటికి చెక్ పెట్టగలవా?

- రచయిత, ఎస్. ప్రవీణ్ కుమార్
- హోదా, బీబీసీ కోసం
పల్లె, పట్నం తేడా లేకుండా తెలంగాణ వాసులు కోతులతో నానా తిప్పలు పడుతున్నారు. మర్కట మూకలు ముప్పేట దాడి చేస్తున్నాయి. నియంత్రించేందుకు ప్రయత్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నాయి. కోతుల దాడుల్లో గాయపడున్న వారి సంఖ్య పెరుగుతోంది. అటు రైతులకు పంట నష్టం తప్పడం లేదు.
కోతుల బాధ నుండి తప్పించుకునేందుకు ఇప్పుడు తెలంగాణలో పలు ప్రాంతాల్లో కొండముచ్చుల (వీటినే కొండెంగ అని కూడా అంటారు)ను ఉపయోగిస్తున్నారు. వీటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు.
వ్యవసాయ రంగాన్ని కోతుల బెడద నుంచి కాపాడేందుకు సూచనలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
కోతులను అడవులకు పంపాలనే ఉద్దేశ్యంతో హరితహారంలో పండ్ల తోటల పెంపకం చేపట్టారు. అవి కాపుకు రావడానికి సమయం ఉండటంతో ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

కోతులకు కొండముచ్చులతో చెక్
కోతుల బాధ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొండముచ్చుల పెంపకం పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కొండముచ్చులను దీనికోసం ఎక్కువగా వాడుతున్నారు. పలు గ్రామపంచాయతీలు కోతుల నియంత్రణకు కొండెంగలను ఉపయోగిస్తున్నాయి.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి లో కోతులను నియంత్రణకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొండముచ్చు పెంచుతున్నారు. ''కొండముచ్చు వచ్చాక మా గ్రామానికి కోతుల ముప్పు తగ్గింది. గతంలో ఇళ్లలోకి వచ్చి వంటపాత్రలు ఎత్తుకెళ్లేవి. పొలాల్లో గుంపులుగా ఉండేవి. కర్రలు పట్టుకుని పొలం పనులకు వెళ్లాల్సి వచ్చేది. కొండెంగ వాసనకే ఇప్పుడు కోతులు మా ఊర్లోకి వస్తలేవు'' అని గ్రామ యువకుడు ముజఫర్ బీబీసీతో అన్నారు.
''పక్క గ్రామాల వారు వచ్చి మా ఊరి కొండెంగను తీసుకెళుతున్నారు. అక్కడ రెండు, మూడు రోజులు ఉంచి, తిరిగి తెస్తారు'' అని ముజఫర్ చెప్పారు.

‘పగలు-రాత్రి తేడా లేదు’
కోతుల గుంపులు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా జనావాసాలపై పడుతున్నాయి. ఇళ్లలోకి చొరబడి చేతికందినవి ఎత్తుకెళ్తున్నాయి. ''ఊరు, పొలం అన్న తేడా లేదు. రాత్రి పూట మా ఇంటి మీద పెంకులను తొలగిస్తున్నాయి. నిద్ర కరువవుతోంది. సరైన నిద్రలేకపోతే మా పిల్లల ఆరోగ్యాలు ఖరాబవుతాయి'' అని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి కి చెందిన సింగపురం బాలరాజు బీబీసీతో అన్నారు.
బాలరాజు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 20 ఏళ్లపాటు పీఈటీ టీచర్ గా పనిచేసారు. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ఆయన ఆ ఉద్యోగం కోల్పోయి, కుటుంబ పోషణకు చిగురుమామిడిలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే కోతుల వల్ల తన వ్యాపారం సరిగా సాగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
''షాపులో ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యులు ఉంటే తప్ప అమ్మకాలు కుదరడం లేదు. ఏ మూల నుంచో వచ్చి చికెన్ షాపును అంగడంగడి చేస్తాయి. కూర ఉంచిన పాత్రలను పడేస్తాయి. కర్రతో అదిలిస్తే గుంపుగా మీదకొస్తాయి'' అని బాలరాజు అన్నారు.
''మానవ జాతిపై వానర జాతి ఆధిపత్యం సాధిస్తుందని అప్పుడెప్పుడో ఓ మ్యాగజీన్‌లో చదివా. అది ఇదేనేమో'' అన్నారు బాలరాజు. కొండల్లో గ్రానైట్ తవ్వకాలు పెరిగిన తర్వాత కోతుల గుంపులు ఎక్కువయ్యాయని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
వృద్ధులు, గృహిణులు, చిన్నారులే బాధితులు
గ్రామాల్లో కోతుల బాధితుల్లో వృద్ధులు, చిన్నపిల్లలు, గృహిణులే ఎక్కువగా ఉంటున్నారు. వాటి దాడుల్లో గాయపడుతున్నారు.
''పొద్దున లేస్తే మా గొడవంతా కోతులతోనే. పల్లెటూర్లలో బాత్రూమ్‌లు బయటే ఉంటాయి. మహిళలు స్నానాలు చేయడం సవాలుగా మారింది. బట్టలెత్తుకు పోతాయని భయం. మనిషి కర్రపట్టుకుని కాపలా ఉంటే తప్ప స్నానాలు చేసే పరిస్థితి కూడా లేదు'' అని చిగురుమామిడి గ్రామానికి చెందిన గృహిణీ సవితా లక్ష్మీ ఆవేదన.
''కోతుల దాడిలో మా పెద్దమ్మ నడుము విరిగి మంచానికే పరిమితం అయింది. కోతులను గ్రామం నుండి వెళ్లగొడతామని సర్పంచ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ తర్వాత మరిచి పోయారు'' అన్నారామె.
పెరట్లో కూరగాయల చెట్లు పెంచడం కూడా మానేశామని సవితా లక్ష్మీ వివరించారు.

చదువులకు కొండముచ్చుల కాపలా
కోతుల గుంపుల వల్ల అటు స్కూళ్లు, కాలేజీలలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం కోసం ఫంక్షన్ హాల్స్ మీదకు గుంపులుగా వచ్చిపడుతున్నాయి.
కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల పాఠశాలల్లో విద్యార్థులకు రక్షణగా కొండముచ్చులను పెంచుతున్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రతిభా గురుకుల కేంద్రం కాలేజీలో ఇదే జరుగుతోంది. విద్యార్ధుల కోతులకు భయపడుతుంటడంతో ఆరేళ్ల నుండి ఇక్కడ కొండముచ్చును పెంచుతున్నారు.
''చుట్టుపక్కల వాటికి తిండి దొరకడం లేదు. అందుకే జనావాసాలలోకి వస్తున్నాయి. మా విద్యార్థుల చాలా ఇబ్బంది పడ్డారు. డైనింగ్‌హాల్, డార్మిటరీ, క్లాస్‌రూమ్..ఇలా ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది పెట్టేవి. దీంతో కొండముచ్చును తీసుకొచ్చాం. కోతుల నుండి మా కాలేజ్ విముక్తి అయ్యింది'' అని ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
అల్గునూరు కాలేజీ ఒక్కటే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు స్కూళ్లలో ఇలా విద్యార్థుల చదువులకు కొండముచ్చులు కాపలా కాస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్న భోజనాలు ఉండే విద్యాసంస్థల్లో కొండముచ్చులను కాపలా ఉంచుతున్నారు.

పంటల రక్షణ రైతుకు పరీక్షే
గ్రామం నుంచి తరిమితే కోతులు గుంపులు గుంపులుగా దగ్గరలోని పొలాలపై పడుతున్నాయి. చేలు, పొలాల్లో పంటలను తినడంకన్నా పాడుచేయడమే ఎక్కువ. ''ఇంటికాడ కొడితే బాయి కాడికి పోతై, బాయికాడ కొడితే ఇంకోసోటికి పోతై. ఎక్కడికి పోయినా కావలి కాయాల్సిందే. మనిషికి ప్రశాంతతే లేదు'' అని మహిళా రైతు పోతరవేణి కనకవ్వ బీబీసీతో అన్నారు.
సొంతంగా ఆరెకరాల భూమితోపాటు, మరో రెండెకరాలు కౌలుకు సాగు చేస్తున్నారు కనకవ్వ.
''మొన్న కొట్టబోతే గుంపుగా మీదకు ఎగబడ్డై. మా పరిస్థితి మంచిగ లేదు. నాట్లేస్తామంటే నాట్లు వద్దనవట్టే. చిన్నచిన్న పంటలు పెట్టుకుంటే రేట్లు లేవాయే. కూరగాయలు సగం కోతులే పీకేసినై. పత్తి బుగ్గలు తినేస్తయి. పల్లీ చేను వేస్తే పీకేస్తయి. పొదుగేసిన కోడి పిల్లలను కూడా పిసికి చంపేసినై'' అని కోతుల గుంపులతో తనకు ఎదురైన కష్టాలను కనకవ్వ వివరించారు.
''కోతుల భయానికి కొండెంగను తెచ్చుకున్నం. అది వచ్చిన నాటి నుంచి కోతులు వస్తలేవు. మేం కొంచెం పని చేసుకుంటున్నం'' అన్నారామె.
కనకవ్వ లాంటి అనుభవాలే చాలా పల్లెల్లో మహిళా రైతులు ఎదుర్కొంటున్నారు. కోతులతో నష్టం జరగని పంటలే లేవని ఆవేదన చెందుతున్నారు.

పంట మార్పిడి-కోతుల నియంత్రణ
జనావాసాల్లో కోతుల సంఖ్యను అదుపుచేయడం, వాటి చేష్టలను నియంత్రించడం ప్రజలకు తలకు మించిన భారం అవుతోంది.
మరోవైపు యాసంగిలో వరికి బదులు ఇతర పంటల సాగుకు మళ్లాలని రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో పంట మార్పుపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన అవగాహన సదస్సుల్లో, ప్రత్యామ్నాయ పంటలు వేస్తే కోతుల బెడద తప్పదని రైతుల వైపు నుంచి వాదన వినిపించింది.
యాసంగి లో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసే సందర్భంలో కోతులను నియంత్రించే విధానాలపై అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. వ్యవసాయ, పశుసంవర్థక, అటవీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీ, తన అధ్యయనాన్ని ప్రారంభించింది.
తెలంగాణ వ్యవసాయ శాఖ 'రైతుబంధు పోర్టల్'లో ప్రత్యేకంగా కోతుల గణనను చేపట్టింది. గ్రామస్థాయిల్లో ఏఈఓ (అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్)ల ఆధ్వర్యంలో ఈ సర్వే సాగుతోంది.
గ్రామాల్లో సంచరిస్తున్న కోతుల గుంపులు, వాటి సంఖ్యతో పాటు వాటివల్ల వివిధ పంటలకు జరుగుతున్న నష్టం శాతం ఎంత, వాటి ఆవాసం, దగ్గరలో ఏదైనా పర్యాటక కేంద్రాలు ఉన్నాయా అన్న వివరాలను సేకరిస్తున్నారు. అదే సందర్భంలో కోతుల నియంత్రణకు స్థానికులు ఏ విధమైన పద్ధతులు వాడుతున్నారు లాంటి వివరాలను సేకరిస్తున్నారు.

తెలంగాణ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కోతుల గణన వెబ్ పోర్టల్ కు రూపొందించిన ప్రశ్నావళిలో కోతుల నియంత్రణకు స్థానిక రైతులు అవలంబిస్తున్న విధానాల్లో నైలాన్ వలలతో పాటు కొండముచ్చులను ప్రవేశపెట్టారా అన్న ప్రశ్న చేర్చారు.
"పంటమార్పులో భాగంగా ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో వేస్తే కోతుల వల్ల వ్యక్తిగతంగా ఒక రైతుకు జరిగే డ్యామేజ్ ను కంట్రోల్ చేయవచ్చు. పంటమార్పుతో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. సర్వే పూర్తయిన తర్వాత కోతులను ఎలా నియంత్రించవచ్చు అన్న అంశంపై పశుసంవర్థక, అటవీశాఖ అధికారులతో కలిసి ప్రణాళికలు రచిస్తాం. ఇప్పటికే వాటర్ కెనాన్స్, సోలార్ ఫెన్సింగ్ , కోతులు ఇష్టపడని చెట్లను పొలాల సరిహద్దుల్లో పెంచడం లాంటి పద్దతులు రైతులకు సూచించాం'' అని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ బీబీసీకి వెల్లడించారు.
ప్రత్యేక కమిటీ రిపోర్ట్ లో సూచించే సూచనలతో పాటు, కోతుల సంఖ్య ను నియంత్రించేందుకు వాటికి ఆపరేషన్లు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
కోతుల జనాభా నియంత్రణకు ఇప్పటికే నిర్మల్‌లో కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. 4 ఏళ్లు పైబడ్డ వయసు కోతులకు ఇందులో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు. ఇలాంటి కేంద్రాలను తెలంగాణలో మరిన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఇప్పటికే నిర్మల్ కోతుల పునరావాస కేంద్రాన్ని అధికారులు సందర్శించి వివరాలను సేకరించారు.

జంతు హక్కుల సంఘాల అభ్యంతరం
కోతుల నియంత్రణకు కొండముచ్చుల వాడటంపై జంతు హక్కు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
''కోతుల నియంత్రణకు కొండ ముచ్చులను అడవుల నుండి తీసుకురావడం జంతు హక్కు చట్టాల ప్రకారం నేరం. అది వాటి హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. కొండముచ్చులకు బదులు వేరే మార్గాలను అన్వేషించాలి. ఇలా తీసుకొస్తున్న కొండముచ్చుల్లో చాలా వరకు వాతావరణం సరిపోక, సరైన పోషణ లేక చనిపోతున్నాయి. కోతులను తరిమాక వాటిని చెట్టుకు కట్టేసి పట్టించుకోవడం మానేస్తున్నారు. గొలుసు మెడకు ఉరిపడి కొన్ని చనిపోతున్నాయి. చాలా కొండముచ్చులు కుక్కల దాడిలో చనిపోయాయి'' అని సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ సభ్యులు సుమన్ బీబీసీతో అన్నారు.
మనుషులు, కోతుల కు మధ్య జరుగుతున్న ఘర్షణలో కొండముచ్చులను పావులుగా వాడుతున్నారని, డబ్బు కోసం అడవుల్లో వేటగాళ్లు కొండముచ్చులను వేటాడుతుంటే కొన్నిసార్లు అవి చనిపోతున్నాయని, ఇలాంటి ఘటనలు బయటి ప్రపంచానికి తెలియడం లేదని సుమన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఫైనాన్షియల్ ప్లానింగ్: కొత్త ఉద్యోగంలో చేరగానే ఏం చేయాలి?
- ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువే, భయపడాల్సిన పనిలేదు.. మీరు తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- 5,000 రకాల వంటలు చేసే రోబో, ధర ఎంతంటే
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- హీరోయిన్ను చంపేసిన దుండగులు.. కొడుకు కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చి కాల్పులు
- స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















