దిల్లీలో కోతుల బెడద: నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గురుప్రీత్ సైనీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''దిల్లీలో కోతుల బెడద క్రమంగా పెరిగిపోతోంది. గతంలో మన ఎంపీ ఒకరిపై కూడా కోతులు దాడి చేశాయి. వాటి దాడి నుంచి ఆయన తప్పించుకున్నా, ఆయన కుమారుడికి గాయాలయ్యాయి. ప్రభుత్వం ఈ కోతుల బెడద నుంచి ప్రజలను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నా.''
జులై 24న రాజ్యసభ ఎంపీ రామ్ కుమార్ కాశ్యప్ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు చేసిన విజ్ఞప్తి ఇది.
నిజానికి ఈ సమస్య కేవలం ఆ ఒక్క ఎంపీదే కాదు.. మొత్తం లుట్యెన్స్ జోన్‌లో, దిల్లీలో, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉంది. వానరాలు పటిష్టమైన భద్రత కలిగిన భవనాల్లోకి కూడా చొరబడుతున్నాయి.
ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి సంఖ్యా తగ్గలేదు, వాటిని నియంత్రించడమూ సాధ్యం కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
రానున్న పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో వానరాల బెడద నుంచి ఎలా తప్పించుకోవాలో సూచిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్.. పార్లమెంట్‌కు వచ్చే ఎంపీలు, మంత్రులు, సామాన్య ప్రజలకు ఒక అడ్వైజరీని కూడా జారీ చేసింది.
దాంట్లో:
- కోతుల కళ్లలోకి చూడవద్దు.
- తల్లికోతి, పిల్లకోతికి మధ్య నుంచి వెళ్లొద్దు.
- కోతులను డిస్టర్బ్ చేయొద్దు. వాటి పాటికి వాటిని వదిలేస్తే, అవి మిమ్మల్నేమీ అనవు.
- కోతులను చూడగానే పరిగెత్తవద్దు.
- చనిపోయిన లేదా గాయపడిన కోతుల వద్దకు వెళ్లొద్దు.
- కోతులకు ఏ ఆహార పదార్థాలనూ ఇవ్వొద్దు.
- ఒకవేళ కోతి మీ వాహనాన్ని (మరీ ముఖ్యంగా ద్విచక్రవాహనం) ఢీ కొడితే మీ వాహనాన్ని ఆపొద్దు.
- ఎప్పుడూ కోతులను కొట్టవద్దు. కోతి కనిపిస్తే కేవలం కర్రతో నేలపై చప్పుడు చేయండి. అవి మీ ఇంటి పరిసరాలలోంచి వెళ్లిపోతాయి.
నిజానికి ఇవి చాలా ప్రాథమిక సూచనలు. కానీ ఇంతకూ ప్రశ్న ఏమిటంటే వానరాలపై ఒక అడ్వైజరీ జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం ఎందుకు ఇంత నిస్సహాయ స్థితిలో ఉంది?

ఫొటో సోర్స్, Getty Images
వానరాల బెడద నుంచి తప్పించుకునేందుకు ముందస్తు సూచనలు
కోతుల సమస్య ఇప్పటిది కాదు. 2014, జులైలో రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ నాటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, కోతులను తరిమేయడానికి ఎన్‌డీఎంసీ 40 మంది శిక్షణ పొందిన వ్యక్తులను నియమించిందని తెలిపారు. వాటిని తరిమేయడానికి రబ్బరు బుల్లెట్లు కూడా ఉపయోగిస్తోందని వెల్లడించారు.
2010లో కోతులను తరిమేసేందుకు శిక్షణ ఇచ్చిన కొండముచ్చులను ఉపయోగించారు. అయితే వాటిని తాడుతో కట్టేయడంపై నాటి బీజేపీ నేత మేనకా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పర్యావరణ, అటవీ శాఖ కొండముచ్చులను అలా తాళ్లతో కట్టేయవద్దని దిల్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీంతో కోతులను తరిమేసేందుకు కొండముచ్చులను ఉపయోగించడం నిలిపేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర ప్రాంతాలలో కోతుల బెడద
దిల్లీ కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా వానరాల బెడద ఉంది. ఆగ్రాలో కూడా కోతుల కారణంగా స్థానికులు, పర్యటకులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కోతులు ప్రజల చేతుల్లో ఉండే ఆహారాన్ని లాక్కెళతాయి. మంగళవారం ఒక కోతి తల్లి ఒడిలో ఉన్న 12 ఏళ్ల చిన్నారిని లాక్కుని పరిగెత్తింది. అయితే కోతి చిన్నారి మెడను గట్టిగా పట్టుకోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు చెబుతున్నారు.
ఇక తాజ్ మహల్‌ను చూడడానికి వచ్చే పర్యాటకులను కోతులు కరచిన సంఘటనలకు లెక్కే లేదు.
హిమాచల్ ప్రదేశ్‌లో వానరాల సమస్య ప్రతి ఎన్నికలలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వాటి సమస్య లేకుండా చేస్తాం అని ప్రతి నాయకుడూ హామీ ఇస్తుంటాడు.
వానరాల కారణంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నది రైతులే. అవి చేతికొచ్చిన పంటలను నాశనం చేస్తుంటాయి. దీంతో చాలా మంది వ్యవసాయమే మానుకున్న సంఘటలున్నాయి. వ్యవసాయ శాఖ 2014లో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, వానరాల కారణంగా ఏటా రూ. 184 కోట్ల పంట నష్టం జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
వానరాలను చంపితే నగదు బహుహతి
గతంలో వానర సమస్యకు పరిష్కారంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వాటిని చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ రాష్ట్ర హైకోర్టు వాటిని చంపడాన్ని నిషేధించింది.
ఇటీవలే ఈ నిషేధాన్ని మళ్లీ ఎత్తివేశారు. వాటిని చంపితే నగదు బహుమతులు కూడా ప్రకటించారు. అయితే మతపరమైన, ఇతర కారణాలతో స్థానికులు వాటిని చంపడానికి ఇష్టపడ్డం లేదు.
ఎందుకు కోతుల విషయంలో ప్రభుత్వం నిస్సహాయంగా మారుతోంది?
దీనికి సమాధానంగా జంతు హక్కుల కార్యకర్త, న్యాయవాది అయిన నరేష్ కద్యాన్, ప్రజలే దీనికి ప్రధాన కారణమని తెలిపారు.
''ప్రజలు అడవులను నాశనం చేశారు. అక్కడ వాటికి ఆహారాన్నిచ్చే చెట్లు కరువయ్యాయి. దీంతో అవి మనుషులుండే ప్రాంతాల్లోకి వస్తున్నాయి.''
''ఇప్పుడు వాటిని తరిమేయాలంటే మళ్లీ అడవులను, పళ్ల చెట్లను పెంచాలి. దీనికి సమయం పడుతుంది. దిల్లీలోని అసోలా భట్టిలో అలాంటి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ అవినీతి కారణంగా అవి నిలిచిపోయాయి'' అని ఆయన తెలిపారు.
గతంలో సుమారు 1700 వానరాలను పట్టి బంధించి అసోలా భట్టిలో వదిలారు. అవి బైటకు రావడానికి వీల్లేకుండా పొడవాటి గోడను కట్టారు. అయితే సరైన చర్యలు తీసుకోకపోవడంతో అవి మళ్లీ మనుషుల నివాసాలపై వచ్చి పడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
అడ్డుగా నిలుస్తున్న వన్యప్రాణి సంరక్షణ చట్టం
మరి అతి తక్కువ సమయంలో కోతులను నివాస ప్రాంతాలనుంచి దూరంగా తరిమేసేందుకు దారే లేదా?
ఒకే ఒక్క దారి ఉందని నరేష్ కద్యాన్ అంటారు.
మనుషుల మధ్యనే పెరిగే కోతులు చూడ్డానికి భయపెట్టేలా ఉన్నా, వాటిలో సాధు లక్షణాలే ఉంటాయంటారు ఆయన.
అందుకని మొదట కోతులను వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలోంచి తప్పించాలి.
ఈ చట్టం కారణంగా... వాటిని వేరే చోటికి తరలించాలంటే పలువురు అధికారుల అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. వాటిని ఆ చట్టం పరిధిలోంచి తొలగిస్తే సమస్య కొంత పరిష్కారం అవుతుందని ఆయన అంటారు. పార్లమెంటరీ అడ్వైజరీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. కోతుల సమస్య పరిష్కారానికి సాంకేతిక పద్ధతులను ఉపయోగించాలని ఆయన అన్నారు.
సాధారణంగా వానరాలు బృందాలుగా జీవిస్తాయి. వాటికంటూ పెద్ద ఒకటి ఉంటుంది. అది ఎప్పుడూ తన తోకను పైకెత్తి ఉంటుంది. దానిని గుర్తించి, దానిని వేరే చోటికి తరలిస్తే మొత్తం గుంపంతా తరలిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
వానరాలకు మతంతో సంబంధం
హిందూమతంలో వానరాన్ని ఆంజనేయస్వామికి ప్రతిరూపంగా భావిస్తారు. గుళ్ల వద్ద జనాలు వాటికి అరటిపళ్లు, ఇతర ఆహార పదార్థాలు అందిస్తుంటారు. వీళ్లు వానరాలను ఏమీ అననివ్వరు.
దీంతో వాటికి అలవాటు పడిన కోతులు జనాల చేతుల్లోంచి వాటిని లాక్కుపోతున్నాయి. ఒకప్పుడు చెట్ల మీది పళ్లు తిన్న కోతులు ఇప్పుడు వండిన, ప్యాకెట్లలోని ఆహార పదార్థాలకు అలవాటు పడ్డాయి.
''మనుషులకు, జంతువులకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో పరిష్కారం మనుషుల చేతుల్లోనే ఉంది'' అన్నారు నరేష్.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








