కోతి పిల్లను వేటాడి చంపిన కుక్కలు, ప్రతీకారంతో 250 కుక్కల్ని చంపిన వానరాలు - ప్రెస్ రివ్యూ

monkey

ఫొటో సోర్స్, Getty Images

కోతి పిల్లను వేటాడి చంపిన కుక్కలపై కోతులు ప్రతీకారం తీర్చుకున్నాయంటూ సాక్షి ఒక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా మజల్‌గావ్‌లో జరిగింది. గతనెలలో కొన్ని కుక్కలు ఒక కోతిపిల్లను వేటాడి చంపాయి. ఇది కోతుల మందలన్నింటినీ బాధించిందని, దీంతో అప్పటి నుంచి అవి కుక్కలపై మెరుపుదాడులకు దిగాయని స్థానికులు తెలిపారు.

ముఖ్యంగా కుక్కపిల్లలు కనిపిస్తే వెంటనే వాటిని ఎత్తుకుపోయి ఎత్తైన బిల్డింగ్‌ లేదా చెట్ల మీద నుంచి విసిరికొట్టడం మొదలుపెట్టాయన్నారు. అలాగే పెద్ద కుక్కలు ఒంటరిగా కనిపిస్తే మందగా వెళ్లి దాడి చేసి చంపేస్తున్నాయన్నారు.

కోతుల దాడుల్లో దాదాపు 250 కుక్కలు ప్రాణాలు పోగొట్టుకున్నాయని, గ్రామంలో కుక్క అన్నది కనిపించకుండా పోయిందన్నారు.

కోతుల గురించి అటవీశాఖకు ఫిర్యాదు చేశామని, వారు వచ్చి పరిస్థితి చూసినా, కోతులను పట్టడంలో విఫలమై వెనుదిరిగారని గ్రామస్తులు వివరించారు.

కోతులు కేవలం కుక్కలపైనే కాకుండా ఇప్పుడు గ్రామస్తుల పిల్లలపై దాడులకు దిగుతున్నాయని వాపోయారు.

లాక్‌డౌన్‌ కారణంగా వీటికి సరైన తిండి దొరకకపోవడంతో కోతుల్లో ఆగ్రహం పెరిగి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మద్యం

ఫొటో సోర్స్, Getty Images

తగ్గిన మద్యం ధరలు

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల్ని ప్రభుత్వం 15 నుంచి 20శాతం తగ్గించిందని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

దాని ప్రకారం.. బ్రాండ్‌ను బట్టి క్వార్టర్‌పై కనీసం రూ.20 నుంచి రూ.50 వరకు, ఫుల్ బాటిల్‌పై రూ.120 నుంచి రూ.200 వరకు తగ్గుదల వర్తింపచేసింది.

అన్ని రకాల బీర్లపై రూ.20 నుంచి రూ.30 వరకు ధర తగ్గించింది. చీప్ లిక్కర్ బ్రాండ్లపై అధికంగా, ప్రీమియం బ్రాండ్లపై తక్కువగా ధరలు తగ్గాయి.

చీప్ లిక్కర్‌లోని కొన్ని రకాల బ్రాండ్ల ధర తెలంగాణలోకంటే ఏపీలో తక్కువగా, మరికొన్ని బ్రాండ్ల ధర తెలంగాణతో సమానంగా ఉండేలా సవరించారు.

ఒక మద్యం కేసు మూల ధరపై వ్యాట్, స్పెషల్ మార్జిన్ రేటు, అదనపు ఎక్సైజ్ సుంకం, అదనపు కౌంటర్‌వయిలింగ్ డ్యూటీలను సవరిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తత్తులు జారీ చేసింది.

ధరల తగ్గింపు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చింది. చీప్ లిక్కర్ రేట్లు తగ్గడం వల్ల వినియోగం మరింత పెరిగి, ప్రభుత్వ ఆదాయం పెరగనుంది.

పీసీఆర్ పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

ఒమిక్రాన్ కేసులు మూడు రోజుల్లోనే డబుల్

ఒమిక్రాన్ కేసులు మూడు రోజుల్లోనే డబుల్ అయ్యాయని వెలుగు దినపత్రిక ఒక కథనం ప్రచురించింది.

ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఇప్పటిదాకా 89 దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించిందని తెలిపింది.

కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రారంభమైన దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఒకటిన్నర నుంచి 3 రోజుల్లోనే డబుల్ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగిన దేశాల్లోనూ ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, వ్యాక్సీన్లు, రోగ నిరోధక వ్యవస్థ నుంచి ఈ వేరియంట్ తప్పించుకుంటుందా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉందని తెలిపింది.

వీడియో క్యాప్షన్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాక్సీన్లకు లొంగదా

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో శ్రీకాంత్

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కిడాంబి శ్రీకాంత్‌ చరిత్ర సృష్టించాడని ఆంధ్రజ్యోతి కథనం రాసింది.

ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన తెలుగు షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌.. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. కనీసం రజతాన్ని ఖాయం చేసుకున్నాడు.

శనివారం భారత ప్లేయర్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో 12వ సీడ్‌ శ్రీకాంత్‌ 17-21, 21-14, 21-17తో లక్ష్యసేన్‌పై పోరాడి విజయం సాధించాడు. మెగా ఈవెంట్‌ స్వర్ణ పోరుకు చేరుకున్న తొలి పురుష షట్లర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో ఓడిన సేన్‌ కాంస్యంతో సంతృప్తిపడ్డాడు.

ఆదివారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో అంటాన్‌నెస్ (డెన్మార్క్‌), లోహ్‌ కీన్‌ యు (సింగపూర్‌) మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో కిడాంబి తలపడనున్నాడు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)